Space Research Organisation
-
‘స్పేస్ ఎక్స్’ మరో అద్భుత ప్రాజెక్టు
సాక్షి, న్యూఢిల్లీ : ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష ప్రయోగశాల ‘స్పేస్ ఎక్స్’ మరో అద్భుత ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతోంది. అంగారకుడికిపైకి మానవులను తీసుకెళ్లే మిషన్‌ను చేపట్టి ఇప్పటికే ఎంతో పురోగతిని సాధించిన స్పేస్ ఎక్స్ ప్రపంచంలో ఏ దేశానికైనాసరే గంట లోపల ఆయుధాలు తీసుకెళ్లి దించి వచ్చే రాకెట్‌ను తయారు చేసేందుకు అమెరికా సైన్యంతో ఒప్పందం చేసుకుంది. ఓ చోటుకు ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి తీసుకొచ్చి మళ్లీ ఉపయోగించడంలో ఇప్పటికే విజయం సాధించిన స్పేస్ ఎక్స్ కార్గో రాకెట్ అంటే సరకును రవాణా చేసే రాకెట్‌ను తయారు చేయబోవడం మాత్రం ఇదే మొదటిసారి. చదవండి: విజయవంతంగా రుద్రం-1 క్షిపణి ప్రయోగం అందుకే ఈ ప్రయత్నంలో తనకు అనుబంధంగా కొనసాగుతున్న వైమానిక సంస్థ ఎక్స్ ఆర్క్ సహకారాన్ని కూడా తీసుకుంటోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు 7,500 మైళ్ల దూరంలోని అఫ్ఘానిస్థాన్లోని అమెరికా వైమానిక స్థావరానికి ఆయుధాలను గంటలో చేరవేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రస్తుతం కార్గో విమానం ద్వారా అక్కడికి ఆయుధాలను చేరవేయడానికి 15 గంటల సమయం పడుతోంది. అతి వేగంగా ఆయుధాలను తరలించే అత్యాధునిక కార్గో విమానాలు అమెరికా వద్ద ప్రస్తుతం 233 ఉన్నాయి. అయితే వాటి గరిష్ట వేగం గంటకు 590 మైళ్లే. 80 టన్నుల సరకు రవాణా చేసేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. వచ్చే ఏడాది ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా తీసుకోను -
అంగారకుడిపైకి చైనా!
బీజింగ్: అరుణ గ్రహంపైకి ఓ శోధక నౌకను ప్రయోగించడంలో చైనా గురువారం విజయవంతమైంది. అంగారకుడి చుట్టూ చక్కర్లు కొట్టడంతోపాటు ఆ గ్రహంపై దిగడం తిరగడం ఈ శోధక నౌక ప్రయోగ లక్ష్యం. లాంగ్‌మార్చ్–5 రాకెట్ ద్వారా వెన్‌ఛాంగ్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి గురువారం నింగికి ఎగసిన ఐదు టన్నుల శోధక నౌక అంగారకుడివైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయోగం జరిగిన 36 నిమిషాలకు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లతో కూడిన అంతరిక్ష నౌక భూ– అంగారక మార్పిడి కక్ష్యలోకి ప్రవేశించిందని, ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత అంగారక గ్రహాన్ని చేరుకుంటుందని చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం తెలిపింది. తియాన్‌విన్–1 పేరున్న ఈ శోధక నౌక అరుణగ్రహంపై దిగిన తరువాత అక్కడి మట్టిని, గ్రహ అంతర్భాగపు నిర్మాణం, వాతావరణం, నీరు వంటి వేర్వేరు అంశాలపై ప్రయోగాలు జరపనుంది. అంగారక గ్రహ కక్ష్యలోకి చేరిన తరువాత శోధక నౌకలోని ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు విడిపోతాయని, ఆర్బిటర్ కక్ష్యలోనే ఉంటూ ప్రయోగాలు నిర్వహిస్తుందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ తెలిపింది. ల్యాండర్/రోవర్లు తమంతట తాముగా అంగారక గ్రహంపై ల్యాండ్ అవుతాయని తెలిపింది. ఆరు చక్రాలున్న రోవర్ సుమారు 200 కిలోల బరువు ఉంటుంది. మూడు నెలలపాటు అక్కడే తిరుగుతూ ప్రయోగాలు చేయనుంది. -
5న జీశాట్-16 ప్రయోగం
సూళ్లూరుపేట: దేశంలో ట్రాన్స్‌పాండర్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇస్రో.. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి 3,181.6 కిలోల బరువైన జీశాట్-16 ఉపగ్రహాన్ని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2.08 గంటలకు ప్రయోగించనుంది. ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఏరియన్-5 ఈసీఏ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేస్తున్నారు. బెంగళూరులో తయారుచేసిన జీశాట్-16 ఉపగ్రహాన్ని ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌కు చేర్చారు. ఈ ఉపగ్రహంలో సమాచార వ్యవస్థకు ఉపయోగించే 12 కేయూ బాండ్స్ ట్రాన్స్‌పాండర్స్, 24 సీబాండ్, 12 ఎక్సెటెండెడ్ సీబాండ్ ట్రాన్స్పాండర్లును అమర్చి పంపుతున్నారు. 48 ట్రాన్స్పాండర్లను ఒకేసారి పంపడం ఇదే తొలిసారి. మూడు టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించే సాంకేతిక పరిజ్ఞానం మనవద్ద లేకపోవడంతో ఫ్రాన్స్‌తో ఉన్న ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని అక్కడి నుంచి చేపడుతున్నారు. మనం అత్యంత బరువైన ఉపగ్రహాలను ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి, వాళ్లు అత్యంత చిన్న తరహా ఉపగ్రహాలను మనదేశంలోని శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నారు. స్పాట్-6, స్పాట్-7 వంటి ఫ్రాన్స్ ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి ప్రయోగించిన తెలిసిందే. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగం విజయం సాధిస్తే ఇంతటి బరువైన ఉపగ్రహాలను మనమే అంతరిక్షంలోకి పంపే అవకాశం ఉంటుంది.