Mars orbit
-
మంగళ్యాన్ కథ ముగిసింది
బెంగళూరు: అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్యాన్ మిషన్ ముగిసింది. మార్స్ ఆర్బిటార్ క్రాఫ్ట్తో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో సోమవారం ధ్రువీకరించింది. 2013 నవంబర్ 5న ఆర్బిటార్ ప్రయోగం ప్రారంభించారు. ఆర్బిటార్ 300 రోజులపాటు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో అరుణగ్రహం ఉపరితలంపై వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించింది. మంగళ్యాన్ జీవితకాలం ముగిసిందని, పని చేయడం ఆగిపోయిందని, ఆర్బిటార్‌ను ఇక రికవరీ చేయలేమని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. ఇతర గ్రహాలపై పరిశోధనల విషయంలో మంగళ్యాన్ అద్భుత సాంకేతిక, శాస్త్రీయ ప్రయోగంగా మిగిలిపోతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. -
పెర్సి సక్సెస్.. మార్స్ ఫోటోలు షేర్ చేసిన నాసా
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు ఉద్దేశించిన ‘పర్సవరన్స్’ రోవర్ గురువారం తెల్లవారుజామున విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 2020, జూలైలో ప్రారంభమైన ఈ సుదీర్ఘయాత్ర విజయవంతం కావడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు శుభవార్తే. ఈ క్రమంలో శుక్రవారం నాసా.. రోవర్ ‘పర్సవరన్స్’ పంపంచిన అరుదైన ఫోటోలను షేర్ చేసింది. వీటిలో రోవర్ కేబుల్స్ సాయంతో అరుణ గ్రహంపై ల్యాండ్ అయిన ఫోటో కూడా ఉంది. ల్యాండ్ అయ్యే సమయానికి ఆరు ఇంజన్లు ఉన్న ఈ రోవర్ తన వేగాన్ని గంటకు 1.7 మైళ్లకు తగ్గించుకుని అరుణగ్రహంపై ల్యాండ్ అయినట్లు నాసా వెల్లడించింది. రోవర్ అరుణగ్రహం ఉపరితలం మీద ల్యాండ్ అయినప్పుడు అక్కడ దుమ్ము లేవడం వీటిల్లో కనిపిస్తుంది అని రోవర్ చీఫ్ ఇంజనీర్ తెలిపారు. ఫోటో కర్టెసీ: నాసా ‘‘రోవర్ తన మొట్టమొదటి హై-రిజల్యూషన్, కలర్ ఫోటోను అప్లోడ్ చేయగలిగింది. ఇది జెజెరో క్రేటర్‌లో అడుగుపెట్టిన చదునైన ప్రాంతాన్ని చూపిస్తుంది. ఇక్కడ బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక నది, లోతైన సరస్సు ఉనికిలో ఉన్నాయనే ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రెండవ కలర్ ఫోటోలో రోవర్ ఆరు చక్రాలలో ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే అనేక రాళ్ళు ఉన్నాయి. ఇవి 3.6 బిలియన్ సంవత్సరాల కన్నా పురాతనమైనవిగా భావిస్తున్నాం’’ అంటూ నాసా ట్వీట్ చేసింది. ఫోటో కర్టెసీ: నాసా ‘‘ఈ రాళ్ళు అగ్నిపర్వత లేదా అవక్షేప మూలాన్ని సూచిస్తాయా అనేది తేలాల్సింది. రోవర్ భూమి మీదకు వచ్చినప్పుడు తనతో పాటు తీసుకువచ్చే ఈ రాళ్లను పరీక్షించి అవి ఏ కాలానికి చెందినవి.. ఏ రకానికి చెందినవి అనేది తేలుస్తాం’’ అన్నారు. పర్సవరన్స్ గురువారం నాడు కొన్ని ఫోటోలను పంపింది. అవి బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయి. అంత క్లారిటీగా లేవు. ఇప్పుడు వచ్చిన ఫోటోలు చాలా బాగా ఉన్నట్లు నాసా వెల్లడించింది. The moment that my team dreamed of for years, now a reality. Dare mighty things. #CountdownToMars pic.twitter.com/8SgV53S9KG — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 19, 2021 చదవండి: మార్స్ పైకి ‘పెర్సీ’ నాసా ప్రయోగం; ఎవరీ స్వాతి మోహన్..? -
'నాసా' అనుకున్నది సాధించింది..
మొత్తానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అనుకున్నది సాధించింది. ఆ సంస్థ పంపిన రోవర్ ‘పర్సవరన్స్’ అరుణగ్రహంపై సరిగ్గా అనుకున్నచోట, అనుకున్న సమయానికి దిగింది. నిరుడు జూలైలో ప్రారంభమైన సుదీర్ఘ యాత్ర ఇలా సుఖాంతం కావటం అంతరిక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు... ఆ రంగంపై ఆసక్తిగల ప్రపంచ పౌరులందరికీ శుభవార్తే. వివిధ దశలుగా పదేళ్లపాటు కొనసాగే మరికొన్ని ప్రయోగాల పరంపర కూడా అనుకున్నట్టుగా పూర్త యితే... అక్కడ సేకరించిన మట్టి నమూనాలు జయప్రదంగా వెనక్కి తీసుకురాగలిగితే అరుణ గ్రహంతోపాటు మొత్తంగా సౌర కుటుంబ నిర్మాణంపై ఇప్పటివరకూ మనకుండే అవగాహన మరిన్ని రెట్లు విస్తరిస్తుంది. మన భూగోళం పుట్టుక గురించి మనకుండే జ్ఞానం సైతం మరింత పదునెక్కుతుంది. చీకటి ఆకాశంలోకి మనం తలెత్తి చూసినప్పుడు తళుకు బెళుకులతో సంభ్ర మాశ్చర్యాల్లో ముంచెత్తే అనేకానేక తారల్లో అంగారకుడిది విశిష్టమైన స్థానం. అది మిగిలిన గ్రహాలకన్నా అధికంగా మెరుస్తూంటుంది. అందుకే అరుణగ్రహం చుట్టూ ఊహలు ఊరేగాయి. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఎన్నో సైన్స్ ఫిక్షన్ కథలు, నవలలు వచ్చాయి. అంగారకుడిపై వచ్చిన చలనచిత్రాలకూ, టెలివిజన్ ధారావాహికలకూ లెక్కేలేదు. ఈ సౌర కుటుంబంలో కేవలం అరుణ గ్రహంపై మాత్రమే జీవరాశికి అనువైన పరిస్థితులుండేవని, ఏకారణంచేతనో అవి తారుమార య్యాయని శాస్త్రవేత్తల విశ్వాసం. ఒకప్పుడు పుష్కలంగా నీటితో అలరారిన ఆ గ్రహంపై ఇప్పుడు అందుకు సంబం ధించిన ఆనవాళ్లే మిగిలాయి. లోగడ అక్కడ దిగిన రోవర్లు నదీజలాలు పారినట్టు కనబడిన ఆనవాళ్లను పంపాయి. గ్రహం లోలోపలి పొరల్లో ఇంకా ఎంతో కొంత నీటి జాడ వుండొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ‘పర్సవరన్స్’ను కూడా సరిగ్గా అలాంటి ప్రాంతాన్ని చూసుకునే దించారు. 350 కోట్ల సంవత్సరాలక్రితం అతి పెద్ద సరస్సు వున్నదని భావించే బిలం అంచుల్లో అది సురక్షితంగా దిగటం శాస్త్రవేత్తల ఘనవిజయమని చెప్పాలి. ఆ దిగే ప్రాంతానికి శాస్త్రవేత్తలు బోస్నియా–హెర్జెగోవినాలోని ఒక పట్టణం పేరైన ‘జెజిరో’గా నామకరణం చేశారు. సరస్సు అని దానర్థం. ఒక పెద్ద స్నానాలతొట్టె ఆకారంలో వున్న ఆ ప్రాంతంలోని రాళ్లలో రహ స్యాలెన్నో దాగివున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటి రసాయన నిర్మాణాన్ని ఛేదిస్తే కోట్లాది సంవత్సరాలక్రితం ఆ సరస్సు ఎలాంటి పరిస్థితుల్లో అంత రించిపోయిందో అంచనా వేయటానికి ఆస్కారం వుంటుందంటున్నారు. ఈ భూగోళంపై కూడా మనిషితో సహా అన్ని జీవులూ నదీ తీరాలను ఆశ్రయించుకుని వుండేవి. అక్కడే తొలి నాగరికతలు వర్థిల్లాయి. అంగారకుడిపై సైతం అదే జరిగివుండాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అరుణగ్రహంపైకి యాత్ర అత్యంత సంక్లిష్టమైనది. దానిపైకి ఇంతవరకూ పంపిన అంతరిక్ష నౌకల్లో 50 శాతం విఫలమయ్యాయి. అందుకే నాసా శాస్త్రవేత్తలు ఈ ఏడు నెలలూ ఊపిరి బిగపట్టి పర్సవరన్స్ గమనాన్ని 24 గంటలూ నిశితంగా పరిశీలిస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు అవసరమైన సందేశాలు పంపుతూ అది సజావుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకూ వివిధ దేశాలు పంపిన రోవర్‌లకన్నా పర్సవరన్స్ చాలా పెద్దది. ఒక కారు సైజున్న ఈ రోవర్‌కు ఒక మినీ హెలికాప్టర్ అమర్చారు. అక్కడి మట్టి నమూనాలను సేకరించడానికి, వాటిని విశ్లేషించి ఎప్పటికప్పుడు సమాచారం నాసాకు చేరేయడానికి అందులో అత్యంతాధునికమైన ఏడు రకాల ఉపకరణాలున్నాయి. ఛాయాచిత్రాలు తీసేందుకు జూమ్ చేయడానికి వీలుండే ఇరవై 3డీ కెమెరాలు, ఆ రోవర్‌ను తాకుతూ వీచే గాలుల ధ్వనిని, మట్టిని సేకరించటానికి రాళ్లను తొలి చినప్పుడు వెలువడే శబ్దాలను రికార్డు చేసేందుకు మైక్రో ఫోన్లు, ఇతర సెన్సర్లు కూడా అమర్చారు. అలాగే అది సేకరించిన నమూనాలను నిక్షిప్తం చేయటానికి చిన్న సైజులోవుండే 43 కంటెయినర్లున్నాయి. అందుకే రోవర్ అనటం దీన్ని ఒక రకంగా చిన్నబుచ్చటమే. ఇది ఏకకాలంలో భిన్నమైన పనులు చేయగల బుద్ధి కుశలతను సొంతం చేసుకున్న ఒక అద్భుత వాహనం. ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్లు, సైంటిస్టులూ పర్సవరన్స్కి అమర్చిన ఉపకరణాలు, దాని వ్యవస్థలూ నిరంతరం రెప్పవాల్చకుండా పర్యవేక్షిస్తుంటారు. ఒకటి రెండు నెలలు గడిచాక రోవర్‌కి అమర్చిన హెలికాప్టర్‌ను విడివడేలా చేస్తారు. అన్నీ సక్రమంగా పనిచేసి రోవర్ నిర్దేశించిన కర్తవ్యాలను పూర్తి చేస్తే అది ఇంతవరకూ మానవాళి సాధించిన విజయాల్లోకెల్లా తలమానికమైనది అవుతుంది. అగ్ని పర్వతాలు బద్దలై లావాలు ప్రవహించిన కారణంగానో, ఒక భారీ గ్రహ శకలం పెను వేగంతో ఢీకొన్న కారణంగానో ఒకప్పుడు నీళ్లు సమృద్ధిగా పారిన అరుణగ్రహం గడ్డ కట్టుకు పోయింది. దాని ఉల్కలు ఇక్కడికి చేరకపోలేదు. కానీ ఇప్పుడు తాను సేకరించే నమూనాలను పర్సవరన్స్ వేర్వేరు కంటెయినర్లలో సీల్ చేస్తుంది. వాటిని నిర్దిష్టమైన ప్రాంతంలో వుంచితే భవి ష్యత్తులో జరిపే అంతరిక్ష ప్రయోగాల ద్వారా వాటిని భూమ్మీదకు తీసుకొస్తారు. ఎంతో ఓర్పుతో, పట్టుదలతో జరగాల్సిన ఈ సుదీర్ఘ ప్రక్రియకు ఇంగ్లిష్‌లో దానికి సమానార్థకమైన పర్సవరన్స్ అని పేరు పెట్టడం సబబైనదే. ఆ పేరుకు తగినట్టే అది మన శాస్త్ర విజ్ఞానంపై కొత్త వెలుగులు ప్రస రించటానికి దోహదపడుతుందని ఆశిద్దాం. -
అంగారకుడిపైకి చైనా!
బీజింగ్: అరుణ గ్రహంపైకి ఓ శోధక నౌకను ప్రయోగించడంలో చైనా గురువారం విజయవంతమైంది. అంగారకుడి చుట్టూ చక్కర్లు కొట్టడంతోపాటు ఆ గ్రహంపై దిగడం తిరగడం ఈ శోధక నౌక ప్రయోగ లక్ష్యం. లాంగ్‌మార్చ్–5 రాకెట్ ద్వారా వెన్‌ఛాంగ్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి గురువారం నింగికి ఎగసిన ఐదు టన్నుల శోధక నౌక అంగారకుడివైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయోగం జరిగిన 36 నిమిషాలకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లతో కూడిన అంతరిక్ష నౌక భూ– అంగారక మార్పిడి కక్ష్యలోకి ప్రవేశించిందని, ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత అంగారక గ్రహాన్ని చేరుకుంటుందని చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం తెలిపింది. తియాన్‌విన్–1 పేరున్న ఈ శోధక నౌక అరుణగ్రహంపై దిగిన తరువాత అక్కడి మట్టిని, గ్రహ అంతర్భాగపు నిర్మాణం, వాతావరణం, నీరు వంటి వేర్వేరు అంశాలపై ప్రయోగాలు జరపనుంది. అంగారక గ్రహ కక్ష్యలోకి చేరిన తరువాత శోధక నౌకలోని ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు విడిపోతాయని, ఆర్బిటర్ కక్ష్యలోనే ఉంటూ ప్రయోగాలు నిర్వహిస్తుందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ తెలిపింది. ల్యాండర్/రోవర్లు తమంతట తాముగా అంగారక గ్రహంపై ల్యాండ్ అవుతాయని తెలిపింది. ఆరు చక్రాలున్న రోవర్ సుమారు 200 కిలోల బరువు ఉంటుంది. మూడు నెలలపాటు అక్కడే తిరుగుతూ ప్రయోగాలు చేయనుంది. -
అంగారకుడిపై జీవం ఉందా?
అంగారకుడిపై జీవం ఉండేదా? ఉందా? దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నామంటున్నారు కొందరు పరిశోధకులు. మరో భూమి కాగలదని భావిస్తున్న అరుణ గ్రహంపై జీవం ఉండటమే కాదు.. ఇప్పుడు అక్కడ శిలీంధ్రాలు పెరుగుతున్నాయని వీరి వాదన. నీళ్లలో పెరిగే నాచు.. పుట్టగొడుగుల్లాంటి శిలీంధ్రాల రూపంలో ఇవి ఉన్నాయని, క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రాల ఆధారంగా వీరు ఈ అంచనాకు వచ్చినట్లు.. జర్నల్ ఆఫ్ ఆస్ట్రో బయాలజీ అండ్ స్పేస్ సైన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ద్వారా వెల్లడైంది. క్యూరియాసిటీ పంపిన కనీసం 15 చిత్రాల్లో అత్యంత సాధారణ స్థాయి జీవం తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ రెజీనా డాస్ చెప్పారు. ఈ రకమైన జీవం ఇప్పుడు కూడా అక్కడ పెరుగుతూ ఉండొచ్చునని.. లేదంటే ఒకప్పుడు అక్కడ మనుగడ సాగించి ఉండవచ్చునని ఆయన అంటున్నారు. వీరి అంచనా ప్రకారం అంగారకుడి వాతావరణంలో ఉన్న మీథేన్ వాయువు ఒక క్రమ పద్ధతిలో హెచ్చుతగ్గులకు లోనవుతోంది. అక్కడి జీవం బతికి ఉన్నప్పుడు ఒకలా, చనిపోయినప్పుడు మరోలా మీథేన్ స్థాయిలు మారుతున్నాయన్నమాట. క్యూరియాసిటీ పంపిన చిత్రాలు మూడు రోజులకు సంబంధించినవైతే.. మొదటి రోజు చిత్రంలోని నాచు కంటే మూడో రోజు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నాసా ఏమంటోంది? రెజీనా డాస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించామని స్పష్టంగా చెబుతున్నప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) దీనిపై వ్యాఖ్యానించలేదు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉల్కా శకలాలు ఢీకొట్టినందున ఒకప్పుడు అంగారకుడిపై జీవం ఉండేందుకు అవసరమైన అన్ని అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అంగారక గ్రహం ఏర్పడిన తొలినాళ్లలో అక్కడి వాతావరణంపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే.. గ్రహశకలాలు ఢీకొట్టడం వల్ల జీవం ఏర్పడేందుకు అత్యంత కీలకమైన నైట్రోజన్ రూపాలు నైట్రైట్లు (ఎన్ఓ2), నైట్రేట్లు (ఎన్ఓ3)లు ఏర్పడతాయని, క్యూరియాసిటీ రోవర్ వీటిని గేల్ క్రేటర్ ప్రాంతంలో సేకరించిన మట్టి, రాతి నమూనాల్లో గుర్తించిందని పేర్కొంది. అంగారకుడిపై అత్యంత పురాతనమైన సరస్సులు, భూగర్భ జలాలు ఉన్నది ఈ గేల్ క్రేటర్లోనే కావడం గమనార్హం. క్యూరియాసిటీ గుర్తించిన నైట్రోజన్ రూపాలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేసింది. ప్రయోగంలో హైడ్రోజన్ ఎక్కువైన కొద్దీ నైట్రేట్లు, నైట్రైట్ల మోతాదు ఎక్కువ కావడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. అంగారకుడిపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులు ఉండేవన్న నిర్ధారణకు వచ్చారు. -
అల్విదా.. అపార్చునిటీ!
వాషింగ్టన్: అంగారక గ్రహానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని మనకు పంపిస్తూ వచ్చిన రోవర్ అపార్చునిటీ గతించినట్లు భావిస్తున్నామని నాసా ప్రకటించింది. ఇది గత 15 ఏళ్లుగా సేవలందిస్తోంది. అపార్చునిటీ ఉన్న పర్సెవరెన్స్ లోయ దక్షిణ భాగంలో ఏడు నెలల క్రితం సంభవించిన భారీ తుపానులో అది దెబ్బతిని ఉంటుం దని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ తుపాను నుంచి వెలువడిన ధూళి, దుమ్ము ఆ ప్రాంతాన్ని కప్పేసిందని, అప్పటి నుంచి దాని సౌర పలకలు సౌరశక్తిని గ్రహించడం కష్టంగా మారడంతో బ్యాటరీల చార్జింగ్ ఆగిపోయిందని వెల్లడించారు. అయితే క్రమంగా తుపాను ఉధృతి తగ్గిన తరువాత రోవర్‌తో సంబంధాల పునరుద్ధరణకు మిషన్ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అపార్చునిటీ నుంచి చివరిసారిగా గతేడాది జూన్ 10న భూమికి సంకేతాలు చేరాయి. ఆ తరువాత రోవర్‌కు సుమారు 600 కమాండ్లు పంపామని నాసా తెలిపింది. డీప్ స్పేస్ నెట్వర్క్(డీఎస్ఎన్) రేడియో సైన్స్ సాయంతో వేర్వేరు పౌనఃపున్యాలు, పోలరైజేషన్లలో అపార్చునిటీ గురించి పరిశోధకులు అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక చివరి ప్రయత్నంగా రాబోయే వారాల్లో మరిన్ని కమాండ్లు పంపాలని కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ పరిశోధకులు సమాయత్తమవుతున్నారు. అపార్చునిటీతో తిరిగి సంబంధాలు పొందేందుకు అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక మార్గాల్ని పరిశీలిస్తామని వారు చెప్పారు. లక్ష్యం 90 రోజులు..కొనసాగింది 5 వేల రోజులు గోల్ఫ్ కారు పరిమాణంలో, ఆరు చక్రాలతో కూడిన అపార్చునిటీ 2004, జనవరి 24న అంగారకుడి ఉపరితలంపై కాలుమోపింది. దీనితో పాటు స్పిరిట్ అనే మరో రోవర్‌ను కూడా పంపారు. అరుణ గ్రహం నుంచి భూమికి సంకేతాలు పంపిన తొలి రోవర్‌గా అపార్చునిటీ గుర్తింపు పొందింది. అంగారకుడిపై 1,006 మీటర్లు ప్రయాణించి, 90 రోజులు సేవలందించేలా దీన్ని రూపొందించారు. కానీ గత ఏడాది ఫిబ్రవరి నాటికే 45 కిలోమీటర్లు ప్రయాణించి 5000వ రోజును పూర్తి చేసుకుంది. సహచర స్పిరిట్ మిషన్ 2011లోనే ముగిసింది. అపార్చునిటీకి కాలం చెల్లినా దాని పనితీరు సంతోషకరంగా సాగిందని ఈ ప్రయోగ ప్రధాన అధ్యయనకర్త స్టీవెన్ డబ్ల్యూ స్క్వైర్స్ చెప్పారు. -
అంగారకుడి కక్ష్యలోకి కారు!
ఇలన్ మస్క్.. హైటెక్ సంచలనాలకు పెట్టింది పేరు. 100 రోజుల్లో 100 మెగావాట్ల బ్యాటరీలను సిద్ధం చేసినా.. మళ్లీ మళ్లీ వాడుకోగల రాకెట్లతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు చేరవేయడమైనా ఆయనకే చెల్లుతుంది. ఇంకొన్నేళ్లలో అంగారకుడిపై మనుషుల కోసం ఓ కాలనీ కూడా కట్టేస్తానని ఇటీవలే ప్రకటించిన మస్క్ తాజాగా ఇంకో సూపర్ ఐడియాను ట్వీటర్లో పంచుకున్నాడు. తన కంపెనీ ‘స్పేస్ ఎక్స్’తయారు చేసే ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా అంగారకుడి కక్ష్యలోకి కారును పంపిస్తానని ప్రకటించాడు. ‘వచ్చే నెలలో ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్‌లో ‘ఫాల్కన్ హెవీ’తొలి ప్రయోగం జరుగుతుంది. నా మిడ్నైట్ చెర్రీ రంగు కారు టెస్లా రోడ్‌స్టర్‌ను అంగారకుడి కక్ష్యలోకి పంపిస్తాను’అని తాజాగా శుక్రవారం మస్క్ ట్వీటర్లో ప్రకటించాడు. ‘లక్ష్యం అంగారకుడి కకే‡్ష్య. పైకి ఎగిరేటప్పుడు పేలిపోకుండా ఉంటే అది వందల కోట్ల సంవత్సరాలు అంతరిక్షంలో ఉండిపోతుంది’అని అభిప్రాయపడ్డారు. కారు ప్రయోగం కష్టమా? మస్క్ కంపెనీ టెస్లా తయారు చేసే రోడ్‌స్టర్ దాదాపు 1,250 కిలోలు ఉంటుంది. 13 అడుగుల పొడవు.. 5.7 అడుగుల వెడల్పు ఉంటుంది. రాకెట్ల ద్వారా మూడు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న తరుణంలో కారును ప్రయోగించడం కష్టమేమీ కాదు.. అయితే దాని వల్ల ప్రయోజనమేంటనే ప్రశ్న. స్పేస్ ఎక్స్ ఇప్పటివరకూ తన ఫాల్కన్–9 వంటి మూడు రాకెట్ల ఇంజన్లను ఒక దగ్గర చేర్చడం ద్వారా ఫాల్కన్ హెవీ రాకెట్ రెడీ అవుతుంది. ఇప్పుడు వాడుతున్న అతిపెద్ద రాకెట్ కంటే ఇది 2 రెట్లు ఎక్కువ చోదక శక్తిని కలిగి ఉంటుందని మస్క్ అంటున్నాడు. అంటే అంతరిక్షంలోకి ప్రవేశించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భవిష్యత్తులో అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు వీటికంటే పెద్దదైన బీఎఫ్ఆర్ రాకెట్లను వాడతామని, గ్రహాంతర ప్రయాణాలతో పాటు భూమ్మీద ఓ మూల నుంచి మరో మూలకు 30 నిమిషాల్లో వెళ్లేందుకు ఇవే ఉపయోగపడతాయని మస్క్ చెప్పాడు. అక్కడేం చేస్తుంది..? ఓ కారును అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడమన్నది ఇదే తొలిసారి. అక్కడ ఈ కారు ఏం చేస్తుందనేది అంతుపట్టని ప్రశ్నే. కక్ష్యలో తిరుగుతూ ఉంటుందా? లేక అరుణ గ్రహంపై పడిపోతుందా? అన్నది తెలియదు. కక్ష్యలోకి ప్రవేశించాలన్నా వేగాన్ని తగ్గించుకునేందుకు కారులో ఓ రాకెట్ ప్యాక్ వంటిది ఉండాలి. లేదంటే ఇది గ్రహపు గురుత్వాకర్షణ శక్తికి లోనై కూలిపోయే ప్రమాదముంది. దీని వెనుక ఉద్దేశం తెలుసుకోవాలంటే మస్క్ చేసే మరో ట్వీట్ కోసం ఎదురు చూడాల్సిందే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశం
-
మహాలయ అమావాస్య అని భయపడ్డారా?
అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా, తొలి ప్రయత్నంలోనే ఆ ఘనతను సాధించిన దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక కక్ష్యలోకి మార్స్ అర్బిటర్ మిషన్ ప్రవేశించడానికి ముందు అందర్నిలోనూ అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడాయి. ఎందుకంటే ఈ ప్రక్రియ మంగళవారం రోజున ప్రారంభమైనదే కాకుండా.. ఈ రోజు మహాలయ అమావాస్య కావడం కూడా కొందర్నిలో అనేక సందేహాలు తలెత్తాయి. అయితే అందరి భయాలను, అంచనాలను, సందేహాలను తలక్రిందులు చేస్తూ పాడ్యమి అమావ్యాస సంధికాలంలో అంగారకుడిని మామ్ విజయవంతమవ్వడంతో ప్రత్యక్షంగా దర్శించుకున్నామని వేద పండితులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం అంగారకుడికి దుష్పలితాలు తగ్గించే విధంగా జరిగాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. అంగారకుడు దుర్గాదేవి సోదరుడని, మంగళవారం అంగారకుడి అనుగ్రహం పొందడం వలన ప్రజలకు దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందన్నారు. అంగారకుడి 9 సంఖ్య అని, ఎక్కువ మంది తొమ్మిదో సంఖ్యకు ప్రాధాన్యమిస్తారని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నమ్మకాలకు తావుందో లేదో కాని.. భారత శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు మామ్ విజయవంత కావడం ద్వారా లభించింది. -
అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించిందిలా...
బెంగళూరు: తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం ఉపరితలానికి 515 కిలో మీటర్ల దూరం, భూమికి 215 కిలోమీటర్ల దూరంలో మామ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు. మంగళవారం ఉదయం 4.17 నిమిషాలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించడం జరిగింది. దాంతో రెడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన యాంటెనాను ఏర్పాటు చేశారు. అంగారక గ్రహం వైపు 6.57 నిమిషాలకు మామ్ దూసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత అంగారక కక్ష్యలోకి వెళ్లడానికి 7.17 నిమిషాలకు ప్రధాన ఇంజన్ పనిచేయడం ప్రారంభించింది. ఈ కీలక ఘట్టంలో 7.12 నిమిషాలకు అంగారక గ్రహంలో గ్రహణం ఏర్పడింది. 7.30 నిమిషాలకు ప్రధాన ఇంజన్ లోని 440 న్యూటన్ లిక్విడ్ అపోజి మోటర్ నిప్పులు గక్కుతూ పనిచేయడం ప్రారంభించింది. ఆతర్వాత 24 నిమిషాలకు అంటే 7.54 గంటలకు అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించింది. మామ్ ప్రయోగం విజయవంతమమైనట్టు యూఎస్, యూరప్, భారత్, ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన ఎర్త్ స్టేషన్లలోని రాడార్స్ కు సిగ్నల్ అందాయి.