ఈవాళో.. రేపో జాబిల్లిపై మకాం పెట్టే మనకు అక్కడ పీల్చేందుకు ఆక్సిజన్ కావాలి కదా? అందుకే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు అక్కడి మట్టి నుంచి స్వచ్ఛమైన ప్రాణవాయువును తయారు చేసేందుకు ఓ పద్ధతిని ఆవిష్కరించారు. చందమామపైని మట్టిని లూనార్ రెగోలిత్ అని పిలుస్తారు. అప్పుడెప్పుడో యాభై ఏళ్ల క్రితం మన సహజ ఉపగ్రహంపై వాలిన అపోలో రాకెట్ ద్వారా కొంత రెగోలిత్‌ను భూమ్మీదకు తెచ్చుకున్నారు. దీని సాయంతో విస్తతంగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు అందులో 40 45 శాతం వరకూ ఆక్సిజనే ఉందని తెలిసింది. ఇంకేముంది తీసేసుకుందామని ప్రయత్నాలైతే చేశారుగానీ.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తల వంతు వచ్చే వరకూ అస్సలు సాధ్యపడలేదు.
ఇందుకోసం కరిగించిన ఉప్పుతో ఆక్సిజన్‌ను వేరుచేయడమన్న పద్ధతిని ఉపయోగించారు. ఇంకోలా చెప్పాలంటే లూనార్ రెగోలిత్‌ను కాల్షియం క్లోరైడ్ (ఒక రకమైన లవణం)ను కలిపి 950 డిగ్రీ సెల్సియస్ వరకూ వేడి చేయడంతో ఈ పద్ధతి పని చేస్తుంది. అత్యధిక వేడిమి వద్ద కొంత కరెంటు షాక్ ఇవ్వడం వల్ల అప్పటివరకూ ఘనంగా ఉన్న పదార్థం కాస్తా కరిగిపోతుందని, ఈ క్రమంలో అందులోని ఆక్సిజన్ వేరుపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరికరాలతో భవిష్యత్తులో వ్యోమగాములకు అవసరమైన ఆక్సిజన్‌ను అక్కడికక్కడే తయారు చేసుకోవచ్చునని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త అలెగ్జాండ్రీ మెరుస్సీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment