RLV-TD
-
అంతరిక్షంలో ‘స్వదేశీ’యానం
స్వదేశీ స్పేస్ షటిల్ నమూనా ప్రయోగం దిగ్విజయం ఆర్ఎల్వీ-టీడీని షార్ నుంచి విజయవంతంగా పరీక్షించిన ఇస్రో శ్రీహరికోట (సూళ్లూరుపేట) : అంతరిక్ష యాత్రలో భారత్ మరో ముందడుగు వేసింది. తొలి ‘స్వదేశీ’ అంతరిక్షనౌకను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. రెక్కలతో కూడిన పునర్వినియోగించగల వాహక నౌక (ఆర్ఎల్వీ-టీడీ) ను నింగికి పంపి తిరిగి తీసుకువచ్చే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసింది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం మరింత సులభంగా, చౌకగా మారేందుకు దోహదం చేయగల ఈ కీలకమైన ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా నిలిచింది. అంతరిక్షనౌక తయారీలో భాగంగా చేపట్టిన ప్రయోగాల తొలి అంకంలో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ - టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ - టీడీ)ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఈ మానవ రహిత నమూనా వ్యోమనౌక ప్రయోగానికి ఆదివారం అర్థరాత్రి దాటాక ఒంటి గంటకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. సరిగ్గా సోమవారం ఉదయం 7 గంటలకు షార్ మొదటి ప్రయోగవేదిక నుంచి ప్రత్యేక రాకెట్ బూస్టర్ మీద అమర్చిన అంతరిక్షనౌకను నింగిలోకి పంపించారు. రాకెట్ బూస్టర్ 65 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకు వెళ్లి అక్కడ నౌకను విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఈ నౌక ధ్వని వేగం కన్నా ఐదు రెట్ల వేగంతో భూ వాతావరణంలోకి తిరిగి రావటం మొదలుపెట్టింది. నౌకలోని నావిగేషన్, మార్గదర్శనం, నియంత్రణ వ్యవస్థ ద్వారా దానిని ఖచ్చితంగా నడుపుతూ కిందికి దించారు. భూ వాతావరణంలోకి ప్రవేశించేటపుడు ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలను ఈ నౌక థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా విజయవంతంగా తట్టుకుంది. అనంతరం.. బంగాళాఖాతంలో ముందే నిర్ణయించిన ఊహాజనిత రన్‌వేపైకి విజయవంతంగా దించారు. దీనిని నేలపై దించటానికి పెద్ద రన్‌వే అవసరం. కానీ షార్‌లో ఆ సౌకర్యం లేకపోవడంతో.. శ్రీహరికోటకు 450 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై విజయవంతంగా దిగటంతో ఈ ప్రయోగపు లక్ష్యం నెరవేరింది. అయితే.. ఈ వ్యోమనౌకను నీటిలో తేలే విధంగా రూపొందించకపోవటంతో అది సముద్రతలాన్ని తాకగానే ముక్కలైంది. కాబట్టి దానిని తిరిగి తీసుకురాలేదు. శ్రీహరికోటతో పాటు.. సముద్రం మీద ఒక ఓడలో ఏర్పాటు చేసిన టెర్మినల్ నుంచి ఈ అంతరిక్ష నౌక గమనాన్ని ఆద్యంతం పరిశీలిస్తూ నియంత్రించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ విభాగాలు.. సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించాయి. ఇది నింగిలోకి వెళ్లి తిరిగి నేలకు దిగటానికి పట్టిన మొత్తం ప్రయాణ సమయం 770 సెకన్లు. అంటే 12.50 నిమిషాల్లోనే ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయోగం ద్వారా.. ఆర్ఎల్వీ-టీడీ స్వీయ నియంత్రిత మార్గ ప్రయాణం, మార్గదర్శనం, నియంత్రణ, పునర్వినియోగించగల థర్మల్ రక్షణ వ్యవస్థ, పునఃప్రవేశ కార్యక్రమ నిర్వహణ వంటి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలను విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఖర్చు తగ్గించేందుకు అనేక ఉపాయాలు... ఆర్ఎల్వీ ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు పదిరెట్ల వరకూ తగ్గుతుందని అంచనా. ఇంకా ఖర్చు తగ్గించే దిశగా ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రస్తుతం 2.2 టన్నుల ఉపగ్రహాలను ప్రయోగించేందు కు అవకాశముండగా.. ఈ సామర్థ్యాన్ని 3.5 టన్నులకు పెంచడం ర్వారా ఒక్కో కిలోగ్రాము బరువును అంతరిక్షంలోకి పంపేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఇదే రాకెట్ ఆధునిక రూపం మార్క్-2 సామర్థ్యాన్ని కూడా నాలుగు టన్నుల నుంచి 7.5 టన్నులకు పెంచే ప్రయత్నాల్లో ఉంది. దీంతోపాటు వీటిలో ఉపయోగించే వికాస్ బూస్టర్లలో సెమీక్రయోజెనిక్ ఇంజన్లను (ఆర్ఎల్వీ-టీడీలో ఉపయోగించారు) వాడటం ద్వారా వాటి బరువును తగ్గించవచ్చునని, తద్వారా మొత్తం వాహక నౌక తయారీకయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని అంచనా. పూర్తిస్థాయి తయారీకి మరో పదేళ్లు... అమెరికాకు చెందిన నాసా 2011లో స్పేస్ షటిల్ కార్యక్రమాన్ని నిలిపివేసిన తర్వాత.. అంతరిక్ష కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపించేందుకు పునర్వినియోగించగల స్పేస్ షటిల్ తయారీ పోటీలోకి భారత్ కూడా ప్రవేశించింది. ఉపగ్రహాలను భూమి చుట్టూ అంతరిక్ష కక్ష్యలోకి చేర్చి మళ్లీ భూమికి తిరిగి రాగల అంతరిక్షనౌకను అభివృద్ధి చేయటం ద్వారా.. ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు అయ్యే ఖర్చును పదింతలు తగ్గించటం లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. అటువంటి పునర్వినియోగించగల రాకెట్‌ను అభివృద్ధి చేయటంలో ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం చాలా ప్రాథమిక దశ. అమెరికా అంతరిక్షనౌకను పోలివున్న ఈ ఆర్ఎల్వీ-టీడీ నిడివి 6.5 మీటర్లు. ఇది వాస్తవంగా తయారు చేయదలచుకున్న అంతిరక్ష నౌక నిడివిలో ఆరో వంతు మాత్రమే. దీని బరువు 1.75 టన్నులు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 95 కోట్లు వ్యయం చేసింది. పూర్తిస్థాయిలో తుది రాకెట్‌ను రూపొందించటానికి ముందు ఈ తరహా ప్రయోగాలు రెండు, మూడు నిర్వహించాల్సి ఉంటుందని.. తుది స్పేస్ షటిల్‌ను సిద్ధం చేయటానికి 10-15 ఏళ్ల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొత్త సాంకేతికతల ఆవిష్కరణ... ద్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల వ్యోమనౌకను ఇస్రో అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు అనేక కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించారు. బూస్టర్ రాకెట్లో వాడిన ఇంధనం నెమ్మదిగా మండేలా చేయడం వీటిలో ఒకటి. వ్యోమనౌకలో వాడిన సిలికా టైల్స్ వాటర్ ప్రూఫింగ్ కోసం ప్రత్యేకమైన రసాయనాన్ని అభివృద్ధి చేశారు. ఆర్ఎల్వీ-టీడీ ముందు భాగంలోని శంఖు ఆకారపు నిర్మాణాన్ని కార్బన్- కార్బన్ మిశ్రధాతువుతో తయారు చేశారు. భారీ సైజున్న విమానం తనంతట తానే ల్యాండ్ అయ్యేలా చేయడం కూడా ఇస్రో సాధించిన ఘనతల్లో ఒకటిగా చెప్పవచ్చు. తొలిదశ రాకెట్ల పునర్ వినియోగం ఆర్ఎల్వీ-టీడీ వ్యోమనౌక 65 కిలోమీటర్ల ఎత్తుకు రెండు దశల్లో చేరింది. తొలి దశలో ఉపయోగించిన రాకెట్.. మధ్యలోనే ఆర్ఎల్వీ-టీడీ నుంచి విడిపోయి బంగాళాఖాతంలో పడిపోయింది. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీల్లోనూ తొలి దశ రాకెట్ భాగాలు ఇలాగే వృథా అవుతుంటాయి. వీటిని కూడా మళ్లీమళ్లీ వాడుకునేలా చేయగలిగితే ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. జీఎస్ఎల్వీ మార్క్- 3 తొలి దశ, దానికి తోడుగా ఉండే నాలుగు స్ట్రాప్ ఆన్ బూస్టర్ల ఖర్చు మొత్తం ప్రాజెక్టు ఖర్చులో మూడొంతుల వరకూ ఉంటుందని అంచనా. తొలి దశ రాకెట్ విడిపోయిన తరువాత అది అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. కీలక టెక్నాలజీలు సక్సెస్ ‘‘ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం కావడాన్ని పునర్వినియోగించగల వ్యోమనౌకల తయారీ దిశగా ఇస్రో వేసిన తొలి అడుగుగా చూడాలి. అంతరిక్ష రంగంలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపయోగపడే ఈ వ్యోమనౌక తయారీలో ఇంకా అనేక మజిలీలు ఉన్నాయి. నావిగేషన్ మొదలుకొని, భూమి పైకి తిరిగి రావటం, ప్యారాచ్యూట్ తదితర ఇతర టెక్నాలజీలన్నీ తొలి ప్రయోగంలోనే విజయవంతం కావడం మనకు గర్వకారణం. ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం ద్వారా లభించిన సమాచారంతో ఉన్న చిన్నపాటి లోటుపాట్లను కూడా సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ఇస్రో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తారనడంలో సందేహం లేదు. - జి.సతీశ్‌రెడ్డి (రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, డెరైక్టర్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్, హైదరాబాద్) -
ఎన్నదగిన విజయం
కొన్ని విజయాలు చిన్నవే కావొచ్చుగానీ అవి ఇచ్చే ధీమా, భరోసా అసామాన్య మైనవి. సోమవారం శ్రీహరికోట నుంచి నిర్వహించిన ‘మేడిన్ ఇండియా’ పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక(ఆర్ఎల్వీ-టీడీ) ప్రయోగం ఇలాంటిదే. సాధారణంగా ఉపగ్రహాలను అంతరిక్షానికి మోసుకెళ్లే వాహకనౌకలు ఆ పని పూర్తయ్యాక అక్కడే మండిపోతాయి. ఆర్ఎల్వీ ఇందుకు భిన్నం. అది వెనక్కు సురక్షితంగా తిరిగొస్తుంది. మళ్లీ మళ్లీ ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది. సోమవారం ప్రయోగించిన ఆర్ఎల్వీ శాస్త్రవేత్తలు నిర్దేశించినట్టుగానే భూమికి 65 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి ధ్వని వేగానికి అయిదు రెట్ల వేగంతో భూమ్మీదకొచ్చి బంగాళాఖాతంలో పడింది. ఇదంతా 13 నిమిషాల్లో పూర్తయింది. 175 కిలోల బరువున్న ఆర్ఎల్వీ-టీడీ చోదన, నియంత్రణ వ్యవస్థల మార్గదర్శకాలకు అను గుణంగా సంతృప్తికరంగా పనిచేసిందని ఇస్రో ప్రకటించింది. ఉపగ్రహాలను పంపడానికి ప్రస్తుతం ఇస్రో రెండు రకాల రాకెట్లు-పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ), జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) వినియోగిస్తున్నది. ఇవి ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడటంవల్ల ఉపగ్రహాలు పంపదల్చిన ప్రతిసారి రాకెట్ల నిర్మాణం తప్పనిసరవుతుంది. ఇందువల్ల ఖర్చు తడిసిమోపెడు కావడంతోపాటు ప్రతిసారి ఎంతోమంది ఆ పనిలో నిమగ్నం కావలసి ఉంటుంది. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ నిర్మాణాల విషయంలో మన శాస్త్ర వేత్తలు సాధించిన విజయాలు అపూర్వమైనవి. ముఖ్యంగా జీఎస్ఎల్వీ రాకెట్లలో వినియోగించే క్రయోజెనిక్ పరిజ్ఞానం ఎన్నో సంక్లిష్టతలతో, సవాళ్లతో కూడుకుని ఉన్నది. అంతర్జాతీయ ఆంక్షలు, వాటివల్ల ఏర్పడిన పరిమితుల మధ్యనే మన శాస్త్రవేత్తలు ఈ పరిజ్ఞానాన్ని సాధించారు. ఆ రంగంలో అగ్రరాజ్యాల గుత్తాధి పత్యాన్ని బద్దలు కొట్టారు. అదే తోవలో ఇప్పుడు పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. నిజానికి దీన్ని పూర్తి అర్ధంలో ప్రయోగం అనడానికి లేదు. నమూనా ప్రయోగంగానే భావించాలి. ఎందుకంటే వాస్తవంగా వినియోగించాల్సిన ఆర్‌ఎల్‌వీతో పోలిస్తే ఇది చాలా చిన్నది. దాని సైజులో ఇది ఆరో వంతు మాత్రమే. పైగా అందులో అమర్చే పరికరాలుగానీ, సాంకేతికతలుగానీ ఇందులో పూర్తి స్థాయిలో ఉండవు. తిరిగొచ్చిన ఆర్ఎల్వీ ల్యాండింగ్ కావడానికి, దాన్ని సేకరించి మళ్లీ వినియోగించడానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికైతే లేవు. రేపన్న రోజున ఒక ఉపగ్రహాన్ని మోసుకెళ్లాల్సిన దూరంతో పోల్చినా ఇప్పుడు వెళ్లిన దూరం అతి స్వల్పమైనది. వాస్తవమైన ఆర్ఎల్వీ భూమికి 36,000 కిలోమీటర్ల దూరానికి మించి వెళ్తుంది. ఇప్పటి ప్రయోగంలో అది కేవలం 65 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈ ప్రయోగం ఇంకా బీజప్రాయంలో ఉన్న పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)ప్రాజెక్టు. అందువల్లే శాస్త్రవేత్తలు దీనికి ఆర్ఎల్వీ-(టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్) అని నామకరణం చేశారు. ఈ కృషి ఫలించి అసలైన ఆర్ఎల్వీ అందుబాటులోకి రావాలంటే కనీసం మరో పదేళ్లు పట్టవచ్చునని భావిస్తున్నారు. పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌకకు సంబంధించిన సాంకేతికత అత్యంత సంక్లిష్టమైనది. అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి ఒక వాహక నౌక సురక్షితంగా వెనక్కి రావడం, దాన్ని మళ్లీ మళ్లీ వినియోగించడానికి వీలుండటం అనేది బహుళ సాంకేతికతల సమ్మేళనం. ప్రస్తుతం అది అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలకు మాత్రమే అందుబాటులో ఉంది. చైనా,బ్రిటన్ తదితర దేశాలు ఇందుకు సంబంధించిన ప్రయోగాల్లో తలమునకలై ఉన్నాయి. 1972- 2011 మధ్య అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అయిదు అంతరిక్ష నౌకలు- కొలంబియా, ఛాలెంజర్, డిస్కవరీ, అట్లాంటిస్, ఎండీవర్‌లను రూపొందించింది. ఇవి ఇంతవరకూ 135 లక్ష్యాలను పూర్తిచేయగలిగాయి. అంతరిక్ష విజయాలను శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని 1967 అక్టోబర్ 10న ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ స్ఫూర్తికి విరుద్ధంగా అంతరిక్షంలో తిరుగాడే తన ప్రత్యర్థి దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసేందుకు అనువైన సాంకేతికతను పెంపొందించుకోవడానికి అమెరికా రహస్య ప్రయోగాలు నిర్వహిస్తున్నదన్న కథనాలు ఆరేళ్లక్రితం సంచలనం కలిగించాయి. అలాంటి పోకడలు అంతిమంగా మానవాళికే ముప్పు కలిగిస్తాయి. అంతరిక్ష వాహక నౌక తిరిగొచ్చినప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే రాపిడి వల్ల భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు రాజుకుంటాయి. దాన్ని తట్టుకునే స్థాయిలో వాహక నౌక ఉండాలి. చౌకలో వాహక నౌక తయారీ, మెరుగైన నిర్మాణం, అందులో వినియోగించే రాకెట్లు వగైరాలు సవాళ్లతో కూడుకున్నవి. అందులో ఎవరి పరిశోధనలు వాళ్లు చేస్తున్నారు. యూరొపియన్ స్పేస్ ఏజెన్సీతోపాటు స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ వంటి కార్పొరేషన్లు ఈ రంగంలో ఇప్పటికే చాలా ముందుకెళ్లాయి. అంతరిక్ష పర్యటనా రంగంలో ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. అంతరిక్ష వాహక నౌకలను విమానాల్లాగే వినియోగించే స్థితి ఇంకా ఏర్పడలేదు. ఆ పరిస్థితే వస్తే ఉపగ్రహాలను పంపడానికవుతున్న వ్యయం మాత్రమే కాదు... అంతరిక్ష ప్రయాణం కూడా కారు చౌక అవుతుంది. అంతరిక్ష రంగంలో చేస్తున్న పరిశోధనలు, వాటి ఫలితాల విషయంలో అంతర్జాతీయంగా ఇస్రోకు మంచి పేరే ఉంది. ముఖ్యంగా అంగారక గ్రహంపైకి తొలి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహాన్ని పంపగలగడం ప్రపంచవ్యాప్తంగా ఉండే నిపుణులను చకితుల్ని చేసింది. కనుకనే ఇస్రో ఇప్పుడు నిర్వహించిన ఆర్ఎల్వీ-టీడీ ప్రయో గాన్ని అందరూ ఆసక్తితో పరిశీలించారు. అంతరిక్ష ప్రయోగాల్లో ముందుండటానికి ప్రపంచ దేశాలన్నీ పోటీ పడు తున్నాయి. ఇప్పటికే ఆ రంగంలో చాలా ముందుకెళ్లిన అగ్రరాజ్యాలు రెండూ అందుకు సంబంధించిన సాంకేతికతను ఇతర దేశాలకు దుర్లభం చేస్తున్నాయి. ఏ ప్రయోగాలైనా, వాటి ఫలితాలైనా ఐక్యరాజ్యసమితి కాంక్షించినట్టు శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగపడాలి. ఆ విషయంలో మన ఇస్రో కృషి ఎన్నదగినది. అంతరిక్ష రంగంలో వరస విజయాలను నమోదు చేసుకుంటూ దూసుకెళ్తున్న ఇస్రో... పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక విషయంలో సైతం చరిత్ర సృష్టించ గలదని ఆశిద్దాం. -
ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పునర్వినియోగానికి అనువైన ఆర్ఎల్వీ-టీడీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం 7గంటలకు షార్ నుంచి బయల్దేరిన రాకెట్ ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా నింగిలోకి 70 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి విజయవంతంగా భూమిని చేరింది. ఈ ప్రక్రియ మొత్తం 11 నిమిషాల్లోనే ముగిసింది. అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ రన్‌వేపై రాకెట్ దిగింది. దీంతో షార్‌లో అప్పటి వరకూ ఉత్కంఠతో ఎదురు చూసిన శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో వ్యోమగాములను రోదసీలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకురావడానికి వీలు పడుతుంది. భవిష్యత్తులో పూర్తి స్థాయి స్పేస్ షటిల్ రూపొందిస్తామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.