జూదం..కబళిస్తున్న ప్రాణం | Kabalistunna passion for gambling .. | Sakshi
Sakshi News home page

జూదం..కబళిస్తున్న ప్రాణం

Published Sat, Jun 21 2014 3:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

జూదం..కబళిస్తున్న ప్రాణం - Sakshi

జూదం..కబళిస్తున్న ప్రాణం

  •      రిక్రియేషన్ పేరిట జోరుగా జూదం
  •      ఏటా రూ. కోట్లలోనే లావాదేవీలు
  •      ఎట్టకేలకు మేల్కొన్న సిటీ పోలీసులు
  •      కఠిన చర్యలకు కమిషనర్ ఆదేశం
  • జూదం..మొదట్లో సరదా..మితి మీరితే వ్యసనం..ఇందులో చిక్కుకుని సమస్యల వలయంలోకి వెళ్తున్నారు. ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నారు. తేరుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. దీనికి ధనికులే కాదు, మధ్య తరగతి వారూ బలవుతున్నారు. ఎన్ని సంఘటనలు జరిగినా..గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.
     
    సాక్షి, సిటీబ్యూరో: క్లబ్బుల్లో రిక్రియేషన్ పేరిట జోరుగా సాగుతున్న జూదం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. పేకాటకు బానిసై సర్వం కోల్పోయిన రాజేంద్రకుమార్ అనే వ్యక్తి శుక్రవారం సాక్షాత్తు రాజ్‌భవన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నగరంలోని పేకాట క్లబ్బుల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రకటించిన నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బోయిన్‌పల్లిలోని జీవీఆర్ ఫ్యామిలీ క్లబ్‌పై కొరడా ఝుళిపించారు. క్లబ్‌ను సీజ్ చేయడంతో పాటు ఆందోళనకు దిగిన ఉద్యోగులతో పాటు యజమానినీ అరెస్టు చేయించారు. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుసపెట్టి దాడులు చేస్తూ ఇలాంటి క్లబ్బులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
     
    చితికిపోతున్న వందల కుటుంబాలు
     
    ఈ జూద క్రీనీడలో  వందల కుటుంబాలు చితికిపోతున్నాయి. వ్యసనపరుల బలహీనతలను క్యాష్ చేసుకుంటూ రిక్రియేషన్ క్లబ్స్ అహ్లాదం ముసుగులో జూద గృహాలు నిర్వహిస్తూ  కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ చట్రంలో చిక్కుకుని ధనవంతులతో పాటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు విలవిలలాడుతున్నారు. సర్వ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. విషయం ఇంతటితో ఆగకుండా వారి కుటుంబాలనూ నడి రోడ్డుపై పడేస్తున్నాయి.

    చట్ట విరుద్ధమని తెలిసినా అనేక క్లబ్బులు రాజకీయ, అధికార అండదండలతో యథేచ్ఛగా పేకాటను నడుపుతున్నాయి. వీటిలో జూదరులకు రాజభోగాలతో పాటు ఫైనాన్సియర్లనూ సమకూరుస్తున్నారు. వెరసి సిటీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి తరలివస్తున్న పేకాట రాయుళ్లకు స్వర్గాధామంగా మారింది. ఈ క్లబ్బుల బారినపడి మధ్య, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు అనేకం ఆర్థికంగా చితికిపోతున్నాయి.
     
    సిటీలో 70కి పైగానే క్లబ్బులు...
     
    నగర పోలీసుల లెక్కల ప్రకారం సిటీలో దాదాపు 30 రిక్రియేషన్ క్లబ్స్ ఉన్నాయి. వీటికి తోడు చిన్నా, పెద్దా అన్నీ కలిపి దాదాపు 70కి పైగా క్లబ్బులు పేకాటను జోరుగా నిర్వహిస్తున్నాయి. ఇందులో కొన్ని ‘రిక్రియేషన్’ పేర అనుమతి తీసుకున్నవి కాగా మరికొన్నింటికి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతి ఉన్న వాటిపై పోలీసులు దాడి చేయరన్న ప్రచారం ఉండటంతో ఇవి పేకాట రాయుళ్లతో నిత్యం కళకళలాడుతుంటాయి. ఇందులో రెండు ప్రధాన రిక్రియేషన్ క్లబ్బుల ఆధాయం కేవలం పేకాట నిర్వహణతోనే రూ.50 కోట్లకు పైనే. పేకాటను నిర్వహించే ఇతర క్లబ్బులు ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఆర్జిస్తున్నాయని అంచనా. మొత్తం క్లబ్బుల్లో వార్షిక టర్నోవర్ వందల కోట్లలోనే ఉంటోంది.
     
    సభ్యత్వం తీసుకుని..సర్వం పొగొట్టుకుంటున్నారు

     
    పేకాటకు బానిసైన అనేక మంది నగరంలోని వివిధ క్లబ్బుల్లో సభ్యత్వాలు తీసుకుని మరీ సర్వం పొగొట్టుకుంటున్నారు. ఈ సభ్యులు అనునిత్యం ఒకటి కాకుంటే మరో క్లబ్బులో పేకాట ఆడుతూ గడిపేస్తున్నారు. ఉదయమే  రావడం, రాత్రి వరకూ పేకాట ఆడటం అలవాటుగా మారిపోతోంది. కొందరైతే రోజుల తరబడి వాటిలోనే గడుపుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. అక్కడే అనేక మంది నుంచి అప్పటికే అప్పులు తీసుకుని మరీ జూదానికి ‘సమర్పిస్తున్నారు’. ఈ రకంగా అన్నీ పోగొట్టుకుని, నిత్యం నరకం చవిచూస్తే జీవచ్ఛవాలుగా బతికే ‘క్లబ్స్ బాధితులు’ సిటీలో ఎందరో ఉంటున్నారు.
     
     పేకాటకు బానిసై ఆత్మహత్యాయత్నం
     
    పంజగుట : తాగుడు, పేకాటకు బానిసైన వ్యక్తి.. తనలా మరొకరు కాకూడదంటూ రాజ్‌భవన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ‘కుటుంబ పోషణ భారమైంది.. పోయిన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకునేందుకు డబ్బు లేదు.. ఎదిగొచ్చిన కూతురు పెళ్లి చేయలేకపోతున్నాను’అంటూ కేకలు వేస్తూ శుక్రవారం సాయంత్రం పురుగులు మందు తాగాడు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అతన్ని యశోద ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.

    పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూల్ టౌన్-1కు చెందిన రాజేంద్రకుమార్ (52) అదే జిల్లా ఎమ్మిగనూరులో కండక్టర్. మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడంటూ 2009లో సస్పెండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వచ్చి నాగోల్‌లో ఉంటున్నాడు. ఇక్కడ కూడా బోయినపల్లిలోని ఓ క్లబ్‌లో తరచూ పేకాడుతూ ఉన్న ఆస్తినీ పోగొట్టుకున్నాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వద్దకు వచ్చి నగరంలో ఉన్న పేకాట క్లబ్‌లనన్నింటిని మూయించాలని నినాదాలు చే స్తూ పురుగుల మందుతాగాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రకుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు చెప్పారు.
     
    సూసైడ్ నోట్‌లో..
     
    సాక్షి,సిటీబ్యూరో: రాజేంద్రకుమార్ (52) రాసిన సూసైడ్‌నోట్ సారాంశం.. ‘‘క్రిస్టాల్, జీవీఆర్, నేనిైెహ టెక్ క్లబ్‌ల్లో 14 ఏళ్లపాటు  పేకాట ఆడి రూ.15 లక్షల వరకు పోగొట్టుకున్నాను. అస్తులు కరిగిపోయాయి, అప్పులెక్కువయ్యాయి. నా చావు అందరికి కనివిప్పు కావాలి, క్లబ్బులను మూసివేయించాలి’’
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement