ఇలన్ మస్క్.. హైటెక్ సంచలనాలకు పెట్టింది పేరు. 100 రోజుల్లో 100 మెగావాట్ల బ్యాటరీలను సిద్ధం చేసినా.. మళ్లీ మళ్లీ వాడుకోగల రాకెట్లతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు చేరవేయడమైనా ఆయనకే చెల్లుతుంది. ఇంకొన్నేళ్లలో అంగారకుడిపై మనుషుల కోసం ఓ కాలనీ కూడా కట్టేస్తానని ఇటీవలే ప్రకటించిన మస్క్ తాజాగా ఇంకో సూపర్ ఐడియాను ట్వీటర్‌లో పంచుకున్నాడు. తన కంపెనీ ‘స్పేస్ ఎక్స్’తయారు చేసే ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా అంగారకుడి కక్ష్యలోకి కారును పంపిస్తానని ప్రకటించాడు. ‘వచ్చే నెలలో ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్‌లో ‘ఫాల్కన్ హెవీ’తొలి ప్రయోగం జరుగుతుంది. నా మిడ్‌నైట్ చెర్రీ రంగు కారు టెస్లా రోడ్‌స్టర్‌ను అంగారకుడి కక్ష్యలోకి పంపిస్తాను’అని తాజాగా శుక్రవారం మస్క్ ట్వీటర్‌లో ప్రకటించాడు. ‘లక్ష్యం అంగారకుడి కకే‡్ష్య. పైకి ఎగిరేటప్పుడు పేలిపోకుండా ఉంటే అది వందల కోట్ల సంవత్సరాలు అంతరిక్షంలో ఉండిపోతుంది’అని అభిప్రాయపడ్డారు.
కారు ప్రయోగం కష్టమా?
మస్క్ కంపెనీ టెస్లా తయారు చేసే రోడ్‌స్టర్ దాదాపు 1,250 కిలోలు ఉంటుంది. 13 అడుగుల పొడవు.. 5.7 అడుగుల వెడల్పు ఉంటుంది. రాకెట్ల ద్వారా మూడు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న తరుణంలో కారును ప్రయోగించడం కష్టమేమీ కాదు.. అయితే దాని వల్ల ప్రయోజనమేంటనే ప్రశ్న. స్పేస్ ఎక్స్ ఇప్పటివరకూ తన ఫాల్కన్–9 వంటి మూడు రాకెట్ల ఇంజన్లను ఒక దగ్గర చేర్చడం ద్వారా ఫాల్కన్ హెవీ రాకెట్ రెడీ అవుతుంది. ఇప్పుడు వాడుతున్న అతిపెద్ద రాకెట్ కంటే ఇది 2 రెట్లు ఎక్కువ చోదక శక్తిని కలిగి ఉంటుందని మస్క్ అంటున్నాడు. అంటే అంతరిక్షంలోకి ప్రవేశించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భవిష్యత్తులో అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు వీటికంటే పెద్దదైన బీఎఫ్‌ఆర్ రాకెట్లను వాడతామని, గ్రహాంతర ప్రయాణాలతో పాటు భూమ్మీద ఓ మూల నుంచి మరో మూలకు 30 నిమిషాల్లో వెళ్లేందుకు ఇవే ఉపయోగపడతాయని మస్క్ చెప్పాడు.
అక్కడేం చేస్తుంది..?
ఓ కారును అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడమన్నది ఇదే తొలిసారి. అక్కడ ఈ కారు ఏం చేస్తుందనేది అంతుపట్టని ప్రశ్నే. కక్ష్యలో తిరుగుతూ ఉంటుందా? లేక అరుణ గ్రహంపై పడిపోతుందా? అన్నది తెలియదు. కక్ష్యలోకి ప్రవేశించాలన్నా వేగాన్ని తగ్గించుకునేందుకు కారులో ఓ రాకెట్ ప్యాక్ వంటిది ఉండాలి. లేదంటే ఇది గ్రహపు గురుత్వాకర్షణ శక్తికి లోనై కూలిపోయే ప్రమాదముంది. దీని వెనుక ఉద్దేశం తెలుసుకోవాలంటే మస్క్ చేసే మరో ట్వీట్ కోసం ఎదురు చూడాల్సిందే.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment