Space experiments
-
స్పేస్ ఎక్స్‌తో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్
అమెరికా అంతరిక్ష పరిశోధనల ప్రైవేట్ కంపెనీ స్పేస్ఎక్స్తో.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యింది. అత్యంత అధునాతన భారీ సమాచార ఉపగ్రహం జీశాట్20 (GSAT N2) అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సుమారు 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చీఫ్ సోమనాథ్.. బృందానికి అభినందనలు తెలియజేశారు. Liftoff of GSAT-N2! pic.twitter.com/4JqOrQINzE— SpaceX (@SpaceX) November 18, 2024స్పేస్ఎక్స్ ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ అనేది తెలిసిందే. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. జీశాట్20 బరువు సుమారు 4,700 కేజీలు. ఇస్రోకు అందుబాటులో ఉన్న లాంఛ్ వెహికల్స్ అంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు. అందుకే స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఆ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్20ను నింగిలోకి మోసుకెళ్లింది.Deployment of @NSIL_India GSAT-N2 confirmed pic.twitter.com/AHYjp9Zn6S— SpaceX (@SpaceX) November 18, 2024అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్‌ఎన్2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. అంతేకాదు.. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా ఈ జీశాట్20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. ఇదీ చదవండి: మన బాహుబలికి అంతబలం లేదంట! -
మానవ సృష్టి ఉల్కాపాతం
ప్రపంచ చరిత్రలో మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం(మిటియోర్)గా డైమార్ఫోస్ ఉల్కపాతం రికార్డుకెక్కబోతోందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. భూగోళం వైపు దూసుకొస్తూ ముప్పుగా మారిన గ్రహశకలాలను దారి మళ్లించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సైంటిస్టులు డబుల్–అస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్టు(డార్ట్) నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం డైమార్ఫోస్ అనే గ్రహశకలాన్ని (అస్టరాయిడ్) ఎంచుకున్నారు. నిజానికి ఈ అస్టరాయిడ్తో భూమికి ముప్పు లేనప్పటికీ ప్రయోగానికి అనువుగా ఉండడంతో ఎంపిక చేశారు. ‘డార్ట్’లో భాగంగా 2021 నవంబర్ 24న స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. ఇది 2022 సెపె్టంబర్ 26న భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల మైళ్లు) దూరంలో ఉన్న డైమార్ఫోస్‌ను గంటకు 13,645 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ఢీకొట్టింది. దాంతో ఆ గ్రహశకలం దారిమళ్లింది. భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి ముప్పు తప్పించడానికి డార్ట్ ప్రయోగం దోహదపడింది. 10 లక్షల కిలోల రాళ్లు, దుమ్ము ధూళి: నాసా స్పేస్‌క్రాఫ్ట్ అత్యంత వేగంగా ఢీకొట్టడంతో డైమార్ఫోస్ నుంచి చిన్నచిన్న రాళ్లు, దుమ్ము ధూళీ వెలువడుతున్నట్లు గుర్తించారు. 2 మిలియన్ పౌండ్లకు (10 లక్షల కిలోలు) పైగా బరువైన రాళ్లు, దుమ్ము ధూళి వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటిని దాదాపు 7 రైలు పెట్టెల్లో నింపొచ్చు. వీటిలో కొన్ని ఇసుక పరిమాణంలో, మరికొన్ని సెల్‌ఫోన్ పరిమాణంలో ఉంటాయని చెబుతున్నారు. అయితే, డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి చివరకు ఎక్కడికి చేరుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇవి మరో 30 సంవత్సరాల్లోగా భూమి, అంగారక గ్రహాల సమీపంలోకి చేరుకుంటా యని చెబు తున్నారు. కొన్ని రాళ్లు, ధూళి మరో ఏడేళ్లలో అరుణ గ్రహానికి చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరో పదేళ్లలో చిన్నపాటి రాళ్లు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నా రు. చాలా చిన్నవి కావడంతో ఇవి భూమి ని ఢీకొట్టినా ఎలాంటి ప్రమాదం ఉండదని భరో సా ఇస్తున్నారు. డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి ఉలా్కపాతాలుగా మారి భూమి, అంగారక గ్రహంపైకి చేరడం 100 సంవత్సరాలపాటు కొన సాగుతుందని ఇటలీలోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ మిలన్కు చెందిన డీప్–స్పేస్ అస్ట్రోడైనమిక్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ పోస్టు డాక్టోరల్ పరిశోధకుడు అసెన్సియో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
SPACE DEBRIS: అంతరిక్ష వీధిలో ట్రాఫిక్ జామ్!
అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర రాజ్యాలు మొదలుకుని చిన్నాచితకా దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూ వస్తోంది. అలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్యా విపరీతంగా పెరుగుతోంది. దాంతోపాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణమూ నానాటికీ పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతోపాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపెడుతోంది... 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలెన్నో తెలుసా? ఏకంగా 2,917! అప్పుడెప్పుడో 1957లో అమెరికా తొలిసారిగా స్పుతి్నక్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే కూడా ఒక్క 2023లో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యే చాలా ఎక్కువట! ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి! ఇవిగాక అంతరిక్షానికి చేరాక విఫలమైనవి, కొంతకాలం పాటు పని చేసి చేతులెత్తేసినవి, కాలపరిమితి తీరి భూమితో లింకులు తెగిపోయినవి కనీసం 24 వేల పై చిలుకే ఉంటాయట! ఇవన్నీ కూడా భూమి చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తమ్మీద యాక్టివ్ ఉపగ్రహాలు, వ్యర్థాలూ కలిపి 10 సెంటీమీటర్ల కంటే పెద్ద ‘అంతరిక్ష వస్తువుల’ మొత్తం సంఖ్య 2023 చివరికల్లా ఏకంగా 37 వేలు దాటిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి! అంతకంటే చిన్నవాటి సంఖ్యకైతే అయితే లెక్కాపత్రం లేదు. మొత్తమ్మీద అంతరిక్షంలో ఇలాంటి వ్యర్థాల పరిమాణం 2020 చివరికే 8 వేల టన్నులు దాటిపోయిందట! వీటితో ప్రమాదాలెన్నో... ► అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు ఇన్నీ అన్నీ కావు... ► భూ కక్ష్యలో తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలను ఇవి ఢీకొనే ముప్పుంటుంది. అదే జరిగితే అత్యంత వ్యయప్రయాసలతో ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా తీరిపోతుంది. ► 1981లో కాస్మోస్ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది. ► 1996లో ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహం సెరీస్ను కూడా 1986లో పేలిపోయిన ఏరియన్ ఉపగ్రహపు శకలాలు ఢీకొన్నాయి. ► 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్‌ప్రెస్ కూడా గుర్తు తెలియని శకలం దెబ్బకు శాశ్వతంగా మూగబోయింది. ► 2009లో టెరా, 2010లో ఆరా 2013లో జియోస్ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల బారినపడ్డాయి. ► 2009లోనైతే 950 కిలోల బరువున్న కాస్మోస్ 2251, 560 కిలోల ఇరీడియం33 ఉపగ్రహాలు పరస్పరం ఢీకొని పేలిపోయాయి. వినువీధిలో రెండు భారీ ఉపగ్రహాలు గుద్దుకోవడం అదే తొలిసారి! ► అంతరిక్ష వ్యర్థాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్లకు భూ దిగువ కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపడమే అసంభవంగా మారవచ్చు. ఐఎస్‌ఎస్‌కూ ముప్పే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు కూడా ఈ వ్యర్థాలతో పెను ముప్పే పొంచి ఉండటం మరింత ఆందోళనకరం. 2019 నాటికే ఐఎస్ఎస్ను 1,400కు పైగా బుల్లి వ్యర్థాలు ఢీకొట్టాయట. వీటి బారినుంచి కాపాడుకునేందుకు షీల్డింగ్ వ్యవస్థ ఐఎస్ఎస్లో ఉంది. కానీ ఐఎస్ఎస్ తాలూకు బయటి భాగాలకు మాత్రం ఆ రక్షణ లేదు. పైగా వాటిని వ్యర్థాలు ఢీకొనే ముప్పు మరింత ఎక్కువ! వ్యర్థాలు ఢీకొట్టనున్నాయన్న హెచ్చరికలతో ఐఎస్ఎస్ సిబ్బంది ఇప్పటిదాకా మూడుసార్లు సమీపంలోని సూయజ్ క్యాప్సూల్లోకి వెళ్లి దాక్కోవాల్సి వచి్చంది! రోజుకొకటి చొప్పున భూమిపైకి... ► ఈ అంతరిక్ష వ్యర్థాలు కక్ష్య నుంచి జారి క్రమంగా భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తుంటాయి. ► చిన్నవైతే భూమిదాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి. ► పెద్దవి మాత్రం భూమిపై పడుతుంటాయి. ► అలా గత 50 ఏళ్లుగా సగటున రోజుకు కనీసం మూడు వ్యర్థాలు కక్ష్య కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయట. ► వాటిలో కనీసం ఒక్కటైనా భూమిపై పడుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి! ► ఓజోన్ పొర దెబ్బ తినేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి. ► పైగా ఈ వ్యర్థాల దెబ్బకు సౌర తుఫాన్లు, కాస్మిక్ రేడియేషన్ బారినుంచి భూమిని కాపాడే మాగ్నెటోస్పియర్ కూడా దెబ్బ తింటోందని తాజా అధ్యయనంలో తేలింది. ► ఈ అంతరిక్ష వ్యర్థాల కట్టడికి ఇప్పటిదాకానైతే అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం గానీ, దేశాల మధ్య ఒప్పందాలు గానీ లేవు. ► అయితే ఈ దిశగా ఐరాస తాలూకు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ కమిటీ 2007లో కొన్ని నిర్దేశాలు రూపొందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యోమగాముల మెదడుకు ముప్పు!
అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్‌లను సేకరించి, పరిశీలించారు. ► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. ► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు. ► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచదేశాలకు ‘చెత్త’ సవాల్.. ఆకాశం కూడా ఆగమాగం.. ఏంటీ పరిస్థితి?
భూగోళాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ‘చెత్త’. నానాటికీ పెరుగుతున్న వ్యర్థాలను వదిలించుకునేందుకు చాలా దేశాలు పెద్ద కసరత్తే చేస్తున్నాయి. కాగా.. ఇదే సందర్భంలో అంతరిక్షంలోనూ పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం రోదసీలో 3,409 శాటిలైట్లు చెత్తగా మారిపోయాయి. ఇవికాకుండా దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు, మిలియన్ల కొద్దీ చిన్నపాటి ముక్కలు అంతరిక్షాన్ని కమ్మేశాయి. 2030 నాటికి రోదసీలో ఉండే శాటిలైట్ల సంఖ్య 58 వేలకు దాటిపోవచ్చని అంచనా. దీనివల్ల గగనతలం భవిష్యత్‌లో పెద్ద ముప్పునే ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతి అంతరిక్ష ప్రయోగాలు మానవాళి చరిత్రను సమూలంగా మార్చేశాయి. ఉపగ్రహాల (శాటిలైట్స్) వినియోగంతో టీవీ, ఫోన్, ఇంటర్నెట్, జీపీఎస్ తదితర సేవలతో పాటు ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను ముందే పసిగట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్క క్లిక్‌తో సమస్త సమాచారాన్ని అరచేతిలో చూడగలుగుతున్నాం. ఇదంతా శాటిలైట్స్ వల్లే సాధ్యమైంది. సోవియట్ యూనియన్ 1957 అక్టోబర్ 4న స్పుతి్నక్ శాటిలైట్ ప్రయోగంతో అంతరిక్ష యుగం మొదలైంది. వివిధ దేశాల ఆధ్వర్యంలో మాత్రమే శాటిలైట్ ప్రయోగాలు కొనసాగగా.. ఇటీవల ప్రైవేట్ కంపెనీలు సైతం ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఐక్యరాజ్య సమితి ఔ టర్ స్పేస్ అఫైర్స్ విభాగం లెక్కల ప్రకారం 2022 జనవరి నాటికి భూమి చుట్టూ 8,261 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ‘ఆర్యభట్ట’. 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్టతో మొదలుపెట్టిన భారత్ ఇప్పటివరకు సుమారు 180 శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపించింది. ఇవికాక సుమారు 38 దేశాలకు చెందిన 350కి పైగా శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మనదేశ శాటిలైట్లలో 40 వరకు సేవలందిస్తుండగా.. మిగిలినవి విశ్వంలో నిరుపయోగంగా ఉన్నాయి. నాణేనికి రెండో వైపు.. ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో గగనతలం చెత్తకుప్పగా మారిపోతోంది. యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్ (యూసీఎస్) లెక్కల ప్రకారం స్పేస్‌లో ఉన్న మొత్తం 8,261 శాటిలైట్లలో ప్రస్తుతం 4,852 మాత్రమే సేవలందిస్తున్నాయి. మిగిలిన 3,409 శాటిలైట్లు నిరుపయోగమై వ్యర్థాలుగా మారిపోయాయి. ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు (10 సెం.మీ కంటే పెద్దవి), మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. ఇటీవల అమెజాన్, స్పేస్–ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు అంతరిక్షంలోకి అడుగుపెట్టి శాటిలైట్ల ప్రయోగాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల 2030 నాటికి రోదసీలో శాటిలైట్ల సంఖ్య 58 వేలకు పైగా దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అంతరిక్షంలో స్పేస్ ట్రాఫిక్ పెరిగిపోవడంతోపాటు డెబ్రిస్ (చెత్త)తో నిండిపోతుందని అంచనా. పెనుసవాల్.. స్పేస్ జంక్ అంతరిక్షంలో ఉపగ్రహాలు తిరిగే వృత్తాకార మార్గాన్ని కక్ష్య (ఆర్బిట్) అంటారు. శాటిలైట్స్‌ను మూడు రకాల ఆర్బిట్స్‌లో ఉంచుతారు. ఇవి భూమి నుంచి 300కి.మీ. వరకు లోయర్ ఆర్బిట్, 700–1,000 కి.మీ వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఆర్బిట్స్, 36 వేల కి.మీ. జియో సింక్రనస్ ఆర్బిట్ (కమ్యూనికేషన్ శాటిలైట్స్) ఉంటాయి. ఏటా వందల సంఖ్యలో శాటిలైట్లను కక్ష్యల్లోకి పంపుతుండటంతో వాటి మధ్య దూరం తగ్గిపోయి స్పేస్ ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీంతో కొత్త ఉపగ్రహాలను పంపేటప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షంలో రాకెట్ పరికరాల శిథిలాలను స్పేస్ డెబ్రిస్ అంటారు. ఎక్కువ అంతరిక్ష శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయి. సాఫ్ట్‌బాల్ పరిమాణంలో 34 వేల స్పేస్ డెబ్రిస్ శిథిలాలు ఉన్నాయని, ఒక మిల్లీమీటర్ కంటే పెద్ద పరిమాణంలో 128 మిలియన్ల శిథిలాలు ఉన్నాయని నాసా ప్రకటించింది. ప్రతి 10 వేల శిథిలాలలో ఒకటి ప్రమాదానికి కారణమవుతుందని అంచనా వేసింది. ఇలాంటి శిథిలాలు 1999 నుంచి ఇప్పటిదాకా 25 ఐఎస్ఎస్ను తాకినట్టు స్పేస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుíÙతం చేస్తున్నాయి. ఈ వ్యర్థ రేణువుల్లో కొన్ని గంటకు 40 వేల కి.మీ. వేగంతో భూకక్ష్య వైపు దూసుకొస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అంతర్జాతీయ కమిటీ వాస్తవానికి అంతరిక్ష వ్యర్థాల్లో మూడింటి ఒక భాగం అమెరికా, రష్యాలవే. వేల కి.మీ. వేగంతో తిరుగుతున్న డెడ్ శాటిలైట్లు, రాకెట్ శిథిలాలను తొలగించడం కత్తిమీద సాములా మారింది. దీంతో అమెరికా వివిధ దేశాల స్పేస్ శాస్త్రవేత్తలతో 1993లో ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కో–ఆర్డినేషన్ కమిటీని నియమించింది. ఐక్యరాజ్య సమితి 1959లోనే ‘ఔటర్ స్పేస్ శాంతియుత ఉపయోగాల కమిటీ’ (యూఎన్–సీఓపీయూఓఎస్)ని నియమించింది. ఈ రెండు కమిటీల్లోనూ భారత్ ప్రారంభ సభ్యదేశంగా ఉంది. ఈ కమిటీల్లోని శాస్త్రవేత్తలు అంతరిక్ష శిథిలాల తొలగింపుపై ఓ నివేదికను రూపొందించాయి. దీనిప్రకారం అధునాతన రాడార్లు, టెలిస్కోపులను ఉపయోగించి అంతరిక్ష వ్యర్థాలను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేస్తుంటారు. కాలం చెల్లిన శాటిలైట్లను కక్ష్య నుంచి తప్పించి భూ వాతావరణంలోకి తెచ్చే యోచన జరుగుతోంది. స్పేస్ డెబ్రిస్‌ను తొలగించే యంత్రాంగం ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం వద్దా లేదు. – ఎంవైఎస్ ప్రసాద్, మాజీ డైరెక్టర్, షార్ ‘నాసా’ ట్రాక్ చేస్తోంది స్పేస్‌లోకి వెళ్లిన ప్రతి వస్తువుకు పొజిషనింగ్ నంబర్ ఇచ్చి వాటి కదలికలను అనుక్షణం ‘నాసా’ ట్రాక్ చేస్తోంది. దీనినే స్పేస్ సర్వేలెన్స్ నెట్వర్క్ ట్రాకింగ్ అంటారు. నాసా అంచనా ప్రకారం ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని, ఇవి ట్రాక్ చేయడానికి చిన్నవే అయినా అంతరిక్ష నౌకను దెబ్బతీసేంత పెద్దవని యూఎస్ మిలటరీ సైతం ప్రకటించింది. అంతరిక్ష యాత్రకు ప్రాణాంతకం లేదా విపత్తు కలిగించే వేల వస్తువులు, నష్టాన్ని కలిగించేంత సామర్థ్యం గలవి మిలియన్ల కొద్దీ ఉన్నాయని అంచనా వేసింది. జియో సింక్రనస్ ఆర్బిట్‌లో భారీ బరువుండే ఉప గ్రహాలుంటాయి. ఈ ఆర్బిట్‌లోని పనికిరాని శాటిలైట్లను పైస్థాయికి పంపేస్తారని.. ఇక్కడ డెబ్రిస్‌ని అంచనా వేయలేమని ‘షార్’ మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ చెప్పారు. అయితే, అధిక ‘డెడ్ శాటిలైట్లు’, శిథిలాలు 600–700 కి.మీ. పరిధిలోనే ఉన్నాయని, ఇవే ప్రధాన సమస్య అని ఆయన స్పష్టం చేశారు. -
అంతరిక్షం.. ఆరోగ్యం జాగ్రత్త!
అంతరిక్షం..అబ్బా చూడ్డానికి ఎంత బాగుంటుందో.. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అయితే తెల్లటి సూటులేసుకుని. డింగుడింగుమంటూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే..భలే మజా వస్తుంది కదూ..నిజంగానే.. అక్కడ అంత బాగుంటుందా? లేదా మన కళ్లకు కనిపిస్తున్నదంతా నాణేనికి ఒక వైపేనా.. రండి.. రెండో వైపు చూసి వద్దాం.. నిజానికి సుదీర్ఘకాల స్పేస్‌మిషన్‌ల వల్ల చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లే వ్యోమగాములకు అక్కడ గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం, రేడియోధార్మికత కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. 2022 కల్లా అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో అంతరిక్షంలో ఆరోగ్యపరంగా వ్యోమగాములు ఎదుర్కొనే ఇబ్బందులపై ఓ లుక్కేస్తే.. 1 దృష్టి సమస్యలు శరీరంలోని ద్రవాలు ప్రసరించి తలవైపు వస్తున్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది 2 గుండె మెల్లిగా బలహీనమవుతుంది.ఆకారంలో మార్పులొస్తాయి.గుండె బరువు తగ్గుతుంది. గుండెకొట్టుకునే విధానంలో చాలా మార్పులొస్తాయి. 3 మూత్రపిండాలు క్యాల్షియం ఎక్కువ మొత్తంలో రక్తంలో కలవడం కారణంగా.. కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4 కండరాలు 5–11రోజుల అంతరిక్ష ప్రయాణంలో 20%వరకు కండరాలు బలహీన పడతాయి. 5 వెన్నెముక వెన్నెపూస దాదాపు 5 సెంటీమీటర్లు సాగేందుకు అవకాశం ఉంటుంది. 6 ఎముకలు భూమిపై వృద్ధుల్లో ఏడాదికి ఎముకల బలహీనత 1.5% వరకు ఉంటుంది. అదే అంతరిక్షంలో నెలకు ఇది 1–1.5% ఉంటుంది. - మిషన్ అనంతరం భూమిపైకి తిరిగొచ్చాక ఈ సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావం నుంచి వ్యోమగాములు బయటపడతారు. -
జూలైలో సూర్యుడి చెంతకు..
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక ఘట్టం రానున్న జూలైలో ఆవిష్కృతం కానుంది. ఇప్పటివరకు చేపట్టిన ప్రయోగాలు ఒక ఎత్తయితే.. జూలైలో చేపట్టబోతున్న ఈ ప్రయోగం మరో ఎత్తు. కన్నెత్తి నేరుగా కూడా చూడలేని సూర్యుడిపైనే ఈ ప్రయోగాన్ని చేపట్టనుండటమే దీని ప్రత్యేకత. తొలిసారి సూర్యుడి వాతావరణాన్ని శోధించేందుకు ‘పార్కర్ సోలార్ ప్రోబ్’మిషన్‌ను నాసా చేపట్టనుంది. జూలై 31న చేపట్టనున్న ఈ ప్రయోగం కోసం తుది దశ సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ ప్రయోగానికి సంబంధించిన అంతరిక్ష నౌకను అమెరికా వాయుసేన ఫ్లోరిడాకు తరలించింది. మూడో దశలో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లోని డెల్టా–4 హెవీ లాంచింగ్ వెహికల్‌కు దీనిని అనుసంధానం చేస్తారు. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక కూడా ప్రవేశించని సూర్యుడి కరోనా కక్ష్యలో ఈ నౌక పరిభ్రమించనుంది. ఆ ప్రాంతంలో ఉండే వేడి, రేడియేషన్ తట్టుకుని సౌర గాలులు ఏర్పడటానికి గల ప్రాథమిక కారణాన్ని కనుగొననుంది. రానున్న 2 నెలలు పూర్తిస్థాయిలో నౌకకు పరీక్షలు చేపట్టి.. సూర్యుడి వేడిని తట్టుకునే కీలకమైన థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ (టీపీఎస్)ను ఏర్పాటు చేయనున్నారు. ఏడేళ్ల సుదీర్ఘ సమయంపాటు ఇది సూర్యుడి కరోనా కక్ష్యలో పరిభ్రమించనున్నట్లు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఆండీ డ్రైస్మన్ తెలిపారు. ఏళ్లపాటు శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న అనేక ప్రశ్నలకు ఈ ప్రయోగం ద్వారా సమాధానం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మరోసారి చంద్రుడిపైకి మనుషులు..
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష విధానం మళ్లీ మారిందా? దేశాధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంతకం చేసిన అమెరికా స్పేస్ పాలసీ మాత్రం ఇదే విషయాన్ని చెబుతోంది. అదేంటంటే... అమెరికా మళ్లీ చంద్రుడివైపే దృష్టిసారించింది. నూతన అంతరిక్ష విధానంపై సంతకం చేసిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... అమెరికన్లను చంద్రుడి పైకి తీసుకెళ్లాలని నాసాను కోరారు. ఇప్పటికే నాసా భవిష్యత్తులో ప్రజలను మార్స్‌కు పంపే యోచనలో ఉంది. కాబట్టి ఇప్పుడు అమెరికన్లను చంద్రుడిపైకి పంపితే ఆ ప్రయోగానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘ఈసారి చంద్రుడిపై అమెరికా జెండానే కాదు.. అమెరికన్ పాదాల అచ్చులుకూడా ఉండాలి. మార్స్ మిషన్‌కు సంబంధించి ఓ ఫౌండేషన్‌ను ప్రారంభిస్తాం.’ అని అన్నారు. 1960 నుంచి 1972ల మధ్యలో నిర్వహించిన అపోలో మిషన్లోభాగంగా ఆఖరిసారిగా అమెరికన్ వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లారు. ఆ తర్వాత అమెరికా అంతరిక్ష విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటికే.. అంటే 1969లోనే అమెరికన్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత హారిసన్ ష్మిట్ కూడా చంద్రుడిపై గడిపారు. దీంతో ఇదివరకే సాధించిన మిషన్లను మళ్లీ ప్రారంభిస్తే అందుకు చాలా ఖర్చవుతుందని భావించిన అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రాజెక్ట్‌ను రద్దు చేశారు. దీనికి బదులు 2030లోగా అమెరికన్లను మార్స్‌కు పంపే విషయంపై దృష్టిసారించేలా అంతరిక్ష విధానాన్ని రూపొందించారు. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం మరోసారి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ఇతర దేశాలకు చెందిన ప్రైవేట్ రంగాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని వైట్‌హౌస్ వెల్లడించింది. -
వసుధైక కుటుంబం ఇస్రో
శ్రీహరికోట(సూళ్లూరుపేట): దేశంలోని సగటు మానవుడికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలను అందుబాటులోకి తీసుకొస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వసుధైక కుటుంబం లాంటిదని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రపంచ అంతరిక్ష వారో త్సవాలను సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని కురూప్ ఆడిటోరియంలో బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వారోత్సవాలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ అంతరిక్ష పితామహులు విక్రమ్‌సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రొఫెసర్ సతీశ్ ధావన్ లాంటివారు నాటిన అంతరిక్ష ప్రయోగాల బీజాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగాయన్నారు. మన ఉపగ్రహాల్ని విదేశీ స్పేస్ సెంటర్ల నుంచి ప్రయోగించే స్థాయినుంచి పీఎస్ఎల్వీ రాకెట్లద్వారా 25 దేశాలకు చెందిన 209 విదేశీ ఉపగ్రహాల్ని పంపించే స్థాయికి చేరడంతో ప్రపంచదేశాలు భారత్‌వైపు చూస్తున్నాయని చెప్పారు. 1972లో విద్యార్థిగా ఎక్స్‌కర్షన్‌కు వచ్చి శ్రీహరి కోట రాకెట్ కేంద్రాన్ని సందర్శించిన తాను ఇప్పుడు ఉప రాష్ట్రపతి హోదాలో ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ శ్రీహరికోట నుంచి ప్రయోగించే ఉప గ్రహాలవల్ల సామాన్యులకు సైతం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో కొచ్చిందన్నారు. సభకు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఉప రాష్ట్రపతిని ఇస్రో చైర్మన్ శాలువాతో సత్కరించి జీఎస్ఎల్వీ రాకెట్ నమూనాతో కూడిన జ్ఞాపికను అందజేశారు. గవర్నర్ నరసింహన్‌కు షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ రాకెట్ నమూనా జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, ఏపీ వ్యవసాయ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
అంతరిక్ష రంగంలో బలీయశక్తిగా భారత్
ఏఎన్‌యూ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని షార్ డెరైక్టర్ కున్హి కృష్ణన్ తెలిపారు. వరల్డ్ స్పేస్ వీక్ వారోత్సవాల్లో భాగంగా శ్రీహరికోట షార్ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్పేస్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కున్హికృష్ణన్ మాట్లాడుతూ ఇస్రో ఆధ్వర్యంలో విద్య, పరిశోధన, సామాజికాభివృద్ధి, వ్యవసాయ సంబంధిత అంశాల అబివృద్ధికి సంబంధించిన అనేక పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. షార్‌లో ఇప్పటివరకు 51 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించామని, త్వరలో సింగపూర్‌కు సంబంధించిన 6 ఉపగ్రహాలను ప్రయోగించనున్నామన్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం) ద్వారా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిజ్ఞానంలో అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు శాటిలైట్లు విజయవంతంగా ప్రయోగించామని, వచ్చే ఏడాది మార్చి కల్లా మరో మూడు శాటిలైట్లు ప్రయోగించనున్నామన్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ ద్వారా జీపీఎస్ కంటే మెరుగైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. మార్స్ ద్వారా సూర్యునిపై ఉన్న పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతోందన్నారు. స్పేస్ ఎగ్జిబిషన్ కన్వీనర్ విజయసారధి మాట్లాడుతూ గత 13 సంవత్సరాల చరిత్రలో స్పేస్ ఎగ్జిబిషన్‌ను తొలిసారిగా ఒక విద్యాసంస్థలో నిర్వహిస్తున్నామన్నారు. రెక్టార్ కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ స్పేస్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సిద్దయ్య, షార్ అసోసియేట్ డెరైక్టర్ సుబ్బారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన స్పేస్ ఎగ్జిబిషన్‌కు విద్యార్థినీ విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 20కి పైగా కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఎగ్జిబిషన్‌కు వచ్చి అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన పరికరాలను వీక్షించారు. ఎగ్జిబిషన్లో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, రీశాట్ తదితర ఉపగ్రహాల నమూనాలను ఉంచారు. 1957 నుంచి ఇప్పటివరకు ఇస్రో ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాలను షార్ శాస్త్రవేత్తలు వివరించారు. -
ప్రతిసృష్టికి రంగం సిద్ధమైందా?
2014 ‘శాస్త్ర’ రౌండప్ అంతరిక్షంపై జ్ఞానం మరింత పెరిగిన ఏడాది ఇది...శాస్త్ర, సాంకేతిక ప్రపంచాల్లోనూ మనిషి సత్యాన్వేషణ మరింత పదునెక్కింది. చిక్కుముళ్లను విప్పే ప్రయత్నాలు ఊపందుకోగా... చికాకుపెట్టే వ్యాధులకు చెక్ పెట్టడంలోనూ ఎంతో కొంత విజయం సాధించాడు. మొత్తమ్మీద శాస్త్ర రంగంలో ఈ ఏడాది పరిణామాలు... ఎంతో మోదం... కొంచెం ఖేదం అని చెప్పకతప్పదు అదెలాగో.. ఆ ఘన విజయాలేమిటో... నిరాశపరిచిన అంశాలేమిటో మీరే చూడండి మరి....! టూకీగా... ⇒ మనిషి మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్‌లను అంతర్జాతీయ సంస్థ ఐబీఎం ఈ ఏడాది తొలిసారి డిజైన్ చేసింది. ⇒ వినూత్నమైన సాఫ్ట్వేర్ సాయంతో ఇంజినీర్లు ఒకదానితో ఒకటి సహకరించుకునే రోబోలకు రూపకల్పన చేశారు. ఈ రోబోల బృందానికి సమాచార సేకరణతోపాటు ప్రత్యేక ఆకారాల్లోకి మారిపోయే సామర్థ్యం ఉంటుంది. ⇒ కొండంత సైజున్న రాక్షసబల్లులు కాలక్రమంలో అందమైన పక్షుల్లా ఎలా మారిపోయాయో శాస్త్రవేత్తలు ఈ ఏడాది వివరించారు. ఇండొనేషియాలోని గుహల్లో కనిపించిన కుడ్యచిత్రాలు మనిషి సాంస్కృతిక జీవన కాలాన్ని నాలుగు రెట్లు వెనక్కు నెట్టాయి. ⇒ పాత జ్ఞాపకాలను చెరిపేసి, కొత్త వాటిని మెదళ్లలోకి జొప్పించేందుకు ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ⇒ అద్దె గర్భంలో పిండాలను పెంచి జన్మనివ్వడం గురించి మనకు తెలుసు. అయితే ఈ ఏడాది తొలిసారి ఓ మహిళ వేరొకరి గర్భాశయాన్ని అమర్చుకుని దానిద్వారా బిడ్డను ప్రసవించింది. టెస్ట్‌ట్యూబ్‌లలో కాకుండా సొంతంగా బిడ్డను కనాలనుకునే మహిళల (గర్భాశయ లోపాలున్నవారు లేదా అసలు గర్భాశయమే లేనివారు) ఆశలు నెరవేరే సమయం దగ్గరలోనే ఉందన్నమాట. ⇒ ఉపగ్రహమంటే భారీసైజుండాలన్న భావనకు ఫుల్స్టాప్ పడిన సంవత్సరం కూడా ఇదే. కేవలం పది సెంటీమీటర్ల సైజు... ఇంకా చెప్పాలంటే ఓ స్మార్ట్‌ఫోన్ సైజు మాత్రమే ఉండే ఉపగ్రహాలు ఎన్నో ఈ ఏడాది నింగికెగశాయి. అంతరిక్షంపై త్రివర్ణ పతాకం.... అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తన ముద్రను బలంగా చాటిన సంవత్సరమిది. గత ఏడాది ప్రయోగించిన మామ్ ఉపగ్రహాన్ని కూడా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టగలగడం మన సాంకేతిక పరిజ్ఞానానికి మేలిమి నిదర్శనం. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ తనదైన పరిణితిని కనపరచిన ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్‌ను కూడా పరీక్షించి చూసింది. దీంతోపాటు ప్రాంతీయ జీపీఎస్ వ్యవస్థకు అవసరమైన రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలతోపాటు మిలటరీ అవసరాలు కూడా అనేకం తీరతాయని అంచనా. అడకత్తెరలో భూమి భవిష్యత్తు... భూ తాపోన్నతి, దాని విపరిణామాల గురించి ప్రపంచానికి తెలియజేసిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమెట్ ఛేంజ్ (ఐపీసీసీ) తాజాగా 2014లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ధనిక, పేద దేశాల తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోకపోతే 2100 నాటికి భూమి సరిదిద్దుకోలేని పరిస్థితికి చేరుకుంటుందని ఈ తాజా నివేదిక స్పష్టంగా హెచ్చరించింది. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని, లేకుంటే వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రమవుతుందని తెలిపింది. మరోవైపు ఈ నెలలో పెరూ రాజధాని లిమాలో సమావేశమైన ప్రపంచదేశాలు వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రతిసృష్టికి కొత్త రెక్కలు... సృష్టికి ప్రతిసృష్టి చేయాలన్న మనిషి ఆశలకు కొత్త రెక్కలు వచ్చిన ఏడాది ఇది. కృత్రిమ జీవశాస్త్ర రంగంలో నమోదైన రెండు ఘన విజయాలు భవిష్యత్తులో కొత్తరకం జీవజాతుల సృష్టికి నాందీ వాక్యం పలికాయి. మే లో కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం తొలిసారి ప్రకృతిలో ఇప్పటివరకూ లేని విధంగా మొత్తం ఆరు రసాయనలతో ఈ కోలీ సూక్ష్మజీవి డీఎన్ఏను మార్చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో వినూత్న లక్షణాలున్న మూలకాలు, పదార్థాలను తయారు చేయడం వీలవుతుందని అంచనా. మరోవైపు ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందమొకటి కృత్రిమ ఈస్ట్ క్రోమోజోమ్‌ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించారు. ఇది భవిష్యత్తులో చౌకైన వ్యాక్సీన్లు, జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడుతుందని అంచనా. అంతరిక్షంలో చీకటి వెలుగులు... అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు సాధించాయి. ప్రైవేట్ కంపెనీలు పోటాపోటీగా జరుపుతున్న ప్రయోగాలు కొన్ని విజయం సాధించగా మరికొన్ని చతికిలబడ్డాయి. వర్జిన్ గలాటిక్ అంతరిక్ష నౌక నవంబరు నెలలో నింగికెగసి ముక్కలై నేలకొరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు పెలైట్లు మరణించారు. మరోవైపు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మూడుసార్లు సామగ్రి రవాణా చేయగలిగింది. అక్టోబరులో జరిగిన నాలుగో ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. ఇంకోవైపు అంతరిక్ష వాహక నౌకలన్నీ మూలనపడ్డ నేపథ్యంలో నాసా అభివృద్ధి చేసిన సరికొత్త వాహకనౌక ఓరియన్ తొలి ప్రయోగం విజయవంతం కావడం విశేషం. తోకచుక్కపై మనిషి ముద్ర... తోకచుక్కను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం జరిగింది. రోసెట్టా అనే అంతరిక్ష నౌక నవంబరు 12న 67పీ పేరుగల తోకచుక్కను సమీపించింది. ఆ వెంటనే దాంట్లోంచి ఫిలే ప్రొబ్ వేరుపడింది. దీంతో పరిశోధకుల్లో ఉత్సాహం ఉరకలెత్తినా, వెంటనే దాంతో సంబంధాలు తెగిపోవడంతో ఉసూరుమన్నారు. లభించిన కొద్ది సమయంలోనే శాస్త్రవేత్తలు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. ఈ పరిశోధనల కారణంగా తోకచుక్కల్లోనూ కర్బన ఆధారిత మూలకాలు ఉన్నట్లు స్పష్టమైంది. భూమిపై కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డ నీటికి కూడా తోకచుక్కలు కారణం కాకపోవచ్చునని తేలింది. మధుమేహానికి మూలకణ చికిత్స! హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అక్టోబరులో మధుమేహంపై కీలక పరిశోధనలో విజయం సాధించారు. క్లోమగ్రంథిలోని బీటా కణాలు రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను నియంత్రిస్తూంటాయి. అయితే టైప్-1 మధుమేహ వ్యాధిగ్రస్థుల్లోని రోగ నిరోధక వ్యవస్థ ఈ బీటా కణాలను నాశనం చేస్తూంటుంది.ఈ సమస్యను అధిగమించేందుకు హార్వర్డ్ శాస్త్రవేత్తలు పిండమూల కణాలనే బీటా కణాలు మార్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రోగి శరీరంలోకి జొప్పించేందుకు సరిపడా కణాలను తయారుచేయగలిగినప్పటికీ ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. తొడుక్కునే గాడ్జెట్ల హవా... టెక్నాలజీ రంగంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల స్థానాన్ని తొడుక్కునే గాడ్జెట్లు (వేరబుల్ గాడ్జెట్స్)లు ఆక్రమించాయి. దిగ్గజ కంపెనీలన్నీ ఏదో ఒక రూపంలో స్మార్ట్‌వాచీలు, ఫిట్నెస్ గాడ్జెట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. మూర్ఛరోగ లక్షణాలు మొదలుకొని గుండెచప్పుడును నిరంతరం పరిశీలించడం వరకూ రకరకాల పనులు చేసిపెట్టగల ఈ గాడ్జెట్లు కొత్త సంవత్సరంలోనూ సంచలనాలు సృష్టిస్తాయనడంలో సందేహం లేదు. యువరక్తం మంచిదే..! ఈ ఏడాది జరిగిన ఓ ప్రయోగం మొత్తం పరిస్థితిని మార్చేసింది. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జంతువులపై జరిపిన ప్రయోగాల్లో యువరక్తంతో వృద్ధాప్య లక్షణాలను వెనక్కు తిప్పవచ్చునని నిరూపించారు. యువరక్తం లేదా రక్తంలోని కొన్ని రకాల పదార్థాలను ముసలి ఎలుకల్లోకి చేర్చినప్పుడు వాటి మెదడు క్రియలు మళ్లీ చురుకెత్తాయని, కండరాల పటుత్వం కూడా పెరిగిందని స్టాన్‌ఫర్డ్ ప్రయోగాలు నిరూపించాయి. అంటే వృద్ధాప్య సమస్యలకు యువరక్తం విరుగుడుగా పనిచేస్తుందన్నమాట. మానవుల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వస్తే..? ఏమో! కొత్త సంవత్సరంలో చూద్దాం!! అంకెల్లో 2014 30.1 కోట్లు... ఈ ఏడాది చివరి మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన స్మార్ట్ఫోన్ల సంఖ్య ఇది. ప్రముఖ నెట్ సెకూరిటీ సంస్థ గార్ట్నర్ అంచనాల ప్రకారం ఇది గత ఏడాది కంటే 20 శాతం ఎక్కువ. మూడేళ్లలోపు మొబైల్ ఫోన్లలో స్మార్ట్ఫోన్ల వాటా ప్రస్తుతపు 66 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని అంచనా. రూ.1500.. మన జన్యుక్రమ సమాచారాన్ని ఏడాదిపాటు భద్రంగా దాచి ఉంచేందుకు గూగుల్ జినోమిక్స్ వసూలు చేసే మొత్తమిది. ఈ సమాచారంతో రాబోయే జబ్బుల గురించి ముందే తెలుసుకోవచ్చు. మేలైన చికిత్స మార్గాలూ వెతుక్కోవచ్చు. ఇదిలా ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా లక్ష మంది పౌరుల జన్యుక్రమాలను నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 440 కోట్ల టెరాబైట్లు.. ఫేస్బుక్ కామెంట్లు మొదలుకొని వికీపీడియాలోని సమాచారం వరకూ డిజిటల్ ప్రపంచం మొత్తమ్మీద నిక్షిప్తమై ఉన్న ఇన్ఫర్మేషన్ మోతాదు ఇది. ఇంటర్నేషన్ డేటా కార్పొరేషన్ అంచనా ప్రకారం ఈ సమాచారం ఏడాదికి 40 శాతం చొప్పున పెరుగుతోంది. 2030 చైనా విడుదల చేసే గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పతాక స్థాయికి చేరే ఏడాది ఇది. భూతాపోన్నతి ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ అంతే వేగంగా వాతావరణానికి హాని చేసే విషవాయువులను వెదజల్లుతోంది. 1990 నుంచి ఏటా పెరుగుతున్న ఈ ఉద్గారాలకు కళ్లెం వేయకపోతే కష్టమే. ఉద్గారాల తగ్గింపునకు అమెరికా, చైనాలు ఒక ఒప్పందానికి రావడం పర్యావరణపరంగా ఈ ఏడాది హాట్‌టాపిక్‌గా నిలిచింది. 40 శాతం సోలార్ ప్యానెల్స్ ఈ ఏడాది సృష్టించిన రికార్డు ఇది. తమపై పడే సూర్యరశ్మిలో విద్యుత్తుగా మార్చే సామర్థ్యం 40 శాతానికి చేరింది. రేపటి హరివిల్లు... 2009లో కనుక్కున్న పెరోవిస్కైట్, కాడ్మియం టెలూరైడ్ వంటి పదార్థాల కారణంగా ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఎంత మంచి సోలార్ ప్యానెల్ సామర్థ్యమైనా 15 శాతానికి మించని నేపథ్యంలో ఇది నిజంగానే శుభవార్త. 2014... వాతావరణ రికార్డులు నమోదు చేయడం మొదలుపెట్టిన తరువాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరం ఇదే. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉష్ణోగ్రత రికార్డులు బద్దలైపోగా, అదే సమయంలో కొన్నిచోట్ల అతిశీతల వాతావరణం, కాశ్మీర్ వంటిచోట్ల కుంభవృష్టి, వరదలతో వాతావరణం మనిషిని బెంబేలెత్తించింది. రేపటి హరివిల్లు... అంధత్వంపై మలి సమరం.. అంధత్వంపై మనిషి మలిసమరం కొత్త ఏడాదిలో మొదలుకానుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్యారిస్‌లో జన్యుశాస్త్రం ఆధారంగా అంధత్వ నివారణ ప్రయోగాలు జరగనున్నాయి. కళ్లల్లో కాంతికి స్పందించే కణాల్లో తేడా వస్తే వచ్చే అంధత్వం (రెటినిటిస్ పిగ్మెంటోసా) ఉన్నవారిపై జెన్సైట్ అనే సంస్థ ఈ ప్రయోగాలు చేయనుంది. వెలుతురు పడగానే స్పందించి ప్రత్యేకమైన ప్రొటీన్లను తయారు చేసే ఓ జన్యువును జొప్పించడం ద్వారా కోల్పోయిన దృష్టిని తిరిగి తేగలమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ రకమైన ప్రయోగం మృతుల నుంచి వెలికితీసిన కనుగుడ్లలో విజయం సాధించినప్పటికీ సాధారణ మానవుల్లో ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియదు. పైగా ఈ ప్రయోగం తరువాత కనిపించే దృశ్యాలు కేవలం బ్లాక్ అండ్ వైట్‌లో మాత్రమే ఉంటాయన్న అంచనాలున్నాయి. మెదడుకు అందే కాంతి సంకేతాల తీవ్రతను మార్చడం ద్వారా ఈ సమస్యను మార్చవచ్చునని జెన్సైట్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్లూటో తొలిఫోటో ఈ ఏడాదే... మన సౌరకుటుంబంలోని చిట్టచివరి ఖగోళ వస్తువు... ప్లూటో ఫోటో ఇప్పటివరకూ మన వద్ద లేదంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ వచ్చే ఏడాది ఈ పరిస్థితి మారనుంది. నాసా ప్రయోగించిన న్యూహొరైజన్స్ ప్రోబ్ తొలిసారి ఈ మినీగ్రహం ఫొటోను తీసి పంపనుంది. జూలై 14న ఆ గ్రహం దగ్గరగా వెళ్లినప్పుడు అత్యంత స్పష్టమైన ఫొటోలు తీయడం వీలవుతుందని, ఫిబ్రవరి నుంచి మే నెల మధ్యలో కొంత తక్కువ రెజల్యూషన్ గల ఫొటోలు లభిస్తాయని నాసా చెబుతోంది. మలేరియా టీకా వచ్చేస్తోంది.. ఏటా లక్షల మంది మరీ ముఖ్యంగా పిల్లల ప్రాణాలు బలితీసుకుంటున్న మలేరియా మహమ్మారిని అంతమొందించే దిశగా అభివృద్ధి చేసిన తొలి టీకా 2015లో అందుబాటులోకి రానుంది. గ్లాస్గో స్మిత్క్లైమ్ బీచెమ్ (జీఎస్కే) కంపెనీ ‘పాథ్ మలేరియా ఇనిషియేటివ్’ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను ఆఫ్రికాలోని 11 దేశాల్లో దాదాపు 15 వేల మందిపై ప్రయోగించి చూశారు. ముందుగా యూరోపియన్ దేశాల్లో వినియోగంలోకి తీసుకువస్తారు. ఆ తరువాత ఆఫ్రికాదేశాల్లోనూ అందుబాటులోకి వస్తుంది.