
మన(సు)లో మాట
మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి. మా అమ్మాయి ఈ మధ్యే బి.టెక్. పూర్తి చేసింది. తనకి సంబంధాలు చూడడం మొదలుపెట్టాం. తను ఈ మధ్య కాస్త విచిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టింది. తాను ఒక సినిమా హీరోని ప్రేమిస్తున్నానని, అతణ్ణి మాత్రమే పెళ్ళి చేసుకుంటానని అంటోంది. ఏదో చిన్నపిల్ల సరదాగా మాట్లాడుతుంది అనుకున్నాము. ఆ హీరో కూడా తనను ఇష్టపడుతున్నాడని, అందుకే తాను ఎవర్నీ పెళ్ళి చేసుకోవట్లేదని ఏదేదో మాట్లాడుతుంది. తన గది నిండా ఆ హీరో ఫోటోలతో నింపేసింది. ఫోన్‌లో ఎప్పుడూ ఆ హీరో సినిమాలే చూస్తుంటుంది. అతను ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడితే అది తనకి ఇన్‌డైరెక్ట్‌గా మెసేజెస్ పంపిస్తున్నాడని అనుకుంటుంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తమను కలుసు కోకుండా అడ్డం పడుతున్నారని, అందుకే నేరుగా వెళ్ళి తనను కలుస్తానని, ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మేం గట్టిగా చెప్తే ఏదైనా చేసుకుంటా అని బెదిరిస్తోంది. మాకు ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. దయచేసి మాకు ఈ సమస్య నుండి బయటపడే దారి చూపెట్టండి.
– విజయలక్ష్మీ, రాజమండ్రి
మీరు రాసిన లక్షణాలన్నీ ‘ఎరటో మేనియా ’(Erotomania) లేదా ‘డిక్లేరామ్‌బాల్ట్ సిండ్రోమ్’ (De Clérambault's syndrome) అనే ఒక రకమైన మానసిక రుగ్మతకు సంబంధించినవి. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లోనే చూస్తుంటాం. తమకంటే బాగా ఉన్నత మయిన స్థాయిలో లేదా పదవిలో ఉన్న పురుషులు లేదా సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ లాంటి వారు తమతో రహస్యంగా ప్రేమలో ఉన్నారనే భ్రమలో ఉంటారు. వాళ్ళ ప్రవర్తనని, మాట్లాడే మాటలని తమకోసమే చేస్తున్నారని తప్పుగా భావించుకుంటారు. వాళ్ళకి ఉత్తరాలు, ఇమెయిల్స్, బహుమతులు పంపడం లాంటివి కూడా చేస్తుంటారు. అవతలివైపు నుండి ఎటువంటి స్పందన లేకపోతే తమ మధ్య వేరేవాళ్ళు అడ్డుపడుతున్నారనో లేదా కావాలనే అవతలి వ్యక్తి గోప్యతని పాటిస్తున్నారని కూడా వాదిస్తారు. వాళ్ళు అనుకునేది నిజం కాదు, భ్రమ అని చెప్పడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, నమ్మకపోగా గొడవలు చేయడం, ఇంట్లో నుండి వెళ్ళిపోవడం లేదా ఏదైనా చేసుకుంటాం అని బెదిరించడం లాంటివి కూడా చేస్తారు.
చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో
వాళ్ళకి ఉన్నది ఒక మానసిక సమస్యే అని వారికి తెలియకపోవడం వల్ల వారితో మందులు వేయించడం కూడా కష్టమే. ఇది కాస్త క్లిష్టమైన మానసిక సమస్యే అయినప్పటికీ కొంతకాలం వాళ్ళని సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో, ఆసుపత్రిలో ఉంచి, మందులు, కౌన్సెలింగ్ ద్వారా వైద్యం చేస్తే క్రమంగా వాళ్లలో మార్పు తీసుకురావచ్చు. వెంటనే మీ దగ్గర్లోని మానసిక వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళి తగిన వైద్యం చేయించండి. ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది!
చదవండి: 35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com