వాషింగ్టన్: అమెరికా గ్రీన్‌కార్డ్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఆశావహులకు ఆ దేశ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. ఫుడ్ స్టాంప్స్(అల్పాదాయ వ్యక్తులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చవకగా ఇచ్చే వోచర్లు), వైద్య సాయం(మెడిక్‌ఎయిడ్), గృహ సదుపాయం(హౌజింగ్ అసిస్టెన్స్) తదితర సౌకర్యాలు కోరుకుంటున్న వారికి గ్రీన్ కార్డ్ నిరాకరించే అవకాశముందని స్పష్టం చేసింది. గ్రీన్‌కార్డ్ పొందినవారికి అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశంతో పాటు పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.
అమెరికా తమ పౌరులకు ఇచ్చే ఇలాంటి ప్రభుత్వ సౌకర్యాలను తాము భవిష్యత్తులో కూడా ఆశించబోమని కాన్సులార్ ఆఫీసర్‌ను నమ్మించాల్సి ఉంటుందని పేర్కొంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా నిబంధనలను జారీ చేసింది. అమెరికాకు రావాలనుకునే లేదా అమెరికాలో ఉండాలనుకునే విదేశీయులు తమ ఖర్చులను తామే భరించేలా, అమెరికా ప్రభుత్వం అందించే సౌకర్యాలపై ఆధారపడకుండా ఉండేలా ఈ తాజా నిబంధనలు తోడ్పడుతాయని వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక స్థాయిని మించి ప్రభుత్వ సౌకర్యాలు పొందే వ్యక్తులను ‘పబ్లిక్ చార్జ్(ప్రజలపై భారం)’గా పరిగణిస్తారు.
అలా పబ్లిక్ చార్జ్‌గా మారే అవకాశమున్న వారిని దేశంలోకి అడుగుపెట్టకుండానే నిరోధిస్తారు. ఇప్పటికే దేశంలో ఉంటున్నవారైతే.. వారి ఇమిగ్రేషన్ స్థాయిని మార్చుకునే అవకాశం ఇవ్వరు. విదేశీయులపై ప్రజాధనం ఖర్చుకాకూడదనే ఈ నిబంధనలను అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చారని వైట్‌హౌజ్ పేర్కొంది. ‘ఈ చట్టం 1996 నుంచే ఉంది కానీ కఠినంగా అమలు చేయలేదు’ అని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్) డైరెక్టర్ కెన్ స్పష్టం చేశారు. ఈ నిబంధనల వల్ల గ్రీన్‌కార్డ్ ఆశావహులు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment