టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్ ఐ రోబోట్ ఈవెంట్‌లో రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్‌లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది.
కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.
టెస్లా కంపెనీ ఇప్పటివరకు కార్లను తయారు చేయడంలోనే నిమగ్నమైంది. కానీ ఇక నుంచి ప్యాసింజర్ వాహనాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు సంస్థ వాహనాల సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రోబోవ్యాన్‌లో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు.
వ్యక్తిగత అవసరాలతోపాటు వాణిజ్య అవసరాల కోసం, పెద్ద మొత్తంలో రవాణా చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగించేందుకు వీలుగా టెస్లా వాహనాలను తయారు చేయాలని నిర్ణయించుకుంది.
సైబర్ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు మస్క్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలా కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. అందులో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.
గతంలో వార్షిక సాధారణ సమావేశంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు.
రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్‌లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించారు. ఈవీల్లో బ్యాటరీలకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచి వాటి తయారీకి అయ్యే ఖర్చు తగ్గించేందుకు చాలా కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment