lockheed martin
-
Russia Ukraine war: ఉక్రెయిన్ శిథిలాల్లో ఆయుధ కంపెనీల... కాసుల పంట
ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో విజేతలెవరు? రష్యా వంటి అత్యంత శక్తివంతమైన దేశం మూడు నెలలుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై పట్టు చిక్కలేదు. పైగా సైనికంగా, సాయుధ సంపత్తి పరంగా అపార నష్టం చవిచూస్తోంది. అంతర్జాతీయంగా, దౌత్యపరంగా తీవ్ర వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. అంతర్జాతీయ సాయంతో రష్యాను ఉక్రెయిన్ ఢీకొడుతున్నా, ఆ దేశం నిండా శిథిల నగరాలే దర్శనమిస్తున్నాయి. మరి ఇంతకూ ఈ యుద్ధంలో గెలుస్తున్నదెవరు? రష్యానా, ఉక్రెయినా? రెండూ కాదు. అమెరికా, పాశ్చాత్య దేశాల ఆయుధ కంపెనీలదే అసలు విజయంగా కన్పిస్తోంది... ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం వల్ల ఆయుధ కంపెనీల పంట పండుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ కంపెనీల్లో తయారవుతున్నవే. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌తో పాటు టాప్ సెవెన్ కంపెనీలు అమెరికావే. అమెరికా, యూరప్ల్లోని ఆయుధ కంపెనీలు చాలావరకు ప్రైవేట్ సంస్థలే. ఐదేళ్లుగా పెద్దగా వ్యాపారం సాగక సతమతమవుతున్న ఈ సంస్థలు ఉక్రెయిన్ యుద్ధం పుణ్యామా అని లాభాల బాట పట్టాయి. అమెరికాతో సహా నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంలో చాలావరకు ఆయుధాల రూపంలోనే అందుతోంది. విమాన విధ్వంసక స్ట్రింగర్, ట్యాంకు విధ్వంసక జావలిన్ ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తున్నది అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్లే. యుద్ధం మొదలవగానే మార్చిలో లాక్‌హీడ్ సంస్థ షేరు విలువ ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. రేథియాన్ సంస్థ షేరు విలువ 8 శాతం, యూరప్‌లో అతిపెద్ద ఆయుధ కంపెనీ బీఏఈ షేరు విలువ ఏకంగా 26 శాతం పెరిగాయి. అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్ షేరు 12 శాతం, నార్త్రోప్ గ్రూమన్ షేరు 22 శాతం పెరిగాయి. కాంగ్రెస్ సభ్యులకు కాసుల పంట అమెరికా కాంగ్రెస్ సభ్యుల్లో చాలామందికి ఆయుధ కంపెనీల్లో షేర్లున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వారికి లాభదాయకంగా మారిందన్నది బిజినెస్ ఇన్సైడర్ పత్రిక కథనం. కనీసం 20 మంది కాంగ్రెస్ సభ్యులకు, లేదా జీవిత భాగస్వాములకు లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్ సంస్థల్లో నేరుగా షేర్లున్నాయి. మరెందరో వాటిలో చాలాకాలంగా పెట్టుబడులు పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ కొత్తగా షేర్లు కొన్నవారికీ కొదవ లేదు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు మార్జోరీ టైలర్ గ్రాన్ ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 22న లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. పైగా, ‘యుద్ధం రాజకీయ నాయకులకు మంచి వ్యాపారం’ అంటూ ట్వీట్ కూడా చేశారు! టెనెసీకి చెందిన మరో రిపబ్లికన్ సభ్యురాలు డయానా హార్స్బర్జర్ తన భర్తతో కలిసి రేథియాన్ షేర్లు కొన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌లో ముందు పెట్టిన ప్రతిపాదనలు చకచకా ఆమోదం పొందుతున్నాయి. పైగా అడిగినంత కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. బిలియన్లు గుమ్మరిస్తున్న యూఎస్ ఉక్రెయిన్‌కు బైడెన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,000 కోట్ల డాలర్లకు పైగా నిధులిచ్చేందుకు సిద్ధమైంది. దాంతో ఉక్రెయిన్ యుద్ధం కోసం గత రెండు నెలల్లోనే అమెరికా మంజూరు చేసిన సాయం ఏకంగా 5,300 కోట్ల డాలర్లను దాటింది. ఇందులో చాలావరకు ఆయుధ రూపంలో అందేదే. గత రెండు దశాబ్దాల్లో అమెరికా ఇచ్చిన అతిపెద్ద విదేశీ సాయం ఇదే! యుద్ధం సాగే కొద్దీ ఉక్రెయిన్‌కు సాయాన్ని ఇంకా పెంచుతానంటూ హామీకూడా ఇచ్చింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఆయుధ కంపెనీలు కాసుల పంట పండించుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఇదే విధంగా జరిగింది’’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ జి.డి.భక్తి గత చరిత్రను గుర్తు చేశారు. యూరప్ దేశాలూ... ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న పలు యూరప్ దేశాలు తమ రక్షణ కేటాయింపులను భారీగా పెంచుకుంటున్నాయి. జర్మనీ రక్షణ కేటాయింపులు జీడీపీలో 1.5 శాతం నుంచి 2 శాతానికి పెరగనున్నాయి. జపాన్ 60 ఏళ్ల తర్వాత తమ జీడీపీలో ఒక శాతానికిపైగా నిధులను రక్షణ అవసరాలకు కేటాయించబోతోంది. అమెరికా రక్షణ నిధులు కూడా వచ్చే ఏడాది ఎన్నడూ లేనంతగా జీడీపీలో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరొచ్చన్నది బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎఫ్21 మీరు కొంటే మరో దేశానికి అమ్మం
న్యూఢిల్లీ: ఇతర కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీ దృష్ట్యా.. తాము కొత్తగా తయారు చేసిన ఎఫ్–21 యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ భారత్‌కు ఓ ఆఫర్ ఇచ్చింది. 114 ఎఫ్–21 విమానాల కొనుగోలుకు కనుక భారత్ ఆర్డర్ ఇచ్చిన పక్షంలో.. తమ యుద్ధ విమానాలను మరే ఇతర దేశానికి అమ్మబోమని స్పష్టం చేసింది. ఆయుధాలను తీసుకెళ్లగలిగే సామర్థ్యంతో పాటు అత్యుత్తమమైన ఇంజిన్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ వంటి పలు ప్రత్యేకతలు కలిగిన ఈ విమానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 60కి పైగా వైమానిక కేంద్రాల నుంచి నడపగలిగేలా డిజైన్ చేసినట్లు కంపెనీ వైఎస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ చెప్పారు. 18 బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.1,27,000 కోట్లు) విలువైన 114 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత వైమానిక దళం గత నెలలో సమాచార విజ్ఞప్తి (ఆర్ఎఫ్ఐ) లేదా ప్రాథమిక టెండర్ జారీ చేసింది. -
హైదరాబాద్‌లో ‘ఎఫ్–16’ రెక్కల తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరం మరో రికార్డును నమోదు చేయబోతోంది. అమెరికాకు చెందిన రక్షణ , ఏరోస్పేస్, టెక్నాలజీ దిగ్గజం లాఖీడ్ మార్టిన్... ఎఫ్–16 ఫైటర్ జెట్ల రెక్కల తయారీని హైదరాబాద్‌లో చేపట్టబోతోంది. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తారు. 2020 చివరి నుంచి వీటి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో (టీఏఎస్ఎల్) భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు లాఖీడ్ వెల్లడించింది. టీఏఎస్‌ఎల్‌కు హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం దగ్గరి ఏరోస్పేస్ హార్డ్‌వేర్ పార్క్‌లో తయారీ కేంద్రం ఉంది. ప్రస్తుతం ఎఫ్–16 విమాన రెక్కలు ఇజ్రాయెల్‌లో రూపొందుతున్నాయి. ఎఫ్–16 వింగ్స్‌ను ఇకపై పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాలని లాఖీడ్ నిర్ణయించడం విశేషం. జేవీ ఆధ్వర్యంలో..: లాఖీడ్ మార్టిన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇప్పటికే సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి. టాటా లాఖీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ పేరుతో ఏర్పాటైన ఈ కంపెనీ టర్బోప్రాప్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సి–130 విడిభాగాలను రూపొందిస్తోంది. ఎస్–92 హెలికాప్టర్ల క్యాబిన్లు సైతం హైదరాబాద్ ప్లాంటులో తయారవుతున్నాయి. ఎఫ్–16 ఫైటర్ జెట్స్ రెక్కల తయారీ గురించి లాఖీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ స్పందిస్తూ... అడ్వాన్స్డ్ డిఫెన్స్ రంగంలో టాటాల సామర్థ్యంపై తమకున్న నమ్మకానికిది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు యూఎస్ ఎయిర్ఫోర్స్సహా 28 దేశాలు ఎఫ్–16 రకం 4,604 విమానాలను కొనుగోలు చేశాయి. -
లక్ష కోట్లతో ఫైటర్‌జెట్స్ కొనుగోలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దాదాపు 110 యుద్ధవిమానాల కొనుగోలుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) శుక్రవారం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(ఆర్ఎఫ్ఐ) జారీచేసింది. జూలై 6లోపు తమ ప్రతిపాదనల్ని పంపాలని కోరింది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థలు మొత్తం యుద్ధ విమానాల్లో 85 శాతాన్ని మేకిన్ ఇండియా కింద భారత్‌లో దేశీయ కంపెనీలతో కలసి తయారుచేయాలి. మిగిలిన విమానాలను వినియోగానికి సిద్దంగా ఉన్న స్థితిలో అందజేయాలి. 15 బిలియన్ డాలర్ల(సుమారు రూ.97, 342 కోట్లు) విలువైన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, డసాల్ట్, బోయింగ్ వంటి సంస్థలు పోటీపడుతున్నాయి. ఎఫ్–16, ఎఫ్–18 కొనుగోలుపై భారత్ నిర్ణయంపైనే యుద్ధ విమానాలకు సంబంధించి తమతో రక్షణ సంబంధాలు ఆధారపడి ఉంటాయని అమెరికా తెలిపింది. -
సౌండ్‌లెస్ సూపర్సోనిక్
నాసా కోసం రూ.1610కోట్లు ఖర్చుచేసి లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారుచేయనున్న సూపర్సోనిక్ ‘ఎక్స్’ విమానం ఊహాచిత్రమిది. 55వేల అడుగుల ఎత్తులో, గంటకు 1,513 కి.మీ.ల వేగంలో దూసుకెళ్లేలా దీన్ని తయారుచేస్తున్నారు. ఇది వెళ్తున్నపుడు.. కారు తలుపు వేసినపుడు వచ్చేంత తక్కువ శబ్దమే వస్తుందని కంపెనీ చెబుతోంది. 94 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుండే ఈ విమానం బరువు 14,650 కేజీలు. -
స్పై ప్లేన్ : కనురెప్ప మూసి తెరచేలోగా..!
వాషింగ్టన్ : ప్రపంచం ఇంతవరకూ ఎరుగని వేగంతో ప్రయాణించే విమానాన్ని అమెరికా రూపొందిస్తోంది. ఆ దేశానికి చెందిన ఫైటర్ జెట్ల తయారీ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ స్పై ప్లేన్ ‘ఎస్ఆర్ - 72 బ్లాక్‌బర్డ్’ను అభివృద్ధి చేస్తోంది. కోల్డ్‌వార్ సమయంలో ఎస్ఆర్-71 బ్లాక్‌బర్డ్ విమానం ద్వారా రష్యాపై అమెరికా గూఢచర్యం నిర్వహించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఎస్ఆర్ -71 విధుల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత అమెరికా ఎలాంటి స్పై జెట్‌ను రూపొందించలేదు. తాజాగా రూపొందుతున్న ఎస్ఆర్ -72ను ‘సన్ ఆఫ్ బ్లాక్‌బర్డ్’ గా లాక్ హీడ్ మార్టిన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. 2030లో ఈ ప్లేన్ విధుల నిర్వహణను ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. హైపర్ సోనిక్ టెక్నాలజీని వినియోగించడం వల్ల ఎస్ఆర్ -72 ధ్వని వేగం కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం(మాక్ -6)తో ప్రయాణిస్తుంది. కోల్డ్‌వార్ సమయంలో సేవలందిచిన ఎస్ఆర్ -71 మాక్ -3.5 వేగం(సుమారు గంటకు 2వేల కిలోమీటర్లు)తో ప్రయాణించేది. ఎస్ఆర్ -72పై తమకు ఎలాంటి సమాచారం లేదని అమెరికా ఎయిర్‌ఫోర్స్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. -
జాబిల్లి ఇల్లు రెడీ అవుతోంది!
జస్ట్ ఇంకో 13 ఏళ్లు. అంతే.. భూమ్మీది జనాలలో కొందరైనా పొరుగున ఉన్న జాబిల్లిపైకి చేరేందుకు ఉన్న సమయమిది. అబ్బే.. సైంటిస్ట్‌లు సవాలక్ష చెబుతూంటారుగానీ.. అన్నీ అయ్యేనా.. పొయ్యేనా అన్న డౌట్స్ మీకుంటే... పక్క ఫొటో చూసేయండి. రేప్పొద్దున జాబిల్లిపై ఏర్పాటు చేయబోయే మానవ ఆవాసాల నమూనా ఇది. అగ్రరాజ్యం అమెరికాకు అతిపెద్ద డిఫెన్స్ కాంట్రాక్టర్ అయిన లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేస్తోంది దీన్ని. ఏడాది క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ జాబిల్లిపై ఆవాసాలను సిద్ధం చేసేందుకు టెండర్లు పిలిచింది. ఇందులో బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి కంపెనీలు ఆరు వరకూ పోటీపడ్డాయి. చివరకు ఈ టెండర్‌ను దక్కించుకుంది లాక్‌హీడ్ మార్టిన్. నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీస్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ పార్టనర్షిప్స్.. క్లుప్తంగా ‘నెక్స్ట్ స్టెప్’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలిదశలో ఈ కంపెనీ ఇచ్చిన డిజైన్లు ఆమోదం పొందగా.. రెండోదశలో వాటిని మరింత మెరుగుపరిచి నమూనా ఆవాసాలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటివరకూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేసేందుకు ఉపయోగించిన కంటెయినర్లను ఉపయోగించుకుంటున్నారు. అంతరిక్షంలో కొన్ని నెలలపాటు ఖాళీగానూ ఉండాల్సిన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ఆవాసాలను దృఢంగా తయారు చేస్తున్నామని లాక్‌హీడ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ నమూనా ఆవాసంలో కొన్ని సౌకర్యాలను కేవలం ఆగ్మెంటెండ్ రియాల్టీలో మాత్రమే ఉండేలా చూస్తున్నారు. అంటే.. నమూనా పూర్తయిన తరువాత ప్రత్యేకమైన గాగుల్స్ వాడినప్పుడు మాత్రమే కొన్ని వస్తువులు కనిపిస్తాయి. వాస్తవంగా వాటిని ఏర్పాటు చేయరన్నమాట. అనవసరమైన ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ ఏర్పాట్లన్నది లాక్‌హీడ్ మాట. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇక భారత్‌లో ఎఫ్–16 ఫైటర్ జెట్స్ తయారీ!
♦ టాటా గ్రూప్, లాక్‌హీడ్ మార్టిన్ల మధ్య ఒప్పందం ♦ భారత్, అమెరికాలో ఉద్యోగాలకు ఊతం లండన్: అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిస్ ఎయిర్‌షో సందర్భంగా కంపెనీలు ఈ విషయం వెల్లడించాయి. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చే ఈ డీల్ ప్రకారం లాక్‌హీడ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ వర్త్‌లో ఉన్న ప్లాంటు కార్యకలాపాలను భారత్‌కు తరలించనుంది. ఈ క్రమంలో అక్కడి అమెరికన్ల ఉద్యోగుల ఉపాధికి ప్రత్యక్షంగా భంగం కలగకుండా చర్యలు తీసుకోనుంది. మేకిన్ ఇండియా నినాదానికి ప్రాధాన్యమిస్తున్న ప్రధాని మోదీ, అమెరికన్లకే ఉద్యోగాల నినాదానికి ప్రాధాన్యమిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భేటీ కానున్న నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, లాక్‌హీడ్ మార్టిన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఓర్లాండో కర్వాలో సమక్షంలో టీఏఎస్ఎల్ సీఈవో సుకరణ్ సింగ్, లాక్‌హీడ్ వైస్ ప్రెసిడెంట్ జార్జ్ స్టాండ్ రిడ్జ్ దీనిపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం ఈ డీల్‌తో మరింత పటిష్టం కాగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఎఫ్–16ల తయారీకి సంబంధించి ఇదొక అపూర్వమైన ఒప్పందమని ఓర్లాండో పేర్కొన్నారు. టీఏఎస్ఎల్ ఇప్పటికే లాక్‌హీడ్‌కి చెందిన సీ–130జే ఎయిర్‌లిఫ్టర్, ఎస్–92 హెలికాప్టర్లకు ఎయిర్‌ఫ్రేమ్ విడిభాగాలు అందజేస్తోంది. ఉపాధికి తోడ్పాటు..: భారత వైమానిక దళానికి అవసరమైన సింగిల్ ఇంజిన్ ఫైటర్ విమానాల అవసరాలు తీర్చేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లాక్‌హీడ్ భాగస్వామ్యం తోడ్పడనుంది. భారత ఎయిర్‌ఫోర్స్‌కు ఈ తరహా విమానాలు సుమారు 200 అవసరమని రక్షణ రంగ నిపుణుల అంచనా. అత్యంత ఆధునిక ఎఫ్–16 బ్లాక్ 70 విమానాల తయారీ, నిర్వహణ, ఎగుమతికి ఈ డీల్ ద్వారా భారత్‌కు అవకాశం లభించగలదని టాటా సన్స్ పేర్కొంది. అలాగే, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌కు ప్రముఖ స్థానం దక్కగలదని వివరించింది. భారత్‌లో ఎఫ్–16 విమానాల తయారీ ఇటు దేశీయంగా తయారీ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అటు అమెరికాలోనూ వేల కొద్దీ ఉద్యోగాల కల్పనకు ఊతమివ్వగలదని ఓర్లాండో తెలిపారు. ఇప్పటిదాకా సుమారు 4,500 పైగా ఎఫ్–16 యుద్ధ విమానాలు ఉత్పత్తి కాగా, 26 దేశాల్లో 3,200 పైచిలుకు విమానాలు నడుస్తున్నాయి. -
హెలికాప్టర్లూ తయారు చేస్తాం :మసూద్ హుసైనీ..
‘సాక్షి’ ఇంటర్వ్యూ టాటా ఏరోస్ట్రక్చర్స్ చీఫ్ మసూద్ హుసైనీ.. లాక్‌హీడ్ మార్టిన్‌తో కలిసి రెక్కల తయారీ క్యాబిన్లకు సంబంధించి డెలివరీ కూడా మొదలు సిబ్బందికి తగిన శిక్షణ మేమే ఇస్తున్నాం సాక్షి బిజినెస్‌బ్యూరో, హైదరాబాద్ ‘హెలికాప్టర్‌కు అత్యంత ప్రధానమైన క్యాబిన్ పూర్తిస్థాయిలో ఇక్కడే తయారవుతోంది. వీటి డెలివరీ కూడా ఆరంభమయింది. ప్రస్తుతం అత్యంత కీలకమైన రెక్కలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. త్వరలో పూర్తి స్థాయి హెలికాప్టర్‌ను దేశీయంగానే రూపొందిస్తామన్న నమ్మకం మాకుంది. మా సంస్థ లక్ష్యం కూడా ఇదే...’’ అంటూ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లక్ష్యాన్ని చెప్పుకొచ్చారు ఆ సంస్థలో ఏరోస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఆఫీస్‌కు సారథ్యం వహిస్తున్న మసూద్ హుసైనీ. హైదరాబాద్‌లో టాటా సన్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో... ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆదిభట్లలోని ఏరోస్పేస్ సెజ్‌కు సంబంధించిన వివరాలను ‘సాక్షి’ ప్రతినిధితో పంచుకున్నారు. వివరాలివీ... ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్ ఎలా ఉంది? అనుకున్న సమయానికి కొంచెం ఆలస్యమైనా... హెలికాప్టర్ క్యాబిన్ తయారీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాం. అమెరికాకు చెందిన సిర్కోస్కీ ఎయిర్‌క్రాఫ్ట్‌తో కలసి దీనికోసం ఏర్పాటు చేసిన టాటా ఏరోస్పేస్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ క్యాబిన్లను రూపొందిస్తోంది. దేశీయంగా తయారైన తొలి క్యాబిన్‌ను మూడు నెలల కిందటే డెలివరీ చేశాం. ఇక తదుపరి ఫోకస్ దేనిమీద పెట్టారు? హెలికాప్టర్‌కు అత్యంత కీలకమైన సెంటర్ వింగ్ బాక్స్‌ను, రెక్కలను, మరో 400 విడిభాగాలను తయారు చేసే పనిలో పడ్డాం. దీనికోసం అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్‌తో కలసి ‘టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్’ను ఏర్పాటు చేశాం. దీన్ని క్రమంగా విస్తరిస్తూ మరిన్ని విడి భాగాలను తయారు చేస్తాం. అంటే పూర్తి హెలికాప్టర్ ఇక్కడే తయారు చేస్తారా...? అదే మా లక్ష్యం కూడా. కాకపోతే హెలికాప్టర్ తయారీ అంత ఈజీ కాదు. కొన్ని భాగాలు వెంట్రుక మందంకన్నా సన్నగా ఉంటాయి. వీటి తయారీకి అత్యంత నైపుణ్యం కావాలి. మానవ వనరుల అవసరమూ ఎక్కువే. అయితే వీటన్నిటినీ అధిగమించి త్వరలోనే పూర్తి స్థాయి హెలికాప్టర్‌ను ఆదిభట్ల ఏరో సెజ్‌లో తయారు చేస్తామన్న విశ్వాసం మాకుంది. మరి హెలికాప్టర్ భాగాల తయారీకి నిపుణులు అవసరమని మీరే అంటున్నారు కదా? ఎక్కడి నుంచి తెస్తున్నారు? మేం ఇక్కడ సొంత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడే యూనివర్సిటీలలో, కాలేజీలలో నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపడుతున్నాం. వాటిలో సెలక్ట్ చేసుకున్న వాళ్లకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటున్నాం. మీ సెజ్ వచ్చాక ఆదిభట్ల చుట్టుపక్కల పరిస్థితులేమైనా మారాయా? అందులో ఎలాంటి సందేహం లేదు. మా సెజ్‌ను ఆనుకుని సమూహ ఏరో క్లస్టర్ ఏర్పాటవుతోంది. ఐటీతో సహా పలు కంపెనీలు వస్తున్నాయి. మరి రియల్ ఎస్టేట్ సంగతో... దీనిగురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. రియల్ ఎస్టేట్ ధరలు మాత్రం ఆకాశానికి ఎగిశాయన్నది నిజం. కొన్ని చోట్ల ఎకరా భూమి ఏడెనిమిది కోట్ల రూపాయలు కూడా పలుకుతోంది. మా సంస్థలో సిబ్బంది తమ ఇళ్ల కోసం ప్లాట్లు కొనుక్కుందామన్నా కష్టమవుతోందంటే మీరే అర్థం చేసుకోండి.