‘నెట్‌’స్పీడైతే.. బోధన ‘వీఆర్‌’అవుద్ది!  | Probles to Virtual Reality Labs in Government Schools in the State | Sakshi
Sakshi News home page

‘నెట్‌’స్పీడైతే.. బోధన ‘వీఆర్‌’అవుద్ది! 

Published Thu, May 4 2023 1:00 AM | Last Updated on Thu, May 4 2023 1:00 AM

Probles to Virtual Reality Labs in Government Schools in the State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మనుషులుగానీ, వస్తువులుగానీ మనం దగ్గరుండి చూసినట్టుగా.. అంతా మన కళ్ల ముందే ఉన్నట్టుగా అనిపించే సాంకేతికతే ‘వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌)’. ప్రత్యేకమైన వీఆర్‌ హెడ్‌సెట్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేసి, వీడియోలను ప్లే చేయడం ద్వారా అనుభూతిని పొందొచ్చు. ఈ సాంకేతికతతో విద్యా రంగంలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

ఉదాహరణకు ఒక విత్తనం మొలకెత్తడం నుంచి పెద్ద చెట్టుగా ఎదిగేదాకా కీలకమైన దశలన్నింటినీ కొన్ని నిమిషాల్లోనే స్పష్టంగా అవగాహన కలిగేలా ‘వీఆర్‌’వీడియోలను విద్యార్థులకు చూపించవచ్చు. ఇందుకోసమే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వీఆర్‌’బోధన చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ స్కూళ్లలో సరైన కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్‌నెట్‌ లేకపోవడం సమస్యగా మారింది. 

పరిశోధనలపై ఆసక్తి కలిగేలా..
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాఠశాలల్లో ‘వర్చువల్‌ రియాలిటీ, త్రీడీ’పద్ధతుల్లో బోధన అందించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు వెచ్చించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యార్థుల్లో ఆలోచనను రేకెత్తించేలా, క్లిష్టమైన అంశాలు కూడా అత్యంత సులభంగా అర్థమయ్యేలా బోధన కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసింది.

జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా రూపొందించింది. విద్యార్థి స్థాయిలోనే పరిశోధనల వైపు ఆసక్తి కలిగించేలా, పూర్తి అవగాహన వచ్చేలా అంశాలను ఎంపిక చేసింది. ఈ మేరకు 2023–24 నుంచే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో ‘వీఆర్‌’ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీని అమలుకు సంబంధించి ఇటీవల స్కూళ్లలో అధ్యయనం చేసింది. 

పాతకంప్యూటర్లు.. స్లో ఇంటర్నెట్‌..
‘వీఆర్‌–త్రీడీ’వంటి ఆసక్తికర బోధన పద్ధతులను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నా మౌలిక వసతుల కొరత ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం అరకొరగా ఉందని.. వాడే కంప్యూటర్లు కూడా పాతవని, వాటితో వీఆర్‌ త్రీడీ పాఠాలు చెప్పడం కష్టమని అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి ఒక్కో పాఠశాలకు 20 హెడ్‌సెట్ల చొప్పున ఐదు బడుల్లో దీన్ని తొలుత ప్రారంభించాలని అనుకున్నారు.

కానీ బోధనకు సంబంధించిన వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే సమస్య ఏర్పడుతోందని గుర్తించారు. చాలా స్కూళ్లలో ఇప్పటికీ కనీసం 4జీ నెట్‌ కూడా లేదు. పాత కంప్యూటర్లు ఎక్కువ పరిమాణంలో ఉండే వీఆర్‌–త్రీడీ వీడియోలను సరిగా ప్లే చేయలేకపోతున్నాయి. ఇది పిల్లల్లో విసుగు కలిగిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా సామాన్య, సాంఘిక శాస్త్రాల బోధనలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలినట్టు వివరిస్తున్నారు.

ఎక్కువ సామర్థ్యమున్న, వేగంగా పనిచేసే కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్‌ ఉంటే తప్ప ‘వీఆర్‌’బోధన అంశంలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని.. సానుకూల స్పందన వస్తే విద్యార్థులకు అద్భుతమైన బోధన అందుతుందని అధికారులు చెప్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement