ప్రతీకాత్మక చిత్రం
సుశాంత్‌కు 35 ఏళ్లు, పదేళ్ల కిందట పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. ఒక ఎమ్మెన్సీలో పదేళ్లుగా పని చేస్తున్నాడు. మంచి భర్త, తండ్రి, ఉద్యోగి, తెలివైనవాడు, అందరితో కలివిడిగా ఉంటాడు. సాధారణంగా మర్యాదస్తుడయి నప్పటికీ తరచుగా చికాకుగా కనిపిస్తాడు. కౌన్సెలింగ్ రావడం తనకు ఇష్టంలేదనీ, భార్య ఒత్తిడితో వచ్చాననీ చెప్పాడు.
periences..
తాను లాప్‌టాప్‌పై ఎక్కువ సమయం గడుపుతున్నాననీ, పిలిస్తే చిరాకు పడుతున్నానని తన భార్య రోజూ నస పెడుతోందనీ చెప్పాడు. తనకు భార్యా పిల్లలంటే చాలా ఇష్టమన్నాడు. ‘లాప్‌టాప్‌లో అంత టైమ్ ఏం చేస్తారు?’ అని అడిగినప్పుడు చెప్పడానికి సంశయించాడు. ‘సమస్య ఏదైనా సరే.. మీరు చెప్తేనే సహాయం చేయగలను’ అని నచ్చజెప్పాక నోరు విప్పాడు.
నటి తనిష్క తనను ప్రేమిస్తోందనీ
ప్రముఖ నటి తనిష్క తనను ప్రేమిస్తోందనీ, తనకోసమే ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకుండా ఉందనీ చెప్పాడు. ఆమె గురించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికే లాప్‌టాప్‌పై ఎక్కువ సమయం గడుపుతానన్నాడు. తమ ప్రేమ గురించి భార్యకు చెప్పినా అర్థం చేసుకోలేదు కాబట్టి రహస్యంగా ఉంచానని అన్నాడు.
త్వరలోనే తాను, తనిష్క పెళ్లి చేసుకుంటామన్నాడు. అయితే తాను ఎక్కువ సేపు తనిష్క గురించే సెర్చ్ చేస్తూ ఉండటం వల్ల ఆఫీసు పని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నానని చెప్పాడు. అదే తనకు ఆందోళన కలిగిస్తుందన్నాడు.
కోడ్ లాంగ్వేజ్‌లో
‘తనిష్క మీకెలా పరిచయం? ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకెలా తెలుసు? ఆమె మీతో చెప్పిందా?’ అని అడిగినప్పుడు మరిన్ని వివరాలు వెల్లడించాడు. మొదట్లో తాను తనిష్కకు చాలా లెటర్స్ రాశాననీ, ఆ తర్వాత ఆమె నంబర్ సంపాదించి మెసేజెస్ పెట్టానని చెప్పాడు. ఒకసారి ఆమె నుంచి రిప్లయ్ మెసేజ్ కూడా వచ్చిందన్నాడు. ఆ తర్వాత ఆమె తన ఇంటర్వ్యూల్లోనూ, సినిమాల్లోనూ కోడ్ లాంగ్వేజ్‌లో తనకు సందేశాలు పంపిస్తుందన్నాడు.
∙∙
పచ్చి అబద్ధాలని తెలిసినా
సుశాంత్ చెప్పిన కథల్లాంటివి మనకు అప్పుడప్పుడూ పత్రికల్లో కనిపించేవి. సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్ల హవా మొదలయ్యాక ఇలాంటి కథలు ఎక్కువయ్యాయి. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి ప్రముఖ నటి తనను పెళ్లి చేసుకుందంటూ యూట్యూబ్ చానళ్లలో హల్‌చల్ చేయడం మీరూ చూసే ఉంటారు.
అతను చెప్తున్నవి పచ్చి అబద్ధాలని తెలిసినా యూట్యూబ్ చానళ్లు పదే పదే అతన్ని ఇంటర్వ్యూలు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. నిజానికి అది ‘ఎరటోమానియా’ అనే అరుదుగా కనిపించే డెల్యూషనల్ డిజార్డర్.
అయితే మామూలు భ్రమలకు, ఎరటోమేనియాలోని భ్రమలకు తేడా ఉంటుంది. మా పెరట్లోని చెట్లు ప్రతిరోజూ నాతో మాట్లాడతాయని నమ్మడం ఒక డెల్యూషన్. అది జరిగే అవకాశమే లేదు. కానీ ఒక సెలబ్రిటీ మామూలు వ్యక్తిని ప్రేమించే అవకాశం 0.0001 శాతమైనా ఉంటుంది. ఆ వ్యక్తి తానేనని ఎరటోమేనియా ఉన్న వ్యక్తి నమ్ముతాడు. ఇలాంటి భ్రమలు ఏర్పడటంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది.
గేలి చేయకుండా.. చికిత్స అందించాలి
►సుశాంత్ లాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు సాధారణంగా వారి మాటలు విని నవ్వుకుంటారు, గేలి చేస్తారు. కానీ అది ఒక మానసిక రుగ్మత అని గుర్తించి వెంటనే చికిత్స అందించాలి.
►ఇలాంటి రుగ్మతలున్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు కాబట్టి కుటుంబ సభ్యుల సహాయం అవసరం
►వారి భ్రమలను సవాలు చేయడం కంటే, వాటిని తొలగించి వాస్తవం అర్థమయ్యేలా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి
►కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వారి ఆలోచనను, ప్రవర్తనను దారి మళ్లించడానికి ఉపయోగపడు తుంది
►వీలైనంత స్వతంత్రంగా జీవించడంలో వారికి సహాయపడటం కీలకం.
►సమస్య తీవ్రతను బట్టి సైకియాట్రిస్టును సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది.
లక్షణాలు..
►ఎరోటోమానియా ప్రధాన లక్షణం ఒక సెలబ్రిటీ తనను ప్రేమిస్తున్నారని లేదా పెళ్లి చేసుకున్నారనే భ్రమను నమ్మడం.
►ఆ సెలబ్రిటీ ఏం చేసినా అది తనకు పంపే రహస్య సందేశమనే భ్రమలోనే జీవించడం.
►ఆ సెలబ్రిటీ పట్ల విపరీతమైన అబ్సెషన్. సోషల్ మీడియాలో వారిని నిరంతరం ఫాలో అవ్వడం.
►వారి పరిచయం కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడకపోవడం.
కారణాలు...
►జీవితంలో తిరస్కరణ, స్థానభ్రంశం, స్వలింగ సంపర్క ప్రేరణలను నివారించడానికి ఎరోటోమేనియా ఒక రక్షణ విధానంగా ఉంటుందని ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించాడు.
►తీవ్రమైన ఒంటరితనం లేదా పెద్ద నష్టం తర్వాత ఏర్పడే లోటును భర్తీ చేసుకోవడానికి దీన్ని ఒక మార్గంగా తీసుకోవచ్చు.
►బైపోలార్ డిజార్డర్ లేదా స్కిజోఫ్రేనియా ఉన్నవారిలో రావచ్చు.
►మాదక ద్రవ్యాలు లేదా యాంటీ డిప్రెసెంట్స్ వాడకం వల్ల కూడా ఈ లక్షణాలు ఏర్పడవచ్చు.
►మెదడులో అసాధారణతలు లేదా వారసత్వం కూడా కారణం కావచ్చు.
-సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment