చందమామపై 60 ఏళ్లుగా సాగుతున్న పరిశోధనల పరంపరను కీలక మలుపు తిప్పే అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకుని మన శాస్త్రవేత్తలు దేశ కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేశారు. సోమవారంనాడు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లోనే సువర్ణాధ్యాయంగా ఆవిష్కరించదగ్గ ఘట్టం. పెను సవాళ్లు ఇమిడి ఉండే సంక్లిష్టమైన ప్రయోగాలు చేపట్టడంలో, వాటిని విజయతీరాలకు చేర్చడంలో ఇస్రో శాస్త్రవేత్తలకు ఎవరూ సాటిరారు. వారి పరిశోధనా ప్రస్థానంలో అపజయాలు, ఆశాభంగాలు అతి తక్కువ. ఇప్పుడు చంద్రయాన్–2 ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఆ ఒరవడిని కొనసాగించారు. ఈ ప్రాజెక్టుకు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించడం, మొత్తం ప్రాజెక్టులోనే 30 శాతంమంది మహిళలు పాలుపంచుకోవడం ఎన్నదగ్గది. చంద్రయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్య వనిత, మిషన్ డైరెక్టర్ రితూ కరిథాల్ ఈ ప్రాజెక్ట్‌ను తమ భుజస్కంధాలపై వేసుకుని శ్రమించిన తీరు అందరికీ ఆదర్శప్రాయమైనది.
చెప్పాలంటే మన శాస్త్రవేత్తలను అభినందించాల్సింది కేవలం సోమవారం సాధించిన ఘన విజయానికి మాత్రమే కాదు. వారం క్రితం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పెద్దలంతా చంద్రయాన్ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించడానికి ఎదురు చూస్తున్న వేళ... సరిగ్గా 56 నిమిషాల ముందు దాన్ని వాయిదా వేయాలని తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి సైతం వీరిని ప్రశంసించాలి. ఎందుకంటే అవి సంక్లిష్టమైన క్షణాలు. పెద్దలంతా కొలువుదీరిన వేళ అత్యంత కీలకమైన మూడో దశ సమయంలో పనిచేయాల్సిన క్రయోజనిక్ ఇంజిన్‌కు సాంకేతిక లోపం ఏర్పడిందని, గ్యాస్ బాటిల్ లీక్ అయిందని కనుగొనడం ఒక ఎత్తయితే... ఏమాత్రం ఊగిసలాట లేకుండా ప్రయోగాన్ని వాయిదా వేయాలనుకోవటం మరో ఎత్తు. నిజానికి ఈ పరిణామం జరగ్గానే కొందరు పెదవి విరిచారు. మళ్లీ ఎన్ని వారాలూ, ఎన్ని నెలలూ పడుతుందోనని నిట్టూర్చారు. కానీ అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ శాస్త్రవేత్తలంతా సత్వరం తమ కర్తవ్యాన్ని పూర్తిచేశారు. లోపం ఎందుకు జరిగిందో, ఎక్కడ జరిగిందో గుర్తించారు. వారం పూర్తయ్యేసరికి విజయం తమదేనని నిరూపించుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ నిన్న మొన్నటిది కాదు. దీని కోసం గత పదేళ్లుగా ఇస్రో శాస్త్ర వేత్తలు కఠోర శ్రమ చేస్తున్నారు. చంద్రయాన్–1 ద్వారా చంద్రుడిపై నీటిజాడ కనుక్కొన్న చరిత్ర వారిది. పైగా ఇస్రో ఇంతవరకూ చేసిన ప్రయోగాలన్నిటిలోనూ ఇది అత్యంత జటిలమైనది. ప్రతిదీ ఒకటికి పదిసార్లు చూసుకోవాలి. ఎక్కడ ఏమరుపాటుగా ఉన్నా ‘చిర దీక్షా శిక్షా తపస్సమీక్ష’ మొత్తం చెదిరిపోతుంది. మరిన్ని ఏళ్లు శ్రమపడవలసి వస్తుంది. వైజ్ఞానికంగా ఎంతో వెనకబడి పోయే ప్రమాదం ఉంటుంది.
ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల బృందం ఎంత ఒత్తిడికి లోనయి ఉంటుందో, ఏ స్థాయిలో ఆందోళన పడి ఉంటుందో వీటినిబట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇన్నిటిని తట్టుకుని ఒక అద్భుత విజయాన్ని అందించినందుకు వీరందరూ అభినందనీయులు. మొత్తం 6,400 కిలోల బరువైన జీఎస్‌ఎల్‌వీ మార్ 3–ఎం1లో చంద్రయాన్–2 ఉపగ్రహం బరువు 3,850 కిలోలు. ఇందులో 2.3 టన్నుల బరువున్న ఆర్బిటర్, 1.4 టన్నుల బరువున్న ల్యాండర్(విక్రమ్), 27 కిలోల బరువున్న రోవర్(ప్రజ్ఞాన్) ఉన్నాయి. ఈ ప్రజ్ఞాన్‌లో మన దేశ ఉపకరణాలతోపాటు అమెరికా, యూరప్‌లకు చెందిన నాలుగు ఉపకరణాలు కూడా ఉన్నాయి. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ అనుకున్నట్టుగా ఆర్బిటర్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇక అది 50 రోజులు ప్రయాణించి జాబిల్లిపైకి చేరాలి. ఆర్బిటర్ ఏడాదిపాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ దాని వెలుపలి వాతావరణ స్థితి గతులపై శాస్త్రవేత్తలకు విలువైన సమాచారాన్ని పంపుతుంటుంది. మరోపక్క అది చంద్రుడికి 150 కిలోమీటర్ల దూరంలో ఉందనగా దాన్నుంచి ల్యాండర్ ‘విక్రమ్’ వేరు పడి చంద్రుడి దిశగా ప్రయాణం మొదలుపెడుతుంది. సెప్టెంబర్ 6నాటికి –157 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉండే అతి శీతల దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగుతుంది. ఇది ఇంతవరకూ ఏ దేశమూ తలపెట్టని అరుదైన విన్యాసం. ‘విక్రమ్’ అలా చేరుకున్న కాసేపటికే దాన్నుంచి రోవర్ ‘ప్రజ్ఞాన్’ బయటికొస్తుంది. దాదాపు అరకిలోమీటర్ ప్రయాణించి చంద్రుడి ఉపరితలాన్ని, దాని లోపలి భాగాన్ని పరి శోధిస్తుంది. అనేక ప్రయోగాలు చేపడుతుంది.
ఈ ఫలితాలకు సంబంధించిన డేటా అంతా ఎప్పటిక ప్పుడు శాస్త్రవేత్తలకు చేరుస్తుంది. ఈ ప్రయోగాలన్నీ ఒక ‘చాంద్రదినం’(లూనార్ డే)లో ‘ప్రజ్ఞాన్’ ముగించాల్సి ఉంటుంది. ‘చాంద్రదినం’ అంటే మనకు 14 రోజులు!
ప్రాచీనకాలం నుంచీ చంద్రుడు మానవాళి జీవితంలో పెనవేసుకుపోయాడు. వినీలాకాశంలో వెన్నెలలు విరజిమ్ముతూ పరవశింపజేసే చందమామ బాల్యంలో అందరికీ నేస్తమే. కవుల ఊహల్లో, కావ్యకల్పనల్లో కథావస్తువు. ఇప్పటికీ అతిలోక సౌందర్యానికి ఉపమానం చెప్పాలంటే ఎవరికైనా ఊహల్లో మెదిలేది చందమామే.
1966లో అప్పటి సోవియెట్ యూనియన్ తొలిసారిగా మానవ రహిత ఉపగ్రహం ‘లూనా’ను ప్రయోగించినప్పటినుంచీ శాస్త్రవేత్తలకు సైతం చంద్రుడు దగ్గర చుట్టమయ్యాడు. 1969లో అమెరికా ఇద్దరు వ్యోమగాములతో అపోలో అంతరిక్ష నౌకను అక్కడికి పంపింది. నిజానికి వెన్నెలరాజు మానవాళి తొలి లక్ష్యం మాత్రమే. గగనాంతర రోదసిలో మును ముందుకు దూసుకుపోవడానికి చందమామ తొలి మెట్టు మాత్రమే. అక్కడికి చేరడం సులభమైతే అంతకన్నా కష్టతరమైన అరుణగ్రహం చేరడం మానవాళి మలి లక్ష్యమవుతుంది. మొత్తంగా సౌర వ్యవస్థపై మన చూపును నిశితం చేసేందుకు దోహదపడే ప్రయోగాల పరంపరలో చంద్రయాన్–2 ఒక మైలురాయి. కనుకనే ఇంతటి అరుదైన ఘన విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు హాట్సాఫ్ చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment