NASA Space
-
మానవ సృష్టి ఉల్కాపాతం
ప్రపంచ చరిత్రలో మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం(మిటియోర్)గా డైమార్ఫోస్ ఉల్కపాతం రికార్డుకెక్కబోతోందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. భూగోళం వైపు దూసుకొస్తూ ముప్పుగా మారిన గ్రహశకలాలను దారి మళ్లించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సైంటిస్టులు డబుల్–అస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్టు(డార్ట్) నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం డైమార్ఫోస్ అనే గ్రహశకలాన్ని (అస్టరాయిడ్) ఎంచుకున్నారు. నిజానికి ఈ అస్టరాయిడ్తో భూమికి ముప్పు లేనప్పటికీ ప్రయోగానికి అనువుగా ఉండడంతో ఎంపిక చేశారు. ‘డార్ట్’లో భాగంగా 2021 నవంబర్ 24న స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. ఇది 2022 సెపె్టంబర్ 26న భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల మైళ్లు) దూరంలో ఉన్న డైమార్ఫోస్‌ను గంటకు 13,645 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ఢీకొట్టింది. దాంతో ఆ గ్రహశకలం దారిమళ్లింది. భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి ముప్పు తప్పించడానికి డార్ట్ ప్రయోగం దోహదపడింది. 10 లక్షల కిలోల రాళ్లు, దుమ్ము ధూళి: నాసా స్పేస్‌క్రాఫ్ట్ అత్యంత వేగంగా ఢీకొట్టడంతో డైమార్ఫోస్ నుంచి చిన్నచిన్న రాళ్లు, దుమ్ము ధూళీ వెలువడుతున్నట్లు గుర్తించారు. 2 మిలియన్ పౌండ్లకు (10 లక్షల కిలోలు) పైగా బరువైన రాళ్లు, దుమ్ము ధూళి వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటిని దాదాపు 7 రైలు పెట్టెల్లో నింపొచ్చు. వీటిలో కొన్ని ఇసుక పరిమాణంలో, మరికొన్ని సెల్‌ఫోన్ పరిమాణంలో ఉంటాయని చెబుతున్నారు. అయితే, డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి చివరకు ఎక్కడికి చేరుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇవి మరో 30 సంవత్సరాల్లోగా భూమి, అంగారక గ్రహాల సమీపంలోకి చేరుకుంటా యని చెబు తున్నారు. కొన్ని రాళ్లు, ధూళి మరో ఏడేళ్లలో అరుణ గ్రహానికి చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరో పదేళ్లలో చిన్నపాటి రాళ్లు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నా రు. చాలా చిన్నవి కావడంతో ఇవి భూమి ని ఢీకొట్టినా ఎలాంటి ప్రమాదం ఉండదని భరో సా ఇస్తున్నారు. డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి ఉలా్కపాతాలుగా మారి భూమి, అంగారక గ్రహంపైకి చేరడం 100 సంవత్సరాలపాటు కొన సాగుతుందని ఇటలీలోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ మిలన్కు చెందిన డీప్–స్పేస్ అస్ట్రోడైనమిక్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ పోస్టు డాక్టోరల్ పరిశోధకుడు అసెన్సియో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యోమగాముల మెదడుకు ముప్పు!
అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్‌లను సేకరించి, పరిశీలించారు. ► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. ► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు. ► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎక్కువ తక్కువ మాట్లాడితే స్పేస్‌స్టేషన్‌ను కూల్చేస్తాం.. బైడెన్‌కు రష్యా దమ్కీ!!
అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా ఆంక్షలు పెడితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను కూల్చేస్తామని హెచ్చరించింది. స్పేస్ స్టేషన్‌ను యూరప్ దేశాలపై కూల్చేస్తే మీకు ఓకేనా అంటూ ప్రశ్నించారు రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ రొగొజిన్. ఆంక్షలతో రష్యాను కట్టడి చేయాలంటే ఫలితం వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ఉక్రెయిన్‌లోని సామాన్య ప్రజలపై రష్యా సైన్యం పాశవిక దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు మద్దతుగా నిలుస్తూ తమకు(నాటోకు) వ్యతిరేకంగా ఉన్న దేశాలకు జో బైడెన్ సుతిమెత్తని హెచ్చరిక చేశారు. అంతేకాదు ఈ అరాచకత్వానికి పుతిన్ కొన్ని నెలల నుంచే ప్రణాళిక రూపొందించారని, 1,75,000 మంది జవాన్లను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించారని చెప్పారు. ఉక్రెయిన్ వల్ల భద్రతకు ప్రమాదం పొంచి ఉందంటూ రష్యా ఒక రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టిందని దుయ్యబట్టారు.అయితే బైడెన్ ఈ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే.. రష్యా బెదిరింపు ధోరణికి దిగింది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ చీఫ్ డిమిత్రి రోగోజిన్ బైడెన్‌కు దమ్కీ ఇచ్చారు. మమ్మల్ని ఆంక్షలతో కంట్రోల్ చేయాలని చూస్తే స్పేస్ స్టేషన్‌ను ఎవరు కాపాడతారు?" అని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు. "మీరు మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే యూఎస్ లేదా, ఐరోపా దేశాల్లో స్పేస్ స్టేషన్ పడకుండా ఎవరు కాపాడతారు? అంటూ రోగోజిన్ ట్వీట్లో పేర్కొన్నారు. యూరప్? భారత్ - చైనా దేశాల మీద 500టన్నుల స్పేస్ స్టేషన్ కూల్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రవర్తనతో వాళ్లను ప్రమాదంలో పడేయాలని అనుకుంటున్నారా?’ ఐఎస్ఎస్ రష్యా మీదగా ఎగరదు, కాబట్టి ప్రమాదాలన్నీ మీకే. మీరు వాటికి సిద్ధంగా ఉన్నారా? అంటూ రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. -
సూర్యుడు ‘చిన్న’బోయాడు!
లండన్: సూర్యుడితో పోల్చి చూస్తే భూమి పరిమాణం గోలీ అంత.. అవునా? మరి మన సూర్యుడు కూడా గోలీ పరిమాణమంత కనిపిస్తే. ఇదేంటనుకుంటున్నారా..? సూర్యుడి కన్నా వంద రెట్లకు పైగా పెద్దవిగా ఉన్న 9 నక్షత్రాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా స్పేస్ టెలిస్కోప్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ సాయంతో సూర్యుడికి 1,70,000 కాంతి సంవత్సరాల దూరంలో ఓ భారీ నక్షత్రాల సముదాయం ఉన్నట్లు కనుగొన్నారు. ఆ సముదాయాన్ని ఆర్136గా గుర్తించారు. ఆ తొమ్మిది నక్షత్రాలు భారీగా ఉన్నాయని, వేడిని ప్రసరిస్తూ ప్రకాశిస్తున్నాయని తెలిపారు. సూర్యుడి కన్నా 50 రెట్లు పెద్ద నక్షత్రాలు డజన్లకొద్దీ ఉన్నాయని, అయితే 9 మాత్రం సూర్యుడికి 100 రెట్లకన్నా పెద్దవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం విశ్వంలో అతిపెద్ద నక్షత్రంగా ఆర్136ఏ1 ఉందని, అది సూర్యుడికి 250 రెట్లు పెద్దదిగా ఉంటుందని చెప్పారు. ఒక నెలకు మన భూమి పరిమాణమంత మెటీరియల్‌ను అవి కోల్పోతాయని, భారీగా బరువు తగ్గిపోతుండటం మూలంగా వాటి జీవితకాలం తక్కువని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్‌కు చెందిన పరిశోధకుడు పౌల్ క్రౌతెర్ తెలిపారు.