Space shuttle
-
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్‌లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్‌దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్‌లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్‌కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్‌కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్‌లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
వ్యోమగాముల మెదడుకు ముప్పు!
అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్‌లను సేకరించి, పరిశీలించారు. ► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. ► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు. ► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఎస్ఎస్ చేరుకున్న స్పేస్ఎక్స్ క్రూడ్రాగన్ వ్యోమనౌక
-
అరుణగ్రహంపై జీవం కోసం...
పాసడీనా (అమెరికా): వచ్చే ఏడాది అరుణగ్రహంపైకి పంపనున్న ‘ది మార్స్ 2020 మిషన్’అంతరిక్ష నౌక (రోవర్) ద్వారా నాసా ఆ గ్రహంపై ఇప్పటివరకు ఏమైనా జీవం ఉందా అన్న అంశాన్ని పరిశోధించనుంది. అంతేకాదు భవిష్యత్తులో మానవుని మనుగడ సాధ్యమవుతుందా అనేది కూడా తెలుసుకోనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అరుణగ్రహంపైకి పంపనున్న అంతరిక్ష నౌకను శుక్రవారం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్ పాసడీనాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో ఈ నౌకను శాస్త్రవేత్తలు రూపొందించారు. గత వారమే ఈ నౌకను విజయవంతంగా పరీక్షించారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష నౌకను తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఈ నౌక 2020 జూలైలో ఫ్లోరిడాలోని కేప్ కెనవరెల్ నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోయి 2021 ఫిబ్రవరిలో అరుణగ్రహంపై ల్యాండ్ కానుంది. ఈ రోవర్‌పై 23 కెమెరాలు, మార్స్‌పై గాలి శబ్దాలు వినేందుకు రెండు రిసీవర్లు, రసాయనిక చర్యలను విశ్లేషించేందుకు లేజర్లను వాడినట్లు డిప్యూటీ మిషన్ లీడర్ మట్ వాలేస్ తెలిపారు. క్యూరియాసిటీ రోవర్ మాదిరిగానే 6 చక్రాలను అమర్చారు. ఈ రోవర్ దాదాపు కారు పరిమాణంలో ఉంటుంది. అక్కడి ఒక్క రోజులో పూర్తిస్థాయిలో 200 గజాల స్థలాన్ని తూర్పారా పట్టే పనిని రోవర్‌కు అప్పగించారు. దీనికి చేతులు, నేలను తవ్వేందుకు డ్రిల్ అమర్చారు. ఒకప్పుడు అరుణగ్రహంపై వెచ్చటి ఉపరితల జలం, చిక్కటి వాతావరణం, దీని చుట్టూ అయస్కాంత శక్తి ఉండేదని వివరించారు. దీన్ని బట్టి ఏకకణ జీవం ఉండేదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. రోవర్ దిగే స్థలంపై పరిశోధన చేశాక ఎంపికచేశారు. ఈ స్థలంలో ఒకప్పుడు సరస్సు ఉండేదని తెలిపారు. 350 కోట్ల ఏళ్ల ఇది నదీ వ్యవస్థతో అనుసంధానమై ఉండొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ఈ రోవర్ ప్రయోగం తర్వాత ప్రతిష్టాత్మకమైన అరుణగ్రహంపైకి మానవసహిత అంతరిక్ష నౌకను పంపనున్నారు. అరుణ గ్రహంపై పరిశోధనలు చేయనున్న రోవర్ ఇదే -
ఆదిత్యుడి గుట్టు విప్పుతున్న పార్కర్!
వాషింగ్టన్: ఆదిత్యుడు.. అదేనండీ మన సూర్యుడికి అతిదగ్గరగా వెళ్లిన అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోబ్ మొట్టమొదటిసారి భూమికి సమాచారం పంపింది. ఇది కాస్తా సూర్యుడికి సంబంధించిన అనేక మిస్టరీలను ఛేదించేందుకు ఉపయోగపడుతుందని నాసా అంటోంది. ఈ సమాచారం నేచర్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైంది. మిస్టరీల పుట్ట... సూర్యుడి ఉపరితలం కంటే వాతావరణ(కరోనా) ఉష్ణోగ్రత వందల రెట్లు ఎక్కువ ఎందుకుంది? సూర్యుడి నుంచి వెలువడే గాలులకు మూలమెక్కడ? వంటివి ఇప్పటికీ మిస్టరీలే. అయితే గత ఏడాది ఆగస్టులో నాసా ప్రయోగించిన పార్కర్ ప్రోబ్ తాజాగా పంపిన సమాచారంతో ఈ రహస్యాలను ఛేదించవచ్చునని నాసా అంచనా వేస్తోంది. నక్షత్రాల పుట్టుక వివరమూ తెలుస్తుంది... పార్కర్ సోలార్ ప్రోబ్ ఇచ్చే సమాచారంతో నక్షత్రాలు ఎలా పుడతాయి? ఎలా పరిణమిస్తాయన్న విషయంలోనూ మానవ అవగాహన పెరగనుంది. సూర్యుడిని వీలైనంత దగ్గరగా పరిశీలించడం ద్వారా అక్కడ జరిగే కార్యకలాపాలను మరింత స్పష్టంగా చూడగలుగుతున్నామని, వాటి ప్రభావం భూమిపై ఎలా ఉంటుందో తెలుస్తోందని, పాలపుంతల్లోని నక్షత్రాలను అర్థం చేసుకునేందుకు అవసరమైన వివరాలూ అర్థమవుతున్నాయని నాసా శాస్త్రవేత్త థామస్ జుర్‌బుకెన్ తెలిపారు. హీలియో ఫిజిక్స్ (సూర్య భౌతికశాస్త్రం) రంగంలో ఎంతో ఆసక్తికరమైన దశకు పార్కర్ ప్రోబ్ సమాచారం శ్రీకారం చుట్టిందని అన్నారు. కరోనా తాలూకూ అయస్కాంత నిర్మాణాన్ని చూడటం ద్వారా సౌర గాలులు సూక్ష్మస్థాయి కరోనా రంధ్రాల నుంచి వస్తున్నట్లు తెలిసిందని కాలిఫోరి్నయా యూనివర్సిటీ అధ్యాపకుడు స్టూవర్ట్ బేల్ తెలిపారు. సూర్యుడికి అతిదగ్గరగా వెళ్లినప్పుడు ప్రోబ్‌పై అక్కడక్కడా పడ్డ దుమ్ము తమను ఆశ్చర్యపరిచిందని, మిల్లీమీటర్లో వెయ్యోవంతు సైజున్న ఈ దుమ్ము సూర్యుడికి సమీపంలో కరిగిపోయిన గ్రహశకలాల తాలూకూ అవశేషాలు కావచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
అతివ.. ఆకాశ మార్గాన!
నిప్పులు చిమ్ముతూ నింగికెగసి వినీలాకాశంలో చక్కర్లు కొడుతున్న వ్యోమనౌకను వీడి ఇద్దరు మహిళలు ఈ నెల 29న స్పేస్‌వాక్ చేయబోతున్నారు. మెక్ క్లెయిన్, క్రిస్టినా కోచ్‌లు భూమికి దాదాపు 300 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో నడిచి కేవలం మహిళలు పాల్గొన్న తొలి స్పేస్వాక్గా రికార్డు సృష్టించబోతున్నారు. మెక్ క్లెయిన్, క్రిస్టినా కోచ్‌ల స్పేస్‌వాక్‌కు భూమిపై నుంచి మరో మహిళ సాయం చేయబోతున్నారు. మేరీ లారెన్స్ లీడ్ ఫ్లైట్ డైరెక్టర్‌గా పనిచేస్తే, జాకీ కేగీ స్పేస్‌వాక్ ఫ్లైట్ కంట్రోలర్‌గా ఉంటారు. మెక్ క్లెయిన్ అమెరికా సైన్యంలో మేజర్, పైలట్ కూడా. ఈమె ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ క్రిస్టినా కోచ్ మార్చి 14న అంతరిక్ష నౌకలో వెళ్లి మెక్ క్లెయిన్ను కలుసుకుంటారు. స్పేస్ వాక్కు ఎలా వెళ్తారు? అంతరిక్ష నౌక నుంచి బయటకు రావడాన్నే స్పేస్ వాక్ అంటారు. బయటకు రావాలంటే వారి రక్షణకోసం స్పేస్ సూట్ ధరిస్తారు. స్పేస్ సూట్లో వారు శ్వాస పీల్చుకోవడానికి ఆక్సిజన్, తాగేందుకు నీళ్లూ ఉంటాయి. స్పేస్ వాక్కు కొన్ని గంటల ముందే స్పేస్ సూట్‌ను ఆక్సిజన్‌తో నింపి దాన్ని ధరిస్తారు. ఒకసారి దాన్ని ధరించాక కొన్ని గంటలపాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీల్చవచ్చు. ఆ తర్వాత వ్యోమగామి శరీరం నుంచి నైట్రోజన్‌ను పూర్తిగా తొలగిస్తారు. ఒకవేళ నైట్రోజన్‌ను బయటకు పంపకపోతే స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు వారి శరీరం నిండా బొబ్బలు వచ్చి, ఈ బొబ్బల కారణంగా వ్యోమగాముల భుజాలదగ్గరా, మోచేతులపైనా, ముంజేతులపై, మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తాయి. దీంతో వ్యోమగాములు పరిస్థితి అత్యంత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అరుదైన.. అద్భుతమైన.. మెక్‌క్లెయిన్, క్రిస్టినా కోచ్ ఇద్దరూ మార్చి 29న చేసే అరుదైన స్పేస్‌వాక్ మహిళలందరికీ గర్వించదగిన సందర్భంగా మారబోతోంది. ఇప్పటి వరకు ఇద్దరు పురుషులో, లేదా ఒక పురుషుడి తోడుగానో మరో మహిళ స్పేస్ వాక్‌లో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు కేవలం ఇద్దరూ మహిళలే ఆ సాహసాన్ని అవలీలగా ఆవిష్కరించబోతున్నారు. -
జాబిల్లి ఇల్లు రెడీ అవుతోంది!
జస్ట్ ఇంకో 13 ఏళ్లు. అంతే.. భూమ్మీది జనాలలో కొందరైనా పొరుగున ఉన్న జాబిల్లిపైకి చేరేందుకు ఉన్న సమయమిది. అబ్బే.. సైంటిస్ట్‌లు సవాలక్ష చెబుతూంటారుగానీ.. అన్నీ అయ్యేనా.. పొయ్యేనా అన్న డౌట్స్ మీకుంటే... పక్క ఫొటో చూసేయండి. రేప్పొద్దున జాబిల్లిపై ఏర్పాటు చేయబోయే మానవ ఆవాసాల నమూనా ఇది. అగ్రరాజ్యం అమెరికాకు అతిపెద్ద డిఫెన్స్ కాంట్రాక్టర్ అయిన లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేస్తోంది దీన్ని. ఏడాది క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ జాబిల్లిపై ఆవాసాలను సిద్ధం చేసేందుకు టెండర్లు పిలిచింది. ఇందులో బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి కంపెనీలు ఆరు వరకూ పోటీపడ్డాయి. చివరకు ఈ టెండర్‌ను దక్కించుకుంది లాక్‌హీడ్ మార్టిన్. నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీస్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ పార్టనర్షిప్స్.. క్లుప్తంగా ‘నెక్స్ట్ స్టెప్’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలిదశలో ఈ కంపెనీ ఇచ్చిన డిజైన్లు ఆమోదం పొందగా.. రెండోదశలో వాటిని మరింత మెరుగుపరిచి నమూనా ఆవాసాలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటివరకూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేసేందుకు ఉపయోగించిన కంటెయినర్లను ఉపయోగించుకుంటున్నారు. అంతరిక్షంలో కొన్ని నెలలపాటు ఖాళీగానూ ఉండాల్సిన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ఆవాసాలను దృఢంగా తయారు చేస్తున్నామని లాక్‌హీడ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ నమూనా ఆవాసంలో కొన్ని సౌకర్యాలను కేవలం ఆగ్మెంటెండ్ రియాల్టీలో మాత్రమే ఉండేలా చూస్తున్నారు. అంటే.. నమూనా పూర్తయిన తరువాత ప్రత్యేకమైన గాగుల్స్ వాడినప్పుడు మాత్రమే కొన్ని వస్తువులు కనిపిస్తాయి. వాస్తవంగా వాటిని ఏర్పాటు చేయరన్నమాట. అనవసరమైన ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ ఏర్పాట్లన్నది లాక్‌హీడ్ మాట. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పునర్వినియోగానికి అనువైన ఆర్ఎల్వీ-టీడీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం 7గంటలకు షార్ నుంచి బయల్దేరిన రాకెట్ ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా నింగిలోకి 70 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి విజయవంతంగా భూమిని చేరింది. ఈ ప్రక్రియ మొత్తం 11 నిమిషాల్లోనే ముగిసింది. అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ రన్‌వేపై రాకెట్ దిగింది. దీంతో షార్‌లో అప్పటి వరకూ ఉత్కంఠతో ఎదురు చూసిన శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో వ్యోమగాములను రోదసీలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకురావడానికి వీలు పడుతుంది. భవిష్యత్తులో పూర్తి స్థాయి స్పేస్ షటిల్ రూపొందిస్తామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. -
అంతరిక్షం నుంచి సూపర్ సెల్ఫీ!
పెద్ద గాజుపలక.. డంబెల్లాంటి ఓ బండరాయి ఉన్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రం ఓ సెల్ఫీ(స్వీయచిత్రం)! ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా)కు చెందిన రోసెట్టా వ్యోమనౌక అక్టోబరు 7న దీనిని తీసుకుంది. చిత్రంలో గాజుపలకలా కనిపిస్తున్నది రోసెట్టా 14 మీటర్ల సౌరవిద్యుత్ పలక కాగా.. రాయిలా కనిపిస్తున్నది ‘67/పీ చుర్యుమోవ్ గెరాసిమెంకో’ అనే తోకచుక్క! పదేళ్లుగా ఈ తోకచుక్కను వెంటాడుతూ అంతరిక్షంలో వందల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన రోసెట్టా ఎట్టకేలకు ఆ తోకచుక్కకు 16 కి.మీ. సమీపంలోకి చేరుకుంది. నవంబరు 11న ఫిలే అనే ఓ ల్యాండర్‌ను ఈ తోకచుక్కపైకి దింపనున్న రోసెట్టా పరిశోధనలు చేసి భూమికి సమాచారం పంపనుంది. 47.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తోకచుక్క గుట్టు తెలిస్తే.. భూమిపైకి నీరు, జీవం ఎలా ఏర్పడిందన్న విషయాలు తెలుస్తాయి. -
16 ఏళ్ల తర్వాత బదులిచ్చింది..!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు 36 ఏళ్ల క్రితం.. 1978లో రోదసికి పంపిన వ్యోమనౌక ఇది. పేరు ‘ఇంటర్నేషనల్ సన్-ఎర్త్ ఎక్స్‌ప్లోరర్(ఐసీ)-3’. భూమి అయస్కాంత క్షేత్రంపై సౌరగాలుల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు దీనిని రోదసికి పంపారు. సూర్యుడిపై అధ్యయనం తర్వాత దీనిని హేలీ తోకచుక్కపై పరిశోధనకు మళ్లించారు. 1985లో హేలీ తోకచుక్క తోకభాగం గుండా ప్రయాణించిన ఈ వ్యోమనౌక అందులోని మంచు, ప్లాస్మా కణాలు, ఇతర పదార్థాలకు సంబంధించిన కీలక వివరాలను భూమికి పంపింది. చివరగా 1997 మే 5న దీనితో సంబంధాలు నిలిచిపోయాయి. అయితే 16 ఏళ్ల క్రితం తెరమరుగైన ఐసీ-3తో తాజాగా ఓ ప్రైవేటు పరిశోధకుల బృందం తిరిగి సంబంధాలను పునరుద్ధరించింది. ‘ఐసీ-3 రీబూట్ ప్రాజెక్టు’ పేరుతో పరిశోధనలు చేపట్టిన స్పేస్ కాలేజీ, స్కైకార్ప్, స్పేస్రెఫ్ అనే సంస్థల నేతృత్వంలోని ప్రైవేటు బృందం ప్యూర్టారికోలోని ఆరెసిబో రేడియో అబ్జర్వేటరీ నుంచి సంకేతాలు పంపి, తిరిగి దీని నుంచి సంకేతాలను అందుకోగలిగారు. ప్రస్తుతం దీనిలోని ఇంజిన్లను మండించి, భూమికి సమీపంలోని కక్ష్యలోకి తీసుకురావాలని, తర్వాత మరో సౌర అధ్యయనానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. -
సౌరకుటుంబం ఆవలికి వెళ్లిన వాయేజర్-1
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మూడు దశాబ్దాల క్రితం ప్రయోగించిన ‘వాయేజర్ -1’ వ్యోమనౌక ఎట్టకేలకు సౌరకుటుంబం అంచులు దాటేసింది. అంతరిక్షంలో 36 ఏళ్లుగా నిరంతరం ప్రయాణిస్తున్న ఈ వ్యోమనౌక తాజాగా 1,900 కోట్ల కి.మీ. దూరం దాటేసి నక్షత్రాంతర రోదసిలోకి అడుగుపెట్టింది. మానవ నిర్మితమైన ఓ వస్తువు ఇలా నక్షత్రాంతర రోదసి(రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)కి చేరడం ఇదే తొలిసారని గురువారం అమెరికా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. వాయేజర్-1 నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. అది ఏడాదికాలంగా సౌరకుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసిలో ఉండే ప్లాస్మా తరంగాలు లేదా అయోనైజ్డ్ వాయువుల గుండా ప్రయాణిస్తున్నట్లు అంచనావేశామని ఈ మేరకు వాయేజర్ ప్రాజెక్టు శాస్త్రవేత్త ఎడ్ స్టోన్ తెలిపారు. వోయేజర్-1 నుంచి వెలువడే సంకేతాలు కాంతివేగంతో ప్రయాణిస్తూ.. 17 గంటల్లో భూమిని చేరతాయని, ప్రస్తుత సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించేందుకు కొన్ని నెలల సమయం పట్టవచ్చన్నారు. అయితే నక్షత్రాంతర రోదసికి చేరినా.. సూర్యుడి ప్రభావం పూర్తిగా లేని ప్రదేశానికి వాయేజర్ ఎప్పుడు చేరుకుంటుందో తెలియదన్నారు. కాగా వాయేజర్-2, 1 వ్యోమనౌకలను 16 రోజుల తేడాతో అమెరికా 1977లో ప్రయోగించింది. ఈ రెండూ అప్పటినుంచి రోదసిలో నిరంతరం ప్రయాణిస్తూ సమాచారం పంపుతూనే ఉన్నాయి. సౌరకుటుంబాన్ని దాటిన వ్యోమనౌకగా వాయేజర్-1 చరిత్రకెక్కగా.. దానికంటే ముందు ప్రయోగించిన వోయేజర్-2 అత్యధిక రోజులుగా పనిచేస్తున్న వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది.