మీకు వ్లాగులు అంటే ఏమిటో తెలిసే ఉంటుంది.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్షర్ల గురించి కూడా వినే ఉంటారు. కానీ...వీట్యూబర్లు ఎవరో తెలుసా. దేశంలో వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏమిటో విన్నారా. వెరైటీ పేరుతో పిచ్చి ప్రాంకుల కంటే బోలెడంత ఉపయోగకరమైన ఈ కొత్త ట్రెండ్ ఏమిటో చూసేయండి మరి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్చువల్ యూట్యూబర్లే ఈ వీట్యూబర్లు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ కోసం విపరీతమైన కరువు ఏర్పడింది. ఏదైనా విషయాన్ని కొత్తగా ఎలా చెప్పాలన్న ప్రయత్నంలో ఈ వీట్యూబర్ల వ్యవహారం బాగా ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి ప్రపంచంలో మొట్టమొదట వర్చువల్ యూట్యూబర్ పదాన్ని వాడింది 2016లోనే. జపాన్‌కు చెందిన ‘కైజునా ఏఐ’ మొదలు పెట్టిన ఈ ట్రెండ్ అక్కడ బాగా ప్రజాదరణ చూరగొంది. స్థానికంగా అనేక కంపెనీల మార్కెటింగ్ కూ ఈ వీట్యూబర్లు ఉపయోగపడుతున్నారు. లైవ్ రికార్డింగ్ విషయంలో జపాన్ వీట్యూబర్లు ఇప్పటికే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు.
ఆరేళ్ల క్రితం జపాన్‌లో మొదలైన ఈ వీట్యూబర్ల వ్యవహారం గత రెండేళ్లలో మరింత జోరందుకుంది. భారత్‌లోనూ యాపిల్ మెమోజీ సాయంతో వర్చువల్ అవతార్‌లను సృష్టించుకొని వాటి సాయంతోనే రకరకాల అంశాలపై ఈ వీట్యూబర్లు వీడియోలు చేస్తున్నారు. యాపిల్ ఐఓఎస్ 12, ఆ తరువాత వచ్చిన యాపిల్ ఫోన్లు లేదా ఐప్యాడ్ ఓఎస్‌లతో ఈ మెమోజీలను సృష్టించడం చాలా సులువు. మన పర్సనాలిటీ, మూడ్‌లకు అనుగుణంగా వర్చువల్ అవతార్‌లను తయారు చేసుకొని ఫేస్‌టైమ్‌లో మెసేజ్‌లు పంపుకోవచ్చు. తగిన ఐఫోన్, ఐప్యాడ్‌లు ఉంటే మెమోజీల్లో యానిమేషన్ కూడా చేయవచ్చు.
చదవండి: బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు
ఫన్, ఫిల్మీమోజీల క్రేజ్...
భారత వీట్యూబర్లలో ప్రస్తుతం బాగా క్రేజ్ ఉన్న వీట్యూబ్ చానళ్లలో ఫన్‌మోజీ, ఫిల్మీ మోజీలు రెండు. చిర్రా కార్తీక్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ రెండు చానళ్లలో ఒకటి పేరులో ఉన్నట్లే సినిమాల గురించి మాట్లాడితే... రెండోది చాలా సరదా అంశాలపై వీడియోలు తయారు చేస్తుంది. యాపిల్ కంపెనీ అని మోజీ మెమోజీలను మార్కెట్‌లో విడుదల చేసినప్పుడు కార్తీక్‌రెడ్డి తన యానిమేషన్ ఇన్‌స్టిట్యూట్‌లోని కొందరు విద్యార్థుల సాయంతో ఈ చానళ్లను మొదలుపెట్టారు. పోటుగాడు, ఈమోజీ మామ, ఫిల్మీ ఫన్ అనిమోజీ, సూపర్ మోజీ పేర్లతో మరికొందరు వీట్యూబర్లు తాజాగా రంగంలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment