సాక్షి, విశాఖపట్నం/చోడవరం: విద్యలో వర్చువల్ విప్లవం వస్తోందని, రాష్ట్రంలో వర్చువల్ టెక్నాలజీతో తరగతులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు తరగతి గదుల్లో టీచర్లు ఎప్పుడొస్తారా? అని విద్యార్థులు ఎదురు చూసేవారని.. ఇప్పుడు వర్చువల్ క్లాస్‌ల ద్వారా వారే టీచర్లుగా మారారన్నారు. రాష్ట్రంలో 4వేల వర్చువల్ క్లాస్‌రూమ్‌లు, 5వేల డిజిటల్ తరగతి గదులను నడుపుతున్నామన్నారు. విశాఖలోని ఓ హోటల్లో మూడు రోజులపాటు జరిగే ఎడ్యుటెక్–2018 సదస్సును ఆయన గురువారం ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. విశాఖలో ఇంటెలిజెంట్ గ్లోబల్ హబ్(గేమింగ్ యూనివర్సిటీ) ఏర్పాటుకు యూనిసెఫ్ స్థలం అడిగిందని, ఇందుకు 50 ఎకరాలు కేటాయించనున్నామని తెలిపారు. కాగా, ఈ సదస్సులో ప్రకటించే వైజాగ్ డిక్లరేషన్‌ను యునెస్కో అడాప్ట్ చేసుకునేలా యునెస్కో వరల్డ్ కాన్ఫరెన్స్‌లో ప్రవేశపెడతామని తెలిపారు. కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ 9వ తరగతి నుంచి దేశంలో 15 లక్షల క్లాస్‌రూమ్‌ల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. యునెస్కో ఎంజీఐఈపీ తరఫున కిర్జికిస్తాన్ మాజీ అధ్యక్షురాలు రోజా ఒతుబుయేవి ప్రారంభోపన్యాసం చేశారు.
మూడు ఎంఓయూలు
రాష్ట్రంలో 3 ప్రాజెక్టుల అమలుకు సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శాంసంగ్ మైడ్రీం ప్రాజెక్టు, డిజైన్ యూనివర్సిటీ, స్కిల్లింగ్ ప్రోగ్రాం ఆన్ క్రియేటివ్ డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఒప్పందాలు కుదిరాయి. గేమ్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ హ్యాకథాన్ చాలెంజ్ విన్నర్లను ప్రకటించి వారికి సీఎం బహుమతులు అందజేశారు.
శాంసంగ్ స్మార్ట్ క్లాసుల కార్యక్రమాన్ని, తెలుగులో తొలి గ్లోబల్ వర్సిటీ యాప్‌ను, యునెస్కో–ఎంజీఐఈపీ అభివృద్ధి పరచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం–కలెక్టివ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ను సీఎం ప్రారంభించారు. సదస్సులో యునెస్కో డైరెక్టర్ అనంత దురైయప్ప, డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కిడారి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్–వన్ ప్రాజెక్టుకు విశాఖ జిల్లా చోడవరంలో సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మేలోగా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను పూర్తిచేసి ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా ఎడ్యుటెక్–2018 సదస్సు జరిగిన హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. విలేకరులకు సదస్సు ప్రారంభానికి, మీడియా సమావేశానికి వేర్వేరుగా పాస్‌లిచ్చారు. సదస్సుకు పక్కనే మీడియా సమావేశం నిర్వహించే హాలులోకి వెళ్లేందుకు కూడా విలేకరుల్ని అనుమతించకుండా కట్టడి చేశారు. చోడవరంలో కార్యక్రమానికీ భద్రత అధికంగానే కల్పించారు.
ఏపీ ప్రగతినే తన ఘనతగా మోదీ చెప్పుకుంటున్నారు
ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రగతినే తన ఘనతగా చెప్పుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ నిన్న సింగపూర్ వెళ్లారు. ఫిన్‌టెక్ సిటీ బాగుందన్నారు. అది ఎక్కడుంది? విశాఖలో ఉంది.
మొన్న జపాన్ పోయారు.. అక్కడ 3 పాయింట్లు మాట్లాడారు. డబుల్ డిజిట్ గ్రోత్ అని చెప్పుకున్నారు. ఎక్కడుంది? ఓన్లీ ఏపీలోనే. సెల్‌ఫోన్ గురించి గొప్పలు చెప్పారు. అవీ ఎక్కువగా ఏపీలోనే తయారవుతున్నాయి. ఇస్రో గురించీ చెప్పారు. అది ఉంది? ఇక్కడే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పైనా ప్రధాని మాట్లాడారు. ఇవన్నీ ఏపీవే.. కానీ ఆయనవిగా చెప్పుకుంటున్నారు’’ అని ఆక్షేపించారు. కాగా, పత్రికల్లో తమ గురించి బాగా రాయాలని మీడియా ప్రతినిధుల్ని అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment