ప్రతిసృష్టికి రంగం సిద్ధమైందా?
2014 ‘శాస్త్ర’ రౌండప్
అంతరిక్షంపై జ్ఞానం మరింత పెరిగిన ఏడాది ఇది...శాస్త్ర, సాంకేతిక ప్రపంచాల్లోనూ మనిషి సత్యాన్వేషణ మరింత పదునెక్కింది. చిక్కుముళ్లను విప్పే ప్రయత్నాలు ఊపందుకోగా... చికాకుపెట్టే వ్యాధులకు చెక్ పెట్టడంలోనూ ఎంతో కొంత విజయం సాధించాడు. మొత్తమ్మీద శాస్త్ర రంగంలో ఈ ఏడాది పరిణామాలు... ఎంతో మోదం... కొంచెం ఖేదం అని చెప్పకతప్పదు అదెలాగో.. ఆ ఘన విజయాలేమిటో... నిరాశపరిచిన అంశాలేమిటో మీరే చూడండి మరి....!
టూకీగా...
⇒ మనిషి మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్‌లను అంతర్జాతీయ సంస్థ ఐబీఎం ఈ ఏడాది తొలిసారి డిజైన్ చేసింది.
⇒ వినూత్నమైన సాఫ్ట్‌వేర్ సాయంతో ఇంజినీర్లు ఒకదానితో ఒకటి సహకరించుకునే రోబోలకు రూపకల్పన చేశారు. ఈ రోబోల బృందానికి సమాచార సేకరణతోపాటు ప్రత్యేక ఆకారాల్లోకి మారిపోయే సామర్థ్యం ఉంటుంది.
⇒ కొండంత సైజున్న రాక్షసబల్లులు కాలక్రమంలో అందమైన పక్షుల్లా ఎలా మారిపోయాయో శాస్త్రవేత్తలు ఈ ఏడాది వివరించారు. ఇండొనేషియాలోని గుహల్లో కనిపించిన కుడ్యచిత్రాలు మనిషి సాంస్కృతిక జీవన కాలాన్ని నాలుగు రెట్లు వెనక్కు నెట్టాయి.
⇒ పాత జ్ఞాపకాలను చెరిపేసి, కొత్త వాటిని మెదళ్లలోకి జొప్పించేందుకు ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి.
⇒ అద్దె గర్భంలో పిండాలను పెంచి జన్మనివ్వడం గురించి మనకు తెలుసు. అయితే ఈ ఏడాది తొలిసారి ఓ మహిళ వేరొకరి గర్భాశయాన్ని అమర్చుకుని దానిద్వారా బిడ్డను ప్రసవించింది. టెస్ట్‌ట్యూబ్‌లలో కాకుండా సొంతంగా బిడ్డను కనాలనుకునే మహిళల (గర్భాశయ లోపాలున్నవారు లేదా అసలు గర్భాశయమే లేనివారు) ఆశలు నెరవేరే సమయం దగ్గరలోనే ఉందన్నమాట.
⇒ ఉపగ్రహమంటే భారీసైజుండాలన్న భావనకు ఫుల్‌స్టాప్ పడిన సంవత్సరం కూడా ఇదే. కేవలం పది సెంటీమీటర్ల సైజు... ఇంకా చెప్పాలంటే ఓ స్మార్ట్‌ఫోన్ సైజు మాత్రమే ఉండే ఉపగ్రహాలు ఎన్నో ఈ ఏడాది నింగికెగశాయి.
అంతరిక్షంపై త్రివర్ణ పతాకం....
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తన ముద్రను బలంగా చాటిన సంవత్సరమిది. గత ఏడాది ప్రయోగించిన మామ్ ఉపగ్రహాన్ని కూడా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టగలగడం మన సాంకేతిక పరిజ్ఞానానికి మేలిమి నిదర్శనం. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ తనదైన పరిణితిని కనపరచిన ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్‌ను కూడా పరీక్షించి చూసింది. దీంతోపాటు ప్రాంతీయ జీపీఎస్ వ్యవస్థకు అవసరమైన రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలతోపాటు మిలటరీ అవసరాలు కూడా అనేకం తీరతాయని అంచనా.
అడకత్తెరలో భూమి భవిష్యత్తు...
భూ తాపోన్నతి, దాని విపరిణామాల గురించి ప్రపంచానికి తెలియజేసిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమెట్ ఛేంజ్ (ఐపీసీసీ) తాజాగా 2014లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ధనిక, పేద దేశాల తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోకపోతే 2100 నాటికి భూమి సరిదిద్దుకోలేని పరిస్థితికి చేరుకుంటుందని ఈ తాజా నివేదిక స్పష్టంగా హెచ్చరించింది. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని, లేకుంటే వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రమవుతుందని తెలిపింది. మరోవైపు ఈ నెలలో పెరూ రాజధాని లిమాలో సమావేశమైన ప్రపంచదేశాలు వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చాయి.
ప్రతిసృష్టికి కొత్త రెక్కలు...
సృష్టికి ప్రతిసృష్టి చేయాలన్న మనిషి ఆశలకు కొత్త రెక్కలు వచ్చిన ఏడాది ఇది. కృత్రిమ జీవశాస్త్ర రంగంలో నమోదైన రెండు ఘన విజయాలు భవిష్యత్తులో కొత్తరకం జీవజాతుల సృష్టికి నాందీ వాక్యం పలికాయి. మే లో కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం తొలిసారి ప్రకృతిలో ఇప్పటివరకూ లేని విధంగా మొత్తం ఆరు రసాయనలతో ఈ కోలీ సూక్ష్మజీవి డీఎన్‌ఏను మార్చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో వినూత్న లక్షణాలున్న మూలకాలు, పదార్థాలను తయారు చేయడం వీలవుతుందని అంచనా. మరోవైపు ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందమొకటి కృత్రిమ ఈస్ట్ క్రోమోజోమ్‌ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించారు. ఇది భవిష్యత్తులో చౌకైన వ్యాక్సీన్లు, జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడుతుందని అంచనా.
అంతరిక్షంలో చీకటి వెలుగులు...
అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు సాధించాయి. ప్రైవేట్ కంపెనీలు పోటాపోటీగా జరుపుతున్న ప్రయోగాలు కొన్ని విజయం సాధించగా మరికొన్ని చతికిలబడ్డాయి. వర్జిన్ గలాటిక్ అంతరిక్ష నౌక నవంబరు నెలలో నింగికెగసి ముక్కలై నేలకొరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు పెలైట్లు మరణించారు. మరోవైపు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మూడుసార్లు సామగ్రి రవాణా చేయగలిగింది. అక్టోబరులో జరిగిన నాలుగో ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. ఇంకోవైపు అంతరిక్ష వాహక నౌకలన్నీ మూలనపడ్డ నేపథ్యంలో నాసా అభివృద్ధి చేసిన సరికొత్త వాహకనౌక ఓరియన్ తొలి ప్రయోగం విజయవంతం కావడం విశేషం.
తోకచుక్కపై మనిషి ముద్ర...
తోకచుక్కను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం జరిగింది. రోసెట్టా అనే అంతరిక్ష నౌక నవంబరు 12న 67పీ పేరుగల తోకచుక్కను సమీపించింది. ఆ వెంటనే దాంట్లోంచి ఫిలే ప్రొబ్ వేరుపడింది. దీంతో పరిశోధకుల్లో ఉత్సాహం ఉరకలెత్తినా, వెంటనే దాంతో సంబంధాలు తెగిపోవడంతో ఉసూరుమన్నారు. లభించిన కొద్ది సమయంలోనే శాస్త్రవేత్తలు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. ఈ పరిశోధనల కారణంగా తోకచుక్కల్లోనూ కర్బన ఆధారిత మూలకాలు ఉన్నట్లు స్పష్టమైంది. భూమిపై కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డ నీటికి కూడా తోకచుక్కలు కారణం కాకపోవచ్చునని తేలింది.
మధుమేహానికి మూలకణ చికిత్స!
హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అక్టోబరులో మధుమేహంపై కీలక పరిశోధనలో విజయం సాధించారు. క్లోమగ్రంథిలోని బీటా కణాలు రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను నియంత్రిస్తూంటాయి. అయితే టైప్-1 మధుమేహ వ్యాధిగ్రస్థుల్లోని రోగ నిరోధక వ్యవస్థ ఈ బీటా కణాలను నాశనం చేస్తూంటుంది.ఈ సమస్యను అధిగమించేందుకు హార్వర్డ్ శాస్త్రవేత్తలు పిండమూల కణాలనే బీటా కణాలు మార్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రోగి శరీరంలోకి జొప్పించేందుకు సరిపడా కణాలను తయారుచేయగలిగినప్పటికీ ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.
తొడుక్కునే గాడ్జెట్ల హవా...
టెక్నాలజీ రంగంలో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల స్థానాన్ని తొడుక్కునే గాడ్జెట్లు (వేరబుల్ గాడ్జెట్స్)లు ఆక్రమించాయి. దిగ్గజ కంపెనీలన్నీ ఏదో ఒక రూపంలో స్మార్ట్‌వాచీలు, ఫిట్‌నెస్ గాడ్జెట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాయి. మూర్ఛరోగ లక్షణాలు మొదలుకొని గుండెచప్పుడును నిరంతరం పరిశీలించడం వరకూ రకరకాల పనులు చేసిపెట్టగల ఈ గాడ్జెట్‌లు కొత్త సంవత్సరంలోనూ సంచలనాలు సృష్టిస్తాయనడంలో సందేహం లేదు.
యువరక్తం మంచిదే..!
ఈ ఏడాది జరిగిన ఓ ప్రయోగం మొత్తం పరిస్థితిని మార్చేసింది. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జంతువులపై జరిపిన ప్రయోగాల్లో యువరక్తంతో వృద్ధాప్య లక్షణాలను వెనక్కు తిప్పవచ్చునని నిరూపించారు. యువరక్తం లేదా రక్తంలోని కొన్ని రకాల పదార్థాలను ముసలి ఎలుకల్లోకి చేర్చినప్పుడు వాటి మెదడు క్రియలు మళ్లీ చురుకెత్తాయని, కండరాల పటుత్వం కూడా పెరిగిందని స్టాన్‌ఫర్డ్ ప్రయోగాలు నిరూపించాయి. అంటే వృద్ధాప్య సమస్యలకు యువరక్తం విరుగుడుగా పనిచేస్తుందన్నమాట. మానవుల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వస్తే..? ఏమో! కొత్త సంవత్సరంలో చూద్దాం!!
అంకెల్లో 2014
30.1 కోట్లు...
ఈ ఏడాది చివరి మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్ల సంఖ్య ఇది. ప్రముఖ నెట్ సెకూరిటీ సంస్థ గార్ట్‌నర్ అంచనాల ప్రకారం ఇది గత ఏడాది కంటే 20 శాతం ఎక్కువ. మూడేళ్లలోపు మొబైల్ ఫోన్లలో స్మార్ట్‌ఫోన్ల వాటా ప్రస్తుతపు 66 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని అంచనా.
రూ.1500..
మన జన్యుక్రమ సమాచారాన్ని ఏడాదిపాటు భద్రంగా దాచి ఉంచేందుకు గూగుల్ జినోమిక్స్ వసూలు చేసే మొత్తమిది. ఈ సమాచారంతో రాబోయే జబ్బుల గురించి ముందే తెలుసుకోవచ్చు. మేలైన చికిత్స మార్గాలూ వెతుక్కోవచ్చు. ఇదిలా ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా లక్ష మంది పౌరుల జన్యుక్రమాలను నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
440 కోట్ల టెరాబైట్లు..
ఫేస్‌బుక్ కామెంట్లు మొదలుకొని వికీపీడియాలోని సమాచారం వరకూ డిజిటల్ ప్రపంచం మొత్తమ్మీద నిక్షిప్తమై ఉన్న ఇన్ఫర్మేషన్ మోతాదు ఇది. ఇంటర్నేషన్ డేటా కార్పొరేషన్ అంచనా ప్రకారం ఈ సమాచారం ఏడాదికి 40 శాతం చొప్పున పెరుగుతోంది.
2030
చైనా విడుదల చేసే గ్రీన్‌హౌస్ వాయువుల మోతాదు పతాక స్థాయికి చేరే ఏడాది ఇది. భూతాపోన్నతి ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ అంతే వేగంగా వాతావరణానికి హాని చేసే విషవాయువులను వెదజల్లుతోంది. 1990 నుంచి ఏటా పెరుగుతున్న ఈ ఉద్గారాలకు కళ్లెం వేయకపోతే కష్టమే. ఉద్గారాల తగ్గింపునకు అమెరికా, చైనాలు ఒక ఒప్పందానికి రావడం పర్యావరణపరంగా ఈ ఏడాది హాట్‌టాపిక్‌గా నిలిచింది.
40 శాతం
సోలార్ ప్యానెల్స్ ఈ ఏడాది సృష్టించిన రికార్డు ఇది. తమపై పడే సూర్యరశ్మిలో విద్యుత్తుగా మార్చే సామర్థ్యం 40 శాతానికి చేరింది.
రేపటి హరివిల్లు... 2009లో కనుక్కున్న పెరోవిస్కైట్, కాడ్మియం టెలూరైడ్ వంటి పదార్థాల కారణంగా ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఎంత మంచి సోలార్ ప్యానెల్ సామర్థ్యమైనా 15 శాతానికి మించని నేపథ్యంలో ఇది నిజంగానే శుభవార్త.
2014...
వాతావరణ రికార్డులు నమోదు చేయడం మొదలుపెట్టిన తరువాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరం ఇదే. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉష్ణోగ్రత రికార్డులు బద్దలైపోగా, అదే సమయంలో కొన్నిచోట్ల అతిశీతల వాతావరణం, కాశ్మీర్ వంటిచోట్ల కుంభవృష్టి, వరదలతో వాతావరణం మనిషిని బెంబేలెత్తించింది.
రేపటి హరివిల్లు...
అంధత్వంపై మలి సమరం..
అంధత్వంపై మనిషి మలిసమరం కొత్త ఏడాదిలో మొదలుకానుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్యారిస్‌లో జన్యుశాస్త్రం ఆధారంగా అంధత్వ నివారణ ప్రయోగాలు జరగనున్నాయి. కళ్లల్లో కాంతికి స్పందించే కణాల్లో తేడా వస్తే వచ్చే అంధత్వం (రెటినిటిస్ పిగ్‌మెంటోసా) ఉన్నవారిపై జెన్‌సైట్ అనే సంస్థ ఈ ప్రయోగాలు చేయనుంది. వెలుతురు పడగానే స్పందించి ప్రత్యేకమైన ప్రొటీన్లను తయారు చేసే ఓ జన్యువును జొప్పించడం ద్వారా కోల్పోయిన దృష్టిని తిరిగి తేగలమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
ఈ రకమైన ప్రయోగం మృతుల నుంచి వెలికితీసిన కనుగుడ్లలో విజయం సాధించినప్పటికీ సాధారణ మానవుల్లో ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియదు. పైగా ఈ ప్రయోగం తరువాత కనిపించే దృశ్యాలు కేవలం బ్లాక్ అండ్ వైట్‌లో మాత్రమే ఉంటాయన్న అంచనాలున్నాయి. మెదడుకు అందే కాంతి సంకేతాల తీవ్రతను మార్చడం ద్వారా ఈ సమస్యను మార్చవచ్చునని జెన్‌సైట్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్లూటో తొలిఫోటో ఈ ఏడాదే...
మన సౌరకుటుంబంలోని చిట్టచివరి ఖగోళ వస్తువు... ప్లూటో ఫోటో ఇప్పటివరకూ మన వద్ద లేదంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ వచ్చే ఏడాది ఈ పరిస్థితి మారనుంది. నాసా ప్రయోగించిన న్యూహొరైజన్స్ ప్రోబ్ తొలిసారి ఈ మినీగ్రహం ఫొటోను తీసి పంపనుంది. జూలై 14న ఆ గ్రహం దగ్గరగా వెళ్లినప్పుడు అత్యంత స్పష్టమైన ఫొటోలు తీయడం వీలవుతుందని, ఫిబ్రవరి నుంచి మే నెల మధ్యలో కొంత తక్కువ రెజల్యూషన్ గల ఫొటోలు లభిస్తాయని నాసా చెబుతోంది.
మలేరియా టీకా వచ్చేస్తోంది..
ఏటా లక్షల మంది మరీ ముఖ్యంగా పిల్లల ప్రాణాలు బలితీసుకుంటున్న మలేరియా మహమ్మారిని అంతమొందించే దిశగా అభివృద్ధి చేసిన తొలి టీకా 2015లో అందుబాటులోకి రానుంది. గ్లాస్గో స్మిత్‌క్లైమ్ బీచెమ్ (జీఎస్‌కే) కంపెనీ ‘పాథ్ మలేరియా ఇనిషియేటివ్’ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను ఆఫ్రికాలోని 11 దేశాల్లో దాదాపు 15 వేల మందిపై ప్రయోగించి చూశారు. ముందుగా యూరోపియన్ దేశాల్లో వినియోగంలోకి తీసుకువస్తారు. ఆ తరువాత ఆఫ్రికాదేశాల్లోనూ అందుబాటులోకి వస్తుంది.