సౌరకుటుంబం ఆవలికి వెళ్లిన వాయేజర్-1
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మూడు దశాబ్దాల క్రితం ప్రయోగించిన ‘వాయేజర్ -1’ వ్యోమనౌక ఎట్టకేలకు సౌరకుటుంబం అంచులు దాటేసింది. అంతరిక్షంలో 36 ఏళ్లుగా నిరంతరం ప్రయాణిస్తున్న ఈ వ్యోమనౌక తాజాగా 1,900 కోట్ల కి.మీ. దూరం దాటేసి నక్షత్రాంతర రోదసిలోకి అడుగుపెట్టింది. మానవ నిర్మితమైన ఓ వస్తువు ఇలా నక్షత్రాంతర రోదసి(రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)కి చేరడం ఇదే తొలిసారని గురువారం అమెరికా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. వాయేజర్-1 నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. అది ఏడాదికాలంగా సౌరకుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసిలో ఉండే ప్లాస్మా తరంగాలు లేదా అయోనైజ్డ్ వాయువుల గుండా ప్రయాణిస్తున్నట్లు అంచనావేశామని ఈ మేరకు వాయేజర్ ప్రాజెక్టు శాస్త్రవేత్త ఎడ్ స్టోన్ తెలిపారు.
వోయేజర్-1 నుంచి వెలువడే సంకేతాలు కాంతివేగంతో ప్రయాణిస్తూ.. 17 గంటల్లో భూమిని చేరతాయని, ప్రస్తుత సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించేందుకు కొన్ని నెలల సమయం పట్టవచ్చన్నారు. అయితే నక్షత్రాంతర రోదసికి చేరినా.. సూర్యుడి ప్రభావం పూర్తిగా లేని ప్రదేశానికి వాయేజర్ ఎప్పుడు చేరుకుంటుందో తెలియదన్నారు. కాగా వాయేజర్-2, 1 వ్యోమనౌకలను 16 రోజుల తేడాతో అమెరికా 1977లో ప్రయోగించింది. ఈ రెండూ అప్పటినుంచి రోదసిలో నిరంతరం ప్రయాణిస్తూ సమాచారం పంపుతూనే ఉన్నాయి. సౌరకుటుంబాన్ని దాటిన వ్యోమనౌకగా వాయేజర్-1 చరిత్రకెక్కగా.. దానికంటే ముందు ప్రయోగించిన వోయేజర్-2 అత్యధిక రోజులుగా పనిచేస్తున్న వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది.