లోక్‌సభలో
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సమీక్షించే ప్రతిపాదన ఏదీ లేదని సోమవారం లోక్‌సభలో స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావ్ కరాద్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఏడాది జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్వహించిన సమావేశంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు పరిశ్రమ) ప్రైవేటీకరణలో భాగంగా వందశాతం పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయ అనుమతి తెలిపిందని పేర్కొన్నారు. దీన్లో కేంద్ర ప్రభుత్వ వాటాతోపాటు అనుబంధంగా ఉన్న సంస్థలు, సంయుక్త భాగస్వామ్యసంస్థల వాటాలను 100 శాతం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌లో ఉద్యోగులు, భాగస్వాముల సమస్యల పరిష్కార విధివిధానాలు చేరుస్తామని పేర్కొన్నారు.
హనుమ జన్మస్థలంపై పరిశోధన ప్రతిపాదన లేదు
హనుమంతుడి జన్మస్థలంపై పరిశోధనచేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. హనుమంతుడి జన్మస్థలం ఏడుకొండల మీద అని టీటీడీ, కొప్పల్ జిల్లాలో అని కర్ణాటక చెబుతున్న అంశాలపై కేంద్రానికి అవగాహన ఉందా అని బీజేపీ సభ్యుడు సంగన్న అమరప్ప అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో భాగంగా రాష్ట్రాలు, పాఠశాలల ఉత్తమ పద్ధతులు, నూతన ఆవిష్కరణలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నాడు–నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలికవసతుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పథకంపై వైఎస్సార్‌సీపీ సభ్యుడు బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జాతీయ విద్యావిధానం–2020లో సెకండరీ విద్యకు సంబంధించి లాంగ్ టర్మ్ డిజిటల్ ఎడ్యుకేషనల్ స్ట్రాటజీ కూడా చేర్చినట్లు వైఎస్సార్‌సీపీ సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ముస్లింలలో 6.96 శాతమే గ్రాడ్యుయేట్లు
రాజ్యసభలో
ముస్లింలలో గ్రాడ్యుయేషన్, ఆపైన చదువుతున్న వారి సంఖ్య 6.96 శాతం మాత్రమేనని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 43 శాతం ముస్లిం జనాభాలో 2.75 శాతం మాత్రమే గ్రాడ్యుయేట్లున్న విషయం వాస్తవమేనా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ముస్లిం జనాభాలో అక్షరాస్యత 68.5 శాతం ఉన్నట్లుగా 2011 జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయన్నారు. విద్యాపరంగా మైనారిటీ సాధికారికత నిమిత్తం ప్రవేశపెట్టిన మూడు ఉపకారవేతన పథకాలకు బడ్జెట్ కేటాయింపును రూ.287 కోట్లకు పెంచిన దృష్ట్యా 2018–19 నుంచి హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా రద్దుచేసినట్లు పేర్కొన్నారు. ఏపీలో 112 తాగునీటి పరీక్ష, పరిశోధన కేంద్రాలున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు జవాబుగా కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment