Recreation
-
ట్రంప్‌పై కాల్పులు.. రీక్రియేట్ చేసిన పిల్లలు
కంపాలా : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశాయి. అయితే ఆ కాల్పుల్ని ఘటనను ఉంగాండాలోని ఓ ప్రాంతానికి చెందిన పిల్లలు రీక్రియేట్ చేశారు. ఈ రీక్రియేషన్ వీడియోలో ట్రంప్ పాత్రను పోషించిన బాలుడు తన పిడికిలిని బిగించి ఫైట్ అని నినాదాలు చేయడం మిలియన్ల మందిని ఆకట్టుకోవడం గమనార్హం. రీక్రియేన్ వీడియోలో ట్రంప్ స్థానంలో ఓ బాలుడు ప్రసంగిస్తుండగా.. కాల్పుల నుంచి బాలుడిని కాపాడేందుకు రక్షణ సిబ్బంది అడ్డుగా నిలబడడం, కాల్పుల తర్వాత ట్రంప్ అన్నట్లుగానే తన పిడికిలిని బాలుడు ‘ఫైట్’..‘ఫైట్’ అంటూ నినాదాలు చేయడం మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది.Ugandan Kids re-enact the Trump Assassination Attempt pic.twitter.com/2tck8GNa23— ɖʀʊӄքǟ ӄʊռʟɛʏ 🇧🇹🇹🇩 (@kunley_drukpa) July 17, 2024ఆ బాలుడిని కాపాడేందుకు పిల్లలు చెక్క తుపాకుల్ని, వేదిక కోసం చెక్క డబ్బాల్ని వినియోగించారు. ట్రంప్ మాట్లాడిన విధంగా రీక్రియేట్ చేసిన వీడియోలో బాలుడి మాటలు, ఆహభావాల్ని వ్యక్తం చేయడం మరింతగా ఆకట్టుకుంది. మరో వైపు పిల్లల్లో పెరిగిపోతున్న ఈ తరహా ధోరణి పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఇలాంటి వాటిని చూసి అనుకరిస్తున్నారు. ఇది నేటి సమాజాన్ని, ప్రవర్తనను ప్రతిభింస్తుందని సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేస్తున్నారు. -
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్‌ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
మాస్ట్రో సంజయ్ లీలా బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌తో డిజిటల్ ప్రపంచంలోకి ఆకట్టుకునేలా అడుగుపెట్టాడు. సంచలన టీవీ సిరీస్‌తో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాడు. పలువురు నటీమణులు తమ అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా వీటన్నింటికి మించి గోల్డెన్ గర్ల్ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.హర్షాలీ మల్హోత్రా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ ‘‘బజరంగీ భాయిజాన్’’లో మున్నీ పాత్రలో నటించి, ప్రశంసలందుకున్న హర్షాలీ మల్హోత్రా లేటెస్ట్ సంచలనం. హీరామండిలోని అలంజేబ్ పాత్రను రీక్రియేట్ చేసింది. ఇందులో తనదైన నటనతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) ఈ ధారావాహికలోని ‘‘ఏక్ బార్ దేఖ్ లిజియే’’ పాటకు తనదైన అభియనంతో వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గోల్డెన్ కలర్ లెహంగాలో మల్హోత్రా మెరిసిపోయింది. అందమైన ఆమె కళ్ళు అనేక భావోద్వేగాలను అలవోకంగా పలికించడం విశేషం. దీంతో ఒరిజినల్ సాంగ్‌తో పోలిస్తే మల్హోత్రా బాగా నటించిందంటూ అంతా కితాబిచ్చారు.1940లలోని భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యానికి వ్యతిరేకంగా, ‘‘హీరామండి’’ లాహోర్‌లోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్ హీరా మండిలో తవాయిఫ్‌ల (వేశ్యల) జీవితాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. స్టార్-స్టడెడ్ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ అధ్యాయాన్ వంటి ప్రఖ్యాత నటీనటులు ఉన్నారు. ఇంకా శేఖర్ సుమన్, తహా షా బదుషా, ఫరీదా జలాల్తదితరులు మరికొందరు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో వెబ్ సిరీస్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన షోగా నిలిచిన సంగతి తెలిసిందే. -
వ్యర్థాల ప్లాంట్.. వినోదాల స్పాట్!
నగరాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించి ఓ ప్రదేశంలో కాల్చేయడమో లేదా రీసైక్లింగ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. తీవ్ర దుర్గంధభరితమైన, అత్యంత కాలుష్యమయమైన ఆ ప్రాంతానికి పొరపాటున కూడా వెళ్లే సాహసం చేయలేం కదా? కానీ అలాంటి ప్రదేశానికి వెళ్లి సేద తీరడమే కాదు.. ఆడొచ్చు.. పాడొచ్చు.. ఇంకా కావాల్సింది సుష్టుగా తినొచ్చు. అవాక్కవుతున్నారా? నిజంగా ఇది నిజం. మరి అ అందమైన చెత్త వినోద కేంద్రం ఎక్కడుంది, దాని విశేషాలేంటో చూద్దామా? డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్.. రాజరిక వారసత్వం, ఆధునిక వాస్తుశిల్పాన్ని మిళితం చేసిన పర్యావరణ అనుకూలమైన అందమైన నగరం. 2017లో కోపెన్‌హాగన్‌ను ప్రపంచంలోని గ్రీన్‌సిటీగా ప్రకటించారు. ఇది ప్రధానంగా పునరుత్పాదక శక్తిని పెంపొందించడం, క్లీనర్ మొబిలిటీపై దృష్టి పెట్టింది. దీంతో నగరంలోని వ్యర్థాలను మొత్తం విద్యుత్‌గా మార్చే ఒక పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారు. కేవలం ప్లాంటు ఒకటే ఏం బాగుంటుందని అనుకున్నారు డెన్మార్క్ అధికారులు. అంతే వ్యర్థాల శుద్ధి కేంద్రానికి వినోదపు టచ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు అదిరిపోయే డిజైన్‌తో ఈ ప్లాంట్ నిర్మించారు. కోపెన్‌హాగన్‌లోని ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ ఆర్కిటెక్ట్ అద్భుతాన్ని అమేజర్ బక్కే లేదా కోపెన్హిల్గా పిలుస్తారు. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉన్న ఈ భవ నాన్ని చూస్తే ఇది వ్యర్థ శుద్ధి కేంద్రమా అనే సందేహం కలగక మానదు. 100 మీటర్ల ఎత్తైన ఈ భవనంపైన అనేక కార్యకలాపాలతో కూడిన డైనమిక్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్కైయింగ్, హైకింగ్, క్లైంబింగ్ వంటి వినోద సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇది వ్యర్థాలను ప్రాసెస్ చేసే ప్లాంట్‌గానే కాకుండా.. వినోదాలు పంచే విహారాల స్పాట్‌గా కూడా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. కార్బన్ న్యూట్రల్ సిటీగా.. 2025 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సిటీగా కోపెన్హాగన్ అవతరించాలనే లక్ష్యంతోనే ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. వ్యర్థాలను భూగర్భంలో ఉండే ఓ బాయిలర్‌లో ప్రాసెస్ చేయడం ద్వారా ప్లాంట్ పనిచేస్తుంది. రోజుకు 300 ట్రక్కుల వ్యర్థాలను వెయ్యి డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాతావరణంలోకి 250 కిలోగ్రాముల కార్బన్‌డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో 124 మీటర్ల చిమ్నీ ద్వారా బయటకు వస్తుంది. ఏటా 4,40,000 టన్నుల వ్యర్థాలను మండించడం ద్వారా 1,50,000 గృహాల విద్యుత్ అవసరాలను ఈ ప్లాంట్ తీరుస్తోంది. పర్వతారోహకులకు పండుగే.. పర్యాటకులు ఈ ప్లాంట్ పై స్కైయింగ్ చేయొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 85 మీటర్ల క్లైంబింగ్ వాల్‌ను ఈ ప్లాంట్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడకు వచ్చే పర్వతారోహకులు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కింది భాగంలో గ్లైడింగ్ ప్రాక్టీస్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇక రిసార్ట్స్ తరహాలో ఇక్కడ కెఫే, బార్ కూడా ఉన్నాయండోయ్.. రూఫ్‌టాప్ కెఫేలో వేడి వేడి కాఫీ, చల్లని శీతలపానీయాలతో సేద తీరొచ్చు. సముద్రాన్ని చూస్తూ మీకు నచి్చన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా డెన్మార్క్ వెళితే ఈ ప్లాంట్‌ను ఓ లుక్కేసి రండి. -
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్‌చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్‌లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్‌లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్‌లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
'బాహుబలి' సీన్ రీక్రియేట్ చేసిన కాజల్.. వైరల్ అవుతున్న ఫోటో
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కొడుకు నీల్ కిచ్లూతో కలిసి బాహుబలిలోని ఓ సీన్ రీక్రియేట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ కెరీర్ పీక్స్‌లో ఉండగానే గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిన కాజల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలుపెట్టే సీన్‌ని కాజల్ తన కొడుకు నీల్‌తో రీక్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. 'రాజమౌళి సర్ ఇది నీల్, నేను మీకు అంకితమిస్తున్నాం' అంటూ ఫోటోను షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ హీరోగా చేస్తున్న ఇండియన్ 2లో త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనుంది. -
సీన్ రీక్రియేషన్.. లఖీమ్‌పూర్‌కు ఆశిష్ మిశ్రా
అఖీమ్‌పూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన కార్యాచరణను వేగవంతంగా చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు, ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతోపాటు ఇదే కేసులో అరెస్టు చేసిన మరో ముగ్గురిని గురువారం ఘటనా స్థలానికి తీసుకొచి్చంది. హింసకు దారితీసిన పరిణామాలను తెలుసుకొనేందుకు లఖీమ్‌పూర్‌లో చోటుచేసుకున్న వరుస ఘటనలను రీక్రియేట్ చేసింది. రైతుల స్థానంలో కొన్ని బొమ్మలను పెట్టి, వాహనంతో ఢీకొట్టించినట్లు తెలుస్తోంది. పటిష్టమైన భద్రత మధ్య నిందితులను టికోనియా–బన్బరీపూర్ రోడ్డులో ఘటనా స్థలానికి చేర్చారు. అక్టోబర్ 3న జరిగిన ఘటనపై వారిని ప్రశ్నించారు. అంతకముందు అధికారులు జిల్లా జైలుకు చేరుకొని, నిందితులు దాస్, లతీఫ్, భారతిని తమ కస్టడీలోకి తీసుకొని, లఖీమ్‌పూర్‌కు బయలుదేరారు. ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాను పోలీసు కార్యాలయం నుంచి తీసుకొచ్చారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రం లఖీమ్‌పూర్ సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 3న రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం చెలరేగిన హింసాకాండలో మరో నలుగురు బలయ్యారు. వీరిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్, ఒక జర్నలిస్టు ఉన్నారు. -
అంబానీ ఇంటి వద్ద కలకలం: కేసులో పురోగతి
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఎస్యూవీ పట్టుబడిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి ఎన్ఐఏ అధికారులు మాజీ పోలీసు సచిన్ వాజేను తీసుకుని అంబానీ నివాసం వద్దకు వెళ్లారు. ఆ రోడ్డును అరగంటపాటు దిగ్బంధించి వాజే చెప్పిన వివరాల ప్రకారం సంఘటనల క్రమాన్ని రిక్రియేట్ చేశారు. అక్కడ ఎస్‌యూవీని ఉంచిన ప్రాంతం వద్ద తెల్లటి కుర్తా ధరించిన వాజేను అటూఇటూ నడిపించి, మొత్తం ఈ కార్యక్రమాన్ని రికార్డు చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన బహుళ అంతస్తుల అంబానీ నివాసం అంటిలియా వద్ద వద్ద పేలుడు వాహనంతోపాటు అందులో హెచ్చరికతో కూడిన ఉత్తరం లభ్యమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో రికార్డయిన సీసీ ఫుటేజీలో కనిపించిన తెల్ల కుర్తా వ్యక్తి ముంబై అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేనే అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. అయితే, ఈ విషయం ధ్రువీకరించుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా, థానేకు చెందిన వ్యాపారి, స్కార్పియో యజమాని అయిన మన్సుఖ్ హిరేన్ ఈ నెల 5వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మన్సుఖ్ మృతికి సచిన వాజే కారణమంటూ అతని భార్య ఆరోపించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్) దర్యాప్తు చేస్తున్న ఈ కేసును కూడా కేంద్ర హోం శాఖ శనివారం ఎన్ఐఏకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్న వజేను మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా ఉండగా, అంబానీ నివాసం వద్ద వాహనంలో లభించిన 20 జిలెటిన్ స్టిక్స్ పేలుడు తీవ్రత తక్కువగా ఉంటుందనీ, వీటివల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశాలు చాలా తక్కువని ముంబైలోని కలినాలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికారులు తెలిపారు. జిలెటిన్ స్టిక్స్‌లోని అమోనియాను విశ్లేషించాక ఈ అంచనాకు వచ్చామన్నారు. ఇలాంటి పేలుడు పదార్థాలను బావులు తవ్వడానికి, రోడ్డు నిర్మాణ పనులు వంటి వాటిలోనే వినియోగిస్తారన్నారు. తమ నివేదికను రెండు రోజుల్లో ఎన్ఐఏకు అందిస్తామన్నారు. దీంతోపాటు, స్కార్పియో వాస్తవ ఛాసిస్ నంబర్‌ను కనిపెట్టి, ఆ వాహనం ఎవరి పేరిట రిజిస్టరయి ఉందో త్వరలోనే తెలుసుకుంటామన్నారు. వాహనంలోపల రక్తం, వెంట్రుకలు తదితర ఆధారాల కోసం పూర్తిస్థాయిలో శోధిస్తా మన్నారు. వీటి ఆధారంగా ఘటనా సమయంలో ఆ వాహనంలో ఎవరెవరు ప్రయాణించారు? దానిని నడిపిందెవరు? వంటి వివరాలను కూడా తెలుసుకుంటామన్నారు. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం: మళ్లీ అక్కడే మరో మృతదేహం అంబానీ ఇంటి వద్ద కలకలం: వాజే టార్గెట్ వంద కోట్లు -
భువన విజయం
బ్రహ్మ చేసిన సృష్టికి దీటుగా ప్రతిసృష్టి చేయగలవారు శిల్పులు. యుగాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఈ శిల్ప కళావృత్తిలో సాధారణంగా మగవాళ్లే ఉంటారు. మగవాళ్లకు సహాయంగా చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఆడవాళ్లు. ఈ ‘సాధారణంగా’ అనే ఆనవాయితీని చెరిపేశారు భువనేశ్వరి. ఆళ్లగడ్డలో శిల్పకారులుంటారనే సంగతి ఆ జిల్లా వాళ్లకు తప్ప బయటి ప్రపంచానికి తెలియని స్థితి నుంచి ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాలకు కూడా ఆళ్లగడ్డ తెలిసిందంటే ఆ ఘనత.. భువనేశ్వరి శిల్పకళా నైపుణ్యానిదే. భువనేశ్వరి మొదట్లో శిల్పిగా స్థిరపడాలనుకోలేదు. టెన్ టు ఫైవ్ ఆఫీస్ జాబ్ లాంటిది చేయాలనుకున్నారు. ప్రొఫెషనల్‌గా స్థిరపడాలనుకున్నప్పుడు కూడా బొటిక్ పెట్టాలనుకున్నారు. బొటిక్ పెట్టడానికి ముందు వస్త్రరంగం మీద పట్టు సాధించడానికి స్వయంగా అధ్యయనం మొదలుపెట్టారు. అధ్యయనం అంటే సూరత్‌కో, ముంబైకో వెళ్లి వస్త్ర పరిశ్రమలను చూడడం, డిజైనర్ల స్టూడియోలను సందర్శించడం. అయితే అది సాధ్యమయ్యే పని కాదనిపించి, అన్నింటికీ ఇంటర్నెట్నే ఆధారం చేసుకున్నారామె. నెలల పాటు ఈ సెర్చింగ్‌లో ఉండగా ఆమె మెదడులో ఓ ఆలోచన మెరిసింది. లూయీ పాశ్చర్ పరిశోధనలు చేసి చేసి, ఏళ్ల తర్వాత రేబిస్కి మందు కుక్క మెదడులోనే ఉందని తెలుసుకోవడం లాంటిదే భువనేశ్వరికి వచ్చిన ఆలోచన కూడా. ఇంటర్నెట్లో శోధిస్తుంటే తనకు తెలిసినవి, తెలియనివి ఎన్నెన్నో బయటపడుతున్నాయి. కానీ తన ఇంట్లో తయారవుతున్నటువంటి శిల్పాలు మాత్రం కనిపించలేదు. ప్రపంచం భూగోళమంత పెద్దదే అయినా విశ్వం అరచేతిలో ఇమిడిపోయేటంత అనువైనది కూడా అనిపించిందామెకు. టన్నుల బరువైన శిల్పాలను ఫొటో తీసి ఫేస్బుక్లో, ఓఎల్ఎక్స్, క్వికర్‌లలో పెట్టి, వాటి వివరాలను ప్రాధాన్యతలను వివరించడం మొదలుపెట్టింది. అమెరికా కస్టమర్ మేరీ యాన్ మెగసెసె తనను వెతుక్కుంటూ ఆళ్లగడ్డ వచ్చినప్పుడు అనిపించిందామెకు తాను చేస్తున్న ప్రయత్నం విజయవంతం అయి తీరుతుందని. రెండున్నర లక్షల రూపాయల ఆర్డర్ వచ్చింది. ఫేస్బుక్ ఆధారంగా భువనేశ్వరి అందుకున్న తొలి ఆర్డర్ అదే. నాన్నకు నమ్మకం కలిగింది భువనేశ్వరి తండ్రి రవీంద్రాచారి జీవితాన్ని శిల్పకళకే అంకితం చేశారు. ఆయన 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి బాలవీరాచారి కాలం చేశారు. రోజుకు ఇరవై రూపాయల కూలికి పని చేసి, కొన్నేళ్లకు వృత్తిలో స్థిరపడి, తండ్రి స్థాపించిన శిల్పకళామందిరానికి పూర్వవైభవం తెచ్చారాయన. భువనేశ్వరికి ఇంట్లో రోజూ ఉలి చప్పుళ్లు వినిపిస్తూనే ఉండేవి. ఆసక్తి కొద్దీ తమ్ముడితోపాటు శిల్పాల దగ్గరకు వెళ్లినా సరే... రవీంద్రాచారికి మనసొప్పేది కాదు. కూతురు దుమ్ములో పని చేయడం నచ్చేది కాదాయనకు. సున్నితమైన చేతులు ఉలిని పట్టుకుని గట్టిపడిపోతాయని వద్దనే వాడు. అంత గారంగా పెంచుకున్న తండ్రి... కూతురి జీవితం కూడలిలో ఉందని తెలిసినప్పుడు ఒక మాటన్నారు. ‘బాధపడుతూ ఎటూ తేల్చుకోలేక ఎంత కాలం గడిపినా సరే, పరిష్కారం దొరకదు. పని మీద ధ్యాస పెట్టు, గమ్యం తెలిసే వరకు పనిలోనే మునిగిపో’ అని చెప్పాడు. నైపుణ్యం వచ్చే వరకు శిక్షణనిచ్చాడాయన. భువనేశ్వరి విదేశీ కస్టమర్ నుంచి తొలి ఆర్డర్ అందుకున్నప్పుడు ఆయనకు కూతురి భవిష్యత్తు పట్ల భరోసా కలిగింది. శిల్పాల పురిటిగడ్డ! ఆళ్లగడ్డలో శిల్పుల కుటుంబాలు రెండొందలకు పైగా ఉన్నాయి. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన నిపుణులున్నారు. అయితే బొమ్మల కోసం తమ దగ్గరకు వినియోగదారులను తీసుకురావడం ఎలాగో తెలియదు. కులవృత్తితో భుక్తి జరగక తిప్పలు పడుతున్న వాళ్లే ఎక్కువ. అలాంటిది భువనేశ్వరి ప్రయత్నంతో ఆళ్లగడ్డ అంటే శిల్పాల పురిటిగడ్డ అనుకుంటోంది ప్రపంచం. ఆమెతోపాటు ఆ గ్రామంలో అనేక మందికి ఉపాధి మెరుగైంది. ఆమె దగ్గర ఆళ్లగడ్డలో యాభై మంది, క్యాంపుల్లో ముప్పై మంది శిల్పులు పని చేస్తున్నారు. ప్రస్తుతం యాదగిరి గుట్టలో శిల్పాలు చెక్కుతున్నారు. ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్లో కూడా శిల్పాల ప్రాధాన్యం పెరిగింది. ఇళ్లలో డైనింగ్ టేబుల్, కార్నర్ స్టాచ్యూలు, గార్డెన్లో పర్గోలా (రాతి మండపం)లు పెట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్ కూడా శిల్పకారులకు మంచి ఉపాధిగా మారింది. కులవృత్తి ఊరుదాటలేక అంతరించి పోతున్న ఈ టెక్ యుగంలో టెక్నాలజీనే ప్లాట్‌ఫామ్‌గా చేసుకుని వంశపారంపర్యంగా వచ్చిన కళకు జీవం పోస్తున్నారు భువనేశ్వరి. దేవుడి విగ్రహానికి సెంటిమెంట్ దేవుడి విగ్రహాలకు కళ్లను శిల్పకళామందిరాల్లో గీయరు. విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లిన తర్వాత శిల్పి గర్భగుడిలోకి వెళ్లి బంగారు లేదా వెండి సూదితో కళ్లను చెక్కుతారు. ఎందుకంటే.. ‘దేవుడు ముందే కళ్లు తెరిచి తనను ఆలయంలోకి ఎప్పుడు చేరుస్తారా, భక్తులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడకూడదు. భక్తులు ఎదురు చూస్తుండగా దేవుడు కళ్లు తెరవాలి’ అని చెబుతారు. ఇల్లే యూనివర్సిటీ ‘‘కులవృత్తిలో నైపుణ్యం సంపాదించడం యూనివర్సిటీలో కోర్సు చేయడం కంటే ఎక్కువే. నిత్యం ప్రాక్టికల్ క్లాసులకు హాజరైనట్లే. మా విశ్వబ్రహ్మల కుటుంబాల్లో పిల్లలు పలక బలపం పట్టుకోవడం వచ్చినప్పటి నుంచి బొమ్మలు గీస్తుంటారు. ప్రతి శిల్పకారునిలోనూ చిత్రకారులుంటారు. మాస్టర్ శిల్పి కావాలంటే బొమ్మ గీయడం బాగా వచ్చి ఉండాలి. అలాగే శిల్పకారులు తప్పని సరిగా తమ మానసిక స్థితిని సాంత్వన పరుచుకుని పనిలోకి దిగాలి. ఎందుకంటే... మన మనసులోని భావాలు శిల్పం ముఖంలో ప్రతిబింబించి తీరుతాయి. అయితే ఈ కళలో ఉండే గొప్పతనం ఏమిటంటే... కష్టాలను, బాధలను అదిమిపెట్టుకుని, మనసు చిక్కబట్టుకుని పని మొదలు పెట్టిన కొంత సేపటికే పనిలో నిమగ్నమైపోతాం. పని