Ukraine-Russia War: US Weapons Companies Boast in the War - Sakshi
Sakshi News home page

Russia Ukraine war: ఉక్రెయిన్‌ శిథిలాల్లో ఆయుధ కంపెనీల... కాసుల పంట

Published Mon, May 23 2022 5:05 AM | Last Updated on Mon, May 23 2022 8:45 AM

Ukraine-Russia war: US Weapons Companies Boast in the War - Sakshi

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో విజేతలెవరు? రష్యా వంటి అత్యంత శక్తివంతమైన దేశం మూడు నెలలుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్‌ వంటి చిన్న దేశంపై పట్టు చిక్కలేదు. పైగా సైనికంగా, సాయుధ సంపత్తి పరంగా అపార నష్టం చవిచూస్తోంది. అంతర్జాతీయంగా, దౌత్యపరంగా తీవ్ర వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. అంతర్జాతీయ సాయంతో రష్యాను ఉక్రెయిన్‌ ఢీకొడుతున్నా, ఆ దేశం నిండా శిథిల నగరాలే దర్శనమిస్తున్నాయి.  మరి ఇంతకూ ఈ యుద్ధంలో గెలుస్తున్నదెవరు? రష్యానా, ఉక్రెయినా? రెండూ కాదు. అమెరికా, పాశ్చాత్య దేశాల ఆయుధ కంపెనీలదే అసలు విజయంగా కన్పిస్తోంది...

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం వల్ల ఆయుధ కంపెనీల పంట పండుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ కంపెనీల్లో తయారవుతున్నవే. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ లాక్‌హీడ్‌ మార్టిన్‌తో పాటు టాప్‌ సెవెన్‌ కంపెనీలు అమెరికావే. అమెరికా, యూరప్‌ల్లోని ఆయుధ కంపెనీలు చాలావరకు ప్రైవేట్‌ సంస్థలే. ఐదేళ్లుగా పెద్దగా వ్యాపారం సాగక సతమతమవుతున్న ఈ సంస్థలు ఉక్రెయిన్‌ యుద్ధం పుణ్యామా అని లాభాల బాట పట్టాయి.

అమెరికాతో సహా నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంలో చాలావరకు ఆయుధాల రూపంలోనే అందుతోంది. విమాన విధ్వంసక స్ట్రింగర్, ట్యాంకు విధ్వంసక జావలిన్‌ ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తున్నది అమెరికాకు చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్, రేథియాన్‌లే. యుద్ధం మొదలవగానే మార్చిలో లాక్‌హీడ్‌ సంస్థ షేరు విలువ ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. రేథియాన్‌ సంస్థ షేరు విలువ 8 శాతం, యూరప్‌లో అతిపెద్ద ఆయుధ కంపెనీ బీఏఈ షేరు విలువ ఏకంగా 26 శాతం పెరిగాయి. అమెరికాకు చెందిన జనరల్‌ డైనమిక్స్‌ షేరు 12 శాతం, నార్త్‌రోప్‌ గ్రూమన్‌ షేరు 22 శాతం పెరిగాయి.

కాంగ్రెస్‌ సభ్యులకు కాసుల పంట
అమెరికా కాంగ్రెస్‌ సభ్యుల్లో చాలామందికి ఆయుధ కంపెనీల్లో షేర్లున్నాయి. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వారికి లాభదాయకంగా మారిందన్నది బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పత్రిక కథనం. కనీసం 20 మంది కాంగ్రెస్‌ సభ్యులకు, లేదా జీవిత భాగస్వాములకు లాక్‌హీడ్‌ మార్టిన్, రేథియాన్‌ సంస్థల్లో నేరుగా షేర్లున్నాయి. మరెందరో వాటిలో చాలాకాలంగా పెట్టుబడులు పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ కొత్తగా షేర్లు కొన్నవారికీ కొదవ లేదు.

రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడు మార్జోరీ టైలర్‌ గ్రాన్‌ ఉక్రెయిన్‌ యుద్ధం మొదలవడానికి రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 22న లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. పైగా, ‘యుద్ధం రాజకీయ నాయకులకు మంచి వ్యాపారం’ అంటూ ట్వీట్‌ కూడా చేశారు! టెనెసీకి చెందిన మరో రిపబ్లికన్‌ సభ్యురాలు డయానా హార్స్‌బర్జర్‌ తన భర్తతో కలిసి రేథియాన్‌ షేర్లు కొన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం కోసం అధ్యక్షుడు జో బైడెన్‌ కాంగ్రెస్‌లో ముందు పెట్టిన ప్రతిపాదనలు చకచకా ఆమోదం పొందుతున్నాయి. పైగా అడిగినంత కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు.

బిలియన్లు గుమ్మరిస్తున్న యూఎస్‌
ఉక్రెయిన్‌కు బైడెన్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,000 కోట్ల డాలర్లకు పైగా నిధులిచ్చేందుకు సిద్ధమైంది. దాంతో ఉక్రెయిన్‌ యుద్ధం కోసం గత రెండు నెలల్లోనే అమెరికా మంజూరు చేసిన సాయం ఏకంగా 5,300 కోట్ల డాలర్లను దాటింది. ఇందులో చాలావరకు ఆయుధ రూపంలో అందేదే. గత రెండు దశాబ్దాల్లో అమెరికా ఇచ్చిన అతిపెద్ద విదేశీ సాయం ఇదే! యుద్ధం సాగే కొద్దీ ఉక్రెయిన్‌కు సాయాన్ని ఇంకా పెంచుతానంటూ హామీకూడా ఇచ్చింది. ‘‘ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా ఆయుధ కంపెనీలు కాసుల పంట పండించుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఇదే విధంగా జరిగింది’’ అని రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ జి.డి.భక్తి గత చరిత్రను గుర్తు చేశారు.

యూరప్‌ దేశాలూ...
ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న పలు యూరప్‌ దేశాలు తమ రక్షణ కేటాయింపులను భారీగా పెంచుకుంటున్నాయి. జర్మనీ రక్షణ కేటాయింపులు జీడీపీలో 1.5 శాతం నుంచి 2 శాతానికి పెరగనున్నాయి. జపాన్‌ 60 ఏళ్ల తర్వాత తమ జీడీపీలో ఒక శాతానికిపైగా నిధులను రక్షణ అవసరాలకు కేటాయించబోతోంది. అమెరికా రక్షణ నిధులు కూడా వచ్చే ఏడాది ఎన్నడూ లేనంతగా జీడీపీలో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరొచ్చన్నది బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా నిపుణుల అంచనా.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement