వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష విధానం మళ్లీ మారిందా? దేశాధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంతకం చేసిన అమెరికా స్పేస్ పాలసీ మాత్రం ఇదే విషయాన్ని చెబుతోంది. అదేంటంటే... అమెరికా మళ్లీ చంద్రుడివైపే దృష్టిసారించింది. నూతన అంతరిక్ష విధానంపై సంతకం చేసిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... అమెరికన్లను చంద్రుడి పైకి తీసుకెళ్లాలని నాసాను కోరారు. ఇప్పటికే నాసా భవిష్యత్తులో ప్రజలను మార్స్‌కు పంపే యోచనలో ఉంది. కాబట్టి ఇప్పుడు అమెరికన్లను చంద్రుడిపైకి పంపితే ఆ ప్రయోగానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
‘ఈసారి చంద్రుడిపై అమెరికా జెండానే కాదు.. అమెరికన్ పాదాల అచ్చులుకూడా ఉండాలి. మార్స్ మిషన్‌కు సంబంధించి ఓ ఫౌండేషన్‌ను ప్రారంభిస్తాం.’ అని అన్నారు. 1960 నుంచి 1972ల మధ్యలో నిర్వహించిన అపోలో మిషన్‌లోభాగంగా ఆఖరిసారిగా అమెరికన్ వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లారు. ఆ తర్వాత అమెరికా అంతరిక్ష విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటికే.. అంటే 1969లోనే అమెరికన్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత హారిసన్ ష్మిట్ కూడా చంద్రుడిపై గడిపారు.
దీంతో ఇదివరకే సాధించిన మిషన్‌లను మళ్లీ ప్రారంభిస్తే అందుకు చాలా ఖర్చవుతుందని భావించిన అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రాజెక్ట్‌ను రద్దు చేశారు. దీనికి బదులు 2030లోగా అమెరికన్లను మార్స్‌కు పంపే విషయంపై దృష్టిసారించేలా అంతరిక్ష విధానాన్ని రూపొందించారు. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం మరోసారి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ఇతర దేశాలకు చెందిన ప్రైవేట్ రంగాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని వైట్‌హౌస్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment