16 ఏళ్ల తర్వాత బదులిచ్చింది..!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు 36 ఏళ్ల క్రితం.. 1978లో రోదసికి పంపిన వ్యోమనౌక ఇది. పేరు ‘ఇంటర్నేషనల్ సన్-ఎర్త్ ఎక్స్‌ప్లోరర్(ఐసీ)-3’. భూమి అయస్కాంత క్షేత్రంపై సౌరగాలుల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు దీనిని రోదసికి పంపారు. సూర్యుడిపై అధ్యయనం తర్వాత దీనిని హేలీ తోకచుక్కపై పరిశోధనకు మళ్లించారు. 1985లో హేలీ తోకచుక్క తోకభాగం గుండా ప్రయాణించిన ఈ వ్యోమనౌక అందులోని మంచు, ప్లాస్మా కణాలు, ఇతర పదార్థాలకు సంబంధించిన కీలక వివరాలను భూమికి పంపింది.
చివరగా 1997 మే 5న దీనితో సంబంధాలు నిలిచిపోయాయి. అయితే 16 ఏళ్ల క్రితం తెరమరుగైన ఐసీ-3తో తాజాగా ఓ ప్రైవేటు పరిశోధకుల బృందం తిరిగి సంబంధాలను పునరుద్ధరించింది. ‘ఐసీ-3 రీబూట్ ప్రాజెక్టు’ పేరుతో పరిశోధనలు చేపట్టిన స్పేస్ కాలేజీ, స్కైకార్ప్, స్పేస్‌రెఫ్ అనే సంస్థల నేతృత్వంలోని ప్రైవేటు బృందం ప్యూర్టారికోలోని ఆరెసిబో రేడియో అబ్జర్వేటరీ నుంచి సంకేతాలు పంపి, తిరిగి దీని నుంచి సంకేతాలను అందుకోగలిగారు. ప్రస్తుతం దీనిలోని ఇంజిన్లను మండించి, భూమికి సమీపంలోని కక్ష్యలోకి తీసుకురావాలని, తర్వాత మరో సౌర అధ్యయనానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.