పూర్తయిన తర్వాత తేలికపడిన మనసుతో ఉలి పక్కన పెడతాం. రకరకాల శిల్పాలు చేస్తాం కానీ బుద్ధుడి విగ్రహం చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆయన ముఖంలో ప్రశాంతత, ఉంగరాలు తిరిగిన జుట్టు, సున్నితమైన వేళ్లు... వేటికవే క్లిష్టంగా ఉంటాయి. వాటన్నింటికంటే అర్ధనిమీలిత నేత్రాలను చెక్కడం నిజంగా బ్రహ్మ విద్య అనే చెప్పాలి’’ అంటారు భువనేశ్వరి. ఆరు భాగాలు.. ఆరు దశలు ఒక శిల్పం రూపుదిద్దుకోవాలంటే తల, మెడ, నడుము, మోకాళ్లు, చీలమండలు, పాదాలు... ఇలా ఆరు భాగాలుగా పని జరుగుతుంది. ముఖం పొడవు ఇన్ని అంగుళాలుంటే... మెడ ఎంత ఉండాలి, దేహం పొడవు, కాళ్లు, పాదాల పొడవు... ప్రతిదీ కొలత ప్రకారం జరగాలి. శాస్త్రబద్ధంగా లెక్క ఉంటుంది. మాకు పెద్దవాళ్లు నోటిమాటగా చెప్పి నేర్పించేస్తారు. పుస్తకం చూడాల్సిన అవసరం రాదు. మొదట రాయి మీద బొమ్మ వేస్తారు. ఈ పనిని మా నాన్నలాగ మాస్టర్లే చేయాలి. ఆ తర్వాత బ్లేడ్ మెషీన్‌తో ఎక్స్‌ట్రాలు తీసేయాలి. మూడవ దశలో శిల్పంలో ప్రధాన ఆకారం వచ్చేటట్లు బిట్ మెషీన్‌తో చెక్కాలి. ఆ తర్వాత శిల్పానికి పాలిష్. ఐదవ దశలో వేళ్లు, ఆభరణాలు, వస్త్రాలు, జుట్టు వంటి లైనింగ్ వర్క్ చేసి, డైమండ్ టూల్‌తో జీవరేకలు గీయాలి. చివరగా కళ్లు పెట్టాలి. మా తాత శ్రీశైలంలోని భ్రమరాంబిక ఆలయం, మహానంది ఆలయంలో అద్దాల మండపం, అహోబిలంలో కోనేరు వంటి ప్రసిద్ధ నిర్మాణాలు చేశారు. ఆయన స్థాపించినదే ‘శారద శిల్పకళామందిరం’. నాన్న అనారోగ్యం వల్ల ఇప్పుడు నేను, తమ్ముడు చూసుకుంటున్నాం. కస్టమర్లు ఫేస్బుక్, వాట్సాప్‌లలో కాంటాక్ట్ చేస్తున్నారు. వాళ్లకు ఆళ్లగడ్డ రావడం కంటే కర్నూలు సౌకర్యంగా ఉంటుందని అక్కడో బ్రాంచ్ పెట్టాను. మైసూర్, పులివెందుల దగ్గర మల్యాల, కర్నూలు దగ్గర వెల్దుర్తి నుంచి రాళ్లను తెచ్చుకుంటాం. విగ్రహానికి రాయిని ఎన్నుకోవవడంలోనే నైపుణ్యం ఉంటుంది. దేవుడు కృష్ణశిల (నల్లరాయి)లో ఉంటాడని చెబుతారు. రాయి లోపల సన్న పగులు ఉన్నా సరే దానిని పక్కన పడేయాల్సిందే. ఉలితో శిల మీద దెబ్బ వేయగానే వచ్చిన శబ్దం చెప్పేస్తుంది ఆ రాయి గట్టిదా డొల్లదా అని. నేను ఎక్కువ కష్టపడిన విగ్రహాల్లో ద్రాక్షారామంలోని శివుడు ధ్యాన ముద్రలో ఉన్న విగ్రహం కోసం, లేపాక్షి నంది విగ్రహం కోసం మాత్రమే. అది నిజానికి కష్టం కాదు ఆందోళన. గోదావరి పుష్కరాల కోసం 13 అడుగుల విగ్రహం ఆర్డర్ చేశారు, 25 రోజుల్లో పూర్తి చేయాలి. మొత్తం ఇరవై మందిమి... పగలు పది మంది, రాత్రి పదిమంది షిఫ్టుల్లో పనిచేశాం. కృష్ణాపుష్కరాల కోసం చేసిన కృష్ణవేణి విగ్రహం (శ్రీశైలం పాతాళగంగ ఘాట్), శ్రీశైలం శిఖరం మీద ఉండే నంది విగ్రహం చాలా సంతోషాన్నిచ్చాయి. మా తాత శిల్పాలున్న శ్రీశైలంలో నా శిల్పాలు కూడా ఉండడం నాకు సంతోషాన్నిచ్చింది. – భువనేశ్వరి, శిల్పి, శారద శిల్పకళామందిరం నిర్వాహకురాలు ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు: బి. వి. కృష్టయ్య -
ఆ కనులు ఆకర్షణ గనులు
ఎంతటివారైనా ఏదో కొంత సమయాన్ని తమతో తాము కాలక్షేపం చేసుకుంటూ గడిపినా, ఆ తర్వాత కొంత సమయాన్నైనా ఎవరితోనైనా గడపాలని అనుకుంటారు. అలా మరొకరితో సమయాన్ని గడపడం కోసం వాళ్లు మరో వ్యక్తి దగ్గరికి పోవడమో లేక ఆ పరిచితుడైన వ్యక్తికి కబురుచేసి రప్పించుకోవడమో చేస్తారు. ఇది లోక సహజమైన విషయం. అయితే సాయి మాత్రం ఎవరి సాంగత్యమూ తనకి అక్కర్లేదన్నట్లుగానే ఉండేవాడు. ఒంటరితనంలోనే – ఎందరితోనో తానున్నట్లుగా అనుకుంటూ ఉండేవాడేమో అనిపించేవాడు. సూర్యుడు అస్తమించాడనగానే మసీదులోకి వెళ్లేవాడు. పడుకోబోయేప్పుడు తన వస్తువులైన చిలుం – పొగాకు – రేకుడబ్బా – సటకాలని తృప్తిగా చూసుకుంటూండేవాడు. తన మోకాళ్ల వరకూ కప్పేస్తూ ఉండే పొడవైన చొక్కా(కఫనీ)ని ధరించి ఆ లోపల ఒక గోచీని ధరించేవాడు. తెల్లని శుభ్రమైన గుడ్డని తలచుట్టూ బిగించి గట్టిగా కట్టుకోవడమే కాక, ఆ మిగిలిన గుడ్డని బాగా మెలితిప్పి ఎడమచెవి వద్ద ముడివేసి ఉంచేవాడు. తన కఫనీకి అక్కడక్కడా చిరుగులున్నా ఎంతో సంతృప్తితో ఉండేవాడు. ఎవరైనా ఆయన్ని చూడ్డానికొచ్చినప్పుడు – తాను చిరిగిన దుస్తులతో ఉన్నాననే తక్కువదనం, బిడియం ఆయనలో ఏమాత్రమూ ఉండేది కాదు. వెనక్కి వేలాడుతూంటే ఆ ముడివేసిన వస్త్రం మిగిలిన భాగం ఓ జడలాగా అనిపిస్తూ ఉండేది, దూరంగా నిలబడి చూస్తుంటే. ఒక్కోసారి ఆ ఎడమచెవి వద్ద వస్త్రాన్ని ముడివేయగా మిగిలిన వస్త్రం అక్కడి నుండి ఎడమభుజం మీదుగా వక్షస్థలమ్మీదికి వేలాడుతూ కనిపిస్తూండేది. ఒక్కోసారి వారం, మళ్లీ మాట్లాడితే పదిరోజులైనా స్నానమే చేయకుండా ఉంటూండేవాడు. పాదాలకెప్పుడూ చెప్పులు ధరించేవాడు కాదు. ఇటు తోటకి వెళ్లినా అటు చావడి వైపుకి వెళ్లినా ఒట్టి పాదాలతో వెళ్లడమే ఆయనకు అలవాటు. తిరిగి తిరిగి వచ్చాక కూచోవాల్సి వస్తే పాతబడి చిరుగులతో కనిపించే ఆ గోనెపట్టాయే అతనికి గొప్ప ఆసనంగా ఉండేది. దాన్నేదో రాజులు వేసుకునే మెత్తని పట్టువస్త్రం తొడిగిన మెత్తని దిండుగా భావించేవాడు. రాత్రింబవళ్లూ ఆ గోనెసంచి అక్కడే ఉండేది. చలి నుండి తనని తప్పించుకోవడానికి అక్కడ ‘ధుని’ (నిరంతరం నిప్పుతో వెలుగుతూండే స్థలం) ఉండేది. మసీదులో దక్షిణానికి ముఖాన్ని పెట్టుకుని, తన ఎడమచేతిని ఆ చిన్న గోడలా ఉండే కట్టడం మీద పెట్టుకుని కూర్చుని కనిపిస్తూండేవాడు. వ్యక్తిలోని అహంకారం, అజ్ఞానం, అవమానభారం, తిరస్కారం, ప్రాపంచికమైన ప్రలోభాలూ... ఇలాంటి వాటన్నింటినీ అగ్నిలో ఆహుతి చేయాలనే దానికి సంకేతంగా ధుని వెలుగుతున్నట్లుగా భావిస్తూ నిరంతరం ఆ ధునినే శ్రద్ధతో, ఏకాగ్రతతో చూస్తూ కాలాన్ని గడుపుతూ, ఎప్పుడూ ‘అల్లా హో మాలిక్!’ అని పైకి అంటూండేవాడు. అహంకారం, అభిమానం అనే రెంటికీ సాక్ష్యంగా ప్రతీకగా రెండే రెండు కర్రలని ఎప్పటికప్పుడు ధునిలో వేస్తూ ఆ అగ్ని ఆరిపోకుండా ప్రజ్వరిల్లుతూ ఉండేలా చూసుకుంటూండేవాడు. ‘అల్లాహ్ హో మాలిక్!’ అంటూ జెండాని ఎగరేస్తూండేవాడు. ఆ మసీదు చాలా ఇరుకుగా ఉండేది. అయినా సరే అదే మసీదులో తిరుగుతూండేవాడు, నిద్రించేవాడు. తనని కలవడానికి వచ్చిన భక్తుల్ని కూడా అక్కడికే రమ్మనేవాడు. మరో విచిత్రమేమంటే బాబాని కలవాలంటే ఆ మసీదులోకి పోవాలి కదా! అది చదును చేయబడిన నేల కాదు. మోకాళ్ల లోతు గుంటలు. చిన్న చిన్న గోతులు. ఎత్తు పల్లాలతో నేల ఉండేది. తన మీద గనక నిజమైన భక్తి, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం ఉంటే ఈ అసౌకర్యాలని లెక్కించరుగదా! అనేది ఆయన దృఢ విశ్వాసం. శారీరక వ్యాధుల్ని నివారించుకోదల్చిన వారూ, మనో వ్యాధుల్ని పోగొట్టుకోదల్చినవారూ, ఆయనని గురించి అనేక విధాలుగా విని ప్రసిద్ధుడైన ఆయన ఎందుకంతటి ప్రసిద్ధిని సంపాదించగలిగారో చూసి పోదామని వచ్చిన వారూ, వారి వెంట వచ్చినవారూ... ఇలా అందరూ ఆ ఇరుకు మసీదులోనే ఆ గుంతలు గోతుల్లోనే వస్తూ అసౌకర్యమనే భావనకి ఏ కోశానా గురయ్యేవారు కాదు. ఆ కారణంగానే రోజురోజుకీ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతూనే వచ్చింది గాని తరగనే తరగలేదు. అదే తీరుగా ఇందరు తండోపతండాలుగా తన దగ్గరికొస్తున్నారు గదా! అని ఏనాడూ సాయి తన ఆసనమైన పాతబడిన గోనె సంచినీ, ఇరుకు మసీదునీ, కుట్లూడిన చిరుగులతో కనిపిస్తున్న కఫనీని మార్చుకుందామనే ఆలోచనకీ రాలేదు. ఇదీ నిజమైన ఫకీరు లక్షణమంటే. ఇందరు ఇన్నిమార్లు వస్తూ మరికొందరిని కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? రావడంలో, వస్తూ ఉండటంలో రహస్యమేంటీ? కారణమేమిటీ? దయనిండినవీ, దర్శించేవారికి వాళ్ల తప్పుల్ని వారికి అర్థమయ్యేలా వివరించగలిగినవీ, ఓదార్పునిచ్చేవీ, బాధలు తీరిపోతాయనే తీరు ఉపదేశాన్ని మౌనంగా ఇవ్వగలిగినవీ ఆకర్షణకి గనులలాగా ఉన్నవీ అయిన ఆయన ఆ కళ్లే. ఆ రోజున తన గుర్రమే ప్రాణంగా ఉన్న చాంద్‌పాటిల్ అంత ఎండలో అంతటి ఆందోళనలోనూ ఆకర్షించినవి సాయి కళ్లే. ఆయన్ని తన ఇంట్లో అలా ఉంచుకుని నిరంతరం సేవిస్తూ ఉండటానిక్కూడా కారణం ఆ కళ్లే. ప్రతిదానికీ తగిన కారణం కావాలంటూ ఆలోచించేవాడూ, దొరికిన కారణం నచ్చని పక్షంలో, ఏమాత్రమూ నమ్మనివాడూ అయిన అన్నాసాహెబు సాయిని దర్శించిన మరుక్షణంలో ఆయన జీవితాన్ని గ్రంథరూపంలో సాయిచరిత్రగా రాయాలనే ఆలోచనకి శ్రీకారాన్ని చుట్టించినవి కూడా ఆ కళ్లే. పరమ భయంకరుడూ, తన అరుపులతో షిరిడీ గ్రామ ప్రజలకి నిద్రాభంగాన్ని కలిగించేవాడూ, ఎందరు నచ్చజెప్ప ప్రయత్నించినా దగ్గరక్కూడా రానివ్వనివాడూ అయిన రోహిల్లా సాయిని దర్శించడానికి వచ్చి, దర్శించి అక్కడే ఉండిపోయేలా చేసినవి ఆ కళ్లే. ఖండోబా దేవాలయ అర్చకుడూ, సంప్రదాయపరుడూ, బ్రాహ్మణుడూ అయిన మహల్సాపతి ‘యా! సాయీ!’ అని సాదరంగా ఆహ్వానించడానికి కారణం ఆ కళ్లే. దాసగణుకి గంగాయమునలని సాయి చూపించగలడనీ ఆ తీరు దృఢ విశ్వాసాన్ని కలిగించినది ఆ కళ్లే. అందుకే సాయిని దర్శించదలిచి వెళ్లిన అందరూ కూడా దర్శించవలసింది ఆ సాయి నేత్రాలనే. బాధలతో ఉన్నవారికి బాధ నివారిణులూ – మనోవ్యాధితో ఉన్నవారికి ఉన్న మనోధైర్య కారిణులూ – కష్టాలలో మునిగి తేలుతున్న వారికి చేతి ఊతనిస్తాననే విశ్వాసదాయినులూ – సాయికి మరింత దగ్గర కాగలుగుతామన్న ఆనంద విధాయినులూ ఆ కళ్లు. ఆ కళ్లు. ఆ కళ్లే. చూసి తీరాలనే ఆర్తితో... లోకంలో కనిపించే ఎన్నో పక్షుల్ని, పశువుల్ని, మృగాల్ని, సర్పాలని, వాహనాలని, వ్యక్తుల్ని అలా చూసేస్తుంటాం. అన్నింటినీ మన మనసు ఇష్టంతో చూడదు. అలా చూడని పక్షంలో ఆ దృశ్యాన్ని బుద్ధికి పంపించదు. అలా బుద్ధికి చేరని దేన్నీ, ఆ బుద్ధి తనలో దాచదు. ఆ కారణంగా వేటిని మన మనసు గ్రహిస్తుందో, తాను ఆనందించి బుద్ధికి అందజేస్తుందో ఆ దృశ్యాలు మాత్రమే మనకి అనుక్షణం కళ్లముందు కనిపిస్తూ ఉంటాయి. అందుకే శాస్త్రం అంది – ఏదో యథాలాపంగా చూడటాన్ని కేవలం చూడటమనీ, అదే మరి రెండవతీరుగా బుద్ధిలో దాచేంత విధంగా చూడటాన్ని దర్శనమనీ. అందుకే దైవ దర్శనం అంటూంటాం. ఈ నేపథ్యంతో పరిశీలిస్తే సాయిని చూసినవారు కొందరున్నారు. దర్శించినవారు ఎందరో ఉన్నారు. మనం ఎదుటివారిని ఎలా చూస్తామో ఆ చూపుకి ఉన్న లోతుతనాన్ని బట్టే కదా ఎదుటివారు కూడా మనని చూసేది! ఆ కారణంగా కేవలం చూడటమనే పనిని చేసిన ఎందర్నో సాయి ‘రమ్మనలేదు – ఇంకా రావేమిటి? అనలేదు – ఎందుకు రావో చూస్తాననలేదు. నేను రానే రానని చెప్పిన నానా వంటి వారికి మళ్లీ కబురు చేసి మరీ రప్పించుకోకుండానూ ఉండలేదు! ఈ దృష్టిభేదాన్ని మనం గమనించాలి. ‘గౌలిబువా’ అనే తొంభై ఐదు సంవత్సరాల భక్తుడొకాయన ఉండేవాడు. ఆయనకి సాయి మీద కాదు భక్తి. పండరీపురంలో ఉండే విఠ్ఠలపాండురంగని మీదే దృష్టంతా. సంవత్సరంలో ఉండే 12 నెలల కాలంలో 8 నెలలపాటు పాండురంగని (విఠ్ఠలుడు) మీదే బుద్ధిని నిలిపి ఆ పండరీపురంలోనే ధ్యానంలోనే కాలాన్ని గడిపి, ఆ మిగిలిన 4 నెలల కాలాన్నీ గోదావరీ నదీ తీరాన తపస్సు చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తూండేవాడు. ఆ నెలల కాలమూ కూడా శ్రీహరి యోగనిద్రకి ఉపక్రమించే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఉండే కాలంలోనే. అంటే శయన ఏకాదశి (శ్రీహరి యోగనిద్రని ముగించి నిద్రనుండి లేచే రోజు) వరకు మాత్రమేనన్నమాట. ఈ మధ్యలో ఒకసారి గోదావరి ఒడ్డునే ఉంటాడు కాబట్టి షిరిడీకొచ్చి సాయిని కలిసి వెళ్తూండేవాడు. ఇలా చాలాకాలం పాటు జరుగుతూ వచ్చింది. పైన అనుకున్నట్టుగా సాయిని ఆయన చూసి వెళ్తూండేవాడే తప్ప దర్శించి వెళ్లేవాడు కాదు. ఆ కారణంగా సాయి గొప్పదనం సర్వదేవతా సమూహం సాయి అనే భావం ఏనాడూ కలగలేదు ఆ వృద్ధ భక్తునికి. తన సామాను మోసేందుకోసం ఓ గాడిదని వెంటబెట్టుకుని దానికి తగిన ఆహారం మొదలైనవి సమకూర్చేందుకై ఓ వ్యక్తిని తోడు తీసుకుని ఈ 4 నెలలపాటూ గోదావరి ఒడ్డున ఉంటూండేవాడు. అలా ఒకసారి సాయివద్దకొచ్చి సాయిని అనుకోకుండా దర్శనదృష్టితో చూశాడు. అంతే! గౌలిబువా దృష్టి మొత్తం మారిపోయింది. దాంతో పైకి అననే అన్నాడు – సాయి నవరత్నాల్లో వజ్రంలాంటి వాడు. ఏ విధంగానూ ముక్కలు కానిదీ, నాశనం కానిదీ, కోయడానికి అవకాశమీయనిదీ అయిన వజ్రం ఎలా ఆకర్షణీయమైనదో, దృఢమైనదో అలా సాయి కూడా ఎవరికీ వశుడు కానివాడు – అహంకారం లేనివాడు – తన స్థాయిని గమనించి అందరినీ రానీయకుండా ఉంచాలనీ, కొందరినీ రప్పించుకోవాలనీ భావించేవాడు కాడు. ఇదంతా నా పూర్వ ఆలోచన. ఇప్పుడు మాత్రం సాయిని ఆర్తితో భక్తితో దర్శించాక నా ఆలోచనే మారిపోయింది. సాయి నన్ను చూసిన ఆ చూపులకున్న లోతుతనంతో నాకు అర్థమయింది – సాయి నాకిష్టమైన పండరీనాథుడు పాండురంగడే – అని అనేశాడు. మనం కూడా గమనించాలి. దైవాన్ని చూడరాదనీ, దర్శించాలనీ, అలా దర్శించగలిగినప్పుడూ, దర్శించినప్పుడూ మాత్రమే భవదవతార తత్త్వం మనకి గోచరిస్తుందనీ – అలా కాక ఏదో దేవాలయానికి వెళ్లాల్సిన అవసరం అలవాటూ ఉన్నాయనే భావంతోగాని వెళ్తే దేవుణ్ని చూడటమే జరుగుతుందనీ – దర్శించడం వీలు కాదనీ, ఇలా చూసిరావడం వల్ల సమయనష్టం తప్ప ప్రయోజనం ఏ మాత్రమూ ఉండదనీను. అలాంటి ఆర్తితో చూసినప్పుడే అది దర్శనం అనిపించుకుంటుందన్నమాట. కాబట్టి సాయిని దర్శించాలని అర్థం చేసుకుందాం! అహంకారులకి మార్గదర్శనం సాయికి ఇప్పుడు బాబాసాహెబ్ అనే అతనుండేవాడు. అతనింటికే వెళ్లి దాదాపు రోజురోజంతా అక్కడే గడిపేవాడు. అంతటి ఉత్తముడు బాబాసాహెబ్. అతనికో తమ్ముడున్నాడు. పేరు నానాసాహెబ్. అతనికి సంతానం ఎంతకాలానికీ కలగలేదు. ఎదురుచూసి ఎదురుచూసి తన భార్య అనుమతిస్తే రెండో పెళ్లిని కూడా చేసుకున్నాడు. అయినా అతనికి సంతానం కలగలేదు. నానా సాహెబ్ (నానా) తహశీల్దార్ ఉద్యోగాన్ని చేస్తుండేవాడు. ప్రభుత్వోద్యోగి అయిన కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువమందితో పరిచయాలున్నాయి అతనికి. అలాంటి నానాకి సాయి ఓసారి ‘అప్పాకులకర్ణి’ అనే అతనితో కబురు చేశాడు – ఓసారి నానాని చూడాలనుంది. తనవద్దకి రావలసిందని. ఆ మాటల్ని లెక్కచేయకుండా నానా కాలాన్ని గడిపేస్తూ వచ్చాడు. మళ్లీ మళ్లీ కబురుపంపాడు సాయి. దాంతో తనకి కబురు తెచ్చిన కులకర్ణిని నిందిస్తూ – ‘నేనేమీ ఖాళీగా ఫకీరులా లేను. ప్రభుత్వోద్యోగిని. పని ఒత్తిడిలో ఉన్నా’ అంటూ నిష్టూరంగా దెప్పిపొడుపుగాను కూడా మాట్లాడాడు. కులకర్ణి వెళ్లిపోయాక తనలో తాను నవ్వుకుంటూ – ఈ ముస్లిం ఫకీరు దగ్గరికి నేను పోవడమా? మాయా శక్తులూ, మాటల గారడీలూ ఉన్న సాయి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది? పైగా రెవెన్యూ ఉద్యోగం చేస్తున్న నా స్థాయి ఎక్కడ? చెట్టు కింద చెప్పుల్లేకుండా కూచునే సాయి స్థాయి ఎక్కడ? చేతులు కట్టుకుని ఆ ఫకీరు ఎదురుగా నిలబడితే నన్ను గౌరవించే అందరూ నన్ను చూసి నవ్వరూ?’ అని ఆలోచించి రానేరానంటూ సాయికి వర్తమానాన్ని పంపించాడు నానా. అయితే ఆశ్చర్యకరమైన అంశమేమంటే ఎందుకో తెలియదుగానీ నానా సాయిని దర్శించాల్సిన పరిస్థితొచ్చింది. నానా సాయిని చూస్తూనే ‘సాయీ! నన్నెందుకు పిలిపించారు?’‡అని అడుగుతూ ఆయన కళ్లలో కళ్లు పెట్టి చూశాడు. అయస్కాంతం దగ్గరగా ఇనుపవస్తువుని పెడితే ఎలా ఆ వస్తువు కాస్తా ఆ అయస్కాంతపు ఆకర్షణకి గురై అయస్కాంతానికి హత్తుకుపోతుందో, బలవంతాన లాగితే తప్ప ఇవతలికి రాదో అలా నానా కళ్లు సాయి కనుల ఆర్ద్రతనుండి బయటికి రాలేకపోయాయి. అంతటితో ఆగక, ‘నానా! లోకంలో ఎందరు లేరు? అయినా నిన్నే ఎందుకు పిలిపించానంటావు? నువ్వు నీ నోటికొచ్చిన తీరులో మాట్లాడినా మళ్లీ ఎందుకని ఆహ్వానించానంటావు? బాగా ఆలోచించుకో! నీకూ నాకూ మూడు జన్మలనుండీ బంధం ఉందయ్యా! అది నీకు తెలియదు. నాకే తెలుసు. అందుకే ఓసారి చూద్దామని కబురంపాను. నాకో నమ్మకం ఉంది నీ మీద – నువ్వు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా వస్తావని. వచ్చావుగా!’ అంటూ సాయి మాట్లాడుతూ ఉంటే ఆయన దయార్ద్రమయమైన కళ్లలో తన కళ్లని తిప్పలేక ఉంచిన నానా వెక్కి వెక్కి ఏడుస్తూ, ‘సాయీ! అపరాధం. మహాపరాధం. అపచారం. మహాపచారం అయిపోయింది’ అంటూ ఉండగానే సాయి తన ఎడమచేతిని నానా తలమీద పెట్టాడు. అంతే! సాయి కనిపించలేదు. ఒక క్షణం నానాకి సాయిలో ధర్మమయమైన వింటిని ధరించిన శ్రీరామచంద్రుడు కనిపించాడు. మళ్లీ అంతలోనే జటాజూటాన్ని ధరించి పరమానందంతో ఆశీర్వదిస్తున్న శివుడు దర్శనమిచ్చాడు. మళ్లీ క్షణంలోనే మహా బలిష్ఠుడూ, నవవ్యాకరణ పండితుడూ, అమోఘకంఠస్వరం కలవాడూ అయిన ఆంజనేయుడు కనిపించాడు. నానా తనని తాను నమ్మలేక కలా? నిజమా? అనుకుని నిజమే అని అనిపించాక ‘సాయిదేవా!’ అన్నాడు హృదయపూర్వకంగా. అక్కడి నుండి దైవంతో సమానంగా కొలుస్తూంటే సాయి దర్శనం కారణంగా నానాకి సంతానం కలిగింది. సాయిని చూస్తే సంతానం కలగడమా? అది సాధ్యమేనా? సాధ్యమే! ఎలాగో చూద్దాం! (సశేషం) -
తల్లి ఆనందమే బిడ్డ భవిష్యత్తు
జాయ్‌ఫుల్ ప్రెగ్నెన్సీ ‘‘గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి చేసే ప్రతి ఆలోచనా పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అందుకే ఆమెకి మానసిక ఆనందం, ఆరోగ్యం చాలా అవసరం. గర్భం దాల్చిన సమయంలో నెగిటివ్ ఆలోచనలు ఎంత మాత్రం దరికి రానివ్వకూడదు. ’’ అంటున్నారు జాయ్ పుల్ ప్రెగ్నెన్సీకి అవసరమైన శిక్షణా తరగతులకు కేరాఫ్ అయిన జెస్సీ నాయుడు. ఆనందదాయకమైన ప్రెగ్నెన్సీ కోసం జెస్సీ అందిస్తున్న సూచనలివి. ►గర్భిణి తగినంత శారీరక విశ్రాంతి తీసుకోవాలి. నెలలు నిండుతున్న కొద్దీ నిద్రపోయేటప్పుడు తలెత్తే అసౌకర్యం వల్ల నిద్రలేమి సమస్య ఎదురవ్వ వచ్చు కాబట్టి ముందుగా వీలైనంత నిద్రపోవడం మంచిది. కూరగాయాలు, పండ్లు ఆహారంలో భాగం చేయాలి. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, సుగర్ ఎక్కువగా ఉండేవి, శాట్యురేటెడ్ ఫ్యాట్స్ బాగా ఉండేవి దూరం పెట్టాలి. ►ఒత్తిడి కారణంగా ఉద్భవించే స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ గర్భంలోని బిడ్డపై ప్రభావం చూపుతుంది. తద్వారా పుట్టిన బిడ్డ ఎక్కువగా ఏడవడం, నిద్రలేమితో బాధపడడం వంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా తల్లుల తీవ్రమైన మానసిక ఒత్తిడి పిల్లలు సరిపడా బరువు లేకుండా పుట్టేందుకు కూడా కారణం అవుతుంది. ఈ సమయంలో కుటుంబ సహకారం, మద్ధతు గర్భిణులకు అత్యవసరం. కాబట్టి తల్లి కాబోతున్నవారు ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి. మెడిటేషన్, నచ్చిన సంగీతం వినడం, గోరువెచ్చని నీటి స్నానం... ఇలా ఒత్తిడిని దూరం చేసే వ్యాపకాలు ఎంచుకోవాలి. అతి వేడి నీటిని స్నానానికి వాడకూడదు. ఇది గర్భంలోని బిడ్డకు హానికరం. వ్యాయామం అవసరం తొలి దశలో వాకింగ్ రోజుకు 20 నుంచి 30 నిమిషాల వరకూ చేయవచ్చు. నిదానంగా మాత్రమే నడవాలి. అయితే లో లైన్ ప్లాసెంటా అనే ప్రత్యేకమైన సమస్య ఉంటే మాత్రం ఎటువంటి వ్యాయామం చేయకూడదు. అలాంటి వాళ్లు రాజయోగ ప్రాణయామ చేయవచ్చు. తొలి 3 నెలల పాటు కేవలం నిలుచుని చేసేవి, అప్పర్బాడీకి చేసే వ్యాయామాలు మాత్రమే చేయాలి. 5వ నెలలో గర్భంలో పెరిగే బిడ్డకి వినికిడి శక్తి ఏర్పడుతుంటుంది. కాబట్టి మ్యూజిక్ థెరపీ వంటివి ఉపకరిస్తాయి. గర్భంలో పెరుగుతున్న బిడ్డతో తరచు తల్లీ తండ్రీ సంభాషిస్తుండాలి. 6వ నెల నుంచి తల్లి కళ్ల ద్వారా బిడ్డ చూస్తుంది. కాబట్టి తల్లి తను వీక్షించే దృశ్యాలు కూడా సమీక్షించుకోవాలి. గర్భంలో ఉన్నప్పుడు 7వ నెలలో సాధారణంగా బిడ్డకు తల కిందకు కాళ్లు పైకి ఉంటాయి. అయితే అరుదుగా కొన్నిసార్లు తలపైకి ఉండి కాళ్లు కిందకు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడే చాలావరకూ సిజేరియన్ ఆపరేషన్ అవసరం అవుతుంటుంది. దీనికి పరిష్కార ప్రక్రియని మేం స్పిన్నింగ్ బేబీ అంటాం. పొట్ట మీద నుంచే బిడ్డను చేతులతో తిప్పుతూ చేసే ప్రక్రియ ఇది. కేవలం 12 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఈ సందర్భంలో ప్రతి రోజూ పర్వతాసనం చేయగలిగితే బిడ్డ తనంతట తానే తిరిగిపోయే అవకాశం ఉంటుంది. ►నెలలు గడుస్తు్తన్న కొద్దీ తన చుట్టూ పేరుకున్న అమ్నియాటిక్ ఫ్లూయిడ్‌ని బిడ్డ రుచి చూడగలుగుతుంది. ఈ దశలో బిడ్డకు వీలున్నన్ని రుచి, వాసన చూసే అవకాశం అందివ్వాలి అని నిపుణులు అంటున్నారు. దీని వల్ల గర్భంలో ఉండగానే విభిన్న రకాల వాసనలను, రుచులను గ్రహించగలిగే శక్తి రావడం వల్ల పుట్టిన తర్వాత అన్ని రకాల ఆహారాలను ఆస్వాదించగలుగుతుంది. లోపలి బిడ్డను సున్నితంగా మసాజ్ చేయవచ్చు. ఇలాంటి చర్యలకు బిడ్డ స్పందించే తీరును గమనించడం చాలా సరదాగా, ఆనందంగా ఉంటుంది. గర్భం మీద ఫ్లాష్లైట్లు పడడం అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాంతిమంతమైన లైట్స్ బిడ్డ కళ్లకు హాని చేస్తాయి అని నిపుణులు అంటారు. అదెలా ఉన్నా గర్భంలోని బిడ్డ నిద్రకు మాత్రం అది చేటు తెచ్చే అవకాశం ఉంది. నవమాసాలూ నిండాక, బిడ్డ బాగా చైతన్యవంతం అయ్యాక ఫ్లాష్‌లైట్ పడినా ప్రభావం ఏమీ ఉండదు. సమన్వయం: సత్యబాబు జెస్సీ నాయుడు -
లేజర్‘షాక్’..
‘లేజేరియం’ టెండర్‌కు చుక్కెదురు ! ఒక్క బిడ్ కూడా దాఖలు కాని వైనం ఖంగుతిన్న హెచ్ఎండీఏ అధికారులు సాధ్యంగాని నిబంధనలే కారణం సిటీబ్యూరో: గ్రేటర్ వాసులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న ‘లేజర్ షో’కు హంగులద్దేందుకు మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చేసిన యత్నం బెడిసి కొట్టింది. ముచ్చటగా మూడోసారి చేసిన ప్రయత్నానికి కూడా చుక్కెదురవడం ఇంజినీరింగ్ అధికారులకు మింగుడుపడకుండా ఉంది. లుంబినీ పార్కు ఆవరణలోని లేజర్ షోను ‘న్యూ థీమ్స్’తో అద్భుతంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించిన హెచ్ఎండీఏ.. ఇటీవల గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. గడువు ముగియడంతో సోమవారం ఆ టెండర్స్ ఓపెన్ చేసిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో పిలిచిన టెండర్‌కు కనీసం ఒక్క బిడ్ కూడా దాఖలవ్వక పోవడం గమనార్హం. నగర సంస్కృతి, చరిత్ర తదితర అంశాలతో పాటు ఎడ్యుకేషన్ (అవగాహన), ఇన్ఫర్మేషన్ (సమాచారం) రిక్రియేషన్ (వినోదం) వంటి అంశాలను నేపథ్యంగా కొత్త థీమ్స్‌ను ప్లాన్ చేసిన అధికారులు రూ. 2.5 కోట్ల అంచనాలతో టెండర్లు ఆహ్వానించారు. అయితే, టెండర్లో ఆచరణ సాధ్యంకాని విధంగా నిబంధనలు పెట్టడంతో అసలుకే మోసం వచ్చిపడింది. కఠిన నిబంధనల వల్లే.. లేజర్ షోను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు గతంలో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినా పెద్దగా స్పందన రాలేదు. మొదట్లో రెండు సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి చూపినా లేజర్ షోకు సంబంధించిన డిజైన్‌ను వారే రూపొందించుకోవాలన్న నిబంధనతో వెనుదిరిగారు. రెండోసారి ప్రదర్శన తాలూకు డిజైన్‌ను హెచ్ఎండీఏనే ఇస్తుందని స్పష్టం చేస్తూ మళ్లీ టెండర్ పిలిచారు. దీనికి సింగిల్ బిడ్ దాఖలు కావడంతో నిబంధనల ప్రకారం ఒక బిడ్ వస్తే ఆ టెండర్‌ను ఇవ్వడం సాధ్యం కాదని రద్దు చేశారు. ముచ్చటగా మూడోసారి టెండర్ పిలిచినా కొన్ని కఠిన నిబంధనలు పెట్టడంతో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గతానుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన ఇంజినీరింగ్ అధికారులు ఆచరణ సాధ్యం గాని నియమ, నిబంధనలు టెండర్లో పొందుపరచడం ఆ ప్రాజెక్టు పట్ల వారికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థ ఐదేళ్ల పాటు లేజర్ షో నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని, ఆ సంస్థ టర్నోవర్ రూ. 1 కోటి ఉండాలని, ఈ తరహా ప్రాజెక్టును గతంలో చేపట్టిన అనుభవం ఉండాలని, అందుకు నిదర్శనంగా తగిన సర్టిఫికెట్ జత చేయాలని, జాయింట్ వెంచర్‌కు అవకాశం లేదని.. ఇలా సవాలక్ష నిబంధనలు పెట్టారు. వంద కోట్ల ప్రాజెక్టుకు కూడా లేనివిధంగా రూ. 2.5 కోట్ల ప్రాజెక్టుకు నిబంధనలు విధంచడంతో దీనికోసం ఎవరూ ఆసక్తి చూపలేదు. ప్రీ బిడ్ మీటింగ్‌కు రెండు సంస్థలు హాజరైనా హెచ్ఎండీఏ విధించిన నిబంధనలు చూసి పత్తాలేకుండా పోయారు. ఈ విషయమై సంబంధిత అధికారిని సంప్రదించగా లేజర్ షోకు ఒక్క బిడ్ కూడా రాని విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలో కన్సల్టెంట్‌తో మాట్లాడి నిబంధనలను సడలిస్తూ మళ్లీ టెండర్ పిలుస్తామని సెలవిచ్చారు. -
ప్రతిసృష్టికి రంగం సిద్ధమైందా?
2014 ‘శాస్త్ర’ రౌండప్ అంతరిక్షంపై జ్ఞానం మరింత పెరిగిన ఏడాది ఇది...శాస్త్ర, సాంకేతిక ప్రపంచాల్లోనూ మనిషి సత్యాన్వేషణ మరింత పదునెక్కింది. చిక్కుముళ్లను విప్పే ప్రయత్నాలు ఊపందుకోగా... చికాకుపెట్టే వ్యాధులకు చెక్ పెట్టడంలోనూ ఎంతో కొంత విజయం సాధించాడు. మొత్తమ్మీద శాస్త్ర రంగంలో ఈ ఏడాది పరిణామాలు... ఎంతో మోదం... కొంచెం ఖేదం అని చెప్పకతప్పదు అదెలాగో.. ఆ ఘన విజయాలేమిటో... నిరాశపరిచిన అంశాలేమిటో మీరే చూడండి మరి....! టూకీగా... ⇒ మనిషి మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్‌లను అంతర్జాతీయ సంస్థ ఐబీఎం ఈ ఏడాది తొలిసారి డిజైన్ చేసింది. ⇒ వినూత్నమైన సాఫ్ట్వేర్ సాయంతో ఇంజినీర్లు ఒకదానితో ఒకటి సహకరించుకునే రోబోలకు రూపకల్పన చేశారు. ఈ రోబోల బృందానికి సమాచార సేకరణతోపాటు ప్రత్యేక ఆకారాల్లోకి మారిపోయే సామర్థ్యం ఉంటుంది. ⇒ కొండంత సైజున్న రాక్షసబల్లులు కాలక్రమంలో అందమైన పక్షుల్లా ఎలా మారిపోయాయో శాస్త్రవేత్తలు ఈ ఏడాది వివరించారు. ఇండొనేషియాలోని గుహల్లో కనిపించిన కుడ్యచిత్రాలు మనిషి సాంస్కృతిక జీవన కాలాన్ని నాలుగు రెట్లు వెనక్కు నెట్టాయి. ⇒ పాత జ్ఞాపకాలను చెరిపేసి, కొత్త వాటిని మెదళ్లలోకి జొప్పించేందుకు ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ⇒ అద్దె గర్భంలో పిండాలను పెంచి జన్మనివ్వడం గురించి మనకు తెలుసు. అయితే ఈ ఏడాది తొలిసారి ఓ మహిళ వేరొకరి గర్భాశయాన్ని అమర్చుకుని దానిద్వారా బిడ్డను ప్రసవించింది. టెస్ట్‌ట్యూబ్‌లలో కాకుండా సొంతంగా బిడ్డను కనాలనుకునే మహిళల (గర్భాశయ లోపాలున్నవారు లేదా అసలు గర్భాశయమే లేనివారు) ఆశలు నెరవేరే సమయం దగ్గరలోనే ఉందన్నమాట. ⇒ ఉపగ్రహమంటే భారీసైజుండాలన్న భావనకు ఫుల్స్టాప్ పడిన సంవత్సరం కూడా ఇదే. కేవలం పది సెంటీమీటర్ల సైజు... ఇంకా చెప్పాలంటే ఓ స్మార్ట్‌ఫోన్ సైజు మాత్రమే ఉండే ఉపగ్రహాలు ఎన్నో ఈ ఏడాది నింగికెగశాయి. అంతరిక్షంపై త్రివర్ణ పతాకం.... అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తన ముద్రను బలంగా చాటిన సంవత్సరమిది. గత ఏడాది ప్రయోగించిన మామ్ ఉపగ్రహాన్ని కూడా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టగలగడం మన సాంకేతిక పరిజ్ఞానానికి మేలిమి నిదర్శనం. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ తనదైన పరిణితిని కనపరచిన ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్‌ను కూడా పరీక్షించి చూసింది. దీంతోపాటు ప్రాంతీయ జీపీఎస్ వ్యవస్థకు అవసరమైన రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలతోపాటు మిలటరీ అవసరాలు కూడా అనేకం తీరతాయని అంచనా. అడకత్తెరలో భూమి భవిష్యత్తు... భూ తాపోన్నతి, దాని విపరిణామాల గురించి ప్రపంచానికి తెలియజేసిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమెట్ ఛేంజ్ (ఐపీసీసీ) తాజాగా 2014లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ధనిక, పేద దేశాల తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోకపోతే 2100 నాటికి భూమి సరిదిద్దుకోలేని పరిస్థితికి చేరుకుంటుందని ఈ తాజా నివేదిక స్పష్టంగా హెచ్చరించింది. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని, లేకుంటే వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రమవుతుందని తెలిపింది. మరోవైపు ఈ నెలలో పెరూ రాజధాని లిమాలో సమావేశమైన ప్రపంచదేశాలు వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రతిసృష్టికి కొత్త రెక్కలు... సృష్టికి ప్రతిసృష్టి చేయాలన్న మనిషి ఆశలకు కొత్త రెక్కలు వచ్చిన ఏడాది ఇది. కృత్రిమ జీవశాస్త్ర రంగంలో నమోదైన రెండు ఘన విజయాలు భవిష్యత్తులో కొత్తరకం జీవజాతుల సృష్టికి నాందీ వాక్యం పలికాయి. మే లో కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం తొలిసారి ప్రకృతిలో ఇప్పటివరకూ లేని విధంగా మొత్తం ఆరు రసాయనలతో ఈ కోలీ సూక్ష్మజీవి డీఎన్ఏను మార్చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో వినూత్న లక్షణాలున్న మూలకాలు, పదార్థాలను తయారు చేయడం వీలవుతుందని అంచనా. మరోవైపు ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందమొకటి కృత్రిమ ఈస్ట్ క్రోమోజోమ్‌ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించారు. ఇది భవిష్యత్తులో చౌకైన వ్యాక్సీన్లు, జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడుతుందని అంచనా. అంతరిక్షంలో చీకటి వెలుగులు... అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు సాధించాయి. ప్రైవేట్ కంపెనీలు పోటాపోటీగా జరుపుతున్న ప్రయోగాలు కొన్ని విజయం సాధించగా మరికొన్ని చతికిలబడ్డాయి. వర్జిన్ గలాటిక్ అంతరిక్ష నౌక నవంబరు నెలలో నింగికెగసి ముక్కలై నేలకొరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు పెలైట్లు మరణించారు. మరోవైపు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మూడుసార్లు సామగ్రి రవాణా చేయగలిగింది. అక్టోబరులో జరిగిన నాలుగో ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. ఇంకోవైపు అంతరిక్ష వాహక నౌకలన్నీ మూలనపడ్డ నేపథ్యంలో నాసా అభివృద్ధి చేసిన సరికొత్త వాహకనౌక ఓరియన్ తొలి ప్రయోగం విజయవంతం కావడం విశేషం. తోకచుక్కపై మనిషి ముద్ర... తోకచుక్కను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం జరిగింది. రోసెట్టా అనే అంతరిక్ష నౌక నవంబరు 12న 67పీ పేరుగల తోకచుక్కను సమీపించింది. ఆ వెంటనే దాంట్లోంచి ఫిలే ప్రొబ్ వేరుపడింది. దీంతో పరిశోధకుల్లో ఉత్సాహం ఉరకలెత్తినా, వెంటనే దాంతో సంబంధాలు తెగిపోవడంతో ఉసూరుమన్నారు. లభించిన కొద్ది సమయంలోనే శాస్త్రవేత్తలు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. ఈ పరిశోధనల కారణంగా తోకచుక్కల్లోనూ కర్బన ఆధారిత మూలకాలు ఉన్నట్లు స్పష్టమైంది. భూమిపై కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డ నీటికి కూడా తోకచుక్కలు కారణం కాకపోవచ్చునని తేలింది. మధుమేహానికి మూలకణ చికిత్స! హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అక్టోబరులో మధుమేహంపై కీలక పరిశోధనలో విజయం సాధించారు. క్లోమగ్రంథిలోని బీటా కణాలు రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను నియంత్రిస్తూంటాయి. అయితే టైప్-1 మధుమేహ వ్యాధిగ్రస్థుల్లోని రోగ నిరోధక వ్యవస్థ ఈ బీటా కణాలను నాశనం చేస్తూంటుంది.ఈ సమస్యను అధిగమించేందుకు హార్వర్డ్ శాస్త్రవేత్తలు పిండమూల కణాలనే బీటా కణాలు మార్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రోగి శరీరంలోకి జొప్పించేందుకు సరిపడా కణాలను తయారుచేయగలిగినప్పటికీ ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. తొడుక్కునే గాడ్జెట్ల హవా... టెక్నాలజీ రంగంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల స్థానాన్ని తొడుక్కునే గాడ్జెట్లు (వేరబుల్ గాడ్జెట్స్)లు ఆక్రమించాయి. దిగ్గజ కంపెనీలన్నీ ఏదో ఒక రూపంలో స్మార్ట్‌వాచీలు, ఫిట్నెస్ గాడ్జెట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. మూర్ఛరోగ లక్షణాలు మొదలుకొని గుండెచప్పుడును నిరంతరం పరిశీలించడం వరకూ రకరకాల పనులు చేసిపెట్టగల ఈ గాడ్జెట్లు కొత్త సంవత్సరంలోనూ సంచలనాలు సృష్టిస్తాయనడంలో సందేహం లేదు. యువరక్తం మంచిదే..! ఈ ఏడాది జరిగిన ఓ ప్రయోగం మొత్తం పరిస్థితిని మార్చేసింది. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జంతువులపై జరిపిన ప్రయోగాల్లో యువరక్తంతో వృద్ధాప్య లక్షణాలను వెనక్కు తిప్పవచ్చునని నిరూపించారు. యువరక్తం లేదా రక్తంలోని కొన్ని రకాల పదార్థాలను ముసలి ఎలుకల్లోకి చేర్చినప్పుడు వాటి మెదడు క్రియలు మళ్లీ చురుకెత్తాయని, కండరాల పటుత్వం కూడా పెరిగిందని స్టాన్‌ఫర్డ్ ప్రయోగాలు నిరూపించాయి. అంటే వృద్ధాప్య సమస్యలకు యువరక్తం విరుగుడుగా పనిచేస్తుందన్నమాట. మానవుల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వస్తే..? ఏమో! కొత్త సంవత్సరంలో చూద్దాం!! అంకెల్లో 2014 30.1 కోట్లు... ఈ ఏడాది చివరి మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన స్మార్ట్ఫోన్ల సంఖ్య ఇది. ప్రముఖ నెట్ సెకూరిటీ సంస్థ గార్ట్నర్ అంచనాల ప్రకారం ఇది గత ఏడాది కంటే 20 శాతం ఎక్కువ. మూడేళ్లలోపు మొబైల్ ఫోన్లలో స్మార్ట్ఫోన్ల వాటా ప్రస్తుతపు 66 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని అంచనా. రూ.1500.. మన జన్యుక్రమ సమాచారాన్ని ఏడాదిపాటు భద్రంగా దాచి ఉంచేందుకు గూగుల్ జినోమిక్స్ వసూలు చేసే మొత్తమిది. ఈ సమాచారంతో రాబోయే జబ్బుల గురించి ముందే తెలుసుకోవచ్చు. మేలైన చికిత్స మార్గాలూ వెతుక్కోవచ్చు. ఇదిలా ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా లక్ష మంది పౌరుల జన్యుక్రమాలను నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 440 కోట్ల టెరాబైట్లు.. ఫేస్బుక్ కామెంట్లు మొదలుకొని వికీపీడియాలోని సమాచారం వరకూ డిజిటల్ ప్రపంచం మొత్తమ్మీద నిక్షిప్తమై ఉన్న ఇన్ఫర్మేషన్ మోతాదు ఇది. ఇంటర్నేషన్ డేటా కార్పొరేషన్ అంచనా ప్రకారం ఈ సమాచారం ఏడాదికి 40 శాతం చొప్పున పెరుగుతోంది. 2030 చైనా విడుదల చేసే గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పతాక స్థాయికి చేరే ఏడాది ఇది. భూతాపోన్నతి ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ అంతే వేగంగా వాతావరణానికి హాని చేసే విషవాయువులను వెదజల్లుతోంది. 1990 నుంచి ఏటా పెరుగుతున్న ఈ ఉద్గారాలకు కళ్లెం వేయకపోతే కష్టమే. ఉద్గారాల తగ్గింపునకు అమెరికా, చైనాలు ఒక ఒప్పందానికి రావడం పర్యావరణపరంగా ఈ ఏడాది హాట్‌టాపిక్‌గా నిలిచింది. 40 శాతం సోలార్ ప్యానెల్స్ ఈ ఏడాది సృష్టించిన రికార్డు ఇది. తమపై పడే సూర్యరశ్మిలో విద్యుత్తుగా మార్చే సామర్థ్యం 40 శాతానికి చేరింది. రేపటి హరివిల్లు... 2009లో కనుక్కున్న పెరోవిస్కైట్, కాడ్మియం టెలూరైడ్ వంటి పదార్థాల కారణంగా ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఎంత మంచి సోలార్ ప్యానెల్ సామర్థ్యమైనా 15 శాతానికి మించని నేపథ్యంలో ఇది నిజంగానే శుభవార్త. 2014... వాతావరణ రికార్డులు నమోదు చేయడం మొదలుపెట్టిన తరువాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరం ఇదే. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉష్ణోగ్రత రికార్డులు బద్దలైపోగా, అదే సమయంలో కొన్నిచోట్ల అతిశీతల వాతావరణం, కాశ్మీర్ వంటిచోట్ల కుంభవృష్టి, వరదలతో వాతావరణం మనిషిని బెంబేలెత్తించింది. రేపటి హరివిల్లు... అంధత్వంపై మలి సమరం.. అంధత్వంపై మనిషి మలిసమరం కొత్త ఏడాదిలో మొదలుకానుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్యారిస్‌లో జన్యుశాస్త్రం ఆధారంగా అంధత్వ నివారణ ప్రయోగాలు జరగనున్నాయి. కళ్లల్లో కాంతికి స్పందించే కణాల్లో తేడా వస్తే వచ్చే అంధత్వం (రెటినిటిస్ పిగ్మెంటోసా) ఉన్నవారిపై జెన్సైట్ అనే సంస్థ ఈ ప్రయోగాలు చేయనుంది. వెలుతురు పడగానే స్పందించి ప్రత్యేకమైన ప్రొటీన్లను తయారు చేసే ఓ జన్యువును జొప్పించడం ద్వారా కోల్పోయిన దృష్టిని తిరిగి తేగలమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ రకమైన ప్రయోగం మృతుల నుంచి వెలికితీసిన కనుగుడ్లలో విజయం సాధించినప్పటికీ సాధారణ మానవుల్లో ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియదు. పైగా ఈ ప్రయోగం తరువాత కనిపించే దృశ్యాలు కేవలం బ్లాక్ అండ్ వైట్‌లో మాత్రమే ఉంటాయన్న అంచనాలున్నాయి. మెదడుకు అందే కాంతి సంకేతాల తీవ్రతను మార్చడం ద్వారా ఈ సమస్యను మార్చవచ్చునని జెన్సైట్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్లూటో తొలిఫోటో ఈ ఏడాదే... మన సౌరకుటుంబంలోని చిట్టచివరి ఖగోళ వస్తువు... ప్లూటో ఫోటో ఇప్పటివరకూ మన వద్ద లేదంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ వచ్చే ఏడాది ఈ పరిస్థితి మారనుంది. నాసా ప్రయోగించిన న్యూహొరైజన్స్ ప్రోబ్ తొలిసారి ఈ మినీగ్రహం ఫొటోను తీసి పంపనుంది. జూలై 14న ఆ గ్రహం దగ్గరగా వెళ్లినప్పుడు అత్యంత స్పష్టమైన ఫొటోలు తీయడం వీలవుతుందని, ఫిబ్రవరి నుంచి మే నెల మధ్యలో కొంత తక్కువ రెజల్యూషన్ గల ఫొటోలు లభిస్తాయని నాసా చెబుతోంది. మలేరియా టీకా వచ్చేస్తోంది.. ఏటా లక్షల మంది మరీ ముఖ్యంగా పిల్లల ప్రాణాలు బలితీసుకుంటున్న మలేరియా మహమ్మారిని అంతమొందించే దిశగా అభివృద్ధి చేసిన తొలి టీకా 2015లో అందుబాటులోకి రానుంది. గ్లాస్గో స్మిత్క్లైమ్ బీచెమ్ (జీఎస్కే) కంపెనీ ‘పాథ్ మలేరియా ఇనిషియేటివ్’ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను ఆఫ్రికాలోని 11 దేశాల్లో దాదాపు 15 వేల మందిపై ప్రయోగించి చూశారు. ముందుగా యూరోపియన్ దేశాల్లో వినియోగంలోకి తీసుకువస్తారు. ఆ తరువాత ఆఫ్రికాదేశాల్లోనూ అందుబాటులోకి వస్తుంది. -
జూదం..కబళిస్తున్న ప్రాణం
రిక్రియేషన్ పేరిట జోరుగా జూదం ఏటా రూ. కోట్లలోనే లావాదేవీలు ఎట్టకేలకు మేల్కొన్న సిటీ పోలీసులు కఠిన చర్యలకు కమిషనర్ ఆదేశం జూదం..మొదట్లో సరదా..మితి మీరితే వ్యసనం..ఇందులో చిక్కుకుని సమస్యల వలయంలోకి వెళ్తున్నారు. ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నారు. తేరుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. దీనికి ధనికులే కాదు, మధ్య తరగతి వారూ బలవుతున్నారు. ఎన్ని సంఘటనలు జరిగినా..గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: క్లబ్బుల్లో రిక్రియేషన్ పేరిట జోరుగా సాగుతున్న జూదం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. పేకాటకు బానిసై సర్వం కోల్పోయిన రాజేంద్రకుమార్ అనే వ్యక్తి శుక్రవారం సాక్షాత్తు రాజ్‌భవన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నగరంలోని పేకాట క్లబ్బుల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రకటించిన నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బోయిన్‌పల్లిలోని జీవీఆర్ ఫ్యామిలీ క్లబ్‌పై కొరడా ఝుళిపించారు. క్లబ్‌ను సీజ్ చేయడంతో పాటు ఆందోళనకు దిగిన ఉద్యోగులతో పాటు యజమానినీ అరెస్టు చేయించారు. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుసపెట్టి దాడులు చేస్తూ ఇలాంటి క్లబ్బులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చితికిపోతున్న వందల కుటుంబాలు ఈ జూద క్రీనీడలో వందల కుటుంబాలు చితికిపోతున్నాయి. వ్యసనపరుల బలహీనతలను క్యాష్ చేసుకుంటూ రిక్రియేషన్ క్లబ్స్ అహ్లాదం ముసుగులో జూద గృహాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ చట్రంలో చిక్కుకుని ధనవంతులతో పాటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు విలవిలలాడుతున్నారు. సర్వ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. విషయం ఇంతటితో ఆగకుండా వారి కుటుంబాలనూ నడి రోడ్డుపై పడేస్తున్నాయి. చట్ట విరుద్ధమని తెలిసినా అనేక క్లబ్బులు రాజకీయ, అధికార అండదండలతో యథేచ్ఛగా పేకాటను నడుపుతున్నాయి. వీటిలో జూదరులకు రాజభోగాలతో పాటు ఫైనాన్సియర్లనూ సమకూరుస్తున్నారు. వెరసి సిటీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి తరలివస్తున్న పేకాట రాయుళ్లకు స్వర్గాధామంగా మారింది. ఈ క్లబ్బుల బారినపడి మధ్య, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు అనేకం ఆర్థికంగా చితికిపోతున్నాయి. సిటీలో 70కి పైగానే క్లబ్బులు... నగర పోలీసుల లెక్కల ప్రకారం సిటీలో దాదాపు 30 రిక్రియేషన్ క్లబ్స్ ఉన్నాయి. వీటికి తోడు చిన్నా, పెద్దా అన్నీ కలిపి దాదాపు 70కి పైగా క్లబ్బులు పేకాటను జోరుగా నిర్వహిస్తున్నాయి. ఇందులో కొన్ని ‘రిక్రియేషన్’ పేర అనుమతి తీసుకున్నవి కాగా మరికొన్నింటికి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతి ఉన్న వాటిపై పోలీసులు దాడి చేయరన్న ప్రచారం ఉండటంతో ఇవి పేకాట రాయుళ్లతో నిత్యం కళకళలాడుతుంటాయి. ఇందులో రెండు ప్రధాన రిక్రియేషన్ క్లబ్బుల ఆధాయం కేవలం పేకాట నిర్వహణతోనే రూ.50 కోట్లకు పైనే. పేకాటను నిర్వహించే ఇతర క్లబ్బులు ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఆర్జిస్తున్నాయని అంచనా. మొత్తం క్లబ్బుల్లో వార్షిక టర్నోవర్ వందల కోట్లలోనే ఉంటోంది. సభ్యత్వం తీసుకుని..సర్వం పొగొట్టుకుంటున్నారు పేకాటకు బానిసైన అనేక మంది నగరంలోని వివిధ క్లబ్బుల్లో సభ్యత్వాలు తీసుకుని మరీ సర్వం పొగొట్టుకుంటున్నారు. ఈ సభ్యులు అనునిత్యం ఒకటి కాకుంటే మరో క్లబ్బులో పేకాట ఆడుతూ గడిపేస్తున్నారు. ఉదయమే రావడం, రాత్రి వరకూ పేకాట ఆడటం అలవాటుగా మారిపోతోంది. కొందరైతే రోజుల తరబడి వాటిలోనే గడుపుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. అక్కడే అనేక మంది నుంచి అప్పటికే అప్పులు తీసుకుని మరీ జూదానికి ‘సమర్పిస్తున్నారు’. ఈ రకంగా అన్నీ పోగొట్టుకుని, నిత్యం నరకం చవిచూస్తే జీవచ్ఛవాలుగా బతికే ‘క్లబ్స్ బాధితులు’ సిటీలో ఎందరో ఉంటున్నారు. పేకాటకు బానిసై ఆత్మహత్యాయత్నం పంజగుట : తాగుడు, పేకాటకు బానిసైన వ్యక్తి.. తనలా మరొకరు కాకూడదంటూ రాజ్‌భవన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ‘కుటుంబ పోషణ భారమైంది.. పోయిన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకునేందుకు డబ్బు లేదు.. ఎదిగొచ్చిన కూతురు పెళ్లి చేయలేకపోతున్నాను’అంటూ కేకలు వేస్తూ శుక్రవారం సాయంత్రం పురుగులు మందు తాగాడు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అతన్ని యశోద ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూల్ టౌన్-1కు చెందిన రాజేంద్రకుమార్ (52) అదే జిల్లా ఎమ్మిగనూరులో కండక్టర్. మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడంటూ 2009లో సస్పెండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వచ్చి నాగోల్‌లో ఉంటున్నాడు. ఇక్కడ కూడా బోయినపల్లిలోని ఓ క్లబ్లో తరచూ పేకాడుతూ ఉన్న ఆస్తినీ పోగొట్టుకున్నాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వద్దకు వచ్చి నగరంలో ఉన్న పేకాట క్లబ్లనన్నింటిని మూయించాలని నినాదాలు చే స్తూ పురుగుల మందుతాగాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రకుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు చెప్పారు. సూసైడ్ నోట్లో.. సాక్షి,సిటీబ్యూరో: రాజేంద్రకుమార్ (52) రాసిన సూసైడ్‌నోట్ సారాంశం.. ‘‘క్రిస్టాల్, జీవీఆర్, నేనిైెహ టెక్ క్లబ్‌ల్లో 14 ఏళ్లపాటు పేకాట ఆడి రూ.15 లక్షల వరకు పోగొట్టుకున్నాను. అస్తులు కరిగిపోయాయి, అప్పులెక్కువయ్యాయి. నా చావు అందరికి కనివిప్పు కావాలి, క్లబ్బులను మూసివేయించాలి’’ -
వైజాగ్ ‘పంచ్’ పవర్
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటి ష్ దేశీయులు తమ వినోదం కోసం ఇక్కడ సరదాగా బాక్సింగ్‌ను ఆడడం ప్రారంభించారు.. కాలక్రమేణా అది నేడు విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెడుతోంది. ఆంగ్లో ఇండియన్స్‌ను ఆనందింపజేసేందుకు నాటి విశాఖవాసులు చేతులకు గుడ్డలు చుట్టుకొని ఆడుతూ వినోదం పంచితే.. ప్రస్తుత తరం ప్రపంచ వేదికలపై పవర్ పంచ్‌లు విసురుతూ పతకాలు కొల్లగొడుతున్నారు. పురుషులతోపాటు మహిళా బాక్సర్లనూ తయారు చేస్తూ విశాఖ.. జాతీయ స్థాయి శిక్షణ శిబిరాలకు కేంద్రంగా మారింది. ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీ కోమ్ కూడా ఈ శిబిరాల్లో పాల్గొన్న బాక్సరే. (-ప్రకాష్ మాడిమి, విశాఖపట్నం, న్యూస్‌లైన్) 1947కు ముందు ఆంగ్లో ఇండియన్లు విశాఖలో ఎక్కువగా నివసించేవారు. వారంతా ఇక్కడ రైల్వే, పోర్టు, షిప్ యార్డుల్లో పనిచేసేవారు. ఖాళీ సమయాల్లో ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ బాక్సింగ్ ఆడుతుంటే స్థానికులు అమితాసక్తితో గమనించేవారు. బ్రిటిష్ వారు నౌకల్లోని డెక్ పైన ఓపెన్ ప్లేస్‌లో ఈ ఆటలాడేవారు. ఇక డచ్ వారు నావికుల మధ్య బాక్సింగ్ పోటీలు పెట్టేవారు. నౌకల్లో పనిచేసే వారి చేతికి గుడ్డలు చుట్టి సాయంత్రం వేళల్లో రిక్రియేషన్‌గా బాక్సింగ్ పోటీలు నిర్వహించేవారు. నగదు ప్రోత్సాహకాలను కూడా అందించేవారు. ఈ పోటీల్ని ఆసక్తిగా గమనిస్తూ స్థానికులు బాక్సింగ్‌పై మక్కువ పెంచుకొన్నారు. క్రమంగా మెళకువలూ నేర్చుకున్నారు. జాతీయ సమాఖ్య ఏర్పాటుతో ప్రాధాన్యత.. అప్పటి వరకు బ్రిటిష్, డచ్‌వారికి ఆనందాన్నందించిన ఆ ఆట భారత బాక్సింగ్ సమాఖ్య ఏర్పడటంతో అధికారిక పోటీలకు నోచుకుంది. రైల్వే యార్డ్స్‌లో ఫోర్‌మెన్‌గా ఆంగ్లో ఇండియన్స్ ఉండటంతో బాక్సింగ్ సంస్కృతి అక్కడ నుంచే స్థానిక ఆటగాళ్లకు చేరింది. కాలక్రమేణా ఆంగ్లో ఇండియన్స్‌కు పోటీనిచ్చే స్థాయికి స్థానిక బాక్సర్లు ఎదిగారు. ఇదే క్రమంలో కోస్తా ప్రాంతంలో బాక్సింగ్ క్రీడకు ప్రాధాన్యత పెరిగింది. ఈస్ట్ కోస్ట్ ప్రాంతమైన విశాఖ నుంచి కోల్‌కతా వరకూ పాకింది. సమాఖ్య చొరవతో విశాఖ పాతపట్నమైన వన్‌టౌన్ ఏరియాలోనూ అమెచ్యూర్ ఆటగాళ్లు తయారయ్యారు. విశాఖ బాక్సింగ్ సంఘం ఆవిర్భావం.. విశాఖలో బాక్సింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ ముందుకొచ్చింది. 1997లో స్థానికంగానే ప్రాంతీయ హాస్టల్‌ను ఏర్పాటు చేసింది. అయితే పోటీలు ఎక్కడ, ఎలా జరుగుతాయనే విషయంపై అవగాహన లేకపోవడంతో పోటీల్లో తలపడే అవకాశం స్థానికులకు దక్కేది కాదు. ఈ పరిస్థితుల్లో జేమ్స్ ఆధ్వర్యంలో విశాఖలో బాక్సింగ్ సంఘం ఏర్పాటైంది. దీంతో స్థానికంగా కొన్ని క్లబ్‌లను ఏర్పాటు చేసి వాటి మధ్య పోటీలకు అంకురార్పణ జరిగింది. పది వెయిట్ కేటగిరీల్లో తలపడే క్లబ్‌లకు గుర్తింపునివ్వడం, మూడు టోర్నీల వరకు మిగిలిన క్లబ్‌లకు అవకాశం కల్పించి క్లబ్‌లను నియంత్రించడంతో బాక్సింగ్ టోర్నీల హవా ప్రారంభమైంది. దానికి నగర పోలీస్ కమిషనర్లు కూడా సహకరించారు. అయితే అప్పటికే బాక్సింగ్ శిక్షణ కేంద్రం తరలివెళ్లి డీఎస్ఏకు అనుసంధానం చేయడంతో మూడేళ్లకే హాస్టల్ ముగిసింది. అకాడమీ ఏర్పాటుతో ఊపు అప్పటి వరకు ప్రాంతీయ హాస్టల్‌గా ఉండి, శాప్‌కు అనుసంధానించబడిన బాక్సింగ్ క్రీడ.. అకాడమీ ఏర్పాటుతో విశాఖలో ఊపందుకుంది. మరో మూడేళ్ల పాటు శాప్ ఆధ్వర్యంలోపోర్ట్ స్టేడియంలోనే నడిచిన రాష్ట్ర అకాడమీ పాత్ర ముగిసింది. అయితే 2003లో భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్).. అకాడమీల స్కీమ్‌లో భాగంగా విశాఖలో ఎస్టీసీ ఏర్పడింది. రెసిడెన్షియల్‌గా శిక్షణనిచ్చే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. జాతీయ శిక్షణ శిబిరాలు చోటు చేసుకున్నాయి. దాంతో అంతర్జాతీయ పోటీల్లోనూ విశాఖ బాక్సర్లు, ఇక్కడ శిక్షణ పొందిన బాక్సర్ల రాణింపు పెరిగింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కోమ్ కూడా ఇక్కడ నిర్వహించిన రెండు జాతీయ శిక్షణా శిబిరాల్లో పాల్గొంది. సీనియర్లే కోచ్‌లు.. స్థానికంగా బాక్సింగ్ క్రీడకు ప్రాచుర్యం ఉన్నా సాంకేతికంగా శిక్షణ పొందిన కోచ్‌లు కరువయ్యారు. దీంతో సీనియర్ బాక్సర్లే కోచ్‌ల పాత్రను కూడా పోషించాల్సి వచ్చింది. అయితే ఉమామహేశ్వరరావు కోచ్‌గా శిక్షణ తీసుకోవడంతో మార్పు చోటుచేసుకుంది. అదే క్రమంలో శిక్షకునిగా వచ్చిన వెంకటేశ్వరరావు కూడా ద్రోణాచార్య అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. 70వ దశకంలోనే సీనియర్ స్టేట్ మీట్‌కు వరుసగా రెండు సార్లు విశాఖ ఆతిథ్యమిచ్చింది. సాయి ప్రసాద్, ఉదయ్ ప్రకాష్, నాగేంద్ర, లింగేశ్వరరావు, ఇజాన్, వరహాలరావు వంటి వారు జాతీయస్థాయికి ఎదిగారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో సురేష్, ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో ఉదయ్‌ప్రకాష్, కిరణ్, యుగంధర్ లాంటివారు పదునైన పంచ్‌లతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా బాక్సర్లు కాలక్రమేణా విశాఖ అమ్మాయిలు కూడా బాక్సింగ్‌పై మక్కువ పెంచుకోసాగారు. ఏకంగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనే పతకాలు అందుకునే స్థాయికి ఎదిగారు. తొలిసారిగా ఈ ఘనతను సాధించిన బాక్సర్ కనకదుర్గ. 2004లో దుబాయ్ వేదికగా సాగిన అంతర్జాతీయ బాక్సింగ్‌లో ఈమె స్వర్ణం సాధించింది. మరో రెండేళ్లకు ఉష ఫైనల్‌కు చేరుకుని రజతాన్ని అందుకుంది. 2007లో ట్రైనింగ్ కమ్ కాంపిటీషన్లోనూ రజతాన్ని సాధించింది. ఆ తరువాత కోచ్ (ఎన్ఐఎస్)గానూ శిక్షణ పూర్తి చేసుకుంది. బాలుర విభాగంలోనూ... బాలుర విభాగంలో 2005లో ఎం.సురేష్ వియత్నాంలో జరిగిన ఆసియన్ క్యాడెట్ బాక్సింగ్‌లో కాంస్యం సాధించాడు. ప్రస్తుతం సబ్ జూనియర్స్ స్థాయిలోనూ విశాఖ బాక్సర్లు సత్తా చాటుతున్నారు. 2005లో జరిగిన జాతీయ సబ్ జూనియర్స్ పోటీల్లో చిన్నారావు, భాస్కర్, సాగర్, శ్యామ్ కుమార్‌లు, ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీల్లో ప్రవీణ్ స్వర్ణ పతకాలు సాధించారు. బాలికల సబ్ జూనియర్స్‌లో ఉమారాణి, నిరోషా, సుజాత స్వర్ణాలందుకున్నారు. ఇంకా ఎంతో మంది వర్ధమాన బాక్సర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ‘అప్పట్లో కిట్స్ కూడా ఉండేవి కావు’ అప్పట్లో నేను జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా.. ట్రాక్ తీసుకోవడం అంటే కలే. కనీసం కిట్స్ కూడా ఉండేవి కావు. ఏడాదికి ఒక టోర్నీలో తలపడితే గొప్పే. నేడు పరిస్థితులు పూర్తిగా భిన్నం. వసతులు పెరిగాయి. నెలకో టోర్నీ వచ్చింది. ఔత్సాహిక క్రీడాకారులు ట్రాక్ లేకుండా ప్రాక్టీస్‌నే మొదలెట్టడం లేదు. గల్లీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ విశాఖలో బాక్సింగ్ అభివృద్ధి చెందింది. - జేమ్స్, విశాఖ బాక్సింగ్ సంఘం వ్యవస్థాపకుడు ‘కామన్వెల్త్లో స్వర్ణం తెస్తా’ మూడో కామన్వెల్త్ బాక్సింగ్ ట్రయల్స్‌కు వెళ్తున్నాను. సీనియర్ విభాగంలో పతకాలు సాధించడమే లక్ష్యం. యూత్ కామన్వెల్త్లో స్వర్ణం సాధిస్తాను. 2009 నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయంగా పతకాలు సాధిస్తున్నా. రెండు సార్లు వరల్డ్‌కప్ బాక్సింగ్‌లో సత్తా చాటాను. టర్కీ, సెర్బియాల్లో స్వర్ణాలందుకున్నాను. బల్గేరియా, సెర్బియాల్లో ఫైనల్‌కు చేరాను. -నిఖత్ జరీన్ (బాక్సర్) ‘యూత్ ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్నా’ ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించాను. గతంలో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిచాను. మరో టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాను. అయితే ప్రస్తుతం యూత్ ఒలింపిక్స్‌లో సీనియర్ విభాగంలో పతకం సాధించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. - శ్యామ్ కుమార్, అంతర్జాతీయ బాక్సర్ -
కాయ్ రాజా..కాయ్
*మళ్లీ జడలు విప్పిన పేకాట క్లబ్బులు *రిక్రియేషన్ పేరుతో మూడుముక్కలాట *నిరుపేదలు, చిరుద్యోగులే టార్గెట్ *ఫిర్యాదు చేసినా..పట్టించుకోని యంత్రాంగాలు సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మళ్లీ పేకాట క్లబ్బులు జడలు విప్పాయి. మూడుముక్కలాటతో కోట్లల్లో టర్నోవర్ చేస్తున్నాయి. రిక్రియేషన్ పేరుతో ఏర్పాటై కేవలం పేకాటకే పరిమితమయ్యాయి. జిమ్,యోగ,స్విమ్మింగ్,ఇండోర్‌గేమ్స్ వసతులున్నాయంటూ రిక్రియేషన్ క్లబ్ పేరుతో రిజిస్ట్రర్ చేసినా.. అక్కడ మాత్రం కేవలం మూడుముక్కలాటే సాగుతోంది. చిరుద్యోగులు, వ్యాపారులు, అట్టడుగు వర్గాలు సైతం ఈ మాయా జూదంలో చిక్కుకుని రోజుల తరబడి ఇళ్లకు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. క్లబ్‌లు మూసేయాలంటూ ఇటీవల హబ్సిగూడ, కోఠి, బోయిన్పల్లిల్లో పలువురు మహిళలు పోలీస్స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో రిక్రియేషన్ పేరుతో ఏర్పడ్డ సుమారు పదిహేను క్లబ్బుల్లో ప్రస్తుతం మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. హబ్సిగూడ , సైదాబాద్, కోఠిలలోని క్లబ్‌లకు తమ భర్తలు బానిసలయ్యారని, పిల్ల ల్ని, మమ్మల్ని పట్టించుకోవటం లేదంటూ ఉ స్మానియా యూనివర్సిటీ,సుల్తాన్‌బజార్ ఠాణా అధికారులకు విన్నవించుకున్నా సరైన స్పందన రాలేదని బాధితులు మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. బోయిన్‌పల్లిలో కాలనీ లోని రెండు ప్రధాన రోడ్లను మూసివేసి ఓ క్లబ్ రూట్ డైవర్షన్ చేస్తూ తమ క్లబ్‌కు వచ్చి పోయే వారికి అడ్డంకులు లేకుండా చేయటం విశేషం. కోట్లల్లో దందా ... రిక్రియేషన్ క్లబ్పేరిట పేకాట దందా కోట్లల్లో సాగుతోంది. రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షల చొప్పున వేర్వేరు కార్డ్ రూమ్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కో రూమ్‌లో 20 నుంచి 30 టేబుల్స్‌పై ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కోటేబుల్పై 10 నుంచి 20 రౌండ్లు ఆడుతున్నారు. ఈ మేరకు ఒక్కో కార్డు రూమ్‌లో సుమారు 300 నుంచి 500 రౌండ్ల పేకాట సాగుతోంది. ఈ లెక్కన ఆయా కార్డు రూము రేంజ్‌ను బట్టి రౌండ్‌కు కొంత సొమ్ము చొప్పున నిర్వహకులు తీసుకుంటున్నారు. ఉదాహరణకు రూ.5 వేల కార్డు రూములో ఒక్కరోజులో 300 రౌండ్ల ఆట సాగితే నిర్వహకులకు రూ.15 లక్షల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన రూ.10వేలు, రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షల కార్డు రూమ్‌ల ఆదాయం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలా రోజుకు లక్షల్లో ఆదాయాన్ని (టర్నోవర్ అయితే కోట్లలో) జేబులో వేసుకుంటున్న క్లబ్‌లు ఆయా వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి భారీగానే ఖర్చు చేస్తున్నాయి. కోడ్ ఉల్లంఘించినా... పోలీసులు పక్షం రోజులుగా చేస్తున్న తనిఖీల్లో లెక్కాపత్రాలు లేకుండా రూ.50 వేలకుపైగా త రలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే లెక్కపత్రాలు లేకుండానే కోట్లాది రూపాయలు రిక్రియేషన్క్లబ్లలో చేతులు మారుతున్నా పోలీసులు మాత్రం అటు వైపు కన్నెతి చూడకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్ ఈ క్లబ్‌లకు వర్తించదా..? కేసులేనా చర్యలేవి..:? బస్తీల్లో గొడవలు చేసే ఒక వ్యక్తి మూడునాలుగు కేసులలో పట్టుబడితే అతనిపై రౌడీషీట్ తెరుస్తారు. ఇక గుడుంబా విక్రయిస్తూ నాలుగైదు సార్లుకుపైగా పట్టుబడితే పీడీ చట్టం ప్రయోగిస్తారు. అలాంటిది పదుల సంఖ్యలో నిబంధనలు ఉల్లంఘించి కేసులలో ఇరుక్కున రిక్రియేషన్ క్లబ్‌లపై శాశ్వత చర్యలు తీసుకోకపోడానికి గల కారణాలు పోలీసులకే తెలియాలి. తూతూ మంత్రంగా సైదాబాద్ పరిధిలో ఫ్రెండ్స్ కల్చరల్ క్లబ్‌పై దాడి చేసి 12 మంది పేకాటరాయుల్ని అరెస్టు చేశారు. ఈ క్లబ్‌పై దాడి జరగడం, కేసులు నమోదు చేయడం కొత్తేమీకాదు. మూడు సార్లకుపైగా పేకాట కేసుల్లో పట్టుబడిన క్లబ్‌ల లెసైన్స్‌లను శాశ్వతంగా రద్దు చే స్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. స్నాచర్లకు అడ్డా... గొలుసు దొంగలకు క్లబ్‌లు అడ్డాగా మారుతున్నాయి. క్లబ్ పరిసర కాలనీలలో మహిళల మెడలోని చైన్లు తెంచుకెళ్లి వాటిని క్లబ్లో ఎవరోఒకరి వద్ద కుదువ పెట్టడం, వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం స్నాచర్ల రోజు వారి విధిగా మారింది. స్నాచింగ్ జరిగిన వెంటనే చుట్టుపక్క ఠాణాల పోలీసులు అప్రమత్తమై గాలిస్తున్నా వారు మాత్రం నిర్భయంగా క్లబ్‌లకు చేరుకుంటున్నారు. ఈ విషయం తెలియని పోలీసులు ఊరంతా గాలిస్తున్నారు. నిబంధనలు హుష్ ‘కాకి’ రిక్రియేషన్ పేరుతో ఏర్పాటైన ఈ క్లబ్బులో సరిపోను పార్కింగ్తో విశాలమైన ఆవరణ ఉండాలి క్లబ్ సభ్యత్వం ఇచ్చే సమయంలో వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. క్లబ్లో జిమ్, యోగ, స్విమ్మింగ్పూల్లతో పాటు అవుట్డోర్ లేదా ఇండోర్ గేమ్స్ సదుపాయాలుండాలి. కోర్టు అనుమతితో కేవలం 13 ముక్కలతో కూడిన పేకాట(స్కిల్డ్గేమ్) మాత్రమే ఆడాలి. ముందస్తు అనుమతి లేకుండా నాన్‌మెంబర్స్‌ను అనుమతించరాదు కానీ పై నిబంధనలు ఏవీ అమలు కావటం లేదు. రిక్రియేషన్‌కు అవసరమైన సౌకర్యాలు లేకుండానే ఒక్క పేకాటనే నిర్వహిస్తున్నారు. కానీ యంత్రాంగం మాత్రం ఆర్నెళ్లకు ఒక మారు చుట్టపుచూపులా దాడులు చేసి తాత్కాలికంగా మూసేస్తున్నారు. మూడు రోజులకే నిర్వాహకులు తిరిగి వాటిని ప్రారంభించటం నగరంలో ఆనవాయితీగా మారింది.