ఆర్‌ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పునర్వినియోగానికి అనువైన ఆర్‌ఎల్వీ-టీడీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం 7గంటలకు షార్ నుంచి బయల్దేరిన రాకెట్ ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా నింగిలోకి 70 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి విజయవంతంగా భూమిని చేరింది. ఈ ప్రక్రియ మొత్తం 11 నిమిషాల్లోనే ముగిసింది.
అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ రన్‌వేపై రాకెట్ దిగింది. దీంతో షార్‌లో అప్పటి వరకూ ఉత్కంఠతో ఎదురు చూసిన శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో వ్యోమగాములను రోదసీలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకురావడానికి వీలు పడుతుంది. భవిష్యత్తులో పూర్తి స్థాయి స్పేస్ షటిల్ రూపొందిస్తామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.