Exhibition space
-
అంతరిక్ష రంగంలో బలీయశక్తిగా భారత్
ఏఎన్‌యూ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని షార్ డెరైక్టర్ కున్హి కృష్ణన్ తెలిపారు. వరల్డ్ స్పేస్ వీక్ వారోత్సవాల్లో భాగంగా శ్రీహరికోట షార్ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్పేస్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కున్హికృష్ణన్ మాట్లాడుతూ ఇస్రో ఆధ్వర్యంలో విద్య, పరిశోధన, సామాజికాభివృద్ధి, వ్యవసాయ సంబంధిత అంశాల అబివృద్ధికి సంబంధించిన అనేక పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. షార్‌లో ఇప్పటివరకు 51 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించామని, త్వరలో సింగపూర్‌కు సంబంధించిన 6 ఉపగ్రహాలను ప్రయోగించనున్నామన్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం) ద్వారా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిజ్ఞానంలో అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు శాటిలైట్లు విజయవంతంగా ప్రయోగించామని, వచ్చే ఏడాది మార్చి కల్లా మరో మూడు శాటిలైట్లు ప్రయోగించనున్నామన్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ ద్వారా జీపీఎస్ కంటే మెరుగైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. మార్స్ ద్వారా సూర్యునిపై ఉన్న పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతోందన్నారు. స్పేస్ ఎగ్జిబిషన్ కన్వీనర్ విజయసారధి మాట్లాడుతూ గత 13 సంవత్సరాల చరిత్రలో స్పేస్ ఎగ్జిబిషన్‌ను తొలిసారిగా ఒక విద్యాసంస్థలో నిర్వహిస్తున్నామన్నారు. రెక్టార్ కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ స్పేస్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సిద్దయ్య, షార్ అసోసియేట్ డెరైక్టర్ సుబ్బారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన స్పేస్ ఎగ్జిబిషన్‌కు విద్యార్థినీ విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 20కి పైగా కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఎగ్జిబిషన్‌కు వచ్చి అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన పరికరాలను వీక్షించారు. ఎగ్జిబిషన్లో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, రీశాట్ తదితర ఉపగ్రహాల నమూనాలను ఉంచారు. 1957 నుంచి ఇప్పటివరకు ఇస్రో ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాలను షార్ శాస్త్రవేత్తలు వివరించారు. -
ఆరున్నర కోట్ల ఏళ్ల నాటి అద్భుతాలు..!
ఆదిలాబాద్ అడవుల్లో బయటపడ్డ అద్భుత వృక్ష శిలాజాలు హైదరాబాద్: రాక్షస బల్లులు.. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమండలంపై ఠీవిగా తిరుగాడిన జీవులు. ప్రస్తుతం శిలాజాల రూపంలో వాటి జాడలు ప్రదర్శన శాలలకే పరిమితమయ్యా యి. హాలీవుడ్ దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లాంటి వారు వెండితెర అద్భుతాలు సృష్టించడంతో ప్రజ లు డైనోసార్లను ‘సజీవంగా’ చూసిన అనుభూతి పొందారు. అన్ని కోట్ల ఏళ్లుగా వాటి అస్థిపంజరాలు పదిలంగా ఉన్నట్టే.. ఆ కాలంలో మనుగడ సాగిం చిన వృక్షాల జాడలూ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటినే వృక్ష శిలాజాలు(ఫాసిల్ వుడ్)గా పేర్కొంటారు. అబ్బురపరిచే అలాంటి వృక్ష శిలాజాల జాడలు తాజాగా ఆదిలాబాద్ అడవుల్లో వెలుగుచూశాయి. ప్రస్తుతం హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్లో ఉన్న రాక్షస బల్లి శిలాజం ఆదిలాబాద్ జిల్లా వేములపల్లి అడవిలో దొరికిందే. తాజాగా అక్కడికి చేరువలోనే ఉన్న బెజ్జూరు మండలం కొండపల్లి అడవిలో విస్తారంగా ఉన్న వృక్ష శిలాజాల జాడ తెలిసింది. ఇవి దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కంటే పూర్వం నాటివిగా భావిస్తున్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో అన్వేషిస్తే 15 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాలకు చెందిన వృక్ష శిలాజాలు వెలుగుచూశాయి. సమీపంలోని చిన్న వాగు ఉధృతంగా ప్రవహించటంతో భూమి కోతకు గురై భూగర్భం లో పది అడుగుల లోపలున్న ఈ శిలాజాలు బయటపడ్డాయి. కొన్ని శిలాజాలు తొమ్మిది నుంచి 25 అడుగుల పొడవుంటే, మరికొన్ని 50 అడుగుల పొడవు ఉండి ముక్కలైనట్టు కనిపిస్తున్నాయి. వీటిల్లో ఎక్కువగా కోనిఫర్ జాతికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ వృక్ష కాండాల కైవారం 5 అడుగుల వరకు ఉండటం విశేషం. స్థానిక అటవీ శాఖ అధికారి అప్పయ్య తొలుత వీటిని గుర్తించారు. ఆ శాఖ సిబ్బంది ప్రసాద్, హసన్, వన సంరక్షణ సమితి సభ్యుడు సుధాకర్ తదితరుల సాయంతో కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు వేముగంటి మురళి, హరగోపాల్ వీటిని వెలుగులోకి తెచ్చారు. వయసు అంచనా ఇలా.. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో గడ్చిరోలికి 15 కి.మీ. దూరంలో ప్రాణహిత-గోదావరి బేసిన్లో ఉన్న వడధామ్‌లో సారోపోడ్స్ సరీసృపాల జాడలు గతంలో వెలుగుచూశాయి. వాటి శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు. అవి మేత కోసం ఆధారపడే జాతి వృక్ష శిలాజాలను కూడా అక్కడ కనుగొన్నారు. అవి ఆరున్నర కోట్ల ఏళ్లకుపైగా చెందినవిగా గుర్తించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని వడధామ్ ఫాసిల్ పార్కుగా మార్చింది. ఇది కొండపల్లి అడవికి చేరువగా ఉన్నందున ఇక్కడి వృక్ష శిలాజాల వయసు కూడా అంతే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మనదేశంలో హిమాచల్‌ప్రదేశ్‌లో శివాలిక్ ఫాసిల్ పార్కు, ఉత్తరప్రదేశ్‌లో సల్కాన్ ఫాసిల్ పార్కు, గుజరాత్లో ఇంద్రోడ డైనోసార్ అండ్ ఫాసిల్ పార్కు, మధ్యప్రదేశ్‌లో మాండ్లె ప్లాంట్ ఫాసిల్స్ నేషనల్ పార్కు, తమిళనాడులో సతనూర్ నేషనల్ ఫాసిల్ పార్కులున్నాయి. ఇదే తరహాలో కొండపల్లి అడవిలో వృక్ష శిలాజాలున్న ప్రాంతాన్ని రక్షించేందుకు దాన్ని ఫాసిల్ పార్కుగా ప్రభుత్వం గుర్తించాలని నిపుణులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో పరిశోధకులు అన్వేషిస్తే రాక్షస బల్లుల శిలాజాల జాడలు వెలుగుచూసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.