వాషింగ్టన్: అమెరికాలో విదేశీయులకు గ్రీన్ కార్డు ఇచ్చే ‘ఈబీ–5 వీసా’ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో 10లక్షల డాలర్లు (దాదాపు రూ.6.78 కోట్లు) పెట్టుబడి పెట్టే వారికి (దీని ద్వారా కనీసం 10 మంది శాశ్వత ఉద్యోగాల కల్పన జరుగుతుంది) ఆ దేశం గ్రీన్ కార్డులు అందిస్తోంది. అయితే ఈ వీసా విధానాన్ని పూర్తిగా సంస్కరించడం లేదా పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని యూఎస్ కాంగ్రెస్‌ను ట్రంప్ సర్కారు కోరింది. ఈబీ–5 విధానం ద్వారా వచ్చిన గ్రీన్‌కార్డును సంపాదించిన వారు దీన్ని దుర్వినియోగం చేయడంతోపాటు మోసాలకు పాల్పడుతున్న కేసులు నమోదవుతున్న నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది అమల్లోకి వస్తే.. ఈబీ–5 విధానంలో అమెరికాలో గ్రీన్ కార్డులు పొందుతున్న భారతీయులపైనా పెను ప్రభావం పడనుంది. ఈ జాబితాలో చైనా, వియత్నాంలు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్ మూడో దేశంగా ఉంది. ఈ విధానంలో ఏటా10వేల వీసాలను విదేశీయులకు ఇస్తున్నారు. ఇందులో ఒక్కో దేశానికి గరిష్టంగా 7% పరిమితి ఉంటుంది. గతేడాది భారత్ నుంచి 500 ఈబీ–5 వీసా పిటిషన్లు దాఖలవగా.. ఈసారి ఈ సంఖ్య 700కు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నమోదు చేసుకున్న వారి వీసా తిరస్కరణ రేటు గరిష్టంగా 20% మాత్రమే. ఇది కూడా సమర్పించే దస్తావేజులు, నిధుల విషయంలో సమస్యలతోనే. భారత్ నుంచి ఈ వీసాలు పొందేవారిలో చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక నుంచే ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఉంటారు.
అమెరికా ‘గూఢచర్య’ ఆరోపణ!
అమెరికా సీనియర్ చట్టసభ్యులు కూడా ఈబీ–5 ఇన్వెస్టర్స్ వీసా కార్యక్రమాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఈ వీసాల దుర్వినియోగం జరుగుతున్న ఘటనలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ‘ఈబీ–5 విధానం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. ’మనీలాండరింగ్, గూఢచర్యం చేసేందుకు కూడా కొందరు ఈ విధానాన్ని వినియోగించుకుంటున్నారు’ అని అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా ఇటీవలే.. కాంగ్రెస్ సభ్యుల విచారణలో వెల్లడించారు. 1990లో కేటగిరీ–5ను సృష్టించినపుడు.. ఉద్యోగ కల్పన, పెట్టుబడుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందనే కాంగ్రెస్ భావించింది. రెండేళ్ల తర్వాత నిరుద్యోగం పెరగడంతో రీజనల్ సెంటర్ ప్రోగ్రామ్‌ను అమల్లోకి తెచ్చి.. దీనికి ఈబీ–5 వీసా విధానాన్ని జోడించారు.
చైనీయులే మోసగిస్తున్నారు!
గత ఐదేళ్లలో ఈ వీసాల ద్వారా దేశ భద్రతను ప్రశ్నించేలా 19 కేసులు నమోదయ్యాయని సిస్నా తెలిపారు. ఈబీ–5 వీసాలను దుర్వినియోగం చేస్తున్న వారిలో ఎక్కువమంది చైనీయులే ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో 120 మంది చైనీయులు తప్పుడు విధానాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అమెరికా ఇమిగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా వివిధ కేసులు బయటపడుతూ.. అమెరికా భద్రతకే సవాల్ విసురుతున్నందున ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు భావిస్తోంది.
350 గ్రాములకు మించి పౌడర్లు తేవొద్దు!
అమెరికా వచ్చే ప్రయాణికులు 350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలు విమానం కేబిన్‌లోకి తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. జూన్ 30 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అమెరికా రవాణా భద్రత పరిపాలన విభాగం (టీఎస్‌ఏ) పేర్కొంది. గతేడాది ఆస్ట్రేలియాలో ఓ గల్ఫ్ విమానంలో పౌడర్ ఎక్స్‌ప్లోజివ్స్ ద్వారా పేలుడు జరిపేందుకు విఫలయత్నం చేసిన నేపథ్యంలో టీఎస్‌ఏ ఈ నిర్ణయం తీసుకుంది. ‘350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలను ఎక్స్‌రే స్క్రీనింగ్ చేయనున్నాం. అలాంటి పదార్థాలను చెకింగ్ బ్యాగుల్లో ఉంచితే అదనపు తనిఖీలు ఉండవు’ అని టీఎస్‌ఏ పేర్కొంది. పౌడర్ లాంటి పదార్థాలు తీసుకొస్తే అదనపు తనిఖీలుంటాయని, వాటిని చెకింగ్ బ్యాగుల్లో ఉంచడం ఉత్తమమని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. వైద్యం, పిల్లలకు సంబంధించిన పౌడర్లు, చితాభస్మం, సుంకం లేని పౌడర్లను వెంట తీసుకెళ్లొచ్చని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment