వాషింగ్టన్ : విదేశీయుల ప్రవేశానికి అమెరికా (usa) కొత్త నిబంధనలు విధించింది. విదేశీయులకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసింది. అమెరికా వచ్చే వారికి రిటన్ ఎయిర్ టికెట్ తప్పని సరి చేసింది. ఈ నింబధనల్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (U.S. Department of Homeland Security) జారీచేసింది. కచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డీహెచ్‌ఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ ఆదేశాలతో రిటన్ టికెట్ లేని కారణంగా నిన్న ఒక్కరోజే వందమంది భారతీయుల్ని వెనక్కి పంపింది. నిబంధనల మేరకు కనీసం 3వేల డాలర్లు లేని మరో వంద మంది భారతీయుల్ని డీహెచ్‌ఎస్ అనుమతించలేదు.
అంతకుముందు, 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్‌తన కార్యచరణ ప్రకటించారు. తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.
అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏమిటంటే...
జన్మతః పౌరసత్వం లేనట్లే
అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది.
అక్రమ వలసదారులంతా వెనక్కే
మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్ ఇన్ మెక్సికో విధానాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్–మెక్సికన్ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్ అండ్ రిలీజ్’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి.
జాతీయ అత్యవసర పరిస్థితి
అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్‌కు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment