అంతరిక్షంలో ‘స్వదేశీ’యానం
స్వదేశీ స్పేస్ షటిల్ నమూనా ప్రయోగం దిగ్విజయం
ఆర్ఎల్వీ-టీడీని షార్ నుంచి విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : అంతరిక్ష యాత్రలో భారత్ మరో ముందడుగు వేసింది. తొలి ‘స్వదేశీ’ అంతరిక్షనౌకను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. రెక్కలతో కూడిన పునర్వినియోగించగల వాహక నౌక (ఆర్ఎల్వీ-టీడీ) ను నింగికి పంపి తిరిగి తీసుకువచ్చే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసింది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం మరింత సులభంగా, చౌకగా మారేందుకు దోహదం చేయగల ఈ కీలకమైన ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా నిలిచింది.
అంతరిక్షనౌక తయారీలో భాగంగా చేపట్టిన ప్రయోగాల తొలి అంకంలో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ - టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ - టీడీ)ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఈ మానవ రహిత నమూనా వ్యోమనౌక ప్రయోగానికి ఆదివారం అర్థరాత్రి దాటాక ఒంటి గంటకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. సరిగ్గా సోమవారం ఉదయం 7 గంటలకు షార్ మొదటి ప్రయోగవేదిక నుంచి ప్రత్యేక రాకెట్ బూస్టర్ మీద అమర్చిన అంతరిక్షనౌకను నింగిలోకి పంపించారు. రాకెట్ బూస్టర్ 65 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకు వెళ్లి అక్కడ నౌకను విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఈ నౌక ధ్వని వేగం కన్నా ఐదు రెట్ల వేగంతో భూ వాతావరణంలోకి తిరిగి రావటం మొదలుపెట్టింది. నౌకలోని నావిగేషన్, మార్గదర్శనం, నియంత్రణ వ్యవస్థ ద్వారా దానిని ఖచ్చితంగా నడుపుతూ కిందికి దించారు. భూ వాతావరణంలోకి ప్రవేశించేటపుడు ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలను ఈ నౌక థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా విజయవంతంగా తట్టుకుంది.
అనంతరం.. బంగాళాఖాతంలో ముందే నిర్ణయించిన ఊహాజనిత రన్‌వేపైకి విజయవంతంగా దించారు. దీనిని నేలపై దించటానికి పెద్ద రన్‌వే అవసరం. కానీ షార్‌లో ఆ సౌకర్యం లేకపోవడంతో.. శ్రీహరికోటకు 450 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై విజయవంతంగా దిగటంతో ఈ ప్రయోగపు లక్ష్యం నెరవేరింది. అయితే.. ఈ వ్యోమనౌకను నీటిలో తేలే విధంగా రూపొందించకపోవటంతో అది సముద్రతలాన్ని తాకగానే ముక్కలైంది. కాబట్టి దానిని తిరిగి తీసుకురాలేదు. శ్రీహరికోటతో పాటు.. సముద్రం మీద ఒక ఓడలో ఏర్పాటు చేసిన టెర్మినల్ నుంచి ఈ అంతరిక్ష నౌక గమనాన్ని ఆద్యంతం పరిశీలిస్తూ నియంత్రించారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ విభాగాలు.. సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించాయి. ఇది నింగిలోకి వెళ్లి తిరిగి నేలకు దిగటానికి పట్టిన మొత్తం ప్రయాణ సమయం 770 సెకన్లు. అంటే 12.50 నిమిషాల్లోనే ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయోగం ద్వారా.. ఆర్ఎల్వీ-టీడీ స్వీయ నియంత్రిత మార్గ ప్రయాణం, మార్గదర్శనం, నియంత్రణ, పునర్వినియోగించగల థర్మల్ రక్షణ వ్యవస్థ, పునఃప్రవేశ కార్యక్రమ నిర్వహణ వంటి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలను విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.
ఖర్చు తగ్గించేందుకు అనేక ఉపాయాలు...
ఆర్ఎల్వీ ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు పదిరెట్ల వరకూ తగ్గుతుందని అంచనా. ఇంకా ఖర్చు తగ్గించే దిశగా ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రస్తుతం 2.2 టన్నుల ఉపగ్రహాలను ప్రయోగించేందు కు అవకాశముండగా.. ఈ సామర్థ్యాన్ని 3.5 టన్నులకు పెంచడం ర్వారా ఒక్కో కిలోగ్రాము బరువును అంతరిక్షంలోకి పంపేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఇదే రాకెట్ ఆధునిక రూపం మార్క్-2 సామర్థ్యాన్ని కూడా నాలుగు టన్నుల నుంచి 7.5 టన్నులకు పెంచే ప్రయత్నాల్లో ఉంది. దీంతోపాటు వీటిలో ఉపయోగించే వికాస్ బూస్టర్లలో సెమీక్రయోజెనిక్ ఇంజన్లను (ఆర్ఎల్వీ-టీడీలో ఉపయోగించారు) వాడటం ద్వారా వాటి బరువును తగ్గించవచ్చునని, తద్వారా మొత్తం వాహక నౌక తయారీకయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని అంచనా.
పూర్తిస్థాయి తయారీకి మరో పదేళ్లు...
అమెరికాకు చెందిన నాసా 2011లో స్పేస్ షటిల్ కార్యక్రమాన్ని నిలిపివేసిన తర్వాత.. అంతరిక్ష కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపించేందుకు పునర్వినియోగించగల స్పేస్ షటిల్ తయారీ పోటీలోకి భారత్ కూడా ప్రవేశించింది. ఉపగ్రహాలను భూమి చుట్టూ అంతరిక్ష కక్ష్యలోకి చేర్చి మళ్లీ భూమికి తిరిగి రాగల అంతరిక్షనౌకను అభివృద్ధి చేయటం ద్వారా.. ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు అయ్యే ఖర్చును పదింతలు తగ్గించటం లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. అటువంటి పునర్వినియోగించగల రాకెట్‌ను అభివృద్ధి చేయటంలో ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం చాలా ప్రాథమిక దశ.
అమెరికా అంతరిక్షనౌకను పోలివున్న ఈ ఆర్ఎల్వీ-టీడీ నిడివి 6.5 మీటర్లు. ఇది వాస్తవంగా తయారు చేయదలచుకున్న అంతిరక్ష నౌక నిడివిలో ఆరో వంతు మాత్రమే. దీని బరువు 1.75 టన్నులు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 95 కోట్లు వ్యయం చేసింది. పూర్తిస్థాయిలో తుది రాకెట్‌ను రూపొందించటానికి ముందు ఈ తరహా ప్రయోగాలు రెండు, మూడు నిర్వహించాల్సి ఉంటుందని.. తుది స్పేస్ షటిల్‌ను సిద్ధం చేయటానికి 10-15 ఏళ్ల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కొత్త సాంకేతికతల ఆవిష్కరణ...
ద్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల వ్యోమనౌకను ఇస్రో అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు అనేక కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించారు. బూస్టర్ రాకెట్లో వాడిన ఇంధనం నెమ్మదిగా మండేలా చేయడం వీటిలో ఒకటి. వ్యోమనౌకలో వాడిన సిలికా టైల్స్ వాటర్ ప్రూఫింగ్ కోసం ప్రత్యేకమైన రసాయనాన్ని అభివృద్ధి చేశారు. ఆర్ఎల్వీ-టీడీ ముందు భాగంలోని శంఖు ఆకారపు నిర్మాణాన్ని కార్బన్- కార్బన్ మిశ్రధాతువుతో తయారు చేశారు. భారీ సైజున్న విమానం తనంతట తానే ల్యాండ్ అయ్యేలా చేయడం కూడా ఇస్రో సాధించిన ఘనతల్లో ఒకటిగా చెప్పవచ్చు.
తొలిదశ రాకెట్ల పునర్ వినియోగం
ఆర్ఎల్వీ-టీడీ వ్యోమనౌక 65 కిలోమీటర్ల ఎత్తుకు రెండు దశల్లో చేరింది. తొలి దశలో ఉపయోగించిన రాకెట్.. మధ్యలోనే ఆర్ఎల్వీ-టీడీ నుంచి విడిపోయి బంగాళాఖాతంలో పడిపోయింది. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీల్లోనూ తొలి దశ రాకెట్ భాగాలు ఇలాగే వృథా అవుతుంటాయి. వీటిని కూడా మళ్లీమళ్లీ వాడుకునేలా చేయగలిగితే ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. జీఎస్ఎల్వీ మార్క్- 3 తొలి దశ, దానికి తోడుగా ఉండే నాలుగు స్ట్రాప్ ఆన్ బూస్టర్ల ఖర్చు మొత్తం ప్రాజెక్టు ఖర్చులో మూడొంతుల వరకూ ఉంటుందని అంచనా. తొలి దశ రాకెట్ విడిపోయిన తరువాత అది అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.
కీలక టెక్నాలజీలు సక్సెస్
‘‘ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతం కావడాన్ని పునర్వినియోగించగల వ్యోమనౌకల తయారీ దిశగా ఇస్రో వేసిన తొలి అడుగుగా చూడాలి. అంతరిక్ష రంగంలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపయోగపడే ఈ వ్యోమనౌక తయారీలో ఇంకా అనేక మజిలీలు ఉన్నాయి. నావిగేషన్ మొదలుకొని, భూమి పైకి తిరిగి రావటం, ప్యారాచ్యూట్ తదితర ఇతర టెక్నాలజీలన్నీ తొలి ప్రయోగంలోనే విజయవంతం కావడం మనకు గర్వకారణం. ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం ద్వారా లభించిన సమాచారంతో ఉన్న చిన్నపాటి లోటుపాట్లను కూడా సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ఇస్రో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తారనడంలో సందేహం లేదు. - జి.సతీశ్‌రెడ్డి (రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, డెరైక్టర్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్, హైదరాబాద్)