ఎరుపురంగు వృత్త ప్రాంతం నుంచి సౌర గాలులు వస్తున్నపుడు పార్కర్ తీసిన ఫొటో (ఫైల్)
వాషింగ్టన్: ఆదిత్యుడు.. అదేనండీ మన సూర్యుడికి అతిదగ్గరగా వెళ్లిన అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోబ్ మొట్టమొదటిసారి భూమికి సమాచారం పంపింది. ఇది కాస్తా సూర్యుడికి సంబంధించిన అనేక మిస్టరీలను ఛేదించేందుకు ఉపయోగపడుతుందని నాసా అంటోంది. ఈ సమాచారం నేచర్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైంది.
మిస్టరీల పుట్ట...
సూర్యుడి ఉపరితలం కంటే వాతావరణ(కరోనా) ఉష్ణోగ్రత వందల రెట్లు ఎక్కువ ఎందుకుంది? సూర్యుడి నుంచి వెలువడే గాలులకు మూలమెక్కడ? వంటివి ఇప్పటికీ మిస్టరీలే. అయితే గత ఏడాది ఆగస్టులో నాసా ప్రయోగించిన పార్కర్ ప్రోబ్ తాజాగా పంపిన సమాచారంతో ఈ రహస్యాలను ఛేదించవచ్చునని నాసా అంచనా వేస్తోంది.
నక్షత్రాల పుట్టుక వివరమూ తెలుస్తుంది...
పార్కర్ సోలార్ ప్రోబ్ ఇచ్చే సమాచారంతో నక్షత్రాలు ఎలా పుడతాయి? ఎలా పరిణమిస్తాయన్న విషయంలోనూ మానవ అవగాహన పెరగనుంది. సూర్యుడిని వీలైనంత దగ్గరగా పరిశీలించడం ద్వారా అక్కడ జరిగే కార్యకలాపాలను మరింత స్పష్టంగా చూడగలుగుతున్నామని, వాటి ప్రభావం భూమిపై ఎలా ఉంటుందో తెలుస్తోందని, పాలపుంతల్లోని నక్షత్రాలను అర్థం చేసుకునేందుకు అవసరమైన వివరాలూ అర్థమవుతున్నాయని నాసా శాస్త్రవేత్త థామస్ జుర్‌బుకెన్ తెలిపారు.
హీలియో ఫిజిక్స్ (సూర్య భౌతికశాస్త్రం) రంగంలో ఎంతో ఆసక్తికరమైన దశకు పార్కర్ ప్రోబ్ సమాచారం శ్రీకారం చుట్టిందని అన్నారు. కరోనా తాలూకూ అయస్కాంత నిర్మాణాన్ని చూడటం ద్వారా సౌర గాలులు సూక్ష్మస్థాయి కరోనా రంధ్రాల నుంచి వస్తున్నట్లు తెలిసిందని కాలిఫోరి్నయా యూనివర్సిటీ అధ్యాపకుడు స్టూవర్ట్ బేల్ తెలిపారు. సూర్యుడికి అతిదగ్గరగా వెళ్లినప్పుడు ప్రోబ్‌పై అక్కడక్కడా పడ్డ దుమ్ము తమను ఆశ్చర్యపరిచిందని, మిల్లీమీటర్‌లో వెయ్యోవంతు సైజున్న ఈ దుమ్ము సూర్యుడికి సమీపంలో కరిగిపోయిన గ్రహశకలాల తాలూకూ అవశేషాలు కావచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment