
సాక్షి, ఢిల్లీ: విశాఖలో మెట్రో రైలు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన రాజ్యసభలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై జరిగిన చర్చలో మాట్లాడుతూ విశాఖపట్నంలో 76.9 కిలోమీటర్ల లైట్ మెట్రో నిర్మించాలని నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పునర్విభజన చట్టంలో "సాధ్యమైతే, అవకాశం ఉంటే" అనే పదాలు ఉపయోగించడం వల్ల ఏపీకి నష్టం జరిగిందన్నారు. బడ్జెట్‌లో రూ. 24వేల కోట్ల రూపాయలు మెట్రో రైలుకు కేటాయిస్తే, విశాఖకు మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కేంద్ర ప్రభుత్వం విశాఖలో మెట్రో రైలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి వర్షానికి పార్లమెంటు ఆవరణలోనే మోకాలు లోతు నీరు ప్రవహించింది. డ్రైన్ల పూడిక తీయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వెంటనే డ్రైనేజీలు, మౌలిక వసతులను మెరుగుపరచాలి. సింధులోయ నాగరికత సమయంలోనే అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థలు నిర్మించగలిగారు. ఇప్పుడు సరైన డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు నిర్మించలేకపోతున్నారు?’’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
నగరాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుచాలి. అల్పాదాయ వర్గాలలో 90 శాతం మందికి ఇళ్లు లేవు. దీనివల్ల మురికివాడలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జనాభా లెక్కలు చేపట్టాలి. నగరాల్లో 17 శాతం మురికివాడలు ఉన్నాయి. మురికివాడలలో బహుళ అంతస్తులు భవనాలు నిర్మించాలి. నగరాలలో ఉపాధి కల్పన పెంచాలి. మురికివాడలలో పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా ముందుకు తీసుకెళ్లాలి’’ అని రాజ్యసభలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.