
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మరో ఘనత సాధించింది. మిషన్‌లో భాగమైన ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్లు విజయవంతంగా ప్రయాణించించినట్లు ఇస్రో శనివారం వెల్లడించింది. మరోవైపు చంద్రయాన్-3 మిషన్ చివరి దశకు చేరింది. చంద్రునిపై సూర్యకాంతి క్షీణిస్తుండటం వల్ల విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ రెండింటినీ స్లీప్ మోడ్‌లో ఉంచడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ తరుణంలో చంద్రయాన్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం
కాగా ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్-3కి చెందిన అన్ని పరికరాలు సవ్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.. ల్యాండర్, రోవర్‌లు ఇంకా ఫంక్షన్ చేస్తున్నాయన్నారు. రోవర్ పంపిన డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. మరో ఒకటి రెండు రోజుల్లో రోవర్, ల్యాండర్లను స్లీపింగ్ మోడ్‌లోకి తీసుకువెళ్లనున్నట్లు సోమనాథ్ చెప్పారు.
చదవండి: ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం.. అభినందనల వెల్లువ
Chandrayaan-3 Mission:
🏏Pragyan 100*
Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ
— ISRO (@isro) September 2, 2023
చంద్రయాన్ మిషన్ గురించి..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ ఆగస్టు 23న జాబిల్లిపై అడుగుపెట్టింది. జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి విక్రమ్ ల్యాండర్‌ను చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది.
4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రగ్యాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది.