అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి.
భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు.
► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్‌లను సేకరించి, పరిశీలించారు.
► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు.
► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు.
► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది.
► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు.
► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు.
► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment