ఎన్నదగిన విజయం | editorial on RLV-TD experiment by ISRO | Sakshi
Sakshi News home page

ఎన్నదగిన విజయం

Published Tue, May 24 2016 1:35 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

ఎన్నదగిన విజయం - Sakshi

ఎన్నదగిన విజయం

కొన్ని విజయాలు చిన్నవే కావొచ్చుగానీ అవి ఇచ్చే ధీమా, భరోసా అసామాన్య మైనవి. సోమవారం శ్రీహరికోట నుంచి నిర్వహించిన ‘మేడిన్ ఇండియా’ పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక(ఆర్‌ఎల్‌వీ-టీడీ) ప్రయోగం ఇలాంటిదే. సాధారణంగా ఉపగ్రహాలను అంతరిక్షానికి మోసుకెళ్లే వాహకనౌకలు ఆ పని పూర్తయ్యాక అక్కడే మండిపోతాయి. ఆర్‌ఎల్‌వీ ఇందుకు భిన్నం. అది వెనక్కు సురక్షితంగా తిరిగొస్తుంది. మళ్లీ మళ్లీ ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది. సోమవారం ప్రయోగించిన ఆర్‌ఎల్‌వీ శాస్త్రవేత్తలు నిర్దేశించినట్టుగానే భూమికి 65 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి ధ్వని వేగానికి అయిదు రెట్ల వేగంతో భూమ్మీదకొచ్చి బంగాళాఖాతంలో పడింది. ఇదంతా 13 నిమిషాల్లో పూర్తయింది. 175 కిలోల బరువున్న ఆర్‌ఎల్‌వీ-టీడీ చోదన, నియంత్రణ వ్యవస్థల మార్గదర్శకాలకు అను గుణంగా సంతృప్తికరంగా పనిచేసిందని ఇస్రో ప్రకటించింది.

ఉపగ్రహాలను పంపడానికి ప్రస్తుతం ఇస్రో రెండు రకాల రాకెట్లు-పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ), జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ) వినియోగిస్తున్నది. ఇవి ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడటంవల్ల ఉపగ్రహాలు పంపదల్చిన ప్రతిసారి రాకెట్ల నిర్మాణం తప్పనిసరవుతుంది. ఇందువల్ల ఖర్చు తడిసిమోపెడు కావడంతోపాటు ప్రతిసారి ఎంతోమంది ఆ పనిలో నిమగ్నం కావలసి ఉంటుంది. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ నిర్మాణాల విషయంలో మన శాస్త్ర వేత్తలు సాధించిన విజయాలు అపూర్వమైనవి. ముఖ్యంగా జీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో వినియోగించే క్రయోజెనిక్ పరిజ్ఞానం ఎన్నో సంక్లిష్టతలతో, సవాళ్లతో కూడుకుని ఉన్నది. అంతర్జాతీయ ఆంక్షలు, వాటివల్ల ఏర్పడిన పరిమితుల మధ్యనే మన శాస్త్రవేత్తలు ఈ పరిజ్ఞానాన్ని సాధించారు. ఆ రంగంలో అగ్రరాజ్యాల గుత్తాధి పత్యాన్ని బద్దలు కొట్టారు.

అదే తోవలో ఇప్పుడు పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. నిజానికి దీన్ని పూర్తి అర్ధంలో ప్రయోగం అనడానికి లేదు. నమూనా ప్రయోగంగానే భావించాలి. ఎందుకంటే వాస్తవంగా వినియోగించాల్సిన ఆర్‌ఎల్‌వీతో పోలిస్తే ఇది చాలా చిన్నది. దాని సైజులో ఇది ఆరో వంతు మాత్రమే. పైగా అందులో అమర్చే పరికరాలుగానీ, సాంకేతికతలుగానీ ఇందులో పూర్తి స్థాయిలో ఉండవు. తిరిగొచ్చిన ఆర్‌ఎల్‌వీ ల్యాండింగ్ కావడానికి, దాన్ని సేకరించి మళ్లీ వినియోగించడానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికైతే లేవు. రేపన్న రోజున ఒక ఉపగ్రహాన్ని మోసుకెళ్లాల్సిన దూరంతో పోల్చినా ఇప్పుడు వెళ్లిన దూరం అతి స్వల్పమైనది. వాస్తవమైన ఆర్‌ఎల్‌వీ భూమికి 36,000 కిలోమీటర్ల దూరానికి మించి వెళ్తుంది. ఇప్పటి ప్రయోగంలో అది కేవలం 65 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈ ప్రయోగం ఇంకా బీజప్రాయంలో ఉన్న పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)ప్రాజెక్టు. అందువల్లే శాస్త్రవేత్తలు దీనికి ఆర్‌ఎల్‌వీ-(టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్) అని నామకరణం చేశారు. ఈ కృషి ఫలించి అసలైన ఆర్‌ఎల్‌వీ అందుబాటులోకి రావాలంటే కనీసం మరో పదేళ్లు పట్టవచ్చునని భావిస్తున్నారు.
 
పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌకకు సంబంధించిన సాంకేతికత అత్యంత సంక్లిష్టమైనది. అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి ఒక వాహక నౌక  సురక్షితంగా వెనక్కి రావడం, దాన్ని మళ్లీ మళ్లీ వినియోగించడానికి వీలుండటం అనేది బహుళ సాంకేతికతల సమ్మేళనం. ప్రస్తుతం అది అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలకు మాత్రమే అందుబాటులో ఉంది. చైనా,బ్రిటన్ తదితర దేశాలు ఇందుకు సంబంధించిన ప్రయోగాల్లో తలమునకలై ఉన్నాయి. 1972- 2011 మధ్య అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అయిదు అంతరిక్ష నౌకలు- కొలంబియా, ఛాలెంజర్, డిస్కవరీ, అట్లాంటిస్, ఎండీవర్‌లను రూపొందించింది. ఇవి ఇంతవరకూ 135 లక్ష్యాలను పూర్తిచేయగలిగాయి. అంతరిక్ష విజయాలను శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని 1967 అక్టోబర్ 10న ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ స్ఫూర్తికి విరుద్ధంగా అంతరిక్షంలో తిరుగాడే తన ప్రత్యర్థి దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసేందుకు అనువైన సాంకేతికతను పెంపొందించుకోవడానికి అమెరికా రహస్య ప్రయోగాలు నిర్వహిస్తున్నదన్న కథనాలు ఆరేళ్లక్రితం సంచలనం కలిగించాయి. అలాంటి పోకడలు అంతిమంగా మానవాళికే ముప్పు కలిగిస్తాయి.
 
అంతరిక్ష వాహక నౌక తిరిగొచ్చినప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే రాపిడి వల్ల భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు రాజుకుంటాయి. దాన్ని తట్టుకునే స్థాయిలో వాహక నౌక ఉండాలి. చౌకలో వాహక నౌక తయారీ, మెరుగైన నిర్మాణం, అందులో వినియోగించే రాకెట్లు వగైరాలు సవాళ్లతో కూడుకున్నవి. అందులో ఎవరి పరిశోధనలు వాళ్లు చేస్తున్నారు. యూరొపియన్ స్పేస్ ఏజెన్సీతోపాటు స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ వంటి కార్పొరేషన్లు ఈ రంగంలో ఇప్పటికే చాలా ముందుకెళ్లాయి. అంతరిక్ష పర్యటనా రంగంలో ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. అంతరిక్ష వాహక నౌకలను విమానాల్లాగే వినియోగించే స్థితి ఇంకా ఏర్పడలేదు. ఆ పరిస్థితే వస్తే ఉపగ్రహాలను పంపడానికవుతున్న వ్యయం మాత్రమే కాదు... అంతరిక్ష ప్రయాణం కూడా కారు చౌక అవుతుంది. అంతరిక్ష రంగంలో చేస్తున్న పరిశోధనలు, వాటి ఫలితాల విషయంలో అంతర్జాతీయంగా ఇస్రోకు మంచి పేరే ఉంది. ముఖ్యంగా అంగారక గ్రహంపైకి తొలి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహాన్ని పంపగలగడం ప్రపంచవ్యాప్తంగా ఉండే నిపుణులను చకితుల్ని చేసింది. కనుకనే ఇస్రో ఇప్పుడు నిర్వహించిన ఆర్‌ఎల్‌వీ-టీడీ ప్రయో గాన్ని అందరూ ఆసక్తితో పరిశీలించారు.
 
అంతరిక్ష ప్రయోగాల్లో ముందుండటానికి ప్రపంచ దేశాలన్నీ పోటీ పడు తున్నాయి. ఇప్పటికే ఆ రంగంలో చాలా ముందుకెళ్లిన అగ్రరాజ్యాలు రెండూ అందుకు సంబంధించిన సాంకేతికతను ఇతర దేశాలకు దుర్లభం చేస్తున్నాయి. ఏ ప్రయోగాలైనా, వాటి ఫలితాలైనా ఐక్యరాజ్యసమితి కాంక్షించినట్టు శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగపడాలి. ఆ విషయంలో మన ఇస్రో కృషి ఎన్నదగినది. అంతరిక్ష రంగంలో వరస విజయాలను నమోదు చేసుకుంటూ దూసుకెళ్తున్న ఇస్రో... పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక విషయంలో సైతం చరిత్ర సృష్టించ గలదని ఆశిద్దాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement