‘హెచ్‌1బీ’పై మరిన్ని ఆంక్షలు | Donald Trump announces new US H-1B visa rules | Sakshi
Sakshi News home page

‘హెచ్‌1బీ’పై మరిన్ని ఆంక్షలు

Published Thu, Oct 8 2020 1:39 AM | Last Updated on Thu, Oct 8 2020 2:30 AM

Donald Trump announces new US H-1B visa rules - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా హెచ్‌ 1బీ వీసా విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో తాజాగా మరికొన్ని ఆంక్షలను చేర్చింది. తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు కోరుకుంటున్న వేలాది భారతీయుల ఆకాంక్షలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌)మంగళవారం దీనికి సంబంధించిన తాత్కాలిక తుది ఉత్తర్వులను జారీ చేసింది. హెచ్‌1బీకి వీలు కల్పించే ‘ప్రత్యేక నైపుణ్య వృత్తి(స్పెషాలిటీ ఆక్యుపేషన్‌)’ నిర్వచనానికి ఇప్పటివరకు ఉన్న విస్తృతార్థాన్ని ఇప్పుడు కట్టుదిట్టం చేసి, సంక్షిప్తం చేశారు. నిబంధనల్లో ఉన్న లొసుగులను తొలగించి అత్యంత అర్హులైన విదేశీయులకు స్థానిక కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించేలా మార్పులు చేశారు.

అమెరికన్లను తొలగించి, ఆ ఉద్యోగాలను చవకగా లభించే విదేశీయులకు ఇచ్చే విధానాన్ని అడ్డుకునేలా నిబంధనలు రూపొందించారు. హెచ్‌1బీ పిటిషన్‌ ఆమోదం పొందకముందు, పిటిషన్‌ విచారణలో ఉన్న సమయంలో, దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత కూడా వర్క్‌సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారాన్ని డీహెచ్‌ఎస్‌కు కల్పించారు. ఈ నిబంధనలు రెండు నెలల్లో అమల్లోకి వస్తాయని డీహెచ్‌ఎస్‌ పేర్కొంది. అమెరికాలోని కంపెనీలు వృత్తి నిపుణులైన విదేశీయులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించినదే హెచ్‌1బీ వీసా అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏడాదికి 85వేల వీసాలు జారీచేస్తున్నారు. భారత్, చైనా తదితర దేశాల నుంచి ఈ వీసాలతో వేలాదిగా అమెరికాకు వెళ్తుంటారు. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత ఐటీ నిపుణులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది.

ఇప్పటికే హెచ్‌1బీపై అమెరికాలో ఉన్న చాలామంది భారతీయులు కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్‌ 19తో ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ.. హెచ్‌1బీ ఉద్యోగాల వల్ల మరింత దిగజారకుండా, ముఖ్యంగా అమెరికన్ల ఉద్యోగ భద్రతకు ముప్పు కలగకుండా చూసే లక్ష్యంతో యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) పనిచేస్తోందని డీహెచ్‌ఎస్‌ పేర్కొంది. తాజా ఆంక్షలను వైట్‌హౌజ్‌ సమర్ధించింది. అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ, అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకే ప్రాధాన్యం కల్పిస్తూ.. అమెరికా వర్క్‌ వీసా విధానాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ మరింత మెరుగుపరుస్తున్నారని పేర్కొంది. ఇన్నాళ్లూ ఈ విధానం దుర్వినియోగమైందని విమర్శించింది. తక్కువ వేతనాలకు లభించే విదేశీ ఉద్యోగుల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోకుండా ట్రంప్‌ చూస్తున్నారని వివరించింది. ‘దేశ ఆర్థిక భద్రత హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీలో భాగంగా మారిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇప్పుడు ఆర్థిక భద్రతే అంతర్గత భద్రత’ అని డీహెచ్‌ఎస్‌ సెక్రటరీ చాడ్‌ వాల్ఫ్‌ వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement