European Space Agency
-
అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణ కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సైన్స్ బోధించేది వేరు. సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం ‘కృత్రిమ రావుకేతువుల’ సాయంతో కోరుకున్నప్పుడల్లా కృత్రిమ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో ఉన్నారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో జంట ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్‌బోర్డ్ అటానమీ3 (ప్రోబా3). ఇందులో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. కక్ష్యలో పరస్పరం దగ్గరగా మోహరించే ఈ శాటిలైట్లు... లేజర్లు, కాంతి సెన్సర్లతో అనుసంధానమై ఉంటాయి. రెండో ఉపగ్రహం నుంచి చూస్తే సూర్యుడు కనబడకుండా ఉండేలా మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ తరహా కృత్రిమ సూర్యగ్రహణాలు అక్కరకొస్తాయని పరిశోధకులు అంటున్నారు. విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యుడు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఈ ప్రయోగం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, మన సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో ఉండే గ్రహాల (ఎక్సో ప్లానెట్స్)కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అద్యయనాలకు ‘ప్రోబా3’ మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఉపగ్రహాలు... ఒకే ఉపగ్రహంగా! ‘ప్రోబా3’ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ‘ప్రోబా3’లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచ్చితత్వంతో రెండు ఉపగ్రహాలను అతి దగ్గరగా కలిపి ఉంచేలా (లాక్ చేసేందుకు) కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనప్పటికీ... 144 మీటర్ల పొడవుండే ఏకైక అబ్జర్వేటరీ మాదిరిగా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ‘ప్రోబా3’ అనేది రెండేళ్ళు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇందులో సౌరగోళం ఆకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం నిర్వహించే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. తన పక్కనే ఉండే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహానికి సూర్యబింబం తాత్కాలికంగా కనిపించకుండా ‘అకల్టర్’ ఉపగ్రహం అడ్డుపడుతుంది. అలా ‘అకల్టర్’ ఉపగ్రహం ఏర్పరచిన ఛాయలో ఉంటూ ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం సూర్యుడి కరోనాను నిశితంగా పరిశీలిస్తుంది. ఉభయ ఉపగ్రహాలు భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు ‘అకల్టర్’ ఉపగ్రహం తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా సదరు డిస్క్ లాంటి పరికరం సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తుంది. అంటే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహంలోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. ‘అకల్టర్’లో లేజర్, విజువల్ మెట్రాలజీ ఆప్టికల్ హెడ్స్, ‘కరోనాగ్రాఫ్’లో షాడో పొజిషన్ సెన్సర్లు ఉంటాయి. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుందని ఈఎస్ఏ ‘ప్రోబా3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వెల్లడించారు. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. దురదృష్టవశాత్తూ సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున ప్రతి రెండేళ్ళకోసారి మాత్రమే సంభవిస్తాయని, వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని గలీనో వివరించారు. అంత కష్టపడినా చివరికి ఫలితం వాతావరణం దయపై ఆధారపడివుంటుందని, వాతావరణం అనుకూలించకుంటే ఆ ప్రయత్నాలన్నీ వృథాయేనని చెప్పారు. అంతగా ప్రయాసపడినా ఏవో కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని గలీనో తెలిపారు. సవివర పరిశోధనలకు ఆ అతి స్వల్ప సమయం సరిపోదన్నారు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారని, అయితే అంతర కరోనాను ఆ ప్రయోగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయలేవని తెలిపారు. సూర్యుడి ఉపరితలంపై 6 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కాగా కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇది వైరుద్ధ్యభరిత అంశమని ‘ప్రోబా3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ అన్నారు. నిజానికి సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలని, కానీ కరోనా విషయంలో అలా జరగదని, అందుకే శాస్త్రవేత్తలు సూర్యుడి అంతర కరోనాను అధ్యయనం చేసేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తారని చెప్పారు. సూర్యుడి ఉపరితలం కంటే సూర్యుడికి బాహ్య పొర అయిన కరోనా ఎందుకు ఎక్కువ వేడిమితో ఉందో తెలుసుకునేందుకు అంతర కరోనాను తాము దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తామని, కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ‘ప్రోబా3’ అందిస్తుందని ఫ్రాన్సిస్కో డీగో చెప్పారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో అంతరిక్షంలోకి సూర్యుడు భారీ స్థాయిలో ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూమి ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతోపాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. ఈ అంశాలపై ‘ప్రోబా3’ అవగాహనను పెంచుతుందని, సౌర భౌతికశాస్త్రాన్ని అది పంపే ఫలితాలు సమూలంగా మార్చివేస్తాయని భావిస్తున్నారు. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహాన్ని బెల్జియం కేంద్రంగా ఉన్న లీగ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని 15 కంపెనీలు, పలు సంస్థల కన్సార్టియం ఈఎస్ఏ కోసం అభివృద్ధి చేసింది. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా3’ జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదికగా జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సివుంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగాసి’ రాకెట్ కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ఈఎస్ఏ, ఇస్రో ఈ ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సివుంది.జమ్ముల శ్రీకాంత్ -
సముద్రం సాక్షిగా... మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్
మౌనంగా కనిపించే సముద్రం ఒక మహా విద్యాలయం. అక్కడ ప్రతి కెరటం ఒక పాఠం నేర్పుతుంది. ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న క్రమంలో దేవ్లీనా భట్టాచార్జీ మత్స్యకారుల జీవితాలను దగ్గరి నుంచి చూసింది. సముద్రం సాక్షిగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్ గురించి ఆలోచించింది. ‘న్యూమర్8’ రూపంలో ఆమె కల సాకారం అయింది... యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్ఎ)లో ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా పనిచేస్తున్నప్పుడు దేవ్లీనా భట్టాచార్జీకి మత్య్సకారుల జీవన విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మత్స్యకారుల సంక్షేమం కోసం డాటాసైన్స్ను ఎలా ఉపయోగించవచ్చు... అనే కోణంలో మేధోమథనం చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అది ‘న్యూమర్8’ పేరుతో స్టార్టప్‌కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. వాతావరణ సూచనల నుంచి మార్కెట్ సూచనల వరకు ఎన్నోరకాలుగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్ ఇది. బెంగళూర్ యూనివర్శిటీలో ఎంసీఏ చేసినా లీనాకు రకరకాల సమస్యలకు సంబంధించి సృజనాత్మక పరిష్కారాల గురించి ఆలోచించడం అంటే ఇష్టం. ఎవరి సహాయం లేకుండానే తన పొదుపు మొత్తాలతో ‘న్యూమర్ 8’ను మొదలుపెట్టింది. డాటా సైంటిస్ట్‌లు, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జిఐఎస్) నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిభావంతురాలైన నందిని కార్తికేయన్‌ను సీటీవోగా నియమించింది. సీయీవోగా లీనా స్టార్టప్‌కు సంబంధించిన రోజువారి వ్యాపారవ్యవహారాలను పర్యవేక్షిస్తే, సీటీవోగా నందిని సాంకేతిక విషయాల బాధ్యతలను చూస్తుంది. ‘న్యూమర్ 8’లోని ‘వోఫిష్’ యాప్‌లో అడ్వైజరీ, మార్కెట్ లింకేజి, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ విషయాలలో మత్స్యకారులకు ఉపయోగపడే ఫీచర్లు ఉన్నాయి. ‘వోఫిష్’ శాటిలైట్ ఇమేజ్ డాటా ఎనాలసిస్ అనేది మత్య్సకారులకు చేపల వేటలో ఉపయోగపడుతుంది. వేటకు ఎక్కువ సమయం తీసుకోకపోవడమే కాదు, ఇంధనాన్ని పొదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. ‘వోఫిష్’లోని మార్కెట్ లింకేజ్ ఫీచర్‌తో మత్స్యకారులకు అవసరమైన వలలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల ఏర్పాటుకు వీలవుతుంది. దీంతోపాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మత్స్యకారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముకోవచ్చు. ‘న్యూమర్8’ తాజాగా సముద్రపు నాచుపై దృష్టి పెట్టింది. ఔషధ, ఆహార, రసాయనిక పరిశ్రమలలో ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నాచుకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్రలోని ‘మహిళా ఆర్థిక్ వికాస్ మహామండల్’ అనే స్వచ్ఛందసంస్థ భాగస్వామ్యంతో మత్య్సకారుల కుటుంబాలకు చెందిన మహిళలకు సముద్రపు నాచు ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పించే ప్రణాళికను న్యూమర్ 8 సిద్ధం చేసింది. చదవండి: Expiry Date: ఎక్స్పైరీ డేట్ ఎందుకు? ఆ తర్వాత వాడితే ఏమవుతుందో తెలుసా! -
నింగిలోకి సోలార్ ఆర్బిటర్
వాషింగ్టన్: అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా సూర్యుడి ధృవాల చిత్రాలను మనకు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లు సంయుక్తంగా తయారు చేసిన సోలార్ ఆర్బిటర్ అంతరిక్ష నౌక సోమవారం నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు రూ.10 వేల కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ అంతరిక్ష నౌకను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అలియన్స్ అట్లాస్–వీ రాకెట్ సాయంతో నింగిలోకి పంపినట్లు నాసా తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైన సంకేతాలు జర్మనీలోని యురోపియన్ స్పేస్ సెంటర్‌కు అంతరిక్ష నౌక నుంచి వచ్చినట్లు నాసా తెలిపింది. ప్రయోగించిన రెండు రోజుల తర్వాత ఈ సోలార్ ఆర్బిటార్ భూమి మీదకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగపడే పరికరాలైన ‘బూమ్’, పలు ఆంటెన్నాలను అంతరిక్షంలో విచ్చుకుంటాయి. సూర్యుడి ఫొటోలను తీసేందుకు ఈ ఆర్బిటార్ బుధగ్రహం కక్ష్యలో తిరగనుంది. బుధగ్రహం చుట్టూ తిరుగుతూ ఇప్పటివరకు మానవుడు కనిపెట్టని సూర్యుడి ధృవాల చిత్రాలను తీయనుంది. -
జాబిల్లి మట్టి నుంచి ఆక్సిజన్!
ఈవాళో.. రేపో జాబిల్లిపై మకాం పెట్టే మనకు అక్కడ పీల్చేందుకు ఆక్సిజన్ కావాలి కదా? అందుకే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు అక్కడి మట్టి నుంచి స్వచ్ఛమైన ప్రాణవాయువును తయారు చేసేందుకు ఓ పద్ధతిని ఆవిష్కరించారు. చందమామపైని మట్టిని లూనార్ రెగోలిత్ అని పిలుస్తారు. అప్పుడెప్పుడో యాభై ఏళ్ల క్రితం మన సహజ ఉపగ్రహంపై వాలిన అపోలో రాకెట్ ద్వారా కొంత రెగోలిత్‌ను భూమ్మీదకు తెచ్చుకున్నారు. దీని సాయంతో విస్తతంగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు అందులో 40 45 శాతం వరకూ ఆక్సిజనే ఉందని తెలిసింది. ఇంకేముంది తీసేసుకుందామని ప్రయత్నాలైతే చేశారుగానీ.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తల వంతు వచ్చే వరకూ అస్సలు సాధ్యపడలేదు. ఇందుకోసం కరిగించిన ఉప్పుతో ఆక్సిజన్‌ను వేరుచేయడమన్న పద్ధతిని ఉపయోగించారు. ఇంకోలా చెప్పాలంటే లూనార్ రెగోలిత్‌ను కాల్షియం క్లోరైడ్ (ఒక రకమైన లవణం)ను కలిపి 950 డిగ్రీ సెల్సియస్ వరకూ వేడి చేయడంతో ఈ పద్ధతి పని చేస్తుంది. అత్యధిక వేడిమి వద్ద కొంత కరెంటు షాక్ ఇవ్వడం వల్ల అప్పటివరకూ ఘనంగా ఉన్న పదార్థం కాస్తా కరిగిపోతుందని, ఈ క్రమంలో అందులోని ఆక్సిజన్ వేరుపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరికరాలతో భవిష్యత్తులో వ్యోమగాములకు అవసరమైన ఆక్సిజన్‌ను అక్కడికక్కడే తయారు చేసుకోవచ్చునని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త అలెగ్జాండ్రీ మెరుస్సీ తెలిపారు. -
ఆచూకీ లేని యూరప్ మార్స్ ల్యాండర్
పారిస్: అంగారక గ్రహంపైకి యూరప్ పంపిన మార్స్ ల్యాండర్ మిస్సయ్యింది. మార్స్ ల్యాండర్ షాపరెల్లి బుధవారం అంగారకునిపై దిగాల్సి ఉంది. కానీ ఆ గ్రహంపైకి దిగే కొన్ని క్షణాల ముందు మార్స్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీనిపై యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నట్లు పేర్కొంది. ప్యారాచూట్ ముందుగానే తొలగిపోవడం వల్ల ల్యాండర్ పడిపోయి ఉండొచ్చని గ్రౌండ్ కంట్రోలర్లు చెప్పారు. దీని వల్ల ల్యాండర్ స్విచ్ ఆఫ్ అయ్యి సంకేతాలు నిలిచిపోయి ఉండొచ్చన్నారు. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంకా నిర్ధారించలేదు. షాపరెల్లి ల్యాండింగ్‌కి సంబంధించి తమ వద్ద కచ్చితమైన సమాచారం లేదని వెల్లడించింది. ఒకవేళ దీని ఆచూకీని గుర్తించలేకపోతే స్పేస్ ఏజెన్సీ వరసగా రెండోసారి విఫలమైనట్లవుతుంది. -
ఫీలే.. నిద్ర లేచింది!
తోకచుక్కపై మేలుకొన్న ఫీలే ల్యాండర్ పారిస్: భూమికి కోట్ల కి.మీ. దూరంలో వేగంగా దూసుకుపోతున్న ఓ తోకచుక్కపై దిగి, చీకట్లో పడిపోయి, మూగబోయిన ఫీలే ల్యాండర్ ఎట్టకేలకు మేలుకొంది! ఏడు నెలల తర్వాత శనివారం ‘హెలో.. ఎర్త్’ అంటూ భూమికి సందేశం పంపింది. ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) పదేళ్ల క్రితం ప్రయోగించిన రోసెట్టా వ్యోమనౌక గతేడాది నవంబర్‌లో ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను చేరడం, అదే నెల 12న ఫీలే అనే ల్యాండర్‌ను ఆ తోకచుక్కపైకి జారవిడిచి చరిత్ర సృష్టించడం తెలిసిందే. అయితే, తోకచుక్కపై పడిన ల్యాండర్ మూడు సార్లు ఎగిరి పడటంతో సూర్యరశ్మి సోకని చోట చీకట్లో ల్యాండ్ అయింది. దీంతో బ్యాటరీ అయిపోయేదాకా 60 గంటలు మాత్రమే పనిచేసి ఆ తోకచుక్కకు చెందిన సమాచారాన్ని ఫీలే భూమికి పంపింది. తోకచుక్క ప్రస్తుతం సూర్యుడి వైపుగా దూసుకుపోతుండటంతో ఫీలే ఉన్న చోట సూర్యరశ్మి పడుతోందని, దీంతో స్వల్పంగా రీచార్జ్ అయిన ఫీలే భూమికి రెండు నిమిషాలు సంకేతాలు పంపిందని, 40 సెకన్ల సమాచారం అందిందని ఆదివారం ఈసా వెల్లడించింది. తోకచుక్క చుట్టూ తిరుగుతున్న రోసెట్టా ద్వారా సంకేతాలను పంపుతూ ఫీలేను నిద్రలేపేందుకు శాస్త్రవేత్తలు మే నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్ముందు ఫీలేపై మరింత వెలుతురు పడి, బాగా పనిచేస్తుందని, మరికొన్ని ప్రయోగాలు చేసి సమాచారం పంపుతుందని భావిస్తున్నారు. ఇవీ విశేషాలు... 8 మంచు, ధూళి, వాయువులతో కూడి ఉండే తోకచుక్కలు సౌరకుటుంబం ఏర్పడిన తొలినాళ్లలో మిగిలిపోయిన పదార్థంతో ఏర్పడ్డాయని అంచనా. ఈ తోకచుక్కపై అధ్యయనం ద్వారా తోకచుక్కలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయన్నది తెలుసుకునేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. 8 67పీ తోకచుక్క ప్రస్తుతం భూమికి 30 కోట్ల కి.మీ. దూరంలో, సెకనుకు 31.24 కి.మీ. వేగంతో సూర్యుడి వైపు వెళుతోంది. 8 ఆగస్టు 13 నాటికి సూర్యుడికి అతి సమీపంలోకి చేరి, తిరిగి దూరం వెళ్లడం మొదలుపెడుతుంది. 8 రోసెట్టా, ఫీలే కలిసి 690 కోట్ల కి.మీ. దూరం ప్రయాణించి తోకచుక్కను చేరాయి. 8 ఫీలే బరువు భూమిపై 100 కిలోలు. తోకచుక్కపై గురుత్వాకర్షణ చాలా తక్కువ కాబట్టి.. అక్కడ ఒక కిలోనే! 8 67పీ తోకచుక్క 4. కి.మీ. వెడల్పు, 5 కి.మీ. పొడవు, బరువు 1000 కోట్ల టన్నులు ఉంటుంది. 8 రోసెట్టా జీవితకాలం 12 ఏళ్లు కాగా, ఈ ఏడాది డిసెంబర్ దాకా పనిచేయనుంది. -
ఎక్కడికైనా నాలుగు గంటల్లోనే...
భూమిపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యానికి చేర్చేసే ‘ల్యాప్క్యాట్ ఏ2’ అనే అంతరిక్ష విమానమిది. బ్రిటన్ కంపెనీ ‘రియాక్షన్ ఇంజన్స్’ సాయంతో ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) దీనిని అభివృద్ధిపరుస్తోంది. ‘సబేర్’ అనే రాకెట్ ఇంజన్‌తో నడిచే ఈ విమానం ధ్వని కంటే ఏకంగా ఐదు రెట్లు అంటే.. గంటకు 5,632 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందట. ఒకేసారి 300 మంది ప్రయాణికులతో 15 నిమిషాల్లోనే ఇది అంతరిక్షానికి చేరుకుంటుంది. గమ్యస్థానం చేరువయ్యాక తిరిగి వాతావరణంలోకి ప్రవేశించి భూమి మీదికి దిగిపోతుంది. ఈ విమానం అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం విమానాలు నడిపేందుకు అయ్యే ఖర్చులో 95% వరకూ ఆదా అవుతుందట. 2019లో దీనిని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సబేర్ ఇంజన్‌తో రూపొందిస్తున్న ‘స్కైలాన్’ అనే అంతరిక్ష విమానాన్ని కూడా ఈసా అభివృద్ధిపరుస్తోంది. ఆ విమానం ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లి నేరుగా కక్ష్యలో వదిలిపెట్టి వస్తుందట! -
చంద్రుడిపై ‘త్రీడీ’ ఇల్లు...
3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో చంద్రుడిపై మానవ స్థావరాల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై పరిశోధిస్తున్న ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) పలు డిజైన్లను రూపొందించింది. చంద్రుడి మట్టిని ఉపయోగించి త్రీడీ ప్రింటింగ్ ద్వారా ఇటుకలు తయారు చేయడం, వాటితో స్థావరాలను నిర్మించడంపై ప్రయత్నిస్తున్న ఈసా ఈమేరకు తాజాగా చంద్రుడి మట్టిని పోలిన మట్టితో ఇటుకలను తయారు చేసింది. అంతరిక్షం నుంచి వచ్చే రేడియేషన్, ఉల్కాపాతం నుంచి రక్షణ కల్పించేలా ఈ ఇటుకలతో గోడలను నిర్మించవచ్చని ఈసా వెల్లడించింది. -
దారి తప్పిన ఉపగ్రహాలు!
పారిస్: ప్రపంచ ఉపగ్రహ దిశానిర్దేశ వ్యవస్థ(గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్) ఏర్పాటు కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ శుక్రవారం ప్రయోగించిన రెండు గెలీలియో ఉపగ్రహాలు సరైన ఎత్తుకు చేరడంలో విఫలమయ్యాయి. ఉపగ్రహాలు రెండూ నియంత్రణలోనే ఉన్నా.. వాటిని నిర్దేశిత ఎత్తులోని కక్ష్యలోకి చేర్చడం కష్టంగా మారిందని రష్యన్ సోయజ్ రాకెట్ ద్వారా వాటిని ప్రయోగించిన ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్‌స్పేస్ తెలిపింది. ఉపగ్రహాలు తక్కువ ఎత్తులోకి చేరినందున సమస్య పరిష్కార మార్గాల గురించి అధ్యయనం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, గెలీలియో అనేది.. యూరోపియన్ యూనియన్ సొంత గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ. అమెరికా, రష్యాలకు చెందిన జీపీఎస్, గ్లోనాస్ నావిగేషన్ వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా, వాటితో కలసి కూడా పనిచేయడం దీని ప్రత్యేకత. పూర్తిస్థాయి గెలీలియో నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.43 వేల కోట్ల వ్యయంతో 30 ఉపగ్రహాలను మోహరించాల్సి ఉంది. ఇంతవరకూ నాలుగు ఉపగ్రహాలను నింగికి పంపగా.. శుక్రవారం డోరెసా, మిలేనా అనే రెండింటిని పంపారు. కానీ అవి తక్కువ ఎత్తుకే చేరడంతో ఇప్పుడు అనుకోని అవాంతరం ఎదురైంది. -
16 ఏళ్ల తర్వాత బదులిచ్చింది..!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు 36 ఏళ్ల క్రితం.. 1978లో రోదసికి పంపిన వ్యోమనౌక ఇది. పేరు ‘ఇంటర్నేషనల్ సన్-ఎర్త్ ఎక్స్‌ప్లోరర్(ఐసీ)-3’. భూమి అయస్కాంత క్షేత్రంపై సౌరగాలుల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు దీనిని రోదసికి పంపారు. సూర్యుడిపై అధ్యయనం తర్వాత దీనిని హేలీ తోకచుక్కపై పరిశోధనకు మళ్లించారు. 1985లో హేలీ తోకచుక్క తోకభాగం గుండా ప్రయాణించిన ఈ వ్యోమనౌక అందులోని మంచు, ప్లాస్మా కణాలు, ఇతర పదార్థాలకు సంబంధించిన కీలక వివరాలను భూమికి పంపింది. చివరగా 1997 మే 5న దీనితో సంబంధాలు నిలిచిపోయాయి. అయితే 16 ఏళ్ల క్రితం తెరమరుగైన ఐసీ-3తో తాజాగా ఓ ప్రైవేటు పరిశోధకుల బృందం తిరిగి సంబంధాలను పునరుద్ధరించింది. ‘ఐసీ-3 రీబూట్ ప్రాజెక్టు’ పేరుతో పరిశోధనలు చేపట్టిన స్పేస్ కాలేజీ, స్కైకార్ప్, స్పేస్రెఫ్ అనే సంస్థల నేతృత్వంలోని ప్రైవేటు బృందం ప్యూర్టారికోలోని ఆరెసిబో రేడియో అబ్జర్వేటరీ నుంచి సంకేతాలు పంపి, తిరిగి దీని నుంచి సంకేతాలను అందుకోగలిగారు. ప్రస్తుతం దీనిలోని ఇంజిన్లను మండించి, భూమికి సమీపంలోని కక్ష్యలోకి తీసుకురావాలని, తర్వాత మరో సౌర అధ్యయనానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.