ఏఎన్‌యూ
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని షార్ డెరైక్టర్ కున్హి కృష్ణన్ తెలిపారు. వరల్డ్ స్పేస్ వీక్ వారోత్సవాల్లో భాగంగా శ్రీహరికోట షార్ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్పేస్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కున్హికృష్ణన్ మాట్లాడుతూ ఇస్రో ఆధ్వర్యంలో విద్య, పరిశోధన, సామాజికాభివృద్ధి, వ్యవసాయ సంబంధిత అంశాల అబివృద్ధికి సంబంధించిన అనేక పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.
షార్‌లో ఇప్పటివరకు 51 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించామని, త్వరలో సింగపూర్‌కు సంబంధించిన 6 ఉపగ్రహాలను ప్రయోగించనున్నామన్నారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ (ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం) ద్వారా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిజ్ఞానంలో అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు శాటిలైట్లు విజయవంతంగా ప్రయోగించామని, వచ్చే ఏడాది మార్చి కల్లా మరో మూడు శాటిలైట్లు ప్రయోగించనున్నామన్నారు.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా జీపీఎస్ కంటే మెరుగైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. మార్స్ ద్వారా సూర్యునిపై ఉన్న పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతోందన్నారు. స్పేస్ ఎగ్జిబిషన్ కన్వీనర్ విజయసారధి మాట్లాడుతూ గత 13 సంవత్సరాల చరిత్రలో స్పేస్ ఎగ్జిబిషన్‌ను తొలిసారిగా ఒక విద్యాసంస్థలో నిర్వహిస్తున్నామన్నారు. రెక్టార్ కేఆర్‌ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ స్పేస్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సిద్దయ్య, షార్ అసోసియేట్ డెరైక్టర్ సుబ్బారెడ్డి తదితరులు ప్రసంగించారు.
ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన
స్పేస్ ఎగ్జిబిషన్‌కు విద్యార్థినీ విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 20కి పైగా కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఎగ్జిబిషన్‌కు వచ్చి అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన పరికరాలను వీక్షించారు. ఎగ్జిబిషన్‌లో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, రీశాట్ తదితర ఉపగ్రహాల నమూనాలను ఉంచారు. 1957 నుంచి ఇప్పటివరకు ఇస్రో ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాలను షార్ శాస్త్రవేత్తలు వివరించారు.
అంతరిక్ష రంగంలో బలీయశక్తిగా భారత్
Published Sun, Oct 11 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM
Advertisement
Advertisement