
724 మిలియన్ యూరోల మేర రిలయన్స్ సరఫరా
నయారా ఎనర్జీ, ఎంఆర్‌పీఎల్ సైతం
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడాది కాలంలో 724 మిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును ఇంధనంగా మార్చి అమెరికాకు ఎగుమతి చేసింది. ‘‘2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్యకాలంలో 2.8 బిలియన్ యూరోల శుద్ధి చేసిన ఇంధనాన్ని భారత్, టర్కిలోని ఆరు రిఫైనరీల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. ఇందులో 1.3 బిలియన్ యూరోల విలువ చేసే ఇంధనం రష్యా చమురుతో తయారైనది’’అని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) ఒక నివేదికలో వెల్లడించింది.
గుజరాత్‌లోని రిలయన్స్ జామ్‌నగర్ యూనిట్ల నుంచి అమెరికా రెండు బిలియన్ యూరోల పెట్రోల్, డీజిల్‌ను దిగుమతి చేసుకోగా.. ఇందులో 724 మిలియన్ యూరోల (రూ.6,733 కోట్లు సుమారు) విలువైన ఇంధనం రష్యా ముడి చమురు ఆధారితమేనని తెలిపింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో రష్యా నేరుగా ఎగుమతి చేయడానికి అవకాశం లేకుండా పోయింది.
గుజరాత్‌లోని వాదినార్‌లో రష్యా రోజ్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీకి 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ ఉంది. ఈ సంస్థ సైతం గతేడాది కాలంలో అమెరికాకు 184 మిలియన్ యూరోల ఇంధనాన్ని ఎగుమతి చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులోనూ 124 మిలియన్ యూరోల విలువ మేర రష్యా ముడి చమురు ఆధారితమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ ఎంఆర్‌పీఎల్ సైతం అమెరికాకు 42 మిలియన్ యూరోల విలువైన ఇంధనాన్ని ఎగుమతి చేయగా, ఇందులో 22 మిలియన్ యూరోల మేర రష్యా ముడి చమురుతో చేసిందేనని ఈ నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment