US Congress
-
పాక్‌కు సాయం ఆపండి
ఇస్లామాబాద్: అమెరికా అందిస్తున్న భారీ ఆర్థిక సాయాన్ని మానవ హక్కుల ఉల్లంఘనకు పాకిస్తాన్ వినియోగిస్తోందని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగి రాజ్యాంగబద్ధమైన రీతిలో ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఆ దేశానికి ఎలాంటి ఆర్థిక సాయమూ అందించొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాన్ ఒమర్‌తో పాటు మరో 10 మంది కాంగ్రెస్ సభ్యులు ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. దైవ దూషణ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం తదితర చర్యలకు పాక్ పాల్పడుతున్న వైనాన్ని అందులో ప్రస్తావించారు. ‘‘ఇవన్నీ పాక్‌లోని మతపరమైన మైనారిటీలను మరింతగా అణచివేసేందుకు తీసుకుంటున్న చర్యలే. ఎందుకంటే దైవదూషణ బిల్లును పాక్ పార్లమెంటు ఆమోదించిన కొద్ది రోజులకే మతోన్మాద మూకలు చర్చిలను ధ్వంసం చేయడంతో పాటు క్రైస్తవుల ఇళ్లకు నిప్పు పెట్టాయి’’ అంటూ వారు ఆందోళన వెలిబుచ్చారు. -
పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్?
వాషింగ్టన్: అమెరికాలో జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్ల ప్రభుత్వానికి కొత్త ఆర్ధిక సంవత్సరం ముందు షాక్ తగిలింది. అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించగా 232-198 తేడాతో ఆమోదానికి నోచుకోలేదు. దీనివలన వచ్చేనెల ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోనున్నాయి. మొదట్లో బెట్టు చేసినా చివరి నిమిషంలో రిపబ్లికన్లు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందకపోతే షట్ డౌన్ తప్పదంటున్నాయి అమెరికా కాంగ్రెస్ వర్గాలు. షట్ డౌన్? ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అమెరికాలో ఆర్ధిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈనెలలో చివరి రోజైన శనివారం ఈ బిల్లు ఆమోదం పొందకపోతే అమెరికా అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోనుంది. దీనివలన 18 లక్షల మంది ఉద్యోగులున్న ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపులు, ఆయా పథకాలకు నిధులతో పాటు సైనికుల జీతాలు కూడా స్తంభించిపోయే ప్రమాదముంది. ఎందుకు ఆగింది? సరిహద్దు భద్రత ఏజెన్సీ తోపాటు మరికొన్ని ఏజెన్సీల చెల్లింపుల్లో ఫెడరల్ ప్రభుత్వం 30 శాతం కోత విధించింది. దీనిని రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. అలాగే ఉక్రెయిన్‌కు నిధులివ్వాలనే బిల్లును తిరస్కరించనున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బిల్లు ఆమోదం కష్టసాధ్యంగా మారింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ బిల్లును ఆమోదింపజేసి షట్ డౌన్ నివారించేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేశారు. చివరి రోజున కూడా ఆయన ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం అమెరికా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని అంటున్నాయి యూఎస్ కాంగ్రెస్ వర్గాలు. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే బిల్లులో నుంచి ఉక్రెయిన్ అంశాన్ని తొలగించడం ఒక్కటే మార్గమని అంటున్నారు సెనేటర్ రాండ్ పాల్. Like Sen. McConnell said, nobody benefits from a government shutdown—it hurts our services, economy, and neighbors…and it doesn’t save money. It's our job to pass a budget. House Republicans need to put their partisan games aside & work with us to avoid a disastrous shutdown. pic.twitter.com/uhgtecLDpx — Rep. Morgan McGarvey (@RepMcGarvey) September 29, 2023 ఇది కూడా చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. -
టీసీఎస్‌లో అమెరికా కాంగ్రెస్ బృందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రో ఖన్నా సారథ్యంలోని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లోని టీసీఎస్ కార్యాలయాన్ని సందర్శించింది. టాటా గ్రూప్, టీసీఎస్ కార్యకలాపాల గురించి ఈ సందర్భంగా వారికి టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి రాజన్న వివరించారు. అమెరికాకు విజిటర్ వీసాల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆయన కోరారు. అమెరికన్ ఎంబసీ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్, తెలంగాణ ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ, తెలంగాణ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బాలయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న అమెరికాను ఇప్పుడు చైనా మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. ఓ అజ్ఞాత మాల్వేర్ను తమ రక్షణ పరికరాల్లో చైనా ప్రవేశపెట్టిందని అమెరికా సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారి ఒకరు నిర్ధారించారు. తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్ కోడ్‌ను(మాల్వేర్) ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సైనిక కేంద్రాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోకి ఈ మాల్వేర్ రహస్యంగా చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అత్యవసర, సంక్షోభ సమయాల్లో సైన్యానికి అవసరమైన సరఫరాల్లో అంతరాయం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. టైం బాంబులాంటిదే మాల్వేర్ వ్యవహారం తొలుత ఈ ఏడాది మే నెలలో బయటపడింది. గువామ్‌లో అమెరికా ఎయిర్ బేస్‌కు చెందిన టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో అనుమానాస్పద కంప్యూటర్ కోడ్‌ను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. మరో కీలక ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లలోనూ ఇది ఉన్నట్లు పేర్కొంది. ఓల్ట్ టైఫన్ అనే చైనా హ్యాకింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్ అనేది నిజంగా టైంబాంబు లాంటిదేనని అమెరికా కాంగ్రెస్ అధికారి చెప్పారు. సైనిక స్థావరాలకు విద్యుత్, నీటి సరఫరాను, సమాచార మారి్పడిని హఠాత్తుగా నిలిపివేయడానికి ఈ మాల్వేర్ను ఉపయోగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల సైన్యంలో పనివేగం తగ్గిపోతుందని అన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని పరకరాల్లోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను పంపించినట్లు ప్రచారం సాగుతోంది. తైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. ఈ దేశంలో సమీపంలో తరచుగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తమ దేశంలో తైవాన్ ఒక అంతర్భాగమని వాదిస్తోంది. మరోవైపు తైవాన్‌కు అమెరికా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరికరాల్లోకి చైనా మాల్వేర్ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారత్ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి
వాషింగ్టన్: మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడంలో ‘అయితే, కానీ’లకు ఎంతమాత్రం తావులేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 60 నిమిషాలపాటు మోదీ ప్రసంగం కొనసాగింది. పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లతోపాటు సందర్శకుల గ్యాలరీల నుంచి వందలాది మంది భారతీయ–అమెరికన్లు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు, భారత్‌లో 26/11 దాడులు జరిగి దశాబ్దం పూర్తయినా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మతి తప్పిన సిద్ధాంతాలు కొత్తరూపును, కొత్త గుర్తింపును సంతరించుకుంటున్నాయని, అయినప్పటికీ వాటి ఉద్దేశాలు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ముమ్మాటికీ శత్రువేనని స్పష్టం చేశారు. ముష్కర మూకలను అణచివేయడంలో ఎవరూ రాజీ పడొద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పొరుగు దేశాలను ఎగుమతి చేస్తున్న దుష్ట దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఏం మాట్లాడారంటే.. భారీగానే కాదు.. వేగంగానూ అభివృద్ధి ‘‘గత దశాబ్ద కాలంలో వంద మందికిపైగా అమెరికా పార్లమెంట్ సభ్యులు భారత్‌లో పర్యటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్ ఇప్పుడేం చేస్తోంది? ఎలా చేస్తోంది? అన్నదానిపై అందరికీ ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో నేను మొదటిసారి పర్యటించినప్పుడు భారత్ ప్రపచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. మేము భారీగానే కాదు, వేగంగానూ అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్ ప్రగతి సాధిస్తే మొత్తం ప్రపంచం ప్రగతి సాధిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్‌లోనే ఉంది. ఇండో–పసిఫిక్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం.. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇతర దేశాల సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్ సూచిస్తోంది. ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) అన్ని దేశాలూ అనుసరించాలి. చార్టర్‌ను గౌరవించాలి. కానీ, ఇండో–పసిఫిక్‌పై బలప్రయోగం, ముఖాముఖి ఘర్షణ అనే నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఇది కూడా ఒక ప్రాధాన్యతాంశమే. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ఆవశ్యకతపై అమెరికాతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ‘క్వాడ్’ వంటి కూటములు ఈ ప్రయత్నంలో ఒక భాగమే. ఇండో–పసిఫిక్ బాగు కోసం క్వాడ్ కృషి చేస్తోంది. ఉక్రెయిన్ సంఘర్షణ ఆసియా ప్రాంతంలో సమస్యలు సృష్టించిన మాట వాస్తవమే. ఇది యుద్ధాల శకం కాదని, చర్చలు, దౌత్యమార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని సూటిగా చెప్పా. ఇదొక గొప్ప గౌరవం 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఈ అవకాశం దక్కడం గర్వకారణం. మనం ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ(ఏఐ)లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా)లో మరిన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రక్షణ సహకారం విషయంలో మనం(భారత్, అమెరికా) అపరిచితులమే. పెద్దగా రక్షణ సహకారం లేదు. కానీ, ఇప్పుడు భారత్‌కు అమెరికా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా మారింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ తల్లిలాంటిది. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. సమానత్వం, ప్రజల గౌరవానికి స్ఫూర్తినిచ్చేదే ప్రజాస్వామ్యం. ఆలోచనకు, వ్యక్తీకరణకు రెక్కలు తొడిగేది ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య విలువలకు భారత్ ఆయువుపట్టుగా నిలుస్తోంది. వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పండుగలా జరుపుకుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య ఉత్సవం కాదు, వైవిధ్య వేడుక. సామాజిక సాధికారత, ఐక్యత, సమగ్రత వేడుక. డిజిటల్ చెల్లింపుల అడ్డా భారత్ యువ జనాభా అధికంగా ఉన్న ప్రాచీన దేశం భారత్. సంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. నేటి యువత భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నారు. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీల విలువ 320 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్ డాలర్లు ఆదా చేశాం. భారత్‌లో ఇప్పుడు అందరూ స్మార్ట్ఫోన్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సైతం యూపీఐ సేవలను వాడుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచంలో జరిగిన ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 46 చెల్లింపులు భారత్‌లోనే జరిగాయి. వేలాది మైళ్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, చౌక డేటాతో భారత్‌లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది. మహిళల సారథ్యంలో అభివృద్ధి ప్రాచీన కాలం నాటి వేదాలు నేటి మానవాళికి గొప్ప నిధి లాంటివి. మహిళా రుషులు సైతం వేదాల్లో ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. ఆధునిక భారతదేశంలో మహిళలు ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో మహిళల సారథ్యంలో అభివృద్ధి జరగాలన్నదే మా ఆకాంక్ష. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 10.5 లక్షల మంది మహిళలు వివిధ పదవులు చేపట్టారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశం భారత్. అంగారక గ్రహంపైకి మనుషులను చేర్చేందుకు చేపట్టిన మార్చ్ మిషన్‌లో మహిళామణులు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కలి్పసే సమూల మార్పులు రావడం ఖాయం. ఆడపిల్లల చదువులు, వారి ఎదుగుదల కోసం పెట్టుబడి పెడితే వారు మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. సంస్కరణల సమయమిది.. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం వచి్చంది. ప్రపంచం మారుతోంది. అంతర్జాతీయ సంస్థలూ మారాల్సిందే. భారత్–అమెరికా మరింత సన్నిహితమవుతున్నాయి. పరస్పర సంబంధాల విషయంలో నూతన ఉషోదయం కనిపిస్తోంది. భారత్–అమెరికా సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, ప్రపంచ భవితవ్యాన్ని కూడా నిర్ధారిస్తాయి. మహాత్మా గాం«దీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తోపాటు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడినవారిని మేమే స్మరించుకుంటున్నాం. భారత్‌లో 2,500కు పైగా రాజకీయ పారీ్టలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పరిపాలిస్తున్నాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. వేలాది యాసలున్నాయి. కానీ, మేమంతా ఒకే స్వరంతో మాట్లాడుతాం. ప్రపంచంలోని అన్ని నమ్మకాలు, విశ్వాసాలకు భారత్‌లో స్థానం ఉంది, వాటిని గౌరవిస్తున్నాం. వైవిధ్యం అనేది భారత్‌లో ఒక సహజ జీవన విధానం. అమెరికా పార్లమెంట్లో భారతీయ–అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సభలో సమోసా కాకస్ ఫ్లేవర్ ఉంది. ఇది మరింత విస్తరించాలి. భారత్‌లోని భిన్న రుచులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నాను. -
140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమిది: మోదీ
వాషింగ్టన్: భారత్, అమెరికా సమాజాలు, సంస్థలు ప్రజాస్వామిక విలువలపై నిర్మితమై ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ వైవిధ్యాన్ని ఇరు దేశాలు గర్వకారణంగా భావిస్తున్నాయని చెప్పారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికాలో అడుగుపెట్టిన మోదీకి గురువారం శ్వేతసౌధంలో సాదర స్వాగతం లభించింది. అధికారిక లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్, అమెరికా రాజ్యాంగాలు ‘దేశ ప్రజలమైన మేము’ అనే మూడు పదాలతోనే ప్రారంభమవుతాయని గుర్తుచేశారు. తనకు అద్భుతమైన స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులకు, అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఇక్కడ తనకు లభించిన స్వాగతం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తున్న 40 లక్షల మందికిపైగా భారతీయులకు గర్వకారణమని అన్నారు. ప్రజాస్వామ్య బలానికి ఇదొక రుజువు: మోదీ ‘అందరి ప్రయోజనాల కోసం, అందరి సంక్షేమం కోసం’ అనే ప్రాథమిక సూత్రాన్ని భారత్, అమెరికా ఎంతగానో విశ్వసిస్తున్నాయని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడిగా అమెరికా వచ్చానని, అప్పుడు వైట్‌హౌస్ బయటి నుంచే చూశానని అన్నారు. ప్రధానమంత్రి హోదాలో చాలాసార్లు ఇక్కడికి వచ్చానని చెప్పారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భారతీయ–అమెరికన్ల కోసం వైట్‌హౌజ్ గేట్లు తెరవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని అన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు కష్టపడి పని చేస్తున్నారని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని మోదీ ప్రశంసించారు. చదవండి: అది మా డీఎన్ఏలోనే ఉంది: బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో మోదీ భారత్–అమెరికా స్నేహం మొత్తం ప్రపంచాన్ని బలోపేతం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయని వివరించారు. ప్రజాస్వామ్య బలానికి భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యమే ఒక రుజువు అని వెల్లడించారు. కీలకమైన అంశాలపై అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించబోతున్నానని పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్‌ను రెండోసారి ఉద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత్ సహకారంతో ‘క్వాడ్’ బలోపేతం: బైడెన్ భారత్–అమెరికా సంబంధాలు 21వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల సంబంధాల్లో ఒకటి అని జో బైడెన్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో మోదీని ఆహా్వనిస్తూ ఆయన మాట్లాడారు. ఈ రోజు రెండు దేశాలు కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అంశాలపై ఇరుదేశాలు సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. స్వేచ్ఛాయుత, భద్రమైన ఇండో–పసిఫిక్ లక్ష్యంగా భారత్ సహకారంతో ‘క్వాడ్’ కూటమిని బలోపేతం చేస్తున్నామని బైడెన్ వివరించారు. చదవండి: Narendra Modi: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు -
భారత్‌లో ముస్లింల హక్కులపై ప్రశ్న.. అది మా డీఎన్ఏలోనే ఉంది: మోదీ
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన ఆధ్యాయం చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినట్లుగా ప్రజాస్వామ్యం అనేది భారత్, అమెరికా దేశాల డీఎన్ఏలో ఉందని అన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ రోజు బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరిపానని తెలిపారు. ప్రజాస్వామిక విలువల గురించి తాము మాట్లాడుకున్నామని వెల్లడించారు. గురువారం వైట్‌హౌస్‌లో చర్చలు ముగిసిన అనంతరం మోదీ, బైడెన్ ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. అరుదైన సంఘటనలో, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సంయుక్త విలేకరుల సమావేశంలో పాత్రికేయుల నుంచి ప్రశ్నలు సంధించారు. ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కుల పరిరక్షణకు, వాక్ స్వాతంత్య్రాన్ని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అమెరికా మీడియా అడిగిన ప్రశ్నకు మోదీ బదులిస్తూ ‘ప్రజాస్వామ్యం మన సిరల్లో నడుస్తోంది’ అని అన్నారు. దేశం మతం లేదా కుల ప్రాతిపదికన వివక్ష చూపదని నొక్కిచెప్పిన ప్రధానమంత్రి, బిజెపి యొక్క చాలా నొక్కిచెప్పబడిన నినాదం - సబ్కా సాథ్, సబ్కా వికాస్. భారత్–అమెరికా సంబంధాల చరిత్రలో ఈ రోజుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయంచామన్నారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని ఫలవంతం చేయడానికి ఇరుదేశాల ప్రభాత్వాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఒక్కతాటిపైకి వచ్చి, కలిసి పనిచేసేలా అంగీకారానికి వచ్చామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం నేడు మరో కొత్త స్థాయికి చేరిందన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై భారత్, అమెరికా కలిసి పోరాడుతున్నాయని చెప్పారు. నూతన రంగాల్లో భారత్, అమెరికా కలిసి చేయాలన్నదే తన ఆకాంక్ష అని జో బైడెన్ వివరించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు. భారత్, అమెరికాకు అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దాపరికాలకు తావు లేదని, పరస్పరం చక్కగా గౌరవించుకుంటున్నాయని బైడెన్ తెలియజేశారు. ప్రతి పౌరుడికీ గౌరవం లభించాలన్నారు. అమెరికా స్ఫూర్తితో సాహసోపేత నిర్ణయాలు రక్షణ, అంతరిక్షం, ఇంధనం, ఆధునిక సాంకేతికత వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో గురువారం అధికారిక చర్చలు జరిపారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు ఈ ముఖాముఖి సమావేశానికి వేదికగా మారింది. పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి బైడెన్ చేపట్టిన చర్యలను మోదీ ప్రశంసించారు. చదవండి: H-1B Visa: ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్.. హెచ్–1బీ వీసా రెన్యువల్ అక్కడే! భారత్–అమెరికా ప్రజల మధ్యనున్న బలమైన అనుబంధమే ఇరు దేశాల నడుమ సంబంధాలకు అసలైన చోదక శక్తి అని పేర్కొన్నారు. నేడు భారత్–అమెరికా సముద్రాల లోతుల నుంచి ఆకాశం అంచుల దాకా, ప్రాచీన సంస్కృతి నుంచి ఆధునిక కృత్రిమ మేధ దాకా భుజం భుజం కలిపి ముందుకు సాగుతున్నాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో అమెరికా చూపుతున్న అంకితభావం తాము సాహసోపేత నిర్ణయాలు, చర్యలు తీసుకోవడానికి స్ఫూర్తినిస్తోందని వ్యాఖ్యానిచారు. మోదీ, బైడెన్ శ్వేతసౌధంలో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు కలిసి మాట్లాడుకున్నారు. మోదీకి ప్రత్యేక విందు.. అగ్రరాజ్య పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్ష భవనంలో ఘనమైన స్వాగతం లభించింది. బుధవారం అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, ఆయన సతీమణి జిల్ ఎదురొచ్చి మరీ మోదీకి సాదర స్వాగతం పలికారు. ద్వారం వద్దే సరదాగా మాట్లాడుతూ ఫొటోలు దిగారు. తర్వాత శ్వేతసౌధంలోకి తోడ్కొని వెళ్లారు. వ్యక్తిగతంగా ప్రత్యేకమైన విందు ఇచ్చేందుకు అంతకుముందే మోదీని బైడెన్ దంపతులు ఆహ్వానించిన విషయం విదితమే. వైట్‌హౌజ్‌లో బైడెన్ కుటుంబసభ్యులతో మోదీ కాసేపు మాట్లాడారు. ‘ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొనడం ఇరుదేశాల గాఢమైన స్నేహబంధానికి సంకేతం’ అని భారత విదేశాంగ శాఖ ఒక ట్వీట్‌చేసింది. తృణధాన్యాలు, మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయ, పుట్టగొడుగులు, మిల్లెట్ కేక్, స్ట్రాబెర్రీ కేక్ ఇలా భిన్న పదార్థాలతో వేర్వేరు వంటకాలను మోదీకి వడ్డించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ విందులో ముందుగా భారత పలు ప్రాంతాలను గుర్తుచేస్తూ అగ్రనేతలకు సంగీతం వినిపించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు జాక్ సులేవాన్, అజిత్ దోవల్‌లు పాల్గొన్నారు. మరోవైపు మోదీకి దాదాపు 400 మంది అతిథుల సమక్షంలో అధికారిక విందు ఇవ్వనున్నారు. -
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అమెరికా కాంగ్రెస్ ఆహ్వానం
న్యూఢిల్లీ: ఈనెల 22న యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించనున్నారు. ఈమేరకు సెనేట్ సభాపతి కెవిన్ మెక్ కార్తి స్వయంగా భారత ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సభలో ప్రధాని భారత్ అమెరికా సంబంధాల రీత్యా అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణతోపాటు ఉభయ దేశాలు ప్రాపంచికంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రసంగం చేయనున్నారు. మోదీ అరుదైన ఘనత... ఏడేళ్ల కిందట 2016లో ఇదే వేదికపై ప్రసంగించారు మోదీ. బ్రిటీష్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా తర్వాత రెండు సందర్భాల్లో యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన నాయకుడిగా చరిత్ర సృష్టించనున్నారు. 2016 ప్రసంగంలో మోడీ... గతంలో మోదీ ఇదే సభను ఉద్దేశించి మాట్లాడుతూ వాతావరణ మార్పుల నుంచి ఉగ్రవాదం వరకు, రక్షణ శాఖ, భద్రతా వ్యవహారాలు, వాణిజ్య సంబంధాలు, రెండు దేశాల మధ్య ఆర్ధిక పురోగతి వంటి అనేక అంశాలను స్పృశించారు. చదవండి: రాహుల్ గాంధీ చెప్పింది అక్షరాలా నిజం -
కవ్వింపులకు దిగితే మోదీ సర్కారు సహించబోదు: అమెరికా నిఘా వర్గాలు
వాషింగ్టన్: పాకిస్తాన్, చైనాలతో భారత్ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్ కవ్వింపులను భారత్ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్‌పై సైనిక చర్యకు దిగే అవకాశముంది’’ అని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి. ‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్‌ది. అందుకే ఇకపై పాక్ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్ ఘర్షణ, తాజాగా అరుణాచల్ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది. చైనాతో అమెరికాకు పెనుముప్పు అమెరికా జాతీయ భద్రతకు, అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ స్థానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అత్యంత ముప్పు పొంచి ఉందని యూఎస్ నిఘా విభాగపు నివేదిక అభిప్రాయపడింది. ‘‘రష్యాతో ఏడాదిగా చైనా బంధం బలపడుతున్న తీరు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. నానాటికీ పెరుగుతున్న ఈ చైనా సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. సెనేట్ సెలెక్ట్ కమిటీ సభ్యులకు నిఘా నివేదిక సమర్పించిన సందర్భంగా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. -
రిపబ్లికన్ అభ్యర్థి మెక్‌కార్తీకి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీదే మెజార్టీ. అయినప్పటికీ స్పీకర్ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి నెగ్గలేకపోయారు. నూతన సభ మంగళవారం కొలువుదీరింది. తొలిరోజు సభాపతి (స్పీకర్) ఎన్నిక నిర్వహించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కెవిన్ మెక్‌కార్తీ మెజార్టీ ఓట్లు కూడగట్టడంలో విఫలమమ్యారు. మంగళవారం రాత్రంతా సభలో హైడ్రామా చోటుచేసుకుంది. మూడు రౌండ్లు ఓటింగ్ నిర్వహించారు. స్పీకర్‌గా నెగ్గడానికి 218 ఓట్లు అవసరం కాగా, మెక్‌కార్తీకి తొలి రెండు రౌండ్లలో 203 ఓట్ల చొప్పున, మూడో రౌండ్లో 202 ఓట్లు వచ్చాయి. దీంతో తదుపరి ఓటింగ్‌ను స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. స్పీకర్ లేకుండానే సభ వాయిదా పడింది. అమెరికా చరిత్రలో 1923 నుంచి చూస్తే ప్రతినిధుల సభలో తొలి రోజు స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మెక్‌కార్తీ ఇక ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త స్పీకర్ ఎన్నికయ్యే దాకా సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. మెక్‌కార్తీకి వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలామంది ప్రత్యర్థులు ఉన్నారని రిపబ్లికన్ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఆయన స్పీకర్‌గా ఎన్నిక కావడం సొంత పార్టీలోనే కొందరికి ఇష్టం లేదన్నారు. మెక్‌కార్తీ స్పీకర్ కావడం కష్టమేనని రిపబ్లికన్ సభ్యుడు బాబ్గుడ్ వ్యాఖ్యానించారు. స్పీకర్ లేకుండా సభ సంపూర్ణం కాదు. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం, కమిటీలకు చైర్మన్లను నియమించడం, సభా కార్యకలాపాలు నిర్వహించడం వంటివి స్పీకర్ బాధ్యతలే. మెజారిటీ ఉన్నా సొంత పార్టీ అభ్యర్థి స్పీకర్‌గా నెగ్గకపోవడం విపక్షానికి చేదు అనుభవమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
ఉక్రెయిన్‌కు చేసేది సాయం కాదు.. పెట్టుబడి..
వాషింగ్టన్: రష్యా తమపై దండయాత్ర చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. బుధవారం అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. అగ్రరాజ్యం తమ దేశానికి అందిస్తున్న భారీ సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తుంది సాయం కాదని, ప్రాజాస్వామ్యం, అంతర్జాతీయ భద్రతకు అగ్రరాజ్యం పెడుతున్న పెట్టుబడి అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. 2023లోనూ తమకు సాయాన్ని కొనసాగించారని కోరారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై అమెరికా విజయం సాధించినట్లు తాము కూడా వెనుకడుగు వేయకుండా రష్యాపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని జెలన్స్కీ స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అమెరికా కాంగ్రెస్ అభినందించింది. సభ్యలందరూ లేచి నిలబడి కరత్వాల ద్వనులతో జెలెన్స్కీ పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నారు. అగ్రరాజ్యం ఇప్పటికే ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించింది. త్వరలో పేట్రియట్ మిసైల్స్ కూడా పంపిస్తామని హామీ ఇచ్చింది. అయితే అమెరికా అందిస్తున్న సాయాన్ని జెలెన్స్కీ పెట్టుబడి అనడం వెనుక కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి అమెరికా ప్రతినిధుల సభ రిపబ్లికన్ల చేతిలోకి వెళ్లనుంది. ఉక్రెయిన్‌కు భారీ ప్యాకీజీపై వారు సుముఖంగా లేరు. డెమొక్రాట్లు భారీ మొత్తాన్ని యుద్ధ సాయంగా సమకూర్చడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు దిగవ సభ వాళ్ల నియంత్రణలోకే వస్తుంది కనుక కచ్చితంగా ప్యాకీజీ బిల్లును అడ్డుకుంటారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ల మనసు మార్చే విధంగా జెలెన్స్కీ మాట్లాడారు. కాంగ్రెస్‌లో ప్రసంగించడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు జెలెన్స్కీ. ఇద్దరూ కలిసి ఓవల్ ఆఫీస్‌లో కన్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. చదవండి: వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో.. -
US midterm elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రిపబ్లికన్లు 218 సీట్లు, అధికార డెమొక్రాట్లు 211 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్షం మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. బైడెన్ నిర్ణయాలు, చర్యలను ప్రతిపక్షం నిలువరించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభలో రిపబ్లికన్ పార్టీ బలం పుంజుకోవడంతో అధ్యక్షుడి దూకుడుకి అడ్డుకట్ట పడనుంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ప్రతినిధుల సభ స్పీకర్‌గా రిపబ్లికన్లు తమ నాయకుడు కెవిన్ మెక్కర్తీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ ఉన్నారు. కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని, రిపబ్లికన్లు వారిని ముందుకు నడిపించబోతున్నారని మెక్‌కర్తీ ట్వీట్ చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన మెక్కర్తీకి ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఉద్ఘాటించారు. రా బోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెనేట్‌పై డెమొక్రాట్ల పట్టు మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని చెప్పారు. ధరలు, జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. జనం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్‌లోని మరో సభ అయిన సెనేట్‌లో అధికార డెమొక్రాట్లు పట్టు నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 100 స్థానాలకు గాను, వారు ఇప్పటిదాకా 50 స్థానాలు దక్కించుకున్నారు. జార్జియా రాష్ట్రం కూడా వారి ఖాతాలో పడనుంది. దీంతో సెనేట్‌లో మెజారిటీ సాధించబోతున్నారు. -
Russia Ukraine war: ఉక్రెయిన్ శిథిలాల్లో ఆయుధ కంపెనీల... కాసుల పంట
ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో విజేతలెవరు? రష్యా వంటి అత్యంత శక్తివంతమైన దేశం మూడు నెలలుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై పట్టు చిక్కలేదు. పైగా సైనికంగా, సాయుధ సంపత్తి పరంగా అపార నష్టం చవిచూస్తోంది. అంతర్జాతీయంగా, దౌత్యపరంగా తీవ్ర వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. అంతర్జాతీయ సాయంతో రష్యాను ఉక్రెయిన్ ఢీకొడుతున్నా, ఆ దేశం నిండా శిథిల నగరాలే దర్శనమిస్తున్నాయి. మరి ఇంతకూ ఈ యుద్ధంలో గెలుస్తున్నదెవరు? రష్యానా, ఉక్రెయినా? రెండూ కాదు. అమెరికా, పాశ్చాత్య దేశాల ఆయుధ కంపెనీలదే అసలు విజయంగా కన్పిస్తోంది... ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం వల్ల ఆయుధ కంపెనీల పంట పండుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ కంపెనీల్లో తయారవుతున్నవే. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌తో పాటు టాప్ సెవెన్ కంపెనీలు అమెరికావే. అమెరికా, యూరప్ల్లోని ఆయుధ కంపెనీలు చాలావరకు ప్రైవేట్ సంస్థలే. ఐదేళ్లుగా పెద్దగా వ్యాపారం సాగక సతమతమవుతున్న ఈ సంస్థలు ఉక్రెయిన్ యుద్ధం పుణ్యామా అని లాభాల బాట పట్టాయి. అమెరికాతో సహా నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంలో చాలావరకు ఆయుధాల రూపంలోనే అందుతోంది. విమాన విధ్వంసక స్ట్రింగర్, ట్యాంకు విధ్వంసక జావలిన్ ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తున్నది అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్లే. యుద్ధం మొదలవగానే మార్చిలో లాక్‌హీడ్ సంస్థ షేరు విలువ ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. రేథియాన్ సంస్థ షేరు విలువ 8 శాతం, యూరప్‌లో అతిపెద్ద ఆయుధ కంపెనీ బీఏఈ షేరు విలువ ఏకంగా 26 శాతం పెరిగాయి. అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్ షేరు 12 శాతం, నార్త్రోప్ గ్రూమన్ షేరు 22 శాతం పెరిగాయి. కాంగ్రెస్ సభ్యులకు కాసుల పంట అమెరికా కాంగ్రెస్ సభ్యుల్లో చాలామందికి ఆయుధ కంపెనీల్లో షేర్లున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వారికి లాభదాయకంగా మారిందన్నది బిజినెస్ ఇన్సైడర్ పత్రిక కథనం. కనీసం 20 మంది కాంగ్రెస్ సభ్యులకు, లేదా జీవిత భాగస్వాములకు లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్ సంస్థల్లో నేరుగా షేర్లున్నాయి. మరెందరో వాటిలో చాలాకాలంగా పెట్టుబడులు పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ కొత్తగా షేర్లు కొన్నవారికీ కొదవ లేదు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు మార్జోరీ టైలర్ గ్రాన్ ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 22న లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. పైగా, ‘యుద్ధం రాజకీయ నాయకులకు మంచి వ్యాపారం’ అంటూ ట్వీట్ కూడా చేశారు! టెనెసీకి చెందిన మరో రిపబ్లికన్ సభ్యురాలు డయానా హార్స్బర్జర్ తన భర్తతో కలిసి రేథియాన్ షేర్లు కొన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌లో ముందు పెట్టిన ప్రతిపాదనలు చకచకా ఆమోదం పొందుతున్నాయి. పైగా అడిగినంత కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. బిలియన్లు గుమ్మరిస్తున్న యూఎస్ ఉక్రెయిన్‌కు బైడెన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,000 కోట్ల డాలర్లకు పైగా నిధులిచ్చేందుకు సిద్ధమైంది. దాంతో ఉక్రెయిన్ యుద్ధం కోసం గత రెండు నెలల్లోనే అమెరికా మంజూరు చేసిన సాయం ఏకంగా 5,300 కోట్ల డాలర్లను దాటింది. ఇందులో చాలావరకు ఆయుధ రూపంలో అందేదే. గత రెండు దశాబ్దాల్లో అమెరికా ఇచ్చిన అతిపెద్ద విదేశీ సాయం ఇదే! యుద్ధం సాగే కొద్దీ ఉక్రెయిన్‌కు సాయాన్ని ఇంకా పెంచుతానంటూ హామీకూడా ఇచ్చింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఆయుధ కంపెనీలు కాసుల పంట పండించుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఇదే విధంగా జరిగింది’’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ జి.డి.భక్తి గత చరిత్రను గుర్తు చేశారు. యూరప్ దేశాలూ... ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న పలు యూరప్ దేశాలు తమ రక్షణ కేటాయింపులను భారీగా పెంచుకుంటున్నాయి. జర్మనీ రక్షణ కేటాయింపులు జీడీపీలో 1.5 శాతం నుంచి 2 శాతానికి పెరగనున్నాయి. జపాన్ 60 ఏళ్ల తర్వాత తమ జీడీపీలో ఒక శాతానికిపైగా నిధులను రక్షణ అవసరాలకు కేటాయించబోతోంది. అమెరికా రక్షణ నిధులు కూడా వచ్చే ఏడాది ఎన్నడూ లేనంతగా జీడీపీలో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరొచ్చన్నది బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మా కలలను కల్లోలం చేశారు: జెలెన్ స్కీ ఆవేదన
Zelenskyy receives a standing ovation from the US lawmakers: ఉక్రెయిన్ పై రష్యా గత 21 రోజులుగా నిరవధిక దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ ఆక్రమణే ద్యేయంగా రష్యా మరింత దుశ్చర్యలకు ఒడిగడుతోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ యూఎస్ కాంగ్రెస్‌తో వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడారు. వ్లోదిమిర్ జెలెన్ స్కీ స్క్రీన్ పై కనబడగానే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల నిలబడి ప్రశంసించారు. జెలెన్స్కీ అమెరికా కాంగ్రెస్‌ని మరింత సైనిక సాయం చేయమని కోరారు. రష్యా పై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా రష్యాతో సాగిస్తున్న వ్యాపారాలను ఉపసంహరించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఆదాయం కంటే శాంతికి పెద్ద పీట వేస్తూ అమెరికా తప్పనిసరిగా దిగుమతులను నిరోధించేలా కట్టుదిట్టం చేయమని కోరారు. రష్యా ఉక్రెయిన్ ఆకాశాన్ని వేలాది మంది మరణాలకు వేదికగా చేసింది." రష్యా మా దేశంలోని విలువలకు, స్వేచ్ఛయుత జీవనానికి భంగం కలిగించేలా దాడి చేసింది. మా కలలను కల్లోల పరిచేలా క్రూరంగా దాడి చేసిందని జెలెన్స్కీ ఆవేదనగా పేర్కొన్నారు". మరోసారి జెలెన్ స్కీ నో ఫ్లై జోన్ అంశం గురించి ప్రస్తావించారు. ఈ మేరకు రష్యా తమ దేశం పై క్రూరంగా చేస్తున్న దాడుల తాలుకా వీడియోని ప్లే చేశారు. యూఎస్ ఇస్తున మద్దతుకు కృతజ్ఞతలు తెలపడమే కాక తమ దేశం కోసం మరింత చేయమని కోరారు. అమెరికా మద్దతు తమ దేశానికి ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. (చదవండి: రష్యా టీవీ లైవ్‌షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్‌కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!) -
గ్రీన్‌కార్డుకు ఇక సూపర్ ఫీ!
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయులకు ఊరట లభించనుంది. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషియరీ కమిటీ రూపొందించిన రీకన్సిలియోషన్ బిల్లులో వివరాల ప్రకారం... గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సూపర్ ఫీ చెల్లించడానికి ముందుకు వస్తే గ్రీన్కార్డుని అప్పటికప్పుడే పొందవచ్చు. అదే విధంగా లీగల్ డ్రీమర్స్ (తల్లిదండ్రుల హెచ్–1బీ వీసాతో చిన్నారులుగా దేశానికి వచ్చి 21 ఏళ్లు నిండిన వారు) ఈ సప్లిమెంటరీ ఫీజు కడితే వారికి శాశ్వత నివాసం, పౌరసత్వం లభిస్తుంది. త్వరలోనే ఈ బిల్లు కాంగ్రెస్ ముందుకు రానుంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల్ని ప్రతీ ఏడాది అమెరికా 1.40 లక్షలు మంజూరు చేస్తుంది. దీంట్లో ఏ ఒక్క దేశానికీ 7 శాతానికి మించి గ్రీన్‌కార్డులు మంజూరు చేయకూడదనే పరిమితి ఉంది. భారతీయులు అధిక సంఖ్యలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తూ ఉండడంతో ఈ కోటా వల్ల దరఖాస్తుదారులు ఎక్కువగా పెరిగిపోతున్నారు. కాటో ఇనిస్టిట్యూట్‌కు చెందిన వలస విధాన నిపుణుడు డేవిడ్ బెయిర్ అధ్యయనం ప్రకారం ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయుల సంఖ్య ఏప్రిల్ 2020 నాటికి 7.41 లక్షలుగా ఉంది. వీరందరికీ కార్డు రావాలంటే 84 ఏళ్లు వేచి చూడాలని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫీ చెల్లిస్తే గ్రీన్‌కార్డు రావడం అన్నది సువర్ణావకాశమని బెయిర్ అన్నారు. 5 వేల డాలర్లు చెల్లించే వారందరికీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తే అంతకు మించినది ఏముంటుందని పేర్కొన్నారు. ఇక అత్యవసర రంగాలైన ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయంతో పాటుగా రవాణా, ఐటీకి చెందిన కంపెనీల్లో పని చేసేవారికి వారి యాజమాన్యం స్పాన్సర్ చేయకపోయినా.. 5 వేల డాలర్లు చెల్లించి గ్రీన్‌కార్డు పొందే అవకాశం ఉంటుంది. ఒక రకంగా బైడెన్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ఈ పని చేస్తూ ఉందని న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ వ్యవస్థాపకుడు సైరస్ డి మెహతా అన్నారు. బడ్జెట్ రీ కన్సిలేషన్ బిల్లులో భాగంగా దీనిని చేర్చడంతో కాంగ్రెస్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని మెహతా ధీమాగా చెప్పారు. బిల్లులో ఏముందంటే.. ► ఉద్యోగ ఆధారిత వలసదారులు గ్రీన్‌కార్డు ప్రయార్టీ తేదీ కంటే ఇంకా రెండేళ్లు ఎక్కువ గా నిరీక్షించాల్సి వచి్చనప్పుడు 5 వేలడాలర్ల సూపర్ ఫీ చెల్లిస్తే అప్పటికప్పుడు వారికి గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు. ► కుటుంబ ఆధారిత వలసదారులు, అమెరికా పౌరులెవరైనా స్పాన్సర్ చేస్తే గ్రీన్‌కార్డు రావాల్సిన సమయంలో కంటే రెండేళ్లు ఎక్కువ నిరీక్షించిన తర్వాత సప్లిమెంట్ ఫీజు కింద 2,500 డాలర్లు చెల్లించాలి. ► వలస విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దేశాల పరిమితి కోటా ఎత్తేయడం, హెచ్–1బీ వీసా వార్షిక కోటా పెంచడం వంటి వాటికి ఈ బిల్లులో చోటు దక్కలేదు. -
డీమర్స్ కోసం యూఎస్ కాంగ్రెస్‌లో బిల్లు
వాషింగ్టన్: దేశంలో చాన్నాళ్లుగా నాన్ ఇమిగ్రంట్ వీసాపై ఉన్నవారితో పాటు డిపెండెంట్స్‌గా అమెరికా వచ్చిన పిల్లలకు(డాక్యుమెంటెడ్ డ్రీమర్స్) శాశ్వత నివాస సదుపాయం కల్పించే దిశగా ముందడుగు పడింది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల సభ్యులు సంబంధిత బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పలువురు భారతీయ పిల్లలు, యువతకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రంట్ వీసాదారుల పిల్లలు, 21 ఏళ్ల వయస్సు దాటితే, స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అమెరికాలో ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సంఖ్య దాదాపు 2 లక్షలు ఉంటుంది. వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. -
ఫౌచీ ఊస్టింగ్.. వైరస్ గుట్టు వీడిందా?
డాక్టర్ ఆంటోనీ ఫౌచీ.. కరోనా టైం నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. వైరస్ వ్యాప్తి తీరుపై విశ్లేషణ, సలహాలు ఇస్తున్న ఫౌచీని ఉన్నపళంగా ఆ పదవి నుంచి తొలగించారట. అంతేకాదు ఆయన ఊస్టింగ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఒక బిల్లును కూడా కాంగ్రెస్(పార్లమెంట్)లో ప్రవేశపెట్టారని కూడా తెలుస్తోంది. మరోవైపు కరోనా వైరస్ ల్యాబ్‌ల్లోనే తయారు చేశారనే విషయాన్ని అమెరికా అధికారికంగా ధృవీకరించిందనేది మరో వార్త. ఫేస్బుక్, వాట్సాప్‌లో ఫార్వార్డ్ అవుతున్న ఈ వార్తల్లో ఉన్న సగం నిజమెంతంటే.. సీనియర్ ఫిజిషియన్, అమెరికాలోనే టాప్ ఇమ్యునాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడి) డైరెక్టర్ ఆంటోనీ ఫౌచీ. అంతెందుకు అమెరికా అధ్యక్షుడికి ఈయనే ఆరోగ్య సలహాదారు కూడా. అలాంటి వ్యక్తిని ఉన్నపళంగా పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏముందసలు?.. విషయంలోకి వెళ్తే.. ఫౌచీ నిర్లక్క్ష్యం వల్లే అమెరికాలో కరోనాతో తీరని నష్టం వాటిల్లిందని, వైరస్ వ్యాప్తి టైంలో ఆయన ప్రభుత్వానికి సరైన మార్గనిర్దేశం చేయలేకపోయాడని, పైగా వైరస్ వ్యాప్తికి సంబంధించి రహస్య ఈ-మెయిల్స్ ద్వారా ఫౌచీ కుట్రకు పాల్పడ్డారనేది రిపబ్లికన్ ఎంపీ మర్జోరి టేలర్ గ్రీనె ఆరోపణ. ఈ మేరకు ఆమె ‘ఫైర్ ఫౌచీ యాక్ట్’ పేరుతో ప్రత్యేకంగా ఒక బిల్లును రూపొందించింది. అయితే ఈ బిల్లు ఇంకా పార్లమెంట్లో చర్చదశకు రాలేదు. ఈలోపే ఓటింగ్ జరిగిందని, ఆమోదం దొరికిందని, ఫౌచీ పని అయిపోయిందని ఫేక్ కథనాలు వెలువడ్డాయి. ఇక కరోనా వైరస్ గుట్టు తేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా నిఘా వర్గాలకు 90 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే(మే 26 ఆదేశాలు వెలువడ్డాయి). వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారా?, లేదంటే జంతువుల ద్వారా సోకిందా? తేల్చాలని ఆయన నిఘా ఏజెన్సీలను ఆదేశించాడు. అయితే నెలలోపే దర్యాప్తు పూర్తైందని, ఇది మనిషి తయారు చేసిందని అమెరికా ధృవీకరించిందని ఒక ప్రైవేట్ బ్లాగ్ ద్వారా ఫేక్ వార్త వైరల్ అయ్యింది. ఇక ఈ రెండు ఫేక్ అని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు ‘ఫౌచీ పట్ల తాను అత్యంత నమ్మకంగా ఉన్నట్లు’ ఈ నెల మొదట్లో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బైడెన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు ఆ అధికారి. చదవండి: కరోనా పుట్టకపై ఫౌచీ కీలక వ్యాఖ్యలు -
అమెరికన్ల జీవితాలు మారుతాయ్!
వాషింగ్టన్: కరోనా సంక్షోభంతో అతాలాకుతలమవుతున్న అమెరికా పౌరుల్ని ఆదుకోవడానికి 1.9 లక్షల కోట్ల అమెరికా డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. 220–211 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ అమెరికన్ రెస్క్యూ ప్లాన్ యాక్ట్‌ని ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఈ ప్యాకేజీకి వ్యతిరేకంగానే ఓటు వేశారు. నాలుగు రోజుల క్రితం సెనేట్ ఆమోదం పొందిన బిల్లుని అక్కడ కూడా రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కోవిడ్–19 సంక్షోభం తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఈ భారీ ప్యాకేజీ ప్రకటించడం ఎందుకనేది వారి వాదనగా ఉంది. అయితే కాంగ్రెస్ దీనిని ఆమోదించగానే ‘‘సాయం ఇక్కడే ఉంది’’అని అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు. తాను ఆ బిల్లుపై శుక్రవారం సంతకం చేస్తానని చెప్పారు. బిల్లు చట్టరూపం దాల్చగానే అమెరికాలో తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలకు ఈ ఏడాది 1400 డాలర్ల ఆర్థిక సాయం చేస్తారు. నిరుద్యోగులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకుంటారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, కోవిడ్‌పై పరిశోధనలకు నిధుల్ని భారీగా ఖర్చు పెడతారు. కోవిడ్–19తో కుదేలైన విమానయానం నుంచి ఫంక్షన్ హాల్స్ వరకు అందరికీ ఈ ప్యాకేజీ ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. ఎన్నికల్లో బైడెన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఈ బిల్లు ఆమోదం పొందడం అత్యంత అవసరం. అందుకే చట్టసభల్లో బైడెన్ సాధించిన తొలి విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ప్రజల జీవితాలను మార్చే నిర్ణయం ఇదేనని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి చెప్పారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే అమెరికాలో ప్రస్తుతం పేదల సంఖ్య 4.4 కోట్ల నుంచి 2.8 కోట్లకు తగ్గిపోతుందని అంచనాలున్నాయి. -
అదిగదిగో గ్రీన్ కార్డు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డు కోసం భారతీయులు ఇకపై ఏళ్లకి ఏళ్లు ఎదురు చూసే పని లేదు. వేలాదిమంది భారతీయ టెక్కీలు, వారి కుటుంబసభ్యులతో పాటు విదేశీయులెందరికో లబ్ధి చేకూరేలా బైడెన్ సర్కార్ అడుగు ముందుకు వేసింది. గ్రీన్‌కార్డుపై దేశాల కోటా పరిమితిని ఎత్తేయడంతో పాటుగా దేశంలో చట్టవిరుద్ధంగా తలదాచుకుంటున్న 1.1కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి వీలు కల్పించే అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని గురువారం కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదించి, అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేస్తే అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకి, వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారితో పాటు చట్టబద్ధంగా ఉంటున్న వారికి కూడా లబ్ధి చేకూరేలా ఈ బిల్లుని రూపొందించారు. దీనిని సెనేటర్ బాబ్ మెనెండెజ్, కాంగ్రెస్ సభ్యురాలు లిండా సాంచెజ్లు చట్టసభలో ప్రవేశపెట్టారు. వలస విధానంలో సమూల సంస్కరణల ద్వారా వలసదారుల్లో భయం లేకుండా వారికి ఆర్థిక భద్రత కల్పించేలా అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని తీసుకువచ్చినట్టుగా వారు మీడియాకు చెప్పారు. ‘‘నా తల్లిదండ్రులు మెక్సికో నుంచి వచ్చారు. ఈ దేశంలో వలసదారులు భయాందోళనలు లేకుండా జీవించేలా వలస విధానాన్ని రూపొందించడానికే నేను శ్రమిస్తున్నాను’’ అని సాంచెజ్ అన్నారు. వలస దారులంటే పొరుగువారు, స్నేహితులని చెప్పారు. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు పూర్తి మెజారిటీ ఉంది. ఎగువ సభ అయిన సెనేట్‌లో రెండు పార్టీలకు 50 చొప్పున సీట్లు ఉన్నాయి. సెనేట్‌లో ఈ బిల్లు పాస్ కావాలంటే మరో 10 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం. వారి కలలు నెరవేరుద్దాం: బైడెన్ దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్న వలసదారుల సంక్షేమం కోసం రిపబ్లికన్లు ఈ బిల్లుకి మద్దతునిస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ గత ప్రభుత్వ తప్పిదాలను సరవిస్తూ వలసదారులకి న్యాయం జరిగేలా చూద్దామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వలస కుటుంబాలను కలుపుతూ వారికి భద్రమైన జీవితాన్ని ఇవ్వడానికి మానవత్వంతో కూడిన వలస విధానాన్ని ముందుకు తీసుకువెళదామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘వలస విధానంలో సంస్కరణల వల్ల అమెరికాలో ఉండాలనుకునే వారి కలలు ఫలించి, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ సంస్కరణలు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ప్రాధాన్యత కాదు. అమెరికా ప్రజల ప్రాధాన్యం కోసమే ఈ బిల్లుని తెచ్చాం. మన దేశం కోసం కష్టపడే వారి కలలు తీరుద్దాం’’ అని బైడెన్ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్న వలసదారుల సంక్షేమం కోసం రిపబ్లికన్లు ఈ బిల్లుకి మద్దతునిస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ గత ప్రభుత్వ తప్పిదాలను సరవిస్తూ వలసదారులకి న్యాయం జరిగేలా చూద్దామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వలస కుటుంబాలను కలుపుతూ వారికి భద్రమైన జీవితాన్ని ఇవ్వడానికి మానవత్వంతో కూడిన వలస విధానాన్ని ముందుకు తీసుకువెళదామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘వలస విధానంలో సంస్కరణల వల్ల అమెరికాలో ఉండాలనుకునే వారి కలలు ఫలించి, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ సంస్కరణలు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ప్రాధాన్యత కాదు. అమెరికా ప్రజల ప్రాధాన్యం కోసమే ఈ బిల్లుని తెచ్చాం. మన దేశం కోసం కష్టపడే వారి కలలు తీరుద్దాం’’ అని బైడెన్ వివరించారు. బిల్లులో ఏముంది ? ► గ్రీన్‌కార్డు మంజూరులో ఏడుశాతం దేశాల కోటాను ఎత్తేస్తూ మొదట దరఖాస్తు చేసుకునే వారికి మొదట గ్రీన్‌కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో పదేళ్లకు పైబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు బిల్లు చట్టరూపం దాల్చగానే లబ్ధి చేకూరనుంది ► హెచ్1–బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఈ వర్క్ ఆథరైజేషన్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ► విదేశాల్లో పుట్టి తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో ఉంటున్న పిల్లలందరికీ వారి వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు లభిస్తాయి. ► అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకి మూడేళ్లలో పౌరసత్వం లభిస్తుంది. ► ఎల్జీబీటీక్యూ హక్కుల పరిరక్షణ, వారి కుటుంబసభ్యులకి, అనాథలకి చట్టపరమైన రక్షణ కలుగుతుంది. ► అమెరికా యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థుల్లో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కోర్సులు చేసేవారికి దేశంలో ఉండడం మరింత సులభంగా మారనుంది ► పరిశ్రమల్లో తక్కువ వేతనానికి పని చేసే కార్మికులకు కూడా గ్రీన్‌కార్డులు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. -
ట్రంప్ స్వీయ క్షమాభిక్ష..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడే ముందు మరో అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ భవనంపై దాడికి మద్దతుదారులను ప్రోత్సహించి ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రంప్ తనని తాను క్షమించుకునే అవకాశాల గురించి యోచిస్తున్నారు. జనవరి 20కి ముందే ట్రంప్‌ని గద్దె దింపేయాలని కాంగ్రెస్ సభ్యుల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ క్షమాభిక్షకి గల సాధ్యా«సాధ్యాలపై సలహాదారులతో సంప్రదిస్తున్నట్టుగా అమెరికా మీడియా అంటోంది. క్షమాభిక్షతో ఎదురయ్యే పర్యవసానాల గురించి నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి క్షమాభిక్షకు వ్యూహరచన క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ట్రంప్‌కి చట్టపరంగా కూడా ముప్పును ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ తన ముందున్న ఏకైక మార్గం స్వీయ క్షమాభిక్ష అని యోచిస్తున్నారు. కేవలం తనొక్కడినే కాకుండా కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ ట్రంప్ సహా కుటుంబ సభ్యులందరికీ క్షమాభిక్ష పెట్టడానికి వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేవారంలో ట్రంప్ అధ్యక్షుడి హోదాలో కొందరికి క్షమాభిక్ష పెట్టనున్నారు. అదే సమయంలో తనని తాను క్షమించుకున్నట్టు ప్రకటించుకుంటే పదవి వీడాకా ఎలాంటి సమస్యలు ఎదురుకావన్న భావనలో ట్రంప్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. చట్టపరంగా వీలవుతుందా ? అమెరికా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు కూడా ఇలా తనని తాను క్షమించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో అమెరికా చట్టాలు అస్పష్టంగా ఉన్నాయి. రాజ్యాంగ నిపుణులు మాత్రం స్వీయ క్షమాభిక్షకు అవకాశం లేదంటున్నారు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారి వాదన. చట్టాల్లో స్వీయ క్షమాభిక్షపై స్పష్టత లేకపోవడంతో ట్రంప్ ఏదైనా చేయవచ్చునని డ్యూక్ లా ప్రొఫెసర్ జెఫ్ పావెల్ అన్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ జొనాథన్ టర్లీ కూడా ట్రంప్ స్వీయ క్షమాభిక్షను ఎవరూ ఆపలేరన్నారు. మూడేళ్ల క్రితం నుంచి.. అధ్యక్షుడికి తనని తాను క్షమించుకునే హక్కు ఉంటుందంటూ మూడేళ్ల క్రితం ట్రంప్ చేసిన ట్వీట్ దుమారాన్నే రేపింది. రాజ్యాంగ నిపుణులు అధ్యక్షుడికి స్వీయ క్షమాభిక్ష హక్కు ఉందని తనతో చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. -
ట్రంప్‌ని గడువుకు ముందే తప్పిస్తారా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని గడువుకి ముందే గద్దె దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనికి గల మార్గాలను అన్వేషిస్తోంది. ట్రంప్‌ని ఎలాగైనా తప్పించాలని సభ్యుల్లో చర్చ జరుగుతోంది. అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ ఈలోగా అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్‌ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్ సభ్యులు పరిశీలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం. దేశ ఉపాధ్యక్షుడు, మంత్రి మండలి సభ్యులు కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఏమిటీ సవరణ? రాజ్యాంగంలోని 25వ సవరణలో నాలుగు సెక్షన్లు ఉన్నాయి. అమెరికా అ«ధ్యక్షుడు పదవిలో ఉండగానే మరణిస్తే దీనిలో మొదటి సెక్షన్ ద్వారా ఉపాధ్యక్షుడు పదవి బాధ్యతలు చేపడతారు. రెండో సెక్షన్ ఉపాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి సంబంధించినది కాగా, మూడోది అధ్యక్షుడెవరైనా తనంతట తానుగా పదవిలో కొనసాగలేనని, తప్పుకుంటానని చెప్పినప్పుడు ఉపాధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించడానికి వినియోగిస్తారు. ఇక అధ్యక్షుడు పాలనా వ్యవస్థపై నియంత్రణ కోల్పోతే ఉపాధ్యక్షుడు, కేబినెట్ సభ్యుల ఆమోదంతో నాలుగో సెక్షన్ ద్వారా అధ్యక్షుడిని తొలగించవచ్చు. అభిశంసన చేయొచ్చా? ట్రంప్‌ని అభిశంసన ద్వారా కూడా పదవి నుంచి తొలగించవచ్చు. అయితే ఇది ప్రతినిధుల సభ ద్వారా జరగాలి. మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదిస్తే, దానిని సెనేట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఒకే రోజులో ఈ ప్రక్రియని ముగించేలా వెసులుబాటు ఉంది. గత ఏడాది ట్రంప్‌పై అభిసంశన తీర్మానం పెట్టినా సెనేట్‌లో వీగిపోయింది. -
బైడెన్‌కు కాంగ్రెస్ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్ ఎన్నికకు గురువారం అధికారికంగా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. క్యాపిటల్ బిల్డింగ్‌లో ప్రస్తుత అధ్యక్షుడు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల అసాధారణ హింసాత్మక విధ్వంసం అనంతరం.. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. పెన్సిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల ఫలితాలపై రిపబ్లికన్ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రతినిధుల సభ, సెనెట్ తోసిపుచ్చాయి. బైడెన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి పెన్స్ 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. 78 ఏళ్ల బైడెన్ జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ హిల్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో ఒక మహిళ సహా నలుగురు చనిపోయారు. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ మహిళ మరణించారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆందో ళనకారులను చెదరగొట్టిన తరువాత సమావేశాలు మళ్లీ కొనసాగాయి. గురువారం తెల్లవారు జాము వరకు సాగిన సమావేశంలో అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్లను, కౌంటింగ్‌ను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరిజోనా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 93–6 ఓట్లతో, ప్రతినిధుల సభ 303–121 ఓట్లతో తోసిపుచ్చాయి. పెన్సిల్వేనియా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 92–7 ఓట్లతో, ప్రతినిధుల సభ 282–138 ఓట్లతో తోసిపుచ్చాయి. భారత సంతతి ఎంపీలు రో ఖన్నా అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్ కూడా ఆయా అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటమి ఒప్పుకున్న ట్రంప్ బైడెన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించిన అనంతరం.. డొనాల్డ్ ట్రంప్ ఒక అధికారిక ప్రకటనలో ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించనప్పటికీ.. జనవరి 20న అధికార మార్పిడి సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. అత్యద్భుతమైన తన తొలి టర్మ్ అధ్యక్ష పాలనకు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోలైన వాటిలో న్యాయమైన ఓట్లనే లెక్కించాలన్న డిమాండ్‌పై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఫలితాలపై కుట్రపూరిత వాదనలను పోస్ట్ చేస్తుండటంతో ట్రంప్ అకౌంట్లను ఫేస్బుక్ 24 గంటల పాటు, ట్విటర్ 12 గంటల పాటు నిలిపివేశాయి. మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన ప్రసంగం సహా మూడు ట్వీట్లను బ్లాక్ చేసింది. ప్రమాణస్వీకారం చేసేంత వరకు ట్రంప్‌ను బ్లాక్ చేయాలని ఫేస్బుక్ నిర్ణయించింది. ట్రంప్ ఫేస్‌బుక్‌ను వాడేందుకు అనుమతించడం ప్రమాదకరమని సంస్థ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ అన్నారు. ట్రంప్ అకౌంట్‌ను 2వారాలు బ్లాక్ చేస్తున్నామని స్పష్టం చేశారు. -
ట్రంప్‌కి అమెరికా కాంగ్రెస్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికన్ కాంగ్రెస్ ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ వీటో అధికారాలను వినియోగించుకోవడానికి వీల్లేకుండా 74 వేల కోట్ల డాలర్ల వార్షిక రక్షణ విధాన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ట్రంప్ హయాంలో అధ్యక్షుడి వీటో అధికారాన్ని తోసిరాజని ఒక బిల్లు చట్ట రూపం దాల్చడం ఇదే తొలిసారి. రిపబ్లికన్ పార్టీకి బలం ఉన్న కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్ కూడా ట్రంప్ అధికారాన్ని పక్కకు పెట్టి నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)ని 81–13 ఓట్ల తేడాతో ఆమోదించడం గమనార్హం. ఈ పరిణామంతో అధికారానికి దూరమవుతున్న క్షణాల్లో సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్‌కి ఎదురు దెబ్బ తగిలిట్టనయింది. ఈ వారం మొదట్లోనే ప్రతినిధుల సభ ఈ బిల్లుని 322–87 ఓట్లతో ఆమోదించింది. ట్రంప్ రక్షణ బిల్లుని మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ బిల్లులోని కొన్ని అంశాలు దేశ భద్రతకు భంగకరంగా ఉన్నాయన్నది ఆయన వాదన. కానీ అమెరికా ప్రజాప్రతినిధులు మాత్రం ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేశారు. సాధారణంగా కాంగ్రెస్‌లోని రెండు సభలు బిల్లుని ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తే అది చట్టరూపం దాలుస్తుంది. అయితే అధ్యక్షుడు తన వీటో అధికారాన్ని వినియోగించి బిల్లుని తిప్పి పంపడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అధ్యక్షుడు బిల్లుని వీటో చేసే అవకాశం లేకుండా కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లుని చట్టంగా మార్చే అవకాశం ఉంది. ట్రంప్ ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉండడంతో కాంగ్రెస్‌లో ఉభయ సభలు ఆయన సంతకం అవసరం లేకుండానే బిల్లుని ఆమోదించాయి. దేశ భద్రత, మిలటరీ అవసరాలు, సైనిక కుటుంబాలకు అండగా ఉండడానికి కావల్సిన నిధులను మంజూరు చేసే బిల్లు కావడంతో కాంగ్రెస్ ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆమోదించింది. భారత్‌లో 19 వేల కేసులు న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 19,079 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,05,788కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్‌తో 224 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,49,218కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 99,06,387కు చేరిం. రికవరీ రేటు 96.12 శాతానికి చేరింది. యూకే నుంచి భారత్‌కు వచ్చిన మరో నలుగురికి బ్రిటన్ వేరియంట్ కరోనా సోకింది. దీంతో మొత్తం బ్రిటన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో 33కు చేరింది. -
పథకం ప్రకారమే గల్వాన్ ఘర్షణలు
న్యూఢిల్లీ: భారత్‌ను లక్ష్యంగా చేసుకొని చైనా చేసే కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి. గత జూన్‌లో భారత్‌కు చెందిన 20 మంది సైనికుల్ని బలి తీసుకున్న గల్వాన్ ఘర్షణల్ని డ్రాగన్ దేశం పక్కాగా కుట్ర పన్ని పాల్పడినట్టుగా అమెరికా–చైనా ఆర్థిక, భద్రత రివ్యూ కమిషన్ అమెరికన్ కాంగ్రెస్‌కి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు గత కొన్ని దశాబ్దాలుగా సరిహద్దుల్లో నెలకొన్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించింది. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జూన్ 15న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), భారత సైనికుల మ««ధ్య హోరాహోరీ జరిగిన పోరులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే, చైనా తరఫున ఎంత ప్రాణ నష్టం జరిగిందో డ్రాగన్ దేశం ఇప్పటికీ వెల్లడించలేదు. చైనా ఒక పథకం ప్రకారమే సరిహద్దుల్లో భారత్‌తో కయ్యానికి కాలు దువ్విందని ఆ నివేదిక స్పష్టం చేసింది. వారాల ముందు నుంచే... గల్వాన్ ఘర్షణలకు కొద్ది వారాల ముందే చైనా రక్షణ మంత్రి తమ సైన్యం సరిహద్దుల్లో ఘర్షణలకు దిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్.. అమెరికా, చైనా మధ్య జరిగే పోరులో భారత్ కల్పించుకుంటే చైనాతో ఆర్థిక, వాణిజ్య బంధాలు తెగిపోతాయని హెచ్చరించింది. ఘర్షణకు ముందే చైనా ఆర్మీకి చెందిన వెయ్యి మంది సైనికులు గల్వాన్ లోయను చుట్టుముట్టడం శాటిలైట్ ఇమేజ్‌లో కనిపించింది. భారీగా ఆయు«ధాల మోహరింపు దృశ్యాలు కూడా ఆ చిత్రాల్లో కనిపించాయని ఆ నివేదిక ప్రస్తావించింది. -
ట్రంప్ చర్యలతో మరింత ప్రాణనష్టం: బైడెన్
వాషింగ్టన్: కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సరైన సహకారం అందకపోతే చాలా మంది అమెరికన్లు చనిపోయే అవకాశముందని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తిరస్కరించిన విషయం తెలిసిందే. కొత్త ఉపశమన చట్టాన్ని ఆమోదించాలని యుఎస్ కాంగ్రెస్‌ను జో బైడెన్ కోరారు. కోవిడ్ -19 మహమ్మారి తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి వ్యాపారవేత్తలు ,కార్మిక నాయకులు కలిసి పనిచేయాలన్నారు. ‘మనము డార్క్ వింటర్‌లోకి వెళ్తున్నాము. కొన్ని విషయాలు సులభతరం అయ్యే ముందు కఠినంగానే ఉంటాయి’ అని బైడెన్ అన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మిలియన్ల కొద్దీ ఉద్యోగ నష్టాలను చవిచూసిన ఆర్థిక వ్యవస్థను జో బైడన్ రాబోయే కాలంలో వాటి భారాన్నిమోయనున్నారు.ఇప్పటికే అమెరికాలో 2,46,000 మందికి పైగా మరణించారు. రోజువారీగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి 20 న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరోవైపు ట్రంప్ తన మొండి వైఖరిని వీడడంలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిచానని ట్వీట్లు వేస్తున్నారు. మోడెర్నా వ్యాక్సిన్ ప్రకటన తరువాత,‘మరొక టీకా ఇప్పుడే ప్రకటించారు. ఈసారి మోడెర్నా95% ప్రభావవంతంగా పనిచేస్తుంది. చరిత్రకారులారా గుర్తుంచుకోండి.. చైనా మహమ్మారిని అంతం చేసే ఈ గొప్ప ఆవిష్కరణలు అన్నీ నా పాలనలోనే బయటకు వచ్చాయి. ’ అని ట్రంప్ అన్నారు.