
మా అబ్బాయికి 14 సంవత్సరాలు. 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్‌లో పక్కన వాళ్ళని ముట్టుకుంటే జబ్బులు వస్తాయని ఏడాది నుంచి స్కూల్‌కి వెళ్ళట్లేదు. బలవంతం గా పంపిస్తే బెంచీని శానిటైజర్‌తో కడిగాకే కూచుంటాడు. పక్కన ఎవర్నీ కూచోనివ్వడు. స్కూల్ నుంచి రాగానే బుక్స్, బ్యాగ్ శానిటైజర్‌తో క్లీన్ చేస్తాడు. బాత్‌రూమ్‌లో బకెట్స్, సబ్బుపెట్టెలు మళ్ళీ మళ్ళీ కడుగుతాడు. స్నానానికి మినరల్ వాటర్ క్యాన్స్ కావాలని గొడవ పడుతున్నాడు. ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చి భోజనం చేస్తే ఆ ప్లేట్స్ బయట పడేసే దాకా ఊరుకోడు. బయట వాళ్ళని ఎవర్నీ ఎక్కువ సేపు ఇంట్లో ఉండనివ్వడు. వాళ్ళు కూచుని వెళ్ళిన కుర్చీలు, ముట్టుకున్న వస్తువులు సబ్బుతో క్లీన్ చేస్తాడు. తను ఆడుకోడానికి గానీ, చుట్టాల ఇళ్ళకు గానీ, వెళ్ళడు. తన వస్తువులను ఎవరూ ముట్టుకోకూడదంటాడు. ఒకప్పుడు చదువులో, ఆటల్లో ముందుండే వాడు. ఇప్పుడిలా అయిపోయాడు. ఇలా చేయకూడదు అని మేము చెప్తే మాతో గొడవ పడుతున్నాడు. దీని గురించి బయట ఎవరికైనా చెబితే చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు. హాస్పిటల్‌కి వెళ్దాం అంటే రాడు. మా అమ్మగారికి కొంచెం శుభ్రత ఎక్కువగా ఉండేది కానీ మరీ ఇంత కాదు. మావాడు బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పండి. – రమాదేవి, పాలకొల్లు
మీ బాబుకి ఉన్న సమస్యని ‘చైల్డ్‌హుడ్ ఓ.సి.డి. అంటారు. చిన్నపిల్లలలో ఓ.సి.డి. సమస్య -7-12 సంవత్సరాల వయసులో మొదలవడం చూస్తూంటాం. ఈ వయసులో మెదడు నిర్మాణం ఇంకా పూర్తిగా జరగకపోవడం వల్ల జబ్బు లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పైగా పిల్లల్లో ‘మెటా కాగ్నిటివ్ స్కిల్స్’ అంటే తమ ఆలోచనలని సమీక్షించి తప్పు ఒప్పులని అర్ధం చేసుకొని మార్చుకోగలిగే నేర్పు పిల్లలలో పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే ఆలోచనల ప్రకారమే వాళ్ళు ప్రవర్తిస్తారు. తమ తల్లి తండ్రులు కూడా తాము చెప్పినట్లే ప్రవర్తించాలి అనుకుంటారు. దీనివల్ల వాళ్ళని చికిత్సకి ఒప్పించడం కష్టం. మురికి, క్రిములు గురించి ఎక్కువగా భయపడడం, పదేపదే చేతులు కడగడం, లేనిపోని సందేహాలు... లాంటి లక్షణాలతోపాటు, తమ వారికీ ఏదో అయిపోతుందన్న భయం ఒక వైపు, ఆ భయం, ఆందోళన తగ్గించడానికి వాళ్ళు. ఏ పనైతే చేస్తారో దాన్నే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. తాము ఇలా పనులు మళ్ళీ, మళ్ళీ చేయడం వలన చెడు జరగకుండా ఆపగలం అనుకుంటారు, దీన్ని ‘మ్యాజికల్ థింకింగ్’ అంటారు.
ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు
ఇలాంటివి ప్రత్యేకంగా పిల్లల్లోనే చూస్తూంటాము. ఇలా ఎక్కువ సేపు చేయడం వల్ల, మిగిలిన పనులు సరిగా టైంకి చేయలేరు. స్కూల్‌కి లేటుగా వెళ్ళాల్సి వస్తుంది. పరీక్షలో సమయానికి సమాధానాలు రాయ లేకపోతారు. చదువులో వెనకబడిపోతారు. తమని అందరూ ఎక్కడ గమనిస్తారో అని బయటకి వెళ్ళడం కూడా మానేస్తారు. ముందుగా వాళ్ళకి ఉన్నది ఒక మెడికల్ కండిషన్, దానికి కూడా వైద్యం ఉంది, అని ఒప్పించడానికి చాలా ఓర్పు, సహనం అవసరం. అలాగని వారు చెప్పే ప్రతి పని చేయడం కూడా కరెక్ట్ కాదు. మీ బాబు ఒకవేళ హాస్పిటల్‌కి రావడానికి సంకోచిస్తే ముందుగా, టెలిఫోన్ కన్సల్టేషన్ ద్వారా సైకియాట్రిస్ట్‌తో మాట్లాడించడం ద్వారా తన ఆలోచన విధానంలో నెమ్మదిగా మార్పు తీసుకురావచ్చు. అలాగే తనని మందులు వాడడానికి ఒప్పించి, తక్కువ డోస్‌లో మందులు వాడి యాంగై్జటీని తగ్గించవచ్చు. ముందు కొంచెం ఉపశమనంకలిగితే తర్వాత మీ బాబు తనంత తానే చికిత్సకి సహకరించవచ్చు కాబట్టి మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ఆల్ ది బెస్ట్.
చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
డా. ఇండ్ల విశాల్ రెడ్డి
సీనియర్ సైకియాట్రిస్ట్,
విజయవాడ
మీ సమస్యలు, సందేహాలు
పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com