
నయా... వంచన
రవికి ఒకరోజు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ తరువాత ఎస్.ఎం.ఎస్. వచ్చింది. ‘ఫలానా వ్యక్తి మీకు తెలుసా?’ అని. మొదట్లో రవి పట్టించుకోలేదు. పదేపదే ఫోన్ కాల్స్ రావడంతో ‘ఎవరీ వ్యక్తి?’ అని తెలుసుకోవడానికి ఆ ఫోటోను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ ఒక్క క్లిక్‌తో హ్యాకర్లు అతడి ఫోన్‌లోకి చొరబడగలిగారు. నిమిషాల వ్యవధిలోనే రవి బ్యాంకు ఖాతా నుంచి రెండు లక్షలు మాయమయ్యాయి.ఈ స్మార్ట్ స్కామ్‌ను ‘స్టెగానోగ్రఫీ’ అంటారు,
స్టెగానోగ్రఫీ (steganography) అనేది గ్రీకుపదం. దీని అర్థం ‘రహస్య రచన’ ‘దాచిన రచన’ హాని చేయని మీడియా ఫైళ్లలో మాల్‌వేర్ లేదా సీక్రెట్ ఇన్‌స్ట్రక్షన్ పొందుపరచడమే ‘స్టెగానోగ్రఫీ’ టెక్నిక్. ఈ హిడెన్ ప్లేలోడ్‌లు ట్రెడిషనల్ డిటెక్షన్ సిస్టమ్ కంటపడకుండా తప్పించుకుంటాయి. ‘ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. 2017లో హ్యాకర్లు వాట్సాప్‌లో షేర్ చేసిన జిఫ్ ఫైల్స్‌లో హానికరమైన కోడ్స్ పొందుపరిచారు. డౌన్‌లోడ్ చేసినప్పుడు హిడెన్ కోడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది.
సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను దాటవేసి, యూజర్ డేటాను యాక్సెస్ చేస్తుంది. ఇది జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ సరికొత్త మార్పులతో 2019లో స్టెగానోగ్రఫీ తిరిగి వచ్చింది’ అంటున్నాడు సైబర్ ఎక్స్‌పర్ట్ తుషార్‌శర్మ. సంప్రదాయ మాల్వేర్ అటెంప్ట్స్‌కు ‘స్టెగానోగ్రఫీ’ ఏ రకంగా భిన్నమైనది? ఎంతమాత్రం అనుమానానికి తావు ఇవ్వని రీతిలో ఇన్నోసెంట్ ఫైల్స్‌లో కోడ్‌ను దాచిపెడతారు, ‘ఈ ఇమేజ్‌లు, ఆడియో ఫైల్స్ ప్రమాదకరమేమీ కాదు అనిపిస్తాయి. అందుకే అవి తరచు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను దాటవేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ఆధారిత ఇమేజ్ రికగ్నిషన్ వంటి ఆధునాతన సాధనాలను కూడా స్టెగానోగ్రఫీ మోసం చేయగలదు’ అంటున్నారు నిపుణులు
మరి దీనికి పరిష్కారం లేదా?
‘స్టెగానోగ్రఫీని గుర్తించడానికి ఫోరెన్సిక్ సాధనాలు, స్టెగానాలిసిస్ ప్లాట్‌ఫామ్‌ల అవసరం ఉంది’ అంటున్నారు సైబర్ నిపుణులు.
కొన్ని జాగ్రత్తలు
→ అపరిచిత నంబర్స్ నుంచి వచ్చిన ఫైల్స్‌ను ఓపెన్, డౌన్‌లోడ్ చేయవద్దు
→ ఫోన్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి
→ ఆటో డౌన్‌లోడ్‌ను డిజేబుల్ చేయండి. వాట్సాప్ సెట్టింగ్‌ను మార్చడం ద్వారా అన్‌నోన్ మీడియా ఆటోమేటిక్‌గా సేవ్ కాకుండా నిరోధించవచ్చు.
→ ఓటీపీలను ఎప్పుడూ షేర్ చేయవద్దు
→ ‘మై కాంటాక్ట్స్’ గ్రూప్ పర్మిషన్ సెట్ చేయండి. అనుమానాస్పద గ్రూప్‌లను దూరం పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది
→ వాట్సాప్‌లో ‘సైలెన్స్’ అన్‌నోన్ కాలర్స్’ ఫీచర్‌ను యాక్టివేట్ చేయండి .