Department of Homeland Security head
-
హెచ్–1బీ వీసా సులభతరం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసా కార్యక్రమం కింద వేగంగా ఉపాధి పొందాలనుకునే భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. వేగంగా ఉపాధి కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హెచ్–1బీ వీసా నిబంధనల్లో కీలకమార్పులు చేసింది. దీంతో హెచ్–1బీ వీసా పొందడం మునపటితో పోలిస్తే అత్యంత సులభంకానుంది. అమెరికా కంపెనీలు తమ ఉద్యోగాల కోసం విదేశీయులను ఎంపికచేసుకునే ప్రక్రియను సులభతరంచేయడం ఇందుకు మరో కారణం. నైపుణ్య ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీ, అనుమతి ప్రక్రియలను వేగవంతం చేయడం, నిబంధనల సడలింపు ప్రక్రియ వంటి నిర్ణయాలు 2025 జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎఫ్–1 విద్యార్థి వీసాలతో అమెరికాలోకి అడుగుపెట్టిన భారతీయులు ఇకపై సులువుగా తమ వీసాను హెచ్–1బీ వీసాగా మార్చుకోవచ్చు. దీంతో వీరికి అక్కడి కంపెనీలు వేగంగా ఉద్యోగాలు కల్పించేందుకు వీలవుతుంది. థిరిటికల్, టెక్నికల్ నిపుణులుగా వీరికి ఉద్యోగాచ్చేందుకు అక్కడి సంస్థలకు అవకాశం చిక్కుతుంది. అంతర్జాతీయ మార్కెట్లకు తగ్గట్లుగా, ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా అమెరికన్ సంస్థలను తీర్చిదిద్దే లక్ష్యంతో వీసా నిబంధనలను సడలిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మంగళవారం ప్రకటించింది. అమెరికా సంస్థలు కార్మిక కొరత సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 20వ తేదీన నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిరోజుల ముందు బైడెన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వేగ వంతం చేయనుంది. ‘‘హెచ్–1బీ వీసా విధానం ద్వారా అమెరికా సంస్థలు అత్యంత నైపుణ్యమైన ఉద్యోగులకు నియమించుకునే అవకాశాలను విస్తృతంచేశాం. దీంతో అంతర్జాతీయ మేధతో అన్ని రంగాల్లో అమెరికా ఎంతో ప్రయోజనం పొందనుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మంత్రి అలెజాండ్రో ఎన్.మయోర్కాస్ చెప్పారు. ‘‘1990లో హెచ్–1బీ విధానం మొదలెట్టాక అమెరికా దేశ ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా ఈ పద్దతిని నవీకరించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు’’అని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం.జడ్డూ హెచ్–1బీ విధానాన్ని మెచ్చుకున్నారు.భారతీయులకు ఏ రకంగా ఉపయోగం?యూఎస్సీఐఎస్ ద్వారా హోంల్యాండ్ సెక్యూ రిటీ విభాగం ఏటా లాటరీ విధానం ద్వారా కేవలం 65,000 వరకు హెచ్–1బీ వీసాలనే జారీచేసేది. అడ్వాన్స్డ్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉన్న సందర్భాల్లో మరో 20వేల హెచ్– 1బీ వీసాలనే ఇచ్చేది. ఈ కోటా పరిమితి అనేది ఇన్నాళ్లూ లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు లేదు. దీంతో ఈ నిబంధనలోని లొసుగును దుర్వినియోగం చేస్తూ చాలా మంది ‘రీసెర్చ్’మాటున వీసాలు సాధించారని, దీంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్య అభ్యర్థులకు లాటరీ ద్వారా వీసా పొందే అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపణలు ఉండేవి. దీంతో వీటికి చెక్ పెడుతూ ఇకపై లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు తొలిసారిగా కోటా పరిమితిని విధి స్తూ, కోటాను నిర్వచిస్తూ నిబంధనల్లో మా ర్పులు తెచ్చారు. దీంతో నాన్‌ప్రాఫిట్, గవర్న మెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి పోటీ తగ్గి ఆ మేరకు భారతీయులకు లాటరీలో అధిక ప్రా ధాన్యత, లబ్ధిచేకూరుతుందని భావిస్తున్నా రు. ప్రతి ఏటా హెచ్–1బీ వీసా పొందుతున్న వారిలో భారత్, చైనా దేశస్థులే అధికంగా ఉంటున్నారు. -
గ్రీన్‌కార్డు ఆశలు తీరే మార్గం.. భారతీయ అమెరికన్లకు శుభవార్త!
వాషింగ్టన్: గ్రీన్‌కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయ అమెరికన్లకు శుభవార్త. 1992 నుంచి నిరుపయోగంగా ఉన్న 2.30 లక్షలకు పైగా గ్రీన్‌కార్డులను స్వాధీనం చేసుకుని, పునరి్వనియోగించాలన్న సిఫారసుపై అధ్యక్షుడి సలహా మండలి ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా, మరింత మంది గ్రీన్‌కార్డులను అందుకునేందుకు వీలు ఏర్పడింది. దీని ప్రకారం..ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్‌కార్డులకు అదనంగా 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటిని జారీ చేస్తారని ప్రముఖ భారతీయ అమెరికన్ అజయ్ భుటోరియా చెప్పారు. అధ్యక్షుడు బైడెన్‌కు ఆసియన్ అమెరికన్ల సలహా మండలిలో భుటోరియా సభ్యుడు. ఇందుకు సంబంధించిన సిఫారసులను మండలికి గురువారం అందజేసినట్లు ఆయన తెలిపారు. గ్రీన్‌కార్డు అంటే అమెరికాలో వలసదారులకు అందజేసే శాశ్వత నివాస పత్రం. ఉపయోగంలో లేని గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, మున్ముందు గ్రీన్‌కార్డుల వృథాను అరికట్టేందుకు పలు సిఫారసులను చేశామన్నారు. వీటి అమలుతో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతో ఊరటనిస్తుందని చెప్పారు. తమ కమిషన్ సిఫారసులకు ఆమోదం తెలిపిన బైడెన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ, ఉద్యోగ ప్రాతిపదికన వలసదారులకు ఏటా నిరీ్ణత సంఖ్యలో గ్రీన్‌కార్డులను జారీ చేసే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)కి కాంగ్రెస్ ఇస్తుంటుంది. అయితే, పరిపాలనా పరమైన జాప్యంతో జారీ అయిన గ్రీన్‌కార్డుల్లో కొన్ని నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. అనేక ఏళ్లుగా ఇలా కార్డులు లక్షలుగా పేరుకుపోయాయని భుటోరియా వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు చర్యలను తాము సూచించినట్లు వెల్లడించారు. అందులో ఒకటి...1992 నుంచి ఉపయోగంలో గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్‌కార్డులకు తోడుగా స్వాధీనం చేసుకున్న 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటినీ జారీ చేయాలి. రెండోది..ఆ ఆర్థిక సంవత్సరంలో సంబంధిత పత్రాలను ఏజెన్సీలు ప్రాసెస్ చేయలేకపోయినప్పటికీ, అన్ని గ్రీన్ కార్డ్‌లు వార్షిక పరిమితి ప్రకారం అర్హులైన వలసదారులకు అందుబాటులో ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావడం. కొత్త విధానం అమల్లోకి రాకముందే ఉపయోగించని గ్రీన్ కార్డ్‌లను తిరిగి పొందేందుకు ఈ విధానాన్ని ముందస్తుగా వర్తింపజేయడం’అని ఆయన వివరించారు. ఈ సిఫారసులు అమల్లోకి వస్తే ఎన్నో కుటుంబాలు, వ్యక్తులతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిరుపయోగంగా ఉండే గ్రీన్‌కార్డుల ప్రభావం ముఖ్యంగా భారతీయ అమెరికన్లు, ఫిలిపినో అమెరికన్లు, చైనీస్ అమెరికన్ల కుటుంబాలపైనే ఉంటుందని చెప్పారు. గ్రీన్‌కార్డుల కొరత ప్రభావం తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే హెచ్–1బీ వీసాదారులపై ఉంటుందని, వారి పిల్లల వలస హోదాపైనా పడుతోందన్నారు. 2020 గణాంకాల ప్రకారం 42 లక్షల కుటుంబాలు సగటున ఆరేళ్లుగా గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయ ఐటీ నిపుణులు గ్రీన్‌కార్డు కోసం సగటున దశాబ్ద కాలంపాటు ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితులున్నాయి. -
వలస విధానంపై ట్రంప్‌కి చుక్కెదురు
వాషింగ్టన్: వలసదారుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మైనర్లుగా ఉన్నప్పుడే చట్టవిరుద్ధంగా తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారికి రక్షణ కల్పించడానికి ఒబామా హయాం నాటి వలస విధానాలను పునరుద్ధరించాలని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకి అక్రమంగా వచ్చిన చిన్నారులకి రక్షణ కల్పించడానికి బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) విధానాన్ని రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలకు అమెరికా కోర్టు అప్పట్లో అడ్డుకట్ట వేసింది. మరో రెండేళ్ల పాటు డీఏసీఏని కొనసాగించాలని న్యూయార్క్ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తి అయిన నికోలస్ గరాఫీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. చట్టపర రక్షణ కోసం వలసదారులు చేసుకునే దరఖాస్తుల్ని సోమవారం నుంచి స్వీకరించాలని స్పష్టం చేశారు. 2017 నుంచి డీఏసీఏ విధానం కింద దరఖాస్తుల్ని తీసుకోవడం ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ విధానం ద్వారా చిన్నతనంలోనే అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి వచ్చిన వారికి రక్షణ కలగనుంది. చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన వారికి రక్షణ కల్పించి, వారికి ఉపాధి మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి నికోలస్ పేర్కొన్నారు. 2019 నాటి సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) నివేదిక ప్రకారం భారత్ నుంచి 6 లక్షల 30 వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. 2010 నుంచి పదేళ్లలో వారి సంఖ్య 72 శాతం పెరిగింది. అదే సంవత్సరం భారత్ నుంచి వచ్చిన వారిలో 2,550 మందికి డీఏసీఏ ద్వారా రక్షణ లభించింది. -
‘హెచ్1బీ’పై మరిన్ని ఆంక్షలు
వాషింగ్టన్: అమెరికా హెచ్ 1బీ వీసా విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో తాజాగా మరికొన్ని ఆంక్షలను చేర్చింది. తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు కోరుకుంటున్న వేలాది భారతీయుల ఆకాంక్షలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)మంగళవారం దీనికి సంబంధించిన తాత్కాలిక తుది ఉత్తర్వులను జారీ చేసింది. హెచ్1బీకి వీలు కల్పించే ‘ప్రత్యేక నైపుణ్య వృత్తి(స్పెషాలిటీ ఆక్యుపేషన్)’ నిర్వచనానికి ఇప్పటివరకు ఉన్న విస్తృతార్థాన్ని ఇప్పుడు కట్టుదిట్టం చేసి, సంక్షిప్తం చేశారు. నిబంధనల్లో ఉన్న లొసుగులను తొలగించి అత్యంత అర్హులైన విదేశీయులకు స్థానిక కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించేలా మార్పులు చేశారు. అమెరికన్లను తొలగించి, ఆ ఉద్యోగాలను చవకగా లభించే విదేశీయులకు ఇచ్చే విధానాన్ని అడ్డుకునేలా నిబంధనలు రూపొందించారు. హెచ్1బీ పిటిషన్ ఆమోదం పొందకముందు, పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో, దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత కూడా వర్క్‌సైట్ ఇన్స్పెక్షన్ అధికారాన్ని డీహెచ్ఎస్కు కల్పించారు. ఈ నిబంధనలు రెండు నెలల్లో అమల్లోకి వస్తాయని డీహెచ్ఎస్ పేర్కొంది. అమెరికాలోని కంపెనీలు వృత్తి నిపుణులైన విదేశీయులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించినదే హెచ్1బీ వీసా అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏడాదికి 85వేల వీసాలు జారీచేస్తున్నారు. భారత్, చైనా తదితర దేశాల నుంచి ఈ వీసాలతో వేలాదిగా అమెరికాకు వెళ్తుంటారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత ఐటీ నిపుణులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇప్పటికే హెచ్1బీపై అమెరికాలో ఉన్న చాలామంది భారతీయులు కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ 19తో ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ.. హెచ్1బీ ఉద్యోగాల వల్ల మరింత దిగజారకుండా, ముఖ్యంగా అమెరికన్ల ఉద్యోగ భద్రతకు ముప్పు కలగకుండా చూసే లక్ష్యంతో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) పనిచేస్తోందని డీహెచ్ఎస్ పేర్కొంది. తాజా ఆంక్షలను వైట్‌హౌజ్ సమర్ధించింది. అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ, అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకే ప్రాధాన్యం కల్పిస్తూ.. అమెరికా వర్క్ వీసా విధానాన్ని అధ్యక్షుడు ట్రంప్ మరింత మెరుగుపరుస్తున్నారని పేర్కొంది. ఇన్నాళ్లూ ఈ విధానం దుర్వినియోగమైందని విమర్శించింది. తక్కువ వేతనాలకు లభించే విదేశీ ఉద్యోగుల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోకుండా ట్రంప్ చూస్తున్నారని వివరించింది. ‘దేశ ఆర్థిక భద్రత హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలో భాగంగా మారిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇప్పుడు ఆర్థిక భద్రతే అంతర్గత భద్రత’ అని డీహెచ్ఎస్ సెక్రటరీ చాడ్ వాల్ఫ్ వ్యాఖ్యానించారు. -
చైనా తక్కువ చేసి చూపింది: అమెరికా
వాషింగ్టన్: కరోనా వైరస్ తీవ్రతను తక్కువగా చేసి చూపడం ద్వారా చైనా అత్యవసరమైన వైద్య సామగ్రిని అక్రమంగా నిల్వ చేసుకుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యురిటీ (డీహెచ్ఎస్)భావిస్తోంది. చైనా నేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యాధి తీవ్రతకు సంబంధించిన సమాచారాన్ని తొక్కిపెట్టారని, ఇది ఈ ఏడాది జనవరి తొలినాళ్లలో జరిగిందని డీహెచ్ఎస్ ఓ నిఘా నివేదికను సిద్ధం చేసిందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. వైరస్ ప్రభావాన్ని తక్కువ చేసి చూపిన చైనా ఆ సమయంలో వైద్య సామాగ్రి దిగుమతులు పెంచి, ఎగుమతులు తగ్గించిందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపింది. వైరస్ సాంక్రమిక లక్షణం ఉందని జనవరి ఆఖరు వరకూ చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలపలేదని నివేదికలో పేర్కొన్నారు. -
అలా అయితే గ్రీన్‌కార్డ్ రాదు!
వాషింగ్టన్: అమెరికా గ్రీన్‌కార్డ్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఆశావహులకు ఆ దేశ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. ఫుడ్ స్టాంప్స్(అల్పాదాయ వ్యక్తులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చవకగా ఇచ్చే వోచర్లు), వైద్య సాయం(మెడిక్ఎయిడ్), గృహ సదుపాయం(హౌజింగ్ అసిస్టెన్స్) తదితర సౌకర్యాలు కోరుకుంటున్న వారికి గ్రీన్ కార్డ్ నిరాకరించే అవకాశముందని స్పష్టం చేసింది. గ్రీన్‌కార్డ్ పొందినవారికి అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశంతో పాటు పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా తమ పౌరులకు ఇచ్చే ఇలాంటి ప్రభుత్వ సౌకర్యాలను తాము భవిష్యత్తులో కూడా ఆశించబోమని కాన్సులార్ ఆఫీసర్‌ను నమ్మించాల్సి ఉంటుందని పేర్కొంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా నిబంధనలను జారీ చేసింది. అమెరికాకు రావాలనుకునే లేదా అమెరికాలో ఉండాలనుకునే విదేశీయులు తమ ఖర్చులను తామే భరించేలా, అమెరికా ప్రభుత్వం అందించే సౌకర్యాలపై ఆధారపడకుండా ఉండేలా ఈ తాజా నిబంధనలు తోడ్పడుతాయని వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక స్థాయిని మించి ప్రభుత్వ సౌకర్యాలు పొందే వ్యక్తులను ‘పబ్లిక్ చార్జ్(ప్రజలపై భారం)’గా పరిగణిస్తారు. అలా పబ్లిక్ చార్జ్‌గా మారే అవకాశమున్న వారిని దేశంలోకి అడుగుపెట్టకుండానే నిరోధిస్తారు. ఇప్పటికే దేశంలో ఉంటున్నవారైతే.. వారి ఇమిగ్రేషన్ స్థాయిని మార్చుకునే అవకాశం ఇవ్వరు. విదేశీయులపై ప్రజాధనం ఖర్చుకాకూడదనే ఈ నిబంధనలను అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చారని వైట్‌హౌజ్ పేర్కొంది. ‘ఈ చట్టం 1996 నుంచే ఉంది కానీ కఠినంగా అమలు చేయలేదు’ అని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) డైరెక్టర్ కెన్ స్పష్టం చేశారు. ఈ నిబంధనల వల్ల గ్రీన్‌కార్డ్ ఆశావహులు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వ్యాఖ్యానించింది. -
హెచ్4 వీసాలపై పిడుగు!
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అనుమతులను రద్దుచేయాలన్న డీహెచ్ఎస్ (డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ) ప్రతిపాదనను అమలుచేసే దిశగా మరో అడుగు ముందుకు పడింది. హెచ్–1బీ వీసా కలిగిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు, వారి 21 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఇచ్చేదే ఈ హెచ్–4 వీసా. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులిస్తూ 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ అనుమతులను రద్దు చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా, డీహెచ్ఎస్ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించాల్సిందిగా మే 22న అమెరికా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయితే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్ష మందికి పైగా భారతీయులు, తమ కొలువులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ లక్ష మంది భారతీయుల్లో స్త్రీలే అత్యధికంగా ఉన్నారు. కనీసం సంవత్సరం తర్వాతే.. ఒక వేళ హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయినా, అది అమలు కావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుందని అమెరికాలో వలస చట్టాల న్యాయనిపుణుడు రాజీవ్ ఖన్నా చెప్పారు. ‘హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునే అనుమతిని రద్దుచేసే ప్రక్రియ ప్రస్తుతం చివరి నుంచి రెండో దశలో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తే, ఫెడరల్ రిజిస్టర్లో దీనిని పోస్ట్ చేస్తారు. 30 లేదా 60 రోజుల్లోపు మళ్లీ ప్రజలు తమ అభిప్రాయాలు తెలపవచ్చు. అనంతరం నిబంధనకు తుదిరూపు వస్తుంది’ అని ఆయన వివరించారు. వలస విధానాల్లో పూర్తి సంస్కరణలు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం తొలి నుంచీ మొగ్గుచూపుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే, గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతులు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చేసింది. అనంతరం గతేడాది అక్టోబర్‌లో డీహెచ్ఎస్ ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడింది. అయితే హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దు చేస్తే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతిభావంతులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. -
షికాగో సెక్స్‌రాకెట్ .. ఎవరీ ABCDE?
చికాగో : తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన షికాగో సెక్స్ రాకెట్ కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్ వెలుగులోకి వచ్చింది. ఆ అఫిడవిట్ పరిశీలిస్తే కోసు దర్యాప్తు పురోగతి, ఏ కోణంలో సాగుతోందన్న విషయం అవగతమవుతోంది. ప్రస్తుతం ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన కొందరి పేర్లు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ అఫిడవిట్లో అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న ఏ, బీ, సీ, డీ, ఈ ఎవరై ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వీరితో పాటూ మొత్తం బాధిత 10 మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ సెక్స్ రాకెట్ డైరీలో ఏపీ మంత్రి ? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రెసిడెంట్ వేమన సతీష్‌ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగానే ఉంటారు. ఈ విషయంలో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అంతేకాకుండా సెక్స్ రాకెట్‌కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. తీగలాగితే డొంకంత కదులుతున్నట్లు పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో అమెరికా తెలుగు సంఘాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అసోసియేషన్ల పేరుతో వీసాలు.. డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ పలువురు నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలకు వీసాలు ఇప్పించి అమెరికాకు రప్పిస్తారని పోలీసుల విచారణలో తేలింది. విచారణ జరిగిందిలా.. గత ఏడాది నవంబర్ 20న ఓ హీరోయిన్ ఢిల్లీ నుంచి షికాగో వెళ్లింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా నవంబర్18న ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు చికాగోకు వెళ్లింది. దీంతో అనుమానంతో వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను విచారించిన అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా ఆయా సంఘాల కార్యక్రమాలకు హాజరైన వారి వివరాలను మన దేశంలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. విచారణకు సహకరిస్తాం : సతీష్ వేమన సినీతారల వ్యభిచారం కేసుకు అమెరికాలోని తెలుగు సంఘాల ఆర్గనైజర్లతో సంబంధాలున్నాయని వస్తున్న వార్తలపై తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన స్పందించారు. నిందితులతో తానాకు ఎలాంటి సంబంధంలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో నిందితులు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, నఖిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించినట్టు తెలుస్తోందన్నారు. కొన్నింటిలో తానా పేరును వాడి, అక్రమ మార్గాల్లో అమెరికా వీసా పొందారన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ(డీహెచ్ఎస్) ఈ కేసు విచారణ ముమ్మరం చేసిందని, వారికి తానా పూర్తిగా సహకరిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు తానా పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన తీరును వారికి వివరించినట్టు తెలిపారు. -
దేశ రక్షణ ట్రంప్ ఎవరికిస్తున్నారంటే..
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలోకి మరో మాజీ ఆర్మీ అధికారిని తీసుకోనున్నారు. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. గతంలో సైనిక విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన జనరల్ జాన్కెల్లీని దేశీయ రక్షణ వ్యవహారాల శాఖ అధిపతిగా తీసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు తన ప్రభుత్వంలోకి ముగ్గురు మాజీ సైనికాధికారులను తీసుకున్నట్లవుతుంది. ‘జాన్ కెల్లీకి అపార అనుభవం ఉంది. అంతర్గత ఉగ్రవాదాన్ని ఆయన సమర్థంగా అంచనా వేయగలరు. ఆయన మంచి కమిట్మెంట్తో పోరాటం చేసే వ్యక్తి. అందుకే ఆయన మాత్రమే ఈ విధులు నిర్వహించగల సమర్థుడని భావిస్తున్నాను. మన సరిహద్దులు కాపాడేందుకు, మనం ఉన్నపలంగా అమలుచేయాల్సిన అక్రమ వలసలు నివారణ వంటివాటికి కెల్లీ సరైనవారు. నిఘా వర్గాలు, ఎన్ఫోర్స్మెంట్ సంస్థల మధ్య వారధిలా పనిచేస్తారు’ అని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై కెల్లీ స్పందిస్తూ ట్రంప్ తనకు ఆ అవకాశం ఇవ్వడం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు, తిరిగి అమెరికా సరిహద్దుల్లో సార్వభౌమాత్వాన్ని కాపాడేందుకు అమెరికా ప్రజలు ఓటేశారని, వారి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు.