మొత్తానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అనుకున్నది సాధించింది. ఆ సంస్థ పంపిన రోవర్ ‘పర్సవరన్స్’ అరుణగ్రహంపై సరిగ్గా అనుకున్నచోట, అనుకున్న సమయానికి దిగింది. నిరుడు జూలైలో ప్రారంభమైన సుదీర్ఘ యాత్ర ఇలా సుఖాంతం కావటం అంతరిక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు... ఆ రంగంపై ఆసక్తిగల ప్రపంచ పౌరులందరికీ శుభవార్తే. వివిధ దశలుగా పదేళ్లపాటు కొనసాగే మరికొన్ని ప్రయోగాల పరంపర కూడా అనుకున్నట్టుగా పూర్త యితే... అక్కడ సేకరించిన మట్టి నమూనాలు జయప్రదంగా వెనక్కి తీసుకురాగలిగితే అరుణ గ్రహంతోపాటు మొత్తంగా సౌర కుటుంబ నిర్మాణంపై ఇప్పటివరకూ మనకుండే అవగాహన మరిన్ని రెట్లు విస్తరిస్తుంది. మన భూగోళం పుట్టుక గురించి మనకుండే జ్ఞానం సైతం మరింత పదునెక్కుతుంది.
చీకటి ఆకాశంలోకి మనం తలెత్తి చూసినప్పుడు తళుకు బెళుకులతో సంభ్ర మాశ్చర్యాల్లో ముంచెత్తే అనేకానేక తారల్లో అంగారకుడిది విశిష్టమైన స్థానం. అది మిగిలిన గ్రహాలకన్నా అధికంగా మెరుస్తూంటుంది. అందుకే అరుణగ్రహం చుట్టూ ఊహలు ఊరేగాయి. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఎన్నో సైన్స్ ఫిక్షన్ కథలు, నవలలు వచ్చాయి. అంగారకుడిపై వచ్చిన చలనచిత్రాలకూ, టెలివిజన్ ధారావాహికలకూ లెక్కేలేదు. ఈ సౌర కుటుంబంలో కేవలం అరుణ గ్రహంపై మాత్రమే జీవరాశికి అనువైన పరిస్థితులుండేవని, ఏకారణంచేతనో అవి తారుమార య్యాయని శాస్త్రవేత్తల విశ్వాసం. ఒకప్పుడు పుష్కలంగా నీటితో అలరారిన ఆ గ్రహంపై ఇప్పుడు అందుకు సంబం ధించిన ఆనవాళ్లే మిగిలాయి. లోగడ అక్కడ దిగిన రోవర్‌లు నదీజలాలు పారినట్టు కనబడిన ఆనవాళ్లను పంపాయి. గ్రహం లోలోపలి పొరల్లో ఇంకా ఎంతో కొంత నీటి జాడ వుండొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ‘పర్సవరన్స్’ను కూడా సరిగ్గా అలాంటి ప్రాంతాన్ని చూసుకునే దించారు.
350 కోట్ల సంవత్సరాలక్రితం అతి పెద్ద సరస్సు వున్నదని భావించే బిలం అంచుల్లో అది సురక్షితంగా దిగటం శాస్త్రవేత్తల ఘనవిజయమని చెప్పాలి. ఆ దిగే ప్రాంతానికి శాస్త్రవేత్తలు బోస్నియా–హెర్జెగోవినాలోని ఒక పట్టణం పేరైన ‘జెజిరో’గా నామకరణం చేశారు. సరస్సు అని దానర్థం. ఒక పెద్ద స్నానాలతొట్టె ఆకారంలో వున్న ఆ ప్రాంతంలోని రాళ్లలో రహ స్యాలెన్నో దాగివున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటి రసాయన నిర్మాణాన్ని ఛేదిస్తే కోట్లాది సంవత్సరాలక్రితం ఆ సరస్సు ఎలాంటి పరిస్థితుల్లో అంత రించిపోయిందో అంచనా వేయటానికి ఆస్కారం వుంటుందంటున్నారు. ఈ భూగోళంపై కూడా మనిషితో సహా అన్ని జీవులూ నదీ తీరాలను ఆశ్రయించుకుని వుండేవి. అక్కడే తొలి నాగరికతలు వర్థిల్లాయి. అంగారకుడిపై సైతం అదే జరిగివుండాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అరుణగ్రహంపైకి యాత్ర అత్యంత సంక్లిష్టమైనది. దానిపైకి ఇంతవరకూ పంపిన అంతరిక్ష నౌకల్లో 50 శాతం విఫలమయ్యాయి. అందుకే నాసా శాస్త్రవేత్తలు ఈ ఏడు నెలలూ ఊపిరి బిగపట్టి పర్సవరన్స్ గమనాన్ని 24 గంటలూ నిశితంగా పరిశీలిస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు అవసరమైన సందేశాలు పంపుతూ అది సజావుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకూ వివిధ దేశాలు పంపిన రోవర్‌లకన్నా పర్సవరన్స్ చాలా పెద్దది. ఒక కారు సైజున్న ఈ రోవర్‌కు ఒక మినీ హెలికాప్టర్ అమర్చారు. అక్కడి మట్టి నమూనాలను సేకరించడానికి, వాటిని విశ్లేషించి ఎప్పటికప్పుడు సమాచారం నాసాకు చేరేయడానికి అందులో అత్యంతాధునికమైన ఏడు రకాల ఉపకరణాలున్నాయి. ఛాయాచిత్రాలు తీసేందుకు జూమ్ చేయడానికి వీలుండే ఇరవై 3డీ కెమెరాలు, ఆ రోవర్‌ను తాకుతూ వీచే గాలుల ధ్వనిని, మట్టిని సేకరించటానికి రాళ్లను తొలి చినప్పుడు వెలువడే శబ్దాలను రికార్డు చేసేందుకు మైక్రో ఫోన్‌లు, ఇతర సెన్సర్లు కూడా అమర్చారు.
అలాగే అది సేకరించిన నమూనాలను నిక్షిప్తం చేయటానికి చిన్న సైజులోవుండే 43 కంటెయినర్లున్నాయి. అందుకే రోవర్ అనటం దీన్ని ఒక రకంగా చిన్నబుచ్చటమే. ఇది ఏకకాలంలో భిన్నమైన పనులు చేయగల బుద్ధి కుశలతను సొంతం చేసుకున్న ఒక అద్భుత వాహనం. ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్లు, సైంటిస్టులూ పర్సవరన్స్‌కి అమర్చిన ఉపకరణాలు, దాని వ్యవస్థలూ నిరంతరం రెప్పవాల్చకుండా పర్యవేక్షిస్తుంటారు. ఒకటి రెండు నెలలు గడిచాక రోవర్‌కి అమర్చిన హెలికాప్టర్‌ను విడివడేలా చేస్తారు. అన్నీ సక్రమంగా పనిచేసి రోవర్ నిర్దేశించిన కర్తవ్యాలను పూర్తి చేస్తే అది ఇంతవరకూ మానవాళి సాధించిన విజయాల్లోకెల్లా తలమానికమైనది అవుతుంది.
అగ్ని పర్వతాలు బద్దలై లావాలు ప్రవహించిన కారణంగానో, ఒక భారీ గ్రహ శకలం పెను వేగంతో ఢీకొన్న కారణంగానో ఒకప్పుడు నీళ్లు సమృద్ధిగా పారిన అరుణగ్రహం గడ్డ కట్టుకు పోయింది. దాని ఉల్కలు ఇక్కడికి చేరకపోలేదు. కానీ ఇప్పుడు తాను సేకరించే నమూనాలను పర్సవరన్స్ వేర్వేరు కంటెయినర్లలో సీల్ చేస్తుంది. వాటిని నిర్దిష్టమైన ప్రాంతంలో వుంచితే భవి ష్యత్తులో జరిపే అంతరిక్ష ప్రయోగాల ద్వారా వాటిని భూమ్మీదకు తీసుకొస్తారు. ఎంతో ఓర్పుతో, పట్టుదలతో జరగాల్సిన ఈ సుదీర్ఘ ప్రక్రియకు ఇంగ్లిష్‌లో దానికి సమానార్థకమైన పర్సవరన్స్ అని పేరు పెట్టడం సబబైనదే. ఆ పేరుకు తగినట్టే అది మన శాస్త్ర విజ్ఞానంపై కొత్త వెలుగులు ప్రస రించటానికి దోహదపడుతుందని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment