సూర్యుడే లక్ష్యంగా... | Sakshi Editorial On NASA Parker Solar Probe | Sakshi
Sakshi News home page

సూర్యుడే లక్ష్యంగా...

Published Wed, Aug 15 2018 12:23 AM | Last Updated on Wed, Aug 15 2018 1:20 AM

Sakshi Editorial On NASA Parker Solar Probe

మన సౌర కుటుంబ పెద్ద సూర్యుడిలోని అంతుచిక్కని రహస్యాలను ఛేదించేందుకు  అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన వ్యోమ నౌక ‘పార్కర్‌ ప్రోబ్‌’ ఆదివారం శరవేగంతో దూసుకు పోయింది. వంద కిలోల బరువు కలిగి ఉండి ఏడేళ్లపాటు సుదీర్ఘ ప్రయాణం చేసి 15 కోట్ల కిలో మీటర్ల దూరంలోని సూర్యుడిని చేరే ‘పార్కర్‌ ప్రోబ్‌’ ప్రాజెక్టు నాసా ఇంతవరకూ చేపట్టిన ప్రాజె క్టులన్నిటిలోనూ అసాధారణమైనది. 460 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి, అప్పటినుంచీ భగ్గున మండుతున్న సూర్యుడి గురించి శాస్త్రవేత్తలకున్న అనేకానేక సందేహాలను పటాపంచలు చేసేందుకు రూ. లక్ష కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. సూర్యుడి ఉపరితలం కన్నా దాని బాహ్య వలయం కరోనాలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఎందుకుంటుందన్నది అంతుచిక్కని ప్రశ్న. సాధారణంగా మండుతున్న వస్తువునుంచి దూరం వెళ్లే కొద్దీ వేడిమి తగ్గుతుంది. కానీ సూర్యుడి దగ్గర దానికి విరుద్ధంగా జరుగుతుంది. సూర్యుడి ఉపరితలం కన్నా దాని చుట్టూ ఉన్న కరోనాలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుడి ఉపరితలంలో 10,000 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉంటే... కరోనాలో దాని కన్నా 200 రెట్ల అధిక ఉష్ణోగ్రత... అంటే 20 లక్షల డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉంటుంది. శాస్త్రవేత్తలు దీనికి ‘కరోనల్‌ హీటింగ్‌’ సమస్యగా పేరు పెట్టారు. ఈ వింతకు రకరకాల కారణాలు చెప్పుకున్నా ఏదీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. ఈ కరోనల్‌ హీటింగ్‌ వెనకున్న మిస్టరీ ఏమిటో పార్కర్‌ ప్రోబ్‌ ఛేదించాల్సి ఉంది. అలాగే సూర్యుడి కరోనాలో తరచుగా పుట్టుకొచ్చే సౌర తుఫాన్లు ఆవేశపూరిత కణాల్ని అంతరిక్షంలో కోట్లాది కిలోమీటర్ల వేగంతో దశ దిశలా వెదజల్లుతూ ఉంటాయి. ఈ కణాలు తమతోపాటు సూర్యుడి గురుత్వాకర్షణను ఎంతోకొంత మోసుకొస్తాయి. ఈ గురుత్వాకర్షణ క్షేత్రం భూ గురుత్వాకర్షణతో సంఘర్షించినప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

భూమి ధ్రువ ప్రాంతాల్లో ఆకాశంలో కనబడే జ్యోతులు(ఆరోరా బోరియాలిస్‌ వగై రాలు) ఈ ఘర్షణ పర్యవసానమే. సౌర తుఫాన్ల తీవ్రత వల్ల ఉపగ్రహాలు కక్ష్య తప్పుతాయి. ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు దెబ్బతింటాయి. పవర్‌ గ్రిడ్‌లు, సాగర గర్భంలోని కేబుళ్లు నిస్తేజమవుతాయి. ఈ సౌర తుఫాన్లు ఎందుకేర్పడతాయో ఇంతవరకూ స్పష్టంగా తెలియదు. కరోనానుంచి వెలువడే ప్లాస్మా, ఆవేశపూరిత కణాలు భూమిని చేరేసరికే వాటి పుట్టుపూర్వోత్తరాల ఆనవాళ్లు హరిం చుకుపోతాయి. అందువల్లే కరోనా సమీపానికే వెళ్లి సంగతేమిటో తెలుసుకోవడం అవసరమని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో భావిస్తున్నారు. వ్యోమనౌక పంపే డేటాతో సూర్యుడి గురుత్వాక ర్షణనూ, దాని శక్తిని అంచనా వేయడానికి వీలవుతుంది. అలాగే కరోనా వాస్తవంగా ఎలా ఉంటుందో ఛాయాచిత్రాల ద్వారా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. తరచు సూర్యబింబంపై ఏర్పడే మచ్చలు, అనుక్షణం ఎగిసిపడే అగ్నికీలలు సూర్యుడిలోని అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్లనేనని తెలిసినా దాన్ని కొలిచేందుకు అనువైన డేటా మన దగ్గర లేదు. ఈ పరిశోధన ద్వారా  సూర్యుడి ఆనుపానులన్నీ తెలుసుకోగలిగితే విశ్వంలోని పలు పాలపుంతల గురించి మన అవ గాహన మరిన్ని రెట్లు పెరుగుతుంది. అయితే పార్కర్‌ ప్రోబ్‌ మన సందేహాలన్నిటికీ సమాధా నాలిస్తుందా... మరిన్ని కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తున్న కొద్దీ, మన అవగాహన పెరిగే కొద్దీ అవి మరిన్ని జటిలమైన ప్రశ్నలను మన ముందుంచుతాయి.

నాసా ప్రారంభమైన 1958లోనే కరోనాపై పరిశోధనలు ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే వేర్వేరు గ్రహాలకు వ్యోమ నౌకల్ని పంపటంతోసహా 14 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఆ సమయంలోనే అప్పటి యువ శాస్త్రవేత్త యూజిన్‌ పార్కర్‌ నక్షత్రాలు శక్తినెలా విడుదల చేస్తాయో, ఆ శక్తి వివిధ గ్రహాలను ఎలా తాకుతుందో అంచనా వేశారు. ఇలా విడుదలయ్యే శక్తికి సౌర తుఫా నులని పేరు పెట్టింది ఆయనే. ఆ సిద్ధాంతంతో చాలామంది శాస్త్రవేత్తలు విభేదించారు. కానీ 1962లో నాసా ప్రయోగించిన వ్యోమనౌక మేరినర్‌ 2 అంతరిక్ష అగాధాల్ని స్పృశించి ఈ సౌర తుఫాన్లు ఆవేశపూరిత కణాలు వెదజల్లుతుండటాన్ని వెల్లడించింది. ప్రస్తుత ప్రయోగానికి మూలం పార్కర్‌ ప్రతిపాదించిన సిద్ధాంతంలో ఉన్నది కనుకే వ్యోమనౌకకు ఆయన పేరు పెట్టారు. అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేసే ప్రాథమికమైన పరిజ్ఞానం ఇంతవరకూ మనకు సమకూడలేదు. పార్కర్‌ ప్రోబ్‌ ఆ లోటు తీర్చే అవకాశం ఉంది.

ఈ జగత్తు సృష్టికి ఆదిత్యుడే మూలకారకుడని ఆదిత్య హృదయం అంటుంది. సమస్త జీవరాశి సూర్యుడిపైనే ఆధారపడుతుంది. అక్కడ సంభవించే వివిధ మార్పుల ఫలితంగానే భిన్న సంద ర్భాల్లో ఈ భూమిపై అనేక రకాల మార్పులు సంభవించాయి. భూమ్మీదనుండే వృక్ష, జంతుజాలం, భూ లోపలి పొరల్లో లభ్యమయ్యే అనేక రకాల ఖనిజాలు, ఇంధనాలు... ఇవన్నీ అలా ఏర్పడ్డవే. సూర్యుడి గమనంలో వచ్చే తేడాలు వాతావరణంలో, సముద్రాల్లో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల్ని నిర్దేశిస్తాయి. వేడిమిని, శీతగాలుల్ని, వర్షపాతాన్ని నిర్ణయిస్తాయి. ఇన్నిటికి సూర్యుడే మూలా ధార మైనప్పుడు అక్కడేం జరుగుతున్నదో, భవిష్యత్తులో అది ఏ ఏ మలుపులు తిరుగుతుందో అవ గాహన చేసుకోవడం తప్పనిసరి. విజ్ఞానరంగంలో మన చేతికందే ఒక్కో విజయమూ విశ్వంపైనా, దాని పుట్టకపైనా మన అవగాహనను అనూహ్య రీతిలో పెంచుతుంది. తెలిసే ప్రతి కొత్త సమా చారమూ మరిన్ని కొత్త అంశాలపై దృష్టి కేంద్రీకరింపజేస్తుంది. పార్కర్‌ ప్రోబ్‌లో వాడిన ప్రతి ఉపకరణాన్ని కరోనాలో ఉండే ఉష్ణోగ్రత, అక్కడి కణాల్లో ఉండే విద్యుదావేశం, వాటి వేగం, వాటి సాంద్రత వగైరాలను అతి జాగ్రత్తగా అంచనావేసి రూపొందించారు. పార్కర్‌ ప్రోబ్‌ వ్యోమనౌక రానున్న ఏడేళ్లలో అపారమైన సమాచారాన్ని అందించి, శాస్త్రవేత్తలు పెట్టుకున్న లక్ష్యాలను సాధి స్తుందని, వారి ఆశల్ని నెరవేరుస్తుందని ఆశిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement