ఫీలే.. నిద్ర లేచింది!
తోకచుక్కపై మేలుకొన్న ఫీలే ల్యాండర్
పారిస్: భూమికి కోట్ల కి.మీ. దూరంలో వేగంగా దూసుకుపోతున్న ఓ తోకచుక్కపై దిగి, చీకట్లో పడిపోయి, మూగబోయిన ఫీలే ల్యాండర్ ఎట్టకేలకు మేలుకొంది! ఏడు నెలల తర్వాత శనివారం ‘హెలో.. ఎర్త్’ అంటూ భూమికి సందేశం పంపింది. ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) పదేళ్ల క్రితం ప్రయోగించిన రోసెట్టా వ్యోమనౌక గతేడాది నవంబర్‌లో ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను చేరడం, అదే నెల 12న ఫీలే అనే ల్యాండర్‌ను ఆ తోకచుక్కపైకి జారవిడిచి చరిత్ర సృష్టించడం తెలిసిందే. అయితే, తోకచుక్కపై పడిన ల్యాండర్ మూడు సార్లు ఎగిరి పడటంతో సూర్యరశ్మి సోకని చోట చీకట్లో ల్యాండ్ అయింది.
దీంతో బ్యాటరీ అయిపోయేదాకా 60 గంటలు మాత్రమే పనిచేసి ఆ తోకచుక్కకు చెందిన సమాచారాన్ని ఫీలే భూమికి పంపింది. తోకచుక్క ప్రస్తుతం సూర్యుడి వైపుగా దూసుకుపోతుండటంతో ఫీలే ఉన్న చోట సూర్యరశ్మి పడుతోందని, దీంతో స్వల్పంగా రీచార్జ్ అయిన ఫీలే భూమికి రెండు నిమిషాలు సంకేతాలు పంపిందని, 40 సెకన్ల సమాచారం అందిందని ఆదివారం ఈసా వెల్లడించింది. తోకచుక్క చుట్టూ తిరుగుతున్న రోసెట్టా ద్వారా సంకేతాలను పంపుతూ ఫీలేను నిద్రలేపేందుకు శాస్త్రవేత్తలు మే నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్ముందు ఫీలేపై మరింత వెలుతురు పడి, బాగా పనిచేస్తుందని, మరికొన్ని ప్రయోగాలు చేసి సమాచారం పంపుతుందని భావిస్తున్నారు.
ఇవీ విశేషాలు...
8 మంచు, ధూళి, వాయువులతో కూడి ఉండే తోకచుక్కలు సౌరకుటుంబం ఏర్పడిన తొలినాళ్లలో మిగిలిపోయిన పదార్థంతో ఏర్పడ్డాయని అంచనా. ఈ తోకచుక్కపై అధ్యయనం ద్వారా తోకచుక్కలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయన్నది తెలుసుకునేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. 8 67పీ తోకచుక్క ప్రస్తుతం భూమికి 30 కోట్ల కి.మీ. దూరంలో, సెకనుకు 31.24 కి.మీ. వేగంతో సూర్యుడి వైపు వెళుతోంది.
8 ఆగస్టు 13 నాటికి సూర్యుడికి అతి సమీపంలోకి చేరి, తిరిగి దూరం వెళ్లడం మొదలుపెడుతుంది.
8 రోసెట్టా, ఫీలే కలిసి 690 కోట్ల కి.మీ. దూరం ప్రయాణించి తోకచుక్కను చేరాయి.
8 ఫీలే బరువు భూమిపై 100 కిలోలు. తోకచుక్కపై గురుత్వాకర్షణ చాలా తక్కువ కాబట్టి.. అక్కడ ఒక కిలోనే!
8 67పీ తోకచుక్క 4. కి.మీ. వెడల్పు, 5 కి.మీ. పొడవు, బరువు 1000 కోట్ల టన్నులు ఉంటుంది.
8 రోసెట్టా జీవితకాలం 12 ఏళ్లు కాగా, ఈ ఏడాది డిసెంబర్ దాకా పనిచేయనుంది.