సూర్యగ్రహణాల కోసం జంట ఉపగ్రహాలు
యూరోపియన్ అంతరిక్ష సంస్థ ‘ప్రోబా-3’ మిషన్
త్వరలో ‘ఇస్రో’ పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం
సౌర కరోనాపై నిశిత అధ్యయనం
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణ కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సైన్స్ బోధించేది వేరు. సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం ‘కృత్రిమ రావుకేతువుల’ సాయంతో కోరుకున్నప్పుడల్లా కృత్రిమ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో ఉన్నారు.
ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో జంట ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్బోర్డ్ అటానమీ3 (ప్రోబా3). ఇందులో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. కక్ష్యలో పరస్పరం దగ్గరగా మోహరించే ఈ శాటిలైట్లు... లేజర్లు, కాంతి సెన్సర్లతో అనుసంధానమై ఉంటాయి. రెండో ఉపగ్రహం నుంచి చూస్తే సూర్యుడు కనబడకుండా ఉండేలా మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం.
సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ తరహా కృత్రిమ సూర్యగ్రహణాలు అక్కరకొస్తాయని పరిశోధకులు అంటున్నారు. విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యుడు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఈ ప్రయోగం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, మన సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో ఉండే గ్రహాల (ఎక్సో ప్లానెట్స్)కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అద్యయనాలకు ‘ప్రోబా3’ మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఉపగ్రహాలు... ఒకే ఉపగ్రహంగా!
‘ప్రోబా3’ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ‘ప్రోబా3’లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచ్చితత్వంతో రెండు ఉపగ్రహాలను అతి దగ్గరగా కలిపి ఉంచేలా (లాక్ చేసేందుకు) కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనప్పటికీ... 144 మీటర్ల పొడవుండే ఏకైక అబ్జర్వేటరీ మాదిరిగా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ‘ప్రోబా3’ అనేది రెండేళ్ళు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇందులో సౌరగోళం ఆకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం నిర్వహించే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి.
తన పక్కనే ఉండే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహానికి సూర్యబింబం తాత్కాలికంగా కనిపించకుండా ‘అకల్టర్’ ఉపగ్రహం అడ్డుపడుతుంది. అలా ‘అకల్టర్’ ఉపగ్రహం ఏర్పరచిన ఛాయలో ఉంటూ ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం సూర్యుడి కరోనాను నిశితంగా పరిశీలిస్తుంది. ఉభయ ఉపగ్రహాలు భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచ్చినప్పుడు ‘అకల్టర్’ ఉపగ్రహం తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా సదరు డిస్క్ లాంటి పరికరం సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తుంది. అంటే ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహంలోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. ‘అకల్టర్’లో లేజర్, విజువల్ మెట్రాలజీ ఆప్టికల్ హెడ్స్, ‘కరోనాగ్రాఫ్’లో షాడో పొజిషన్ సెన్సర్లు ఉంటాయి. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుందని ఈఎస్ఏ ‘ప్రోబా3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వెల్లడించారు.
ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. దురదృష్టవశాత్తూ సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున ప్రతి రెండేళ్ళకోసారి మాత్రమే సంభవిస్తాయని, వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని గలీనో వివరించారు. అంత కష్టపడినా చివరికి ఫలితం వాతావరణం దయపై ఆధారపడివుంటుందని, వాతావరణం అనుకూలించకుంటే ఆ ప్రయత్నాలన్నీ వృథాయేనని చెప్పారు. అంతగా ప్రయాసపడినా ఏవో కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని గలీనో తెలిపారు. సవివర పరిశోధనలకు ఆ అతి స్వల్ప సమయం సరిపోదన్నారు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారని, అయితే అంతర కరోనాను ఆ ప్రయోగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయలేవని తెలిపారు.
సూర్యుడి ఉపరితలంపై 6 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కాగా కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇది వైరుద్ధ్యభరిత అంశమని ‘ప్రోబా3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ అన్నారు. నిజానికి సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలని, కానీ కరోనా విషయంలో అలా జరగదని, అందుకే శాస్త్రవేత్తలు సూర్యుడి అంతర కరోనాను అధ్యయనం చేసేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తారని చెప్పారు. సూర్యుడి ఉపరితలం కంటే సూర్యుడికి బాహ్య పొర అయిన కరోనా ఎందుకు ఎక్కువ వేడిమితో ఉందో తెలుసుకునేందుకు అంతర కరోనాను తాము దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తామని, కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ‘ప్రోబా3’ అందిస్తుందని ఫ్రాన్సిస్కో డీగో చెప్పారు.
కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో అంతరిక్షంలోకి సూర్యుడు భారీ స్థాయిలో ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూమి ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతోపాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. ఈ అంశాలపై ‘ప్రోబా3’ అవగాహనను పెంచుతుందని, సౌర భౌతికశాస్త్రాన్ని అది పంపే ఫలితాలు సమూలంగా మార్చివేస్తాయని భావిస్తున్నారు. ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహాన్ని బెల్జియం కేంద్రంగా ఉన్న లీగ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని 15 కంపెనీలు, పలు సంస్థల కన్సార్టియం ఈఎస్ఏ కోసం అభివృద్ధి చేసింది.
త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం!
‘ప్రోబా3’ జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదికగా జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సివుంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగాసి’ రాకెట్ కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ఈఎస్ఏ, ఇస్రో ఈ ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సివుంది.
జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment