జాబిల్లి ఇల్లు రెడీ అవుతోంది!
జస్ట్ ఇంకో 13 ఏళ్లు. అంతే.. భూమ్మీది జనాలలో కొందరైనా పొరుగున ఉన్న జాబిల్లిపైకి చేరేందుకు ఉన్న సమయమిది. అబ్బే.. సైంటిస్ట్‌లు సవాలక్ష చెబుతూంటారుగానీ.. అన్నీ అయ్యేనా.. పొయ్యేనా అన్న డౌట్స్ మీకుంటే... పక్క ఫొటో చూసేయండి. రేప్పొద్దున జాబిల్లిపై ఏర్పాటు చేయబోయే మానవ ఆవాసాల నమూనా ఇది. అగ్రరాజ్యం అమెరికాకు అతిపెద్ద డిఫెన్స్ కాంట్రాక్టర్ అయిన లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేస్తోంది దీన్ని. ఏడాది క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ జాబిల్లిపై ఆవాసాలను సిద్ధం చేసేందుకు టెండర్లు పిలిచింది.
ఇందులో బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి కంపెనీలు ఆరు వరకూ పోటీపడ్డాయి. చివరకు ఈ టెండర్‌ను దక్కించుకుంది లాక్‌హీడ్ మార్టిన్. నెక్స్‌ట్ స్పేస్ టెక్నాలజీస్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ పార్టనర్‌షిప్స్.. క్లుప్తంగా ‘నెక్స్‌ట్ స్టెప్’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలిదశలో ఈ కంపెనీ ఇచ్చిన డిజైన్లు ఆమోదం పొందగా.. రెండోదశలో వాటిని మరింత మెరుగుపరిచి నమూనా ఆవాసాలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటివరకూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేసేందుకు ఉపయోగించిన కంటెయినర్లను ఉపయోగించుకుంటున్నారు. అంతరిక్షంలో కొన్ని నెలలపాటు ఖాళీగానూ ఉండాల్సిన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ఆవాసాలను దృఢంగా తయారు చేస్తున్నామని లాక్‌హీడ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ నమూనా ఆవాసంలో కొన్ని సౌకర్యాలను కేవలం ఆగ్‌మెంటెండ్ రియాల్టీలో మాత్రమే ఉండేలా చూస్తున్నారు. అంటే.. నమూనా పూర్తయిన తరువాత ప్రత్యేకమైన గాగుల్స్ వాడినప్పుడు మాత్రమే కొన్ని వస్తువులు కనిపిస్తాయి. వాస్తవంగా వాటిని ఏర్పాటు చేయరన్నమాట. అనవసరమైన ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ ఏర్పాట్లన్నది లాక్‌హీడ్ మాట.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్