కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్
సమగ్ర దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా
సంస్థను ప్రైవేటీకరిస్తామనడం అబద్ధం.. తప్పుడు ప్రచారం నమ్మొద్దు
బొగ్గు గనుల వేలం సకాలంలో జరపకపోతే కేంద్ర ప్రభుత్వ జోక్యం
రాష్ట్రం ఆక్షన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీల పై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీఎస్‌ఆర్ ఫండ్స్ విని యోగం, సింగరేణి సంస్థ ద్వారా పలువురి విలాసా లకు చెల్లించిన బిల్లులు, ఇతర అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నందున, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. శనివారం మాజీ ఎంపీ పి.రాములు, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, పార్టీ నాయ కులు ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్. ప్రకాష్‌రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
గోదావరి తీర ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే
‘సింగరేణికి సంబంధించిన పరిపాలన అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోలేక పోయింది. బొగ్గు, సహజ వనరుల విషయంలో, సుప్రీంకోర్టు తీర్పు విషయంలో కేంద్రం ఓ రిఫరీగా విధివిధానాలు, పారదర్శకత తదితర అంశాలపైనే దృష్టి పెట్టగలదు. ఈ శాఖ మంత్రిగా నాకు కేవలం ఆరు రోజుల అనుభవమే ఉంది. సింగరేణిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తా.
సింగరేణిని ప్రైవేటీకరిస్తామనడం శుద్ధ అబద్ధం. తప్పుడు ప్రచా రాలను నమ్మొద్దు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో నిరాశా, నిస్పృహలకు గురైన బీఆర్‌ఎస్ నేతలు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేలా, ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో గోదా వరి పరీవాహక ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే జరుపుతాం. ఈ దిశలో ఇప్పటికే హైదరాబాద్‌లోని సర్వే ఆఫ్ ఇండియాతో ప్రాథమిక చర్చలు జరిపాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
పారదర్శకంగా బొగ్గు గనుల వేలం
‘సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేస్తోంది. ఇప్పటివరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.37 వేల కోట్ల ఆదాయం వచ్చింది. బొగ్గు గనుల వేలంతో 14 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కేంద్రం రూపాయి కూడా తీసుకోదు. ప్రస్తుతం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం సకాలంలో జరపకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈనెలాఖరు వరకు సమయం ఉన్నందున ఒకవేళ రాష్ట్రం ఆక్షన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది..’ అని కేంద్రమంత్రి వివరించారు.
సింగరేణికి కేసీఆర్ మరణశాసనం
‘సింగరేణి సంస్థకు మాజీ సీఎం కేసీఆర్ మరణ శా సనం రాశారు. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్‌ఎస్సే. కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. 2014 ఏప్రిల్ 1 నాటికి సంస్థ అకౌంట్లో రూ. 3,500 కోట్ల డిపాజిట్లు ఉండేవి. కానీ కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా ఎడాపెడా సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా చెల్లింపులు జరపకపోవడంతో మార్చి 31 నాటికి టీఎస్‌జెన్‌కో సింగరేణికి రూ.8,056 కోట్లు బకాయి పడింది. బొగ్గు, విద్యుత్‌కు సంబంధించి సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. నాలుగున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. ఆయన పట్ల సానుభూతి చూపాలి..’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు
‘కాంగ్రెస్ మాటల పార్టీ తప్పితే.. చేతల ప్రభుత్వం కాదు. ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ తప్పితే మిగతా హామీలను తుంగలో తొక్కారు’ అని కేంద్రమంత్రి విమర్శించారు.
నీట్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం
‘నీట్ పరీక్షా పత్రం లీక్ అవలేదు. దేశవ్యాప్తంగా 4వేల కేంద్రాల్లో పరీక్ష జరిగితే, కేవలం నాలుగు సెంటర్లలో ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇచ్చారు. నీట్ విషయంలో కేంద్రానికి ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ పరీక్ష కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతోంది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం చేసి, మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పరీక్ష నిర్వహణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది..’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment