బీజింగ్: అరుణ గ్రహంపైకి ఓ శోధక నౌకను ప్రయోగించడంలో చైనా గురువారం విజయవంతమైంది. అంగారకుడి చుట్టూ చక్కర్లు కొట్టడంతోపాటు ఆ గ్రహంపై దిగడం తిరగడం ఈ శోధక నౌక ప్రయోగ లక్ష్యం. లాంగ్‌మార్చ్–5 రాకెట్ ద్వారా వెన్‌ఛాంగ్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి గురువారం నింగికి ఎగసిన ఐదు టన్నుల శోధక నౌక అంగారకుడివైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయోగం జరిగిన 36 నిమిషాలకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లతో కూడిన అంతరిక్ష నౌక భూ– అంగారక మార్పిడి కక్ష్యలోకి ప్రవేశించిందని, ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత అంగారక గ్రహాన్ని చేరుకుంటుందని చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం తెలిపింది.
తియాన్‌విన్–1 పేరున్న ఈ శోధక నౌక అరుణగ్రహంపై దిగిన తరువాత అక్కడి మట్టిని, గ్రహ అంతర్భాగపు నిర్మాణం, వాతావరణం, నీరు వంటి వేర్వేరు అంశాలపై ప్రయోగాలు జరపనుంది. అంగారక గ్రహ కక్ష్యలోకి చేరిన తరువాత శోధక నౌకలోని ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు విడిపోతాయని, ఆర్బిటర్ కక్ష్యలోనే ఉంటూ ప్రయోగాలు నిర్వహిస్తుందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ తెలిపింది. ల్యాండర్/రోవర్లు తమంతట తాముగా అంగారక గ్రహంపై ల్యాండ్ అవుతాయని తెలిపింది. ఆరు చక్రాలున్న రోవర్ సుమారు 200 కిలోల బరువు ఉంటుంది. మూడు నెలలపాటు అక్కడే తిరుగుతూ ప్రయోగాలు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